Tuesday 8 July 2014

నెల రోజుల బాబు

నెల రోజుల బాబు

Published at: 08-07-2014 03:55 AM
వ్యవస్థల సర్దుబాట్లకే అధిక సమయం
ప్రజలకిచ్చిన హామీలకూ ప్రాధాన్యం
రాష్ట్రాభివృద్ధికి వడివడిగా అడుగులు
సమస్యలపై ప్రజల అవగాహనకు శ్వేతపత్రాలు
చంద్రబాబు నెల రోజుల పాలన తీరు ఇది
హైదరాబాద్‌, జూలై 7 : ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ముఖ్యమంత్రికి కార్యాలయమే తయారు కాలేదు. సగం మంది మంత్రుల కార్యాలయాలకు పూర్తిస్థాయిలో వసతులు సమకూరలేదు. అనేక శాఖల్లో అధికారులు, సిబ్బంది సర్దుబాటు పూర్తి కాలేదు. ఇటువంటి బాలారిష్టాల నడుమ ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించి నెలరోజులు ముగిసింది. ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం క్యాంపు కార్యాలయం తయారు కావడానికే పదిహేను రోజులు పట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవస్థలను సర్దుబాటు చేసుకోవడానికే చంద్రబాబుకు మొదటి నెల రోజుల పాలనలో అధిక శాతం సమయం సరిపోయింది. చేతిలో నిధులు లేక...కనీసం రాజధాని ఏదో కూడా తేలకుండా తుక్కు మాదిరిగా చేతికి వచ్చిన రాషా్ట్రనికి కొత్త రూపు ఇచ్చేందుకు బాబు వడివడిగా అడుగులు వేస్తున్నారు. తాను పరుగులు తీస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించడం... కొత్త కొత్త ఆలోచనలు, నిర్ణయాలతో అందరినీ ఆకట్టుకోవడం సహజంగా చంద్రబాబు శైలి. కానీ ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు శైలిని మార్చారు. విభజన తర్వాత అధ్వానస్ధితిలో చేతికి వచ్చిన రాషా్ట్రన్ని చక్కదిద్దుకోవడానికి... ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఆయన ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి పనిచేస్తున్నారు. అందులో కూడా ఆయన సహజ శైలి తొంగి చూస్తూనే వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగవిరమణ వయసును అరవై ఏళ్లకు పెంచడం సంచలనం కలిగించింది. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపితే పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ప్రధానమైన రైతు రుణ మాఫీని అమలు చేయడానికి చంద్రబాబు ఈ నెల రోజుల్లో సుదీర్ఘమైన కసరత్తు చేశారు. దానిపై అధ్యయనానికి ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
అవి కుదరకపోతే ఇతర మార్గాల ద్వారా రుణాలు సేకరించైనా మాఫీ హామీ నిలబెట్టుకోవడానికి బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి కనీసం పాతిక...ముప్ఫై వేల కోట్ల రూపాయల రుణాలు సేకరించి రైతుల అప్పులు మాఫీ చేయడంపై ప్రస్తుతం కసరత్తు నడుస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ. లక్షన్నర వరకూ మాఫీ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. 