Saturday 12 July 2014

ఉద్యోగులకు నేనున్నా!

ఉద్యోగులకు నేనున్నా!

Published at: 13-07-2014 02:43 AM
ఆగస్టు 15 నుంచి హెల్త్‌ కార్డులు
సత్వరం పీఆర్‌సీ అమలు.. ఆర్థికేతర సమస్యలకు వెంటనే పరిష్కారం
ఉద్యమ కేసులు ఎత్తేస్తాం.. సెలవుగా 80 రోజుల సమ్మె కాలం
మహిళా ఉద్యోగులకు రెండేళ్ల లీవ్‌.. కేంద్రంకంటే మెరుగైన సౌకర్యాలు
విద్వేషాలు పోవాలి.. తెలుగు వారంతా ఏకం కావాలి
23 బదులు 13 జిల్లాలనడం బాధగా ఉంది.. సన్మాన సభలో బాబు
విజయవాడ, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆగస్టు 15 నుంచి ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు ఇస్తాం. తెలంగాణ ప్రభుత్వం కలిసి వచ్చినా రాకపోయినా వీలైనంత త్వరగా ఉద్యోగుల పీఆర్‌సీ అమలు చేస్తాం. కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్‌ సబ్‌ కమిటీని నియమించి దశలవారీగా క్రమబద్ధీకరిస్తాం’’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఎప్పటికైనా తెలుగు వారంతా ఏకం కావాలని, విద్వేషాలు సమసి పోవాలని, సమస్యలు పరిష్కారం కావాలన్నది తన ప్రగాఢ ఆకాంక్ష అని చెప్పారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, వనరులను ఉపయోగించుకుని సంపద సృష్టిద్దాం. ఇవాళ డబ్బులు లేవు. తాత్కాలిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. అన్నిటినీ అధిగమిద్దాం. అందరం కలిసి పని చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. శనివారం లయోలా కళాశాల ఆడిటోరియంలో ఏపీ ఎన్‌జీవోల అసోసియేషన్‌, జేఏసీ ఆధ్వర్యంలో చంద్రబాబును సన్మానించారు. ఈ సందర్భంగా 13 జిల్లాల నుంచి వచ్చిన ఎన్‌జీవో నాయకులు, ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.
అశోక్‌బాబు అధ్యక్షతన జరిగిన సభలో 58 నిమిషాలపాటు మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు, ప్రస్తుత పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘23 జిల్లాలు అని సంబోధించడానికి బదులు 13 జిల్లాలు అని అనడం ఎంతో బాధాకరంగా ఉంది. అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌ను రాజకీయ కుట్రతో విద్వేషాలు రెచ్చగొట్టి విడదీశారు. ఇంకా రెచ్చగొడుతున్నారు. తెలుగు జాతి బాగుండాలని, పేదరికం పోవాలని ఎంతగానో తపిస్తున్నాను. రాష్ట్ర విభజన సమయంలో జీవితంలో ఎన్నడూ పడనంత ఆవేదన చెందాను. ఎన్నో నిద్రలేని రాత్రులు. మానసిక ఆందోళనతో దిగులు చెందాను. ఇరు ప్రాంతాల వారినీ కూర్చోపెట్టి చర్చించి విభజించమంటే హేతుబద్ధత లేకుండా ఏకపక్షంగా విభజించారు. అందుకు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల్లో, ప్రజల్లో కసి, కోపం రెండూ ఉన్నాయి. ఇవి కొనసాగాలి. అభివృద్ధికి ఇవి పనికి వస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించారని ప్రధాన మంత్రి మోదీ కూడా అన్నారని, రాష్ట్రానికి న్యాయం చేస్తానని కూడా చెప్పారని గుర్తు చేశారు. కేంద్రం ఏమాత్రం సహకరిస్తుందో, ఎంత ఇస్తుందో తెలియదు కానీ రాజధాని నిర్మాణానికి తాను ఒక కూలీగా పని చేస్తాన ని, తనతోపాటు ప్రతి ఒక్కరికి ఈ బాధ్యత ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆగస్టుకల్లా అడ్మిషన్లు పూర్తి కావాల్సి ఉన్నా, కామన్‌ ఎంట్రన్స్‌ ద్వారా ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ విద్యార్థుల ప్రవేశాలను నిర్వహిస్తామంటే తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాలేదని చెప్పారు. దీనిపై తాను లేఖ కూడా రాశానని చెప్పారు. పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పినా అక్కడి నుంచి సమాధానం లేదన్నారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడా తెలుగు వారికి అన్యాయం జరిగినా ఒక సైనికుడిలా అడ్డుకుంటానని స్పష్టం చేశారు. ఎటు చూసినా అంథకారం కనిపిస్తున్న దశలో అధికారంలోకి వచ్చామని, ఎన్ని సమస్యలున్నా అధిగమించగల సామర్థ్యం, మానసిక స్థైర్యం పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.
ఉద్యోగులతో ప్రతి మూడు నెలలకొకసారి మంత్రులు కూర్చుని, వారి స్థాయిలో పరిష్కరించదగిన వాటిని పరిశీలిస్తారని చంద్రబాబు చెప్పారు. ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తనను నేరుగా సంప్రదించాలని అశోక్‌బాబుకు చెప్పానన్నారు. సమైక్య ఉద్యమంలో ఉద్యోగులపై పెట్టిన కేసులను సమీక్షించి ఎత్తివేయడానికి ప్రయత్నిస్తామన్నారు. సమ్మె కాలంలోని 80 రోజులను సెలవుగా ప్రకటించి సర్వీస్‌ రెగ్యులర్‌ చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులకు అండగా ఉంటామని చెప్పారు. ఏటా డిపార్ట్‌మెంటల్‌ పదోన్నతుల కమిటీని వేస్తామని, ఏసీబీ కేసులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.  విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్లలో ఉద్యోగులకు 010 ద్వారా వేతనాలు ఇచ్చే విషయంలో ఆర్థికపరమైన ఇబ్బంది ఉందని, దీనిపై గట్టిగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.   రాష్ట్ర రాజధానిపై కమిటీ నివేదిక రావాలని, నివేదిక అందిన తర్వాత మంత్రి మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
2019నాటికి తెలంగాణలోనూ మీరే రావాలి
 ఔట్‌సోర్సింగ్‌ను రద్దు చేయాలి: అశోక్‌బాబు

