Sunday 20 July 2014

పట్టు విడుపులుండొచ్చు! - KCR


పట్టు విడుపులుండొచ్చు!

Published at: 20-07-2014 07:48 AM
హైదరాబాద్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పత్రికా సంపాదకులు, ఎలకా్ట్రనిక్‌ మీడియాకు పాత్రికేయులకు విందు ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో ‘గెట్‌ టు గెదర్‌’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, పాత్రికేయ ప్రముఖులకు మధ్య పలు అంశాలపై పిచ్చాపాటీగా చర్చ జరిగింది. మరీ ముఖ్యంగా... విద్యార్థులకు చెల్లించే ఆర్థిక సహాయానికి (ఫాస్ట్‌) ప్రామాణికంగా నిర్దేశించిన 1956 అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు... ఈ విషయంలో కొన్ని పట్టువిడుపులు ఉంటాయని కేసీఆర్‌ సంకేతాలు పంపారు. ‘ఫాస్ట్‌’ అమలుకు 1956 సంవత్సరాన్ని కటాఫ్‌గా నిర్ణయిస్తే, మా పిల్లలు ఏమైపోవాలి అని ఒక సీనియర్‌ పాత్రికేయుడు అడిగినప్పుడు కేసీఆర్‌ ఈ అంశంపై స్పందించారు. దశాబ్దాల క్రితమే తెలంగాణకు వచ్చి, ఇక్కడే స్థిరపడి, ఇక్కడి సంస్కృతితో మమేకమై, ఇక్కడి వాళ్లమే అనుకునే వారి పిల్లలకు పెద్దగా ఇబ్బంది ఉండబోదని సంకేతాలు పంపారు. వారికి ఫీజు చెల్లింపు విషయంలో పట్టువిడుపులు ఉండొచ్చుననే విధంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే,  ఏళ్లతరబడి తెలంగాణలో ఉంటున్నప్పటికీ, తమ స్వస్థలం గుంటూరు అనో, మరొకటనో చెప్పుకునే వారి పిల్లలకు లబ్ధి చేకూర్చడం ఎంతవరకు సబబో ఆలోచించాలని కూడా కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పథకాలు, ఇచ్చిన హామీల అమలుకు నిధుల కొరత ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ స్థోమతను చూసుకునే పథకాలు, హామీలు ప్రకటిస్తున్నామని తెలిపారు. నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని... ఎంతో కొంత తక్కువపడితే ఆ మేరకు సమీకరించుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ‘మీడియా ఫ్రెండ్లీ’గా ఉంటుందా అని ప్రశ్నించగా... పక్కనే ఉన్న రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు స్పందిస్తూ... ‘ఇదంతా మీడియా ఫ్రెండ్లీ కాదా!’ అంటూ ‘గెట్‌ టుగెదర్‌’ కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌, కేకేతోపాటు మంత్రులు టి.హరీశ్‌ రావు, జగదీశ్వర్‌రెడ్డి, ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌, వివిధ పత్రికలు, వార్తా చానళ్లకు చెందిన ప్రతినిధులు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు ఆర్‌.విద్యాసాగర్‌రావు, సమాచార, పౌర సంబంధాల శాఖ  కమిషనర్‌ ఆర్వీ చంద్రవదన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment