Wednesday, 30 April 2014

ఢిల్లీని తలదన్నే రాజధాని

ఢిల్లీని తలదన్నే రాజధాని

Published at: 01-05-2014 07:29 AM
హైదరాబాద్ లేదనే నిరాశ వద్దద.. కొత్త రాజధానిని హార్డ్‌వేర్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుకుందాం
సీమాం«ద్రులకు నరేంద్ర మోదీ భరోసా.. టీడీపీ- బీజేపీ కూటమికి పట్టం కట్టాలని విన్నపం
సీమాంధ్ర నిర్మాణం కోసం చంద్రబాబు సీఎం కావాలి.. ఢిల్లీలో బలమైన ప్రభుత్వంతోనే కలలు సాకారం
స్కామాంధ్రా.. స్వర్ణాంధ్రా?.. ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి.. తిరుపతి సభలో ప్రజలకు పిలుపు
(తిరుపతి - ఆంధ్రజ్యోతి)'యావత్ భారతదేశంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. సీమాంధ్రలో మాత్రం... ఒక రాష్ట్ర నిర్మాణాన్ని నిర్దేశించే ఎన్నికలు జరుగుతున్నాయి. సోదర సోదరీమణులారా... మీరే ఆలోచించండి! సీమాంధ్రను స్కామాంధ్రగా మార్చే వారిని ఎన్నుకుంటారా? లేక... స్వర్ణాంధ్రగా మార్చే వారిని ఎన్నుకుంటారా?'' అని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను సూటిగా ప్రశ్నించారు. కొత్త రాష్ట్ర భవిష్యత్తు భవ్యంగా ఉండాలన్నా, అభివృద్ధి దివ్యంగా సాగాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కావాలని పేర్కొన్నారు. బుధవారం రాత్రి తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికను పంచుకున్నారు. బాధ్యత, జవాబుదారీతనంగల నేతగా... సీమాంధ్ర అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలన్ని నెరవేర్చుతానని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. "బీహార్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఈ పవిత్రమైన భూమిపై అడుగుపెట్టాను. నా కళ్లముందు తిరుమల వెంకటేశ్వర స్వామిని చేర్చుకునే కాలిబాట భవ్యంగా కనిపిస్తోంది.
గోవింద నామస్మరణ వినిపిస్తోంది'' అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. "మీ ముందు రెండు మార్గాలున్నాయి. సీమాంధ్ర కావాలా? స్కామాంధ్ర కావాలా? సీమాంధ్ర స్వర్ణాంధ్రగా కావాలంటే చెప్పండి! నేను మీతోనే ఉంటాను. మీ కోసం ఏమైనా చేస్తాను'' అని మోదీ పేర్కొన్నారు. 'స్కామాంధ్ర' నేతల వైపు ఏమా త్రం మొగ్గు చూపినా ప్రమాదమేనన్నారు. అప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ఎంత మేలు చేసినప్పటికీ... ప్రజలకు చేరదని హెచ్చరించారు. "చంద్రబాబు హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారు. అలాంటి హైదరాబాద్‌ను వదలడమంటే తల్లిని వదిలి బిడ్డ రావడమే. సీమాం«ద్రుల్లో ఒక బాధ ఉంది. భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళన ఉంది. అయినా.. నిరాశ పడొద్దు'' అని మోదీ భరోసా ఇచ్చారు. 50 ఏళ్ల క్రితం మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయినప్పటి పరిస్థితులను గుర్తుకు తెచ్చారు. "గుజరాత్ వద్ద సంపదలేదు, నదులు లేవు, ఖనిజాలు లేవు, ఎడారి మాత్రమే ఉంది! గుజరాత్ ఖేల్ ఖతం... అని 50 ఏళ్ల క్రితం అంతా వ్యాఖ్యానించారు. కానీ... ఇప్పుడు గుజరాత్‌ను చూడండి. అభివృద్ధి విషయంలో గుజరాత్‌ను మించిన శక్తి సామర్థ్యాలు, నైపుణ్యం సీమాం«ద్రుల్లో ఉన్నాయి. తెలుగు వారి కష్టం వల్ల మా రాష్ట్రంలోని సూరత్ వెలుగుతోంది. అందుకే చెబుతున్నా... మీకు నిరాశ వద్దు! మీకు హామీలు ఇచ్చేందుకు కాదు, భరోసా ఇచ్చేందుకే వచ్చాను'' అని మోదీ ఉద్ఘాటించారు.
