Thursday, 10 April 2014

చిరంజీవి, చంద్రబాబు, జగన్,

చిరంజీవి, చంద్రబాబు, జగన్,

మనది రాజకీయ  పార్టీ ఆధారిత ప్రజాస్వామ్యం. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధుల్ని పొటీకి దించుతాయి.  సగానికి పైగా సీట్లు వచ్చిన పార్టీలో, కూటములో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలిస్తాయి.  కానీ, సీమాంధ్రలో పరిస్థితి ఇందుకు భిన్నంగావుంది. ఈసారి ఎన్నికలు పార్టీల ప్రాతిపదిక మీద కాకుండా నాయకుల ప్రాతిపదికగా సాగుతున్నాయి.

పార్టీకన్నా తానే గొప్ప అనే విధానాన్ని రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశపెట్టింది చంద్రబాబే. తెలుగుదేశం పార్టీ మీద దాని వ్యవస్థాపక అధ్యక్షుడు యన్టీ రామారావు ముద్రను చెరిపేయడానికి  ఆయన ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు.  తెలుగుదెశం పార్టీలో కార్యకర్తలు, క్రియాశీల సభ్యులేకాదు చివరకు పొలిట్ బ్యూరో సభ్యులు సహితం చంద్రబాబు చెప్పినట్టు తలూపాల్సిందే. చంద్రబాబు మాటల్లో ఎప్పుడూ "నేను చేశాను. నేను చేస్తాను"  అంటారేగానీ, "తెలుగుదేశం పార్టీ చేసింది. తెలుగుదేశం పార్టి చేస్తుంది" అని చెప్పరు.

తెలుగు దేశం పార్టీలో ఎప్పుడూ నెంబర్ టూ లతో ముప్పు వుంటుంది. యన్టీ రామారావు తొలి దశలో నాదెండ్ల భాస్కర రావు నెంబరు టూ గా వుండేవారు. ఆయన ఒకసారి యన్టీ రామారావు కాలుపట్టి లాగేశారు. ఆ తరువాత యన్టీ ఆర్ బయటి వాళ్లను నమ్మడం మానేసి అల్లుళ్ల ను నమ్మడం మొదలెట్టారు.  అప్పట్లో నెంబర్ టూగా ఎదిగిన చంద్రబాబు ఏకంగా యన్టీ రామారావును రాజకీయాల్లో నుండే తరిమేశారు. పాత అనుభవం కొద్దీ చంద్రబాబు తన ప్రభుత్వంలోగానీ, పార్టీలోగానీ నెంబర్ టూ అనేవాడు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  చంద్రబాబు టీడిపీలో నెంబర్ టూ అనుకున్నవారంతా పైకో, పక్కకో పోక తప్పని పరిస్థితిని చంద్రబాబు సృష్టిస్తుంటారు. మాధవరెడ్డి, కేసిఆర్, దేవేందర్ గౌడ్, నాగం జనార్దనరెడ్డి తదితర టీడీపి నెంబర్ టూలు అలాగే మట్టికరిచారు.  చంద్రబాబుకు నెంబర్ టూ అంటే ఒక రకం ఫోబియా. హరికృష్ణ, బాలకృష్ణ, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి, ఎర్రబెల్లీ తదితరులు ఎవ్వరూ నెంబర్ టూ గా ఎదగకూడదని వారూ  తెగ జాగ్రత్తలు తీసుకుంటుంటారు. తెలుగుదేశంను పార్టీ పేరుతో కాకుండా చంద్రబాబు పార్టీ అని పిలిస్తే వారికి ఆనందం.

రాజకీయాల్లో జగన్ ది కూడా చంద్రబాబు శైలే. చంద్రబాబును జగన్, జగన్ ను చంద్రబాబు కాపీ కొట్టు కుంటుంటారు.  అయితే జగన్ మాటల్లో ఒక్కటే తేడా వుంటుంది. "నేను చేశాను. నేను చేస్తాను" అని చంద్రబాబు అంటే  " మానాయిన చేశాడు. నేను చేస్తాను" అని  జగన్ అంటారు.  జగన్ కు ఇంకో సమస్య కూడా వుంది. తన  పార్టీ పూర్తి పేరును ఆయన ఎప్పుడూ విడమర్చి చెప్పలేరు. ఆయన పార్టీ పూర్తి పేరు  యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టి. దాన్ని ప్రజలు  వైయస్సార్ పార్టి అనుకోవాలని ఆయన కోరుకుంటారు.  వైయస్సార్ అంటే యువజన, శ్రామిక, రైతు  అన్ కాకుండా తన నాయిన అనుకోవాలని ఆయన తాపత్రయం.  చివరాఖరికి అది ఏ పేరూ లేకుండా జగన్ పార్టీ అయిపోయింది. అలా జరగడమే జగన్ కు ఇష్టం. వైయస్సార్ పార్టీగా దాన్ని కొనసాగిస్తే, దాని మీద తల్లి విజయమ్మకో, చెల్లెలు షర్మీలకో, బావ బ్రదర్ అనిల్ కో హక్కు ఇవ్వాల్సి వుంటుందని జగన్ భయం.  వైయస్సార్ పార్టి అనకుండా దాన్ని  జగన్  పార్టీ అని పిలిస్తే వారికి చాలా ఆనందం.

కాంగ్రెస్ సాంప్రదాయం దీనికి భిన్నమైనది. అమెరికాలో రిపబ్లికన్ పార్టీని గ్రాండ్ ఓల్డ్ పార్టీ అన్నట్టు భారతదేశంలో కాంగ్రెస్ ను గ్రాండ్ ఓల్డ్ పార్టీ అనవచ్చు. దాదాపు నూట ముఫ్ఫయి సంవత్సరాల సాంప్రదాయాల్ని ఒక స్రవంతిగా అది కొనసాగించాలనుకుంటుంది.  కాంగ్రెస్ పాటించే సాంప్రదాయాల్లో  ఒకటి ఏమంటే ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్ధినిగానీ, ముఖ్యమంత్రి అభ్యర్ధిని గానీ ఆ పార్టీ ప్రకటించదు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టి తన ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోదీని ప్రకటించినట్టు, కాంగ్రెస్ తన  ప్రధాని అభ్యర్ధిగా ఒక పేరును ప్రకటించదు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీ అని అనధికారికంగా అందరూ అనుకుంటారు.  కానీ, దాన్ని అధికారికంగా ప్రకటించడానికి కాంగ్రెస్ ఇష్టపడదు.  ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ కు ఆదాయ ఆస్థి (ఎస్సెట్స్) ఖాతాలో కాకుండా, రుణ (లయబిలిటీస్) ఖాతాలో చేరారు.  అయినప్పటికీ, రాహుల్ గాంధీని అధికారికంగా ప్రధాన మంత్రిగా ప్రకటించడానికి సోనియా గాంధీ ఒప్పుకోవడంలేదు. కాంగ్రెస్ కు ఇదో అడ్దంకిగా మారింది.

ఇక సీమాంధ్ర  విషయానికి వస్తే,   చివరి నిముషంలో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కు చేసిన నష్టం ఇంతాఅంతాకాదు. దాన్ని నమ్మకద్రోహం అన్నా తప్పుకాదు. కష్టకాలంలో సీమాంధ్ర కాంగ్రెస్ కు కొత్త ఆశగా కనిపిస్తున్నది చిరంజీవి ఒక్కరే. ఈ ఎన్నికల్లో పోటీ తెలుగుదేశం, వైయస్సార్ సిపీ, కాంగ్రెస్ మధ్య కాదు. ఈ ఎన్నికలు స్పష్టంగా చిరంజీవి, చంద్రబాబు, జగన్  ల మధ్య జరుగుతున్నాయి. కానీ, చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినపుడే కాంగ్రెస్ సీమాంధ్రలో పతనాన్ని ఆపుకోగలదు. విజయాల బాటల నడపగలదు.

జిల్లాస్థాయిల్లోనూ, రాష్ట్రస్థాయిలోనూ ఇప్పుడు కాంగ్రెస్ కు క్రియాశీల నేత లెవరూలేరు. నిర్మాణంలో జాప్యంవల్ల ఇటీవలి మున్సిపోల్స్ లో అనేక వార్డులు, డివిజన్లలో  కాంగ్రెస్ కు అభ్యర్ధులు లేకుండా పోయారు. రేపు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలోనూ ఇలాంటి పరిస్థితి రాదని నమ్మకంలేదు. ఇంతటి అననుకూల పరిస్థితుల్లోనూ సీమాంధ్ర కాంగ్రెస్ నిర్వహించిన బస్సు యాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. బహిరంగ సభలన్నీ జనం తో క్రిక్కిరిసి పోయాయి. ఆ సభలకు వచ్చిన వాళ్లలో అత్యధికులు చిరంజీవి అభిమానులే.  చిరంజీవి ఒక్కరే ఇప్పుడు కాంగ్రెస్ శిబిరంలో జనాకర్షక నేత అని మరోసారి రుజువయ్యింది.

కాంగ్రెస్  పార్టి ఇప్పటికే చిరంజీవిని ఎన్నికల  ప్రచార కమిటి సారధ్య బాధ్యతల్ని అప్పచెప్పింది. ఎన్నికల ప్రచార కమిటి అధ్యక్షుడు అంటే ముఖ్యమంత్రి అభ్యర్ధి అని పరోక్ష సంకేతం వున్నమాట నిజమే. బస్సు యాత్ర సందర్భంగా ఇలాంటి పరోక్ష సంకేతాలను పిసిసి అధ్యక్షుడు  రఘువీరా రెడ్డి   అనేక చోట్ల ఇచ్చారు. ఇది పరోక్ష సంకేతాలు ఇచ్చే సందర్భంకాదు.  చిరంజీవే ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రత్యక్షంగా, అధికారికంగా  ప్రకటించాల్సిన సమయం వచ్చేసింది.

చిరంజీవికి కాంగ్రెస్ లోనే కాదు ఇతర పార్టీలలోనూ పెద్ద ఎత్తున అభిమానులున్నారు.  లక్షలాది అభిమానుల్ని కాంగ్రెస్  లోనికి ఆకర్షించాలంటే, చిరంజీవిని తక్షణం ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పరటించడం ఒక్కటే పరిష్కారం. ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో ఎంత ఆలస్యం జరిగితే కాంగ్రెస్ కు అంత నష్టం. 

No comments:

Post a Comment