2019 నాటికి తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడే అధికారంలోకి రావాలని ఏపీఎన్జీవో సంఘాల అధ్యక్షుడు పరుచూరి అశోక్‌ బాబు ఆకాంక్షించారు. తాము ఇక హైదరాబాద్‌లో పని చేయడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. రాజధానిని త్వరగా ఏర్పాటు చేయాలని చెప్పారు. ‘‘హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు లక్ష మంది వరకు ఉన్నారు. వీరు కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. మేమంతా మీకు అండగా ఉంటాం. 2019 నాటికి అక్కడ మీరు అధికారంలోకి రావాలి’’ అని కోరారు. రాజకీయ అవినీతి వల్లే రాష్ట్రం విడిపోయిందని అన్నారు. సభలో ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ.. విభజన సమయంలో మనోవ్యధ పడింది ఒక్క చంద్రబాబు నాయుడేనని చెప్పారు.
‘‘కళింగ యుద్ధం జరిగిన తర్వాత అశోకుడిలో మార్పు వచ్చింది. సిద్ధార్థుడిలో మార్పు వచ్చిన తర్వాతే గౌతమ బుద్ధుడిగా మారాడు. చరిత్రలో ఆ రెండు ఘటనలకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. ఈరోజు చంద్రబాబు నాయుడు మారిన మనిషి అని నేను చెప్పను కానీ.. ఒక పరిణతి చెందిన నాయకుడు, పరిపక్వత ఉన్న రాజకీయ వేత్తగా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో వచ్చిన ముఖ్యమంత్రిగా ఆయనను మనం హృదయపూర్వకంగా అభినందించాల్సిందే’’ అని చెప్పారు.  ముఖ్యమంత్రికి ఉద్యోగుల సమస్యలు చెప్పటం, పరిష్కారం కోరటం తమ విధి అని, ఎన్నో సమస్యలు ఉన్నా ప్రభుత్వానికి భారం కాని సమస్యలనే మొదట పరిష్కరించాలని కోరుతున్నామని చెప్పారు. చంద్రబాబు ఉద్యోగుల పట్ల చూపిస్తున్న విధానానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో మెరుగైన విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు.  
మహిళా ఉద్యోగులకు రెండేళ్ల లీవ్‌
కేంద్ర సర్వీసుల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు ఉన్న సౌకర్యాల కంటే మెరుగైన వాటిని రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు కూడా కల్పించడానికి ప్రయత్నాలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మహిళా ఉద్యోగినులకు మెటర్నిటీ లీవ్‌, పిల్లల చదువులకు అవసరాన్ని బట్టి రెండేళ్ల లీవ్‌ మంజూరు చేసే నిబందన కేంద్ర సర్వీసుల్లో ఉందని, దానిని రాష్ట్రస్థాయిలో కూడా అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
పిల్లల సంరక్షణ సెలవంటే?
హైదరాబాద్‌ :  ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు, కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు వరుసగా రెండేళ్లు లేదా మధ్యమధ్యలో కొంత విరామం ఇచ్చయినా ఆ మేరకు సెలవు తీసుకోవచ్చు. కేంద్రంలో మాదిరిగానే రