Friday 4 July 2014

24 గంటల కరెంటు నా కల

24 గంటల కరెంటు నా కల

Published at: 05-07-2014 03:00 AM
 రాజస్థాన్‌, ఢిల్లీ, ఏపీల్లో మోడల్‌ ప్రాజెక్టు
కేంద్ర ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి అరోరా వెల్లడి
రాష్ట్ర అధికారులతో కేంద్ర బృందం భేటీ
హైదరాబాద్‌, జూలై 4 : ‘‘విద్యుత్‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ స్వయం సమృద్ధి సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంటూ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటున్నాను. విద్యుత్‌ రంగంలోనే కాదు.. అన్ని రంగాల్లోనూ ఏపీ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని కాంక్షిస్తున్నాను. ఈ దిశగా అడుగులు వేస్తున్నాను. విద్యుత్‌ వినియోగదారులు సంతృప్తి చెందేలా విద్యుత్‌ రంగాన్ని వృద్ధి చేస్తా. గృహాలకు 247 విద్యుత్‌ సరఫరా చేయడం నా స్వప్నం. ఇది నా డ్రీమ్‌ ప్రాజెక్టు’’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాజస్థాన్‌, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లలో గృహాలకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేసే మోడల్‌ ప్రాజెక్టును కేంద్రం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు.. కేంద్ర ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి అరోరా తన బృందంతో శుకవ్రారం హైదరాబాద్‌కు వచ్చారు. ఉదయం ఏపీ జెన్‌కో కార్యాలయంలో ఇంధన శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆమె సీఎం చంద్రబాబును లేక్‌వ్యూ అతిథి గృహంలో కలిశారు. ఈ ప్రాజెక్టు గురించి ఆయనకు సమగ్రంగా వివరించారు. ఇక. రాష్ట్ర విద్యుత్‌ రంగం గురించిన సమగ్ర సమాచారాన్ని ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఆమెకు వివరించారు.
ఈ సమావేశం వివరాలను స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌ సీఈవో ఎ.చంద్రశేఖర రెడ్డి తెలిపారు. ఆయన చెప్పినదాని ప్రకారం.. కేంద్రం ప్రయోగాత్మకంగా 247 గృహాలకు విద్యుత్‌ సరఫరా చేసే పథకాన్ని అమలు చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ రంగంలో సమూల మార్పులు చేసేందుకు చర్యలు తీసుకుంటోందని జ్యోతి అరోరాకు చంద్రబాబు వివరించారు. ఇందులో భాగంగా.. విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంపు, విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌, డిసి్ట్రబ్యూషన్‌ నెట్‌వర్క్‌ విధానాల్ని బలోపేతం చేయడం, సిటిజన్‌ చార్టర్‌ను అమలు చేయడం వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ‘గ్రీన్‌ పవర్‌’ విధానానికి ప్రోత్సాహం ఇస్తూ .. పర్యావరణానికి మేలు చేసే విధంగా సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గృహాలన్నింటికీ 247 విద్యుత్‌ అందించడం తన కల అని కేంద్ర బృందానికి చంద్రబాబు స్పష్టం చేశారు.
 
ఏపీ జెన్‌కోలో.. : అంతకు ముందు.. జ్యోతి అరోరా బృందం శుక్రవారం ఏపీ జెన్‌కో కార్యాలయంలో ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌ తదితరులతో భేటీ అయింది. రాష్ట్రంలో 24 గంటల కరెంటు సరఫరాకు 500 నుంచి 700 మెగావాట్ల కొరత ఉందని రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. బొగ్గు నిల్వల విషయంలో రేషనలైజేషన్‌ లేకపోవడం, సరైన సమయానికి బొగ్గు నిల్వలు రాకపోవడం, గ్యాస్‌ కొరత ఉండడం, వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో థర్మల్‌ ఉత్పత్తికి ఆస్కారం లేకపోవడం తదితర అంశాల గురించి వివరించారు. దీనిపై దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని, కేంద్రం నుంచి అవసరమయ్యే విద్యుత్‌, బొగ్గు, గ్యాస్‌ సరఫరా, గ్రిడ్‌తో అనుసంధానం తదితర అంశాలపై బ్లూప్రింట్‌ ఇవ్వాలని జ్యోతి అరోరా కోరారు. ఇప్పటి వరకూ కేటాయించని విద్యుత్‌ను సెంట్రల్‌ జనరేటింగ్‌ స్టేషన్‌ (సీజీఎస్‌)ల నుంచి కేటాయిస్తామని కేంద్రం తరఫున హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలలో ప్లాంట్‌ లోడ్‌ ఫాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) పూర్తిస్థాయిలో ఉంటూ.. విద్యుదుత్పత్తి గరిష్ఠంగా ఉండేందుకు వీలుగా అదనపు బొగ్గు బ్లాకులను కేటాయిస్త్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ విద్యుత్‌ సౌకర్యం లేని గృహాలకు, ట్రాన్స్‌మిషన్‌ బలోపేతానికి ఆర్‌జీజీవీవై (రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ పథకం), ఆర్‌ఈసీల నుంచి నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కాగా.. పదిహేను రోజుల్లో గృహ వినియోగదారులందరికీ విద్యుత్‌ పథకం కోసం బ్లూప్రింట్‌ను రూపొందిస్తామని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌ వివరించారు. 24 గంటల నిరంతరాయ సరఫరాకు అవసరమయ్యే విద్యుత్‌ సేకరణ కోసం నెల, సంవత్సరాల వారీగా ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన తెలిపారు. విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఆధునికీకరిస్తామన్నారు. కాగా.. కేంద్ర ఇంధన శాఖ బృందం మరో 15 రోజుల తర్వాత రాష్ట్ర అధికారులతో మరోసారి సమావేశమై తదుపరి చర్యలపై చర్చించా తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నది.
సమర్థ నాయకత్వం ఉంది.. సమస్యే కాదు: అజయ్‌జైన్‌
సమర్థమైన నాయకత్వం, ప్రేరణ గల సిబ్బంది ఉండడం వల్ల ఈ పథకం అమలు కష్టమేమీ కాదని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌ చెప్పారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిరంతర విద్యుత్‌ సరఫరాపై మంచి ప్రణాళిక తయారు చేయబోతున్నామని, కేంద్రం తరఫున ఏం చేయాలో, రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేయాలో అందులో నిర్ణయిస్తామన్నారు. అదనంగా విద్యుత్‌, బొగ్గు సరఫరా చేయడం, ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ ఏర్పాటు చేయడం, అవసరమయ్యే నిధుల్ని కేటాయించడం కేంద్రం పని అని ఆయన వివరించారు. ఈ పథకాన్ని ఎన్ని రోజుల్లో ప్రారంభించి, ఎన్ని రోజుల వరకూ అమలు చేయగలుగుతామనే అంశంపైనే కాకుండా, మరో 20 అంశాలపై 15 రోజుల్లో సమగ్రనివేదిక రూపొందిస్తామని వివరించారు.

No comments:

Post a Comment