ప్రగతి ప్రణాళిక సిద్ధం...
సీమాంధ్ర అభివృద్ధికి సంబంధించి తన మస్తిష్కంలో ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని మోదీ వివరించారు. సీమాంధ్రలో టీడీపీ-బీజేపీ, ఢిల్లీలో ఎన్డీయే సర్కారు ఏర్పడిన తర్వాత వాటిని అమలు చేస్తామన్నారు. "నావీ, చంద్రబాబువీ అభివృద్ధి ఆలోచనలే. చంద్రబాబు హైదరాబాద్‌ను సైబర్ సిటీగా మార్చారు. బ్రాండ్ హైదరాబాద్‌ను నిర్మించారు. అలాంటి హైదరాబాద్‌ను వదలి రావడం కష్టమే! కానీ... సీమాంధ్రను మనం హార్డ్‌వేర్ రాజధానిగా మార్చలేమా? పెట్రోలియం ఉత్పత్తుల తర్వాత దేశం అత్యధికంగా దిగుమతి చేసుకునేది ఎలక్ట్రానిక్ వస్తువులనే. సీమాంధ్రలో వాటిని తయారు చేయలేమా? మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఉత్పత్తి చేయలేమా? మన యువకుల్లో శక్తి ఉంది. నైపుణ్యం ఉంది. ప్రపంచం అవసరాలను తీర్చుదాం. బాబు ఈ దిశగా చొరవ తీసుకుంటే, నేను సహకరిస్తాను'' అని పేర్కొన్నారు.
ఢిల్లీ చిన్నబోయేలా రాజధాని
దేశ రాజధాని ఢిల్లీ సైతం చిన్నబోయేలా సీమాంధ్ర రాజధాని నిర్మించుకుందామని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. "గుజరాత్ విడిపోయినప్పుడు రైతులు ఉదారంగా భూములు ఇచ్చారు. మేం కొత్త రాజధాని నగరమైన గాంధీనగర్‌ను నిర్మించుకున్నాం. పదేళ్ల క్రితం ఏర్పాటైన... గిరిజన ప్రాంతమైన, అది బీమారు రాష్ట్రాల నుంచి ఏర్పడిన ఛత్తీస్‌గఢ్‌లో మా బీజేపీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ 'న్యూ రాయ్‌పూర్'ను అద్భుతంగా నిర్మించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక చంద్రబాబు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలి. ప్రపంచంలో అనేక దేశాల్లో కొత్తగా స్మార్ట్ నగరాలు ఏర్పాటయ్యాయి. అలాంటి స్మార్ట్ నగరం ఇక్కడా ఏర్పడాలి. సీమాంధ్ర కొత్త రాజధాని ఎలా ఉండాలంటే... ఢిల్లీ కూడా దాని ముందు చిన్నబోవాలి'' అని మోదీ పేర్కొన్నారు. "గోవిందుడి పవిత్ర భూమి నుంచి మొత్తం సీమాంధ్ర ప్రజలను కోరుతున్నాను. ఇవి ముఖ్యమంత్రిని, సర్కారును ఏర్పాటు చేసే ఎన్నికలు కావు. సీమాంధ్రను నిర్మించుకునే ఎన్నికలు. మీరు మంచి నిర్ణయం తీసుకోకుండా... సీమాంధ్రను స్కామాంధ్రగా మార్చే వారి చేతికి ఇస్తే ఢిల్లీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. సీమాంధ్ర అసెంబ్లీలో టీడీపీ-బీజేపీ పూర్తి మెజారిటీ ఇవ్వండి. ఎంపీ సీట్లన్నీ గెలిపించండి. సీమాంధ్ర నెంబర్ వన్ అవుతుందో, లేదో చూడండి!'' అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సీమాంధ్రలో ప్రభుత్వం ఏర్పాటుకు