Thursday 3 July 2014

మాఫీకి 3 మార్గాలు!

మాఫీకి 3 మార్గాలు!

Published at: 04-07-2014 09:21 AM
 ప్రత్యామ్నాయాలతో ఏపీ సర్కార్‌
 పూచీగా ప్రభుత్వ సంస్థల రాబడులు
 ఆర్థిక సంస్థల నుంచి నిధుల సమీకరణ
ఆస్తుల సెక్యూరిటైజేషన్‌తో రుణ మాఫీ
ఆస్తుల విలువ ఆధారంగా బాండ్ల విక్రయం
 రుణాల సెక్యూరిటైజేషన్‌ దిశగా యోచన
(హైదరాబాద్‌ - ఆంధ్రజ్యోతి) ఒకవైపు రైతులకిచ్చిన మాట, మరోవైపు తీవ్రస్థాయిలో ఉన్న ఆర్థిక వనరుల కొరత, ఇంకో వైపు బ్యాంకర్ల విముఖత, ఆర్బీఐ నుంచి కానరాని సానుకూల స్పందన.. అదే సమయంలో పథకం అమలుపై ఇప్పటికే వ్యక్తమవుతున్న సందేహాలు! వీటన్నిటి నేపథ్యంలో రుణమాఫీపై రైతులకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎట్టకేలకు పరిష్కారం కనుగొంది. నిపుణులు, మేధావులతో రకరకాల ప్రత్యామ్నాయాలపై తీవ్ర స్థాయిలో మేథో కసరత్తు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తిరుగులేని ప్రత్యామ్నాయాలతో ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ప్రభుత్వ సంస్థల భవిష్యత్‌ రాబడులను పూచీగా ఇచ్చి ఆర్థిక సంస్థల నుంచి రుణాలను సమీకరించి మాఫీకి అవసరమైన నిధులను సమీకరించాలని ప్రతిపాదిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్ర విభజన దరిమిలా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రుణమాఫీ పథకం అమలు మరింత భారంగా మారిన విషయం తెలిసిందే. అదే సమయయంలో, నగదు చెల్లింపులకు తప్ప ఇతర ఏ రూపంలోనూ రుణ మాఫీకి అంగీకరించేది లేదని రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు రుణమాఫీ అమలు జాప్యమయ్యే పక్షంలో తాత్కాలిక ఉపశమనంగా రుణాలను రీ షెడ్యూల్‌ చేయించడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నించినా పలు సాంకేతిక కారణాల వల్ల అది కూడా సాధ్యం కాలేదు.
మరోవైపు రుణమాఫీపై ప్రభుత్వం వెనక్కిపోతోందంటూ విమర్శలు వస్తుండటంతో ఆర్థిక, బ్యాంకింగ్‌ నిపుణులతో చంద్రబాబు సంప్రదింపులు జరిపారు. కొన్ని ప్రత్యామ్నాయాలను సిద్ధం చేశారు. వీటిపై కేంద్ర ఆర్థిక శాఖతో, ఆర్‌బీఐతో కూడా సంప్రదించే అవకాశం ఉంది. వీటిలో లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల భవిష్యత్‌ రాబడులను పూచీగా పెట్టి రుణాలు సమీకరించడమనే ప్రతిపాదనకు ప్రభుత్వం మొగ్గు చూపిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ పద్ధతిలో రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైన ఆర్థిక సంస్థతో ప్రభుత్వం ఒప్పందానికి వచ్చిన తర్వాత తృతీయ పక్షం (మరో బ్యాంకు) వద్ద ఎస్ర్కూ ఖాతాను ప్రారంభిస్తారు. పూచీగా ఇచ్చిన ప్రభుత్వ సంస్థల రాబడులను ఏటా ఈ ఎస్ర్కూ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం అప్పు తీరుస్తున్నంత కాలం ఈ ఎస్ర్కూ నిధులు పదిలంగానే ఉంటాయి. ప్రభుత్వం డిఫాల్ట్‌ అయితే ఈ ఎస్ర్కూ ఖాతాలోని సొమ్మును జప్తు చేసుకునే వెసులుబాటు రుణమిచ్చిన సంస్థకు ఉంటుంది. ఈ మేరకు అప్పు ఇచ్చిన సంస్థ, అప్పు తీసుకున్న ప్రభుత్వం, ఎస్ర్కూ ఖాతా నిర్వహించే బ్యాంకు మధ్య కట్టుదిట్టమైన ఒప్పందం ఉంటుంది.
ప్రస్తుతానికి ఈ పద్ధతిలోనే రుణమాఫీకి అవసరమైన నిధులు సమీకరించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలంటే విలువైన వస్తువు లేదా స్థిరాస్తిని తాకట్టు పెట్టడం అందరికీ తెలిసిందే. అసెట్‌ సెక్యూరిటైజేషన్‌లో ముందుగా ఎంపిక చేసిన ఆస్తుల విలువను మదింపువేస్తారు. ఈ ఆస్తుల ఉమ్మడి విలువ ఆధారంగా నిర్దుష్ట కాల పరిమితి ఉన్న బాండ్లను తయారు చేసి ఇన్వెస్టర్లకు విక్రయిస్తారు. వీటిపై వడ్డీ చెల్లిస్తారు. కాల పరిమితి తీరిన తర్వాత బాండ్స్‌ విలువను జారీ చేసిన వారు చెల్లించలేని పక్షంలో సెక్యూరిటీగా ఉన్న ఆస్తులను విక్రయించి ఇన్వెస్టర్లకు సొమ్ము చెల్లిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో ప్రభుత్వానికి అపారమైన స్థిరాస్తులున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో వాటి విలువ ఇప్పటికంటే రానున్న రోజుల్లో అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఆస్తుల భవిష్యత్‌ విలువ ఆధారంగా వాటిని సెక్యూరిటైజేషన్‌ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.



రుణాల సెక్యూరిటైజేషన్‌

Published at: 04-07-2014 09:20 AM
సాధారణంగా బ్యాంకులు లిక్విడిటీ కోసం తమ రుణాలను సెక్యూరిటీలుగా మార్చి ఇతర ఆర్థిక సంస్థలకు లేదా అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీలకు విక్రయిస్తుంటాయి. ఇందులో రిస్క్‌ ఉంటుంది. అందువల్ల సెక్యూరిటీలను కొనే సంస్థలు-ఇన్వెస్టర్లు వాటి వాస్తవ విలువకు కొంత డిస్కౌంట్‌తో కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన సంస్థలు తమ వాటాలోని రుణాలను వడ్డీతో సహా వసూలు చేసుకోగలిగితే లాభాలు పండినట్టే. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రుణాల సెక్యూరిటైజేషన్‌లో... బ్యాంకుల వద్ద ఉన్న రైతులు, స్వయం సహాయ బృందాల రుణాల మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు బదలాయిస్తారు. దీనిని ఒకే పెద్ద అసెట్‌గా మార్చి దానిని మళ్లీ ముక్కలుగా విభజించి వేరువేరు ఇన్వెస్టర్లకు విక్రయిస్తారు. ప్రభుత్వ రుణమే కావడం వల్ల ఇన్వెస్టర్లు కూడా భరోసాతో ఉండొచ్చు.

No comments:

Post a Comment