24 గంటలూ విద్యుత్‌ సరఫరాకు పైలెట్‌ రాష్ట్రంగా ఏపీని ఎంపిక చేయించడం, కేంద్రం నుంచి అదనపు విద్యుత్‌, బొగ్గు కేటాయింపులను సాధించడం వంటి వి ఆయన చేయగలిగారు. ముఖ్యమంత్రిగా చేసిన తొలి సంతకాల్లో బెల్టు షాపులు ఎత్తివేయడం, రెండు రూపాయలకు ఇరవై లీటర్ల మినరల్‌ వాటర్‌ సరఫరా వంటి హామీల అమలుకు కార్యాచరణ మొదలు పెట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు వేగం ప్రకృతి ప్రమాదాల్లో కనిపించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో తెలుగు విద్యార్ధులు నదిలో కొట్టుకుపోయిన దుర్ఘటనలో హైదరాబాద్‌లో దుఖంలో ఉన్న తల్లిదండ్రులను ప్రత్యేక విమానంలో అక్కడకు తరలించడం... అక్కడ ఉన్న మిగిలిన విద్యార్థులను ఇక్కడకు తీసుకురావడంలో ఆయన చూపించిన స్పీడ్‌ పొరుగు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచింది. తూర్పు గోదావరి జిల్లాలో గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలిన దుర్ఘటనలో ఢిల్లీ నుంచి హుటాహుటిన తరలిరావడం, వారం లోపే ప్రమాద బాధితులకు పరిహారం పంపిణీ చేయించడం, తమిళనాడులో జరిగిన ప్రమాదాల బాధితులను ఆదుకోవడానికి అధికారులు, మంత్రులను వెంటనే పంపడం వంటి నిర్ణయాలు ప్రశంసలు అందుకొన్నాయి. అన్ని ప్రాంతాలను సమానంగా చూసే క్రమంలోనే శాసనసభాపక్ష నేతగా తన ఎన్నిక కార్యక్రమం తిరుపతిలో పెట్టుకొన్న ఆయన ప్రమాణ స్వీకారాన్ని విజయవాడ-గుంటూరు మధ్య నిర్వహించారు.
మంత్రివర్గ మొదటి సమావేశాన్ని విశాఖలో పెట్టిన ఆయన ఈసారి స్వాతంత్య్ర వేడుకలను కర్నూలులో పెట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. వీలైనంత వరకూ పొరుగు రాష్ట్రం తెలంగాణతో బహిరంగ విభేదాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్న బాబు విద్యుత్తు పీపీఏల రద్దు విషయంలో మాత్రం తన ఆకస్మిక నిర్ణయంతో సంచలనం కలిగించారు. విభజనలో ఇరు రాషా్ట్రల మధ్య విద్యుత్‌ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందన్న అభిప్రాయంలో ఉన్న ఆయన దానికి పరిష్కారంగా పీపీఏలను రద్దును ఎంచుకొన్నారు. తన చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూనే వాటిపై ప్రజలకు కూడా అవగాహన కలిగే వ్యూహాన్ని ఎంచుకొన్నారు. దీని కోసం వివిధ అంశాలపై శ్వేత పత్రాల విడుదలను మొదలు పెట్టారు. ’పాత రోజుల్లో బాబులో ఉన్న వేగం ఈసారి ప్రజలకు కనిపించడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఎంత ఘోరమైన పరిస్ధితిలో ఉందో... ఆయన ఎంత కష్టపడుతున్నారో ప్రజలకు అవగాహన కలిగించగలిగారు. బాబే ఇన్ని తిప్పలు పడుతున్నారంటే మరొకరైతే కొత్తరాష్ట్రం కుప్పకూలిపోయేదన్నది ఈ నెల రోజుల్లో అందరూ అనుకొంటున్న మాట’ అని ఒక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య బాబు నెల రోజుల పాలనకు అద్దం పడుతోంది.
రాజధానికి విరాళాలు 
అడుసుమిల్లి శ్రీధర్‌రావు, యూఎస్‌ 1,00,000 డా. కె.రవికిరణ్‌, విజయవాడ 15,000 వెంకటలక్ష్మీకుమారి, కేవైఎల్‌ నరసింహారావు, రేపల్లె 10,116 చేకూరి హనుమంతరావు (రైల్వే విశ్రాంత ఉద్యోగి పింఛన్‌), శావల్యాపురం(గుంటూరు) 10,000 కె హిమకుమార్‌, వి సత్యనారాయణ, ఎం కృష్ణకిషోర్‌, బి.బాబు, చెన్నై 13,000 హైదరాబాద్‌ బ్యాంకులో నేరుగా నమోదైన వివరాలు పొతూరు భీమశంకర్‌రాజు 10,000 పొల్లాయి కుమార్‌ 10,000

No comments:

Post a Comment