కాదు... సీమాంధ్రను నిర్మించుకోవడానికి చంద్రబాబును సీఎం చేయాలన్నారు. సీమాంధ్రకు మొత్తం దేశానికి విద్యుత్తు ఇచ్చే శక్తి సామర్థ్యాలు, వనరులు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. "ఢిల్లీ సర్కారుకే గనుక సత్తా ఉంటే... కేవలం సీమాంధ్రలోని కేజీ బేసిన్‌లోని ఇంధన వనరులతోనే మొత్తం దేశానికి కరెంటు ఇవ్వగలదు. విద్యుత్ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించేది. గుజరాత్‌లో పెట్రోలియం యూనివర్సిటీ ఉంది. సీమాంధ్ర యువత కావాలంటే అక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు.
మా రాష్ట్ర తలుపులు తెరిచి ఉంచుతాం. సీమాంధ్రలోనూ గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తులను సంపూర్ణంగా వినియోగించుకోండి. సీమాంధ్ర సముద్ర తీరమే... సంపన్నతకు బాటలు వేస్తుంది. భారత వికాసానికీ బాటలు వేస్తుంది'' అని మోదీ పేర్కొన్నారు. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తూర్పు దిశగా పయణిస్తోందని... సీమాంధ్రలోని తూర్పు తీరం ఈ వికాసానికి కేంద్రంగా మారే అవకాశముందని చెప్పారు. 'అలా చేసే అవకాశం మాకివ్వండి. చేసి చూపిస్తాం' అని మోదీ ఉద్ఘాటించారు. విశాఖ ఉక్కును దేశ విదేశాలకు ఎగుమతి చేయవచ్చునన్నారు. రక్షణ నౌకలను నిర్మించుకునే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల గురించి మోదీ ప్రస్తావించారు. రాయలసీమకు నీటి కష్టాలున్నాయన్నారు. రైతులకు నీళ్లు లభిస్తే మట్టి నుంచి బంగారం పండిస్తారన్నారు. కచ్ పైప్‌లైన్ గురించి వివరించారు. "మా రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలోనూ ఒకప్పుడు నీళ్లు లేవు. ఇప్పుడు పైప్‌లైన్ సహాయంతో పొలాలకు నీరు చేరవేస్తున్నాం. ఆ పైప్‌లైన్ ఎంత పెద్దతో తెలుసా? ఆ తల్లీ కొడుకుల (సోనియా-రాహుల్) కుటుంబం మారుతీ కారులో కూర్చుని ఎంచక్కా పైప్‌లైన్‌లో ప్రయాణించవచ్చు. ఆ పైప్‌లైన్ ద్వారా పాకిస్థాన్ సరిహద్దుల దాకా నీళ్లు తీసుకొచ్చాం. కచ్ ఒకప్పుడు ఎడారి. ఇప్పుడు అక్కడి రైతులు కూరగాయలను, మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు'' అని మోదీ వివరించారు. వాజపేయి గంగా-కావేరీ అనుసంధానం గురించి కలుకన్నారని... దానిని యూపీఏ సర్కారు తొక్కి పెట్టిందని విమర్శించారు. "మేం నదులను అనుసంధానిస్తాం. భూములను పచ్చపరుస్తాం. వాజపేయి హయాంలో ప్రధానమంత్రి గ్రామీణ రహదారి యోజనతో ప్రతి ఊరికీ రహదారులు వేశారు. మేం... జాతీయ కృషి, శిక్షా యోజనతో ప్రతి పొలానికీ నీరు తెస్తాం. ప్రతి చేతికీ పని ఇస్తాం'' అని తెలిపారు.
'మేత నేతల'ను వదలను...
'నేను లంచాలు తినను. తిననివ్వను' అని మోదీ పేర్కొన్నారు. అంతేకాదు... దేశాన్ని, సీమాంధ్రను, ప్రజల శ్రమను దోచుకున్న వారిని వదిలేది లేదని, తగిన గుణపాఠం చెబుతానని ప్రకటించారు.
పవన్‌లో పవర్
"కొన్నాళ్ల క్రితం తమ్ముడు పవన్ కల్యాణ్‌ను కలిశాను. ఆయన గుండెల్లో ఉన్న తెలుగు స్పిరిట్ నా హృదయాన్ని తాకింది!'' - మోదీ
కమలం చూపినందుకు కేసు!
"నాపై కాంగ్రెస్ పార్టీ నిఘంటువులో ఉన్న తిట్లన్నీ ప్రయోగించింది. విష ప్రచారం చేసింది. నా జీవితంలో నాపై ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. చివరికి... రాంగ్‌రూట్‌లో స్కూటర్ నడిపిన కేసు కూడా లేదు. కానీ.. ఏప్రిల్ 30వ తేదీని మాత్రం మరిచిపోలేను. ఈ రోజు గుజరాత్‌లో నాపై కేసు నమోదైంది. అదికూడా... నేనెవరికీ చాకు చూపించలేదు. తుపాకీ చూపించలేదు. కానీ... ప్రజలకు కమలం పువ్వు చూపించాను. అందుకే నాపై కేసు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నిస్పృహలో ఉందో దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు!''
సీమాంధ్రలోనే నా ప్రమాణ స్వీకారం
దేశం ఆశ్చర్యపోయేలా సీమాంధ్ర ప్రగతి
తిరుపతి సభలో చంద్రబాబు
తిరుపతి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): "ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా సీమాంధ్రలోనే ప్రమాణ స్వీకారం చేస్తా. ఆ రోజు నుంచే ఇక్కడ పని చేస్తా'' అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. దేశం ఆశ్చర్యపడే రీతిలో సీమాంధ్రను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. బుధవారం తిరుపతిలో జరిగిన 'ఎన్డీయే విజయ శంఖారావం' సభలో సభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీతో కలిసి చంద్రబాబు ప్రసంగించారు. ఎన్డీయేకు 300 స్థానాలు రావడం, మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. విభజన జరిగిన తీరుపట్ల సీమాంధ్ర ప్రజలు ఆవేదన, ఆక్రోశంతో ఉన్నారని తెలిపారు. "ఈ కసిని, కోపాన్ని పాజిటివ్ ఎనర్జీగా మార్చుదాం. ఆ శక్తిని సీమాంధ్ర అభివృద్ధికి ఉపయోగిద్దాం'' అని చంద్రబాబు పిలుపునిచ్చారు. "నేనూ కసిగా పని చేస్తా. కూలీగా మారతా. చెట్లకింద కూర్చునైనా పని చేద్దాం. మన శక్తిని నిరూపించుకుందాం. పదేళ్లలోకాదు... ఆరునెలల్లో రాజధాని నిర్మించుకుందాం'' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
విభజన చేసిన తీరును ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్‌కు ఏ ఒక్కరూ ఓటు వేయరన్నారు. "రాష్ట్రాన్ని విభజించవద్దని సీమాంధ్రులు అడిగారు. తెలంగాణ ఇవ్వాలంటే సీమాంధ్రను ఒప్పించండి.. లేదా సమైక్యంగా ఉంచాలంటే తెలంగాణను ఒప్పించండి అని నేను సూచించాను. కానీ, రాష్ట్రం సోనియా సొంత జాగీరులాగా రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా విభజించారు'' అని చంద్రబాబు మండిపడ్డారు. ఈ కుట్రపన్నింది కాంగ్రెస్ కాగా... అందులో పాత్రధారులు కేసీఆర్, జగన్ అని విమర్శించారు. ఆ ముగ్గురి మధ్య లాలూచీ ఉందన్నారు. "అప్పులు జనాభా ప్రాతిపదికన పంచుతారు! ఆదాయం మాత్రం ఉండదు. విభజన తర్వాత అప్పులు చెల్లించాలి. వడ్డీలు కట్టాలి. అదే సమయంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. జీతాలు కూడా ఇవ్వగలమో, లేదో తెలియదు! వీటన్నింటికీ కేంద్రం నుంచి నిధులు కావాలి'' అని చంద్రబాబు పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలు అనాథలు కాదని, భారత్‌లో భాగమని కేంద్రం గుర్తించాలన్నారు. అండగా నిలబడాల్సింది మోదీయేనన్నారు. సీమాంధ్రకు 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. హైదరాబాద్‌లో ఉండే సీమాం«ద్రులకు కూడా న్యాయం జరగాల్సిన అవసరముందని తెలిపారు. "సీమాంధ్ర, తెలంగాణ రెండూ సమానమేనని, రెండూ అభివృద్ధి చెందాలి, విభజన హేతుబద్ధంగా ఉండాలని చెప్పిన ఏకైక జాతీయ నాయకుడు నరేంద్ర మోదీ'' అని చంద్రబాబు పేర్కొన్నారు. "నరేంద్ర మోదీ తల్లి బుధవారం ఆటోలో వెళ్లి ఓటు వేసి వచ్చారు. ఇది ఆయన నిరాడంబరతకు నిదర్శనం. అదే... వైఎస్ కుటుంబాన్ని చూడండి! వారికి అన్ని వందల కోట్లు ఎక్కడివి? ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 20 నుంచి 30 కోట్లు ఖర్చు పెడుతున్నారు'' అని చంద్రబాబు పేర్కొన్నారు.
కేసీఆర్‌పైనా చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాజకీయ లబ్ధికోసమే ఆయన రెచ్చగొడుతుంటారన్నారు. "కేసీఆర్ నాతో పెట్టుకోవద్దు అని చెప్పాను' అని తెలిపారు. "కేసీఆర్ చెడబుట్టాడు! నా దగ్గర పెరిగాడు! పనికిమాలిన వ్యక్తి, గురువుకే పంగనామాలు పెట్టాడు' అని మండిపడ్డారు. కెరీర్ దెబ్బతింటుందని తెలిసినా... పవన్ కల్యాణ్ దేశంకోసం రాజకీయాల్లోకి నిస్వార్థంగా వచ్చారని చంద్రబాబు ప్రశంసించారు. ఆ స్ఫూర్తి అందరిలో ఉండాలన్నారు.
సీమాంద్రుల ఆత్మగౌరవం కాపాడలేని జగన్ ముఖ్యమంత్రా?
సీమాంధ్రులను కేసీఆర్ అవమానిస్తుంటే మాట్లాడవేం?
పౌరుషం చచ్చిపోయిందా?
దోచుకోవడంలో కాంగ్రెస్, వైసీపీ సేమ్ టు సేమ్
వైసీపీ హటావో.. సీమాంధ్ర బచావో
చంద్ర బాబు, మోదీతోనే అభివృదిధ
తిరుపతి సభలో పవన్ కల్యాణ్ పిలుపు
తిరుపతి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): సీమాంధ్రలో కాంగ్రెస్ గల్లంతైపోయిందని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇక... 'కాంగ్రెస్ హటావో' అంటూ ప్రత్యేకంగా పిలుపు నివ్వాల్సిన అవసరమే లేదన్నారు. 'వైఎస్ఆర్ కాంగ్రెస్ హటావో... సీమాంధ్ర బచావో' అని సరికొత్త నినాదం ఇచ్చారు. బుధవారం తిరుపతిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొన్న బహిరంగ వేదికపై నుంచి పవన్ కల్యాణ్ ప్రసంగించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, వైసీపీ అధిపతి జగన్‌పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ సీమాం«ద్రులను అవమానించేలా పదేపదే మాట్లాడుతుంటే ఎందుకు స్పందించడంలేదని జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. "నేను పార్టీ పెట్టి 50 రోజులు కూడా కాలేదు. నేనే కేసీఆర్‌ను నిలదీస్తున్నాను. మరి... జగన్ ఎందుకు మాట్లాడటం లేదు. ఆయనలో సీమాంధ్ర పౌరుషం చచ్చిపోయిందా?'' అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సీమాం«ద్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని జగన్‌కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఎక్కడిదని నిలదీశారు. తెలంగాణలో ఊరూరా పర్యటించి కేసీఆర్ వ్యాఖ్యలను ఎందుకు తిప్పి కొట్టలేదన్నారు. దోచుకోవడంలో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ దొందు దొందే అని పవన్ ఎద్దేవా చేశారు. ఆ కాంగ్రెస్ పార్టీ వెనుక వైఎస్ ఉంటే... ఈ కాంగ్రెస్ ముందు వైఎస్ పేరు ఉందన్నారు. 'దోపిడీలో రెండూ సేమ్ టు సేమ్' అన్నారు. వైసీపీకి ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్లేనన్నారు. వైఎస్ వల్లే తెలంగాణ ఉద్యమం బలపడిందన్నారు. "తెలంగాణలో పునర్నిర్మాణం జరగాలి. కానీ, సీమాంధ్రకు అసలు నిర్మాణమే లేదు. ఇలాంటి సమయంలో మంచి ప్రభుత్వాలు రావాలి. మొత్తం ఆంధ్రప్రదేశ్‌ను దోచుకున్న వారికి తెలంగాణలేని ఆంధ్రను దోచుకోవడం ఒక లెక్కా?'' అంటూ పరోక్షంగా జగన్‌పై దాడికి దిగారు.
నాడు సర్దార్ పటేల్ సంస్థానాలను విలీనం చేయగా... ఇప్పుడు సెజ్‌ల పేరిట వేల ఎకరాలు కట్టపెట్టి నయా సంస్థానాలు సృష్టిస్తారని హెచ్చరించారు. 'వైసీపీ హటావ్, సీమాంధ్ర బచావ్' అని పవన్ నినదించారు. కేసీఆర్ నాలుకంతా విషమే అని పవన్ మండిపడ్డారు. "ఆయన అందరినీ తిడతారు. కాబోయే ప్రధానిగా అందరూ చెబుతున్న మోదీని కూడా తిట్టారు. ఆయన నాలుకంతా విషమే. అలాంటి వారితో అయ్యా, అబ్బా అని మాట్లాడితే కుదరదు. విషానికి విషమే విరుగుడు! బాంచన్ దొరా అని కాళ్లు మొక్కుడే నాకు నచ్చదు. దేశ సమగ్రత దెబ్బతినేలా మాట్లాడితే ఒప్పుకోను'' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కేసీఆర్ సీమాం«ద్రులను అవమానించేలా పదే పదే మాట్లాడారంటూ మండిపడ్డారు. ఇది చూసి ఎంతో బాధపడ్డానన్నారు. మోదీకి కేసీఆర్ క్షమాపణ చెబితే... అప్పుడు తాను ఏం చెప్పాలో అది చెబుతానని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్, తాను కలిస్తే 'మూడు' కాదని... 111 అని మోదీ చేసిన ప్రకటనను కేసీఆర్ ఎద్దేవా చేయడంపై పవన్ మండిపడ్డారు. "అది 111 కాదని, పంగనామాలని కేసీఆర్ గేలి చేశారు. అవి పంగనామాలు కావు... వెంకటేశ్వరస్వామి మూడు నామాలు'' అని పేర్కొన్నారు.

No comments:

Post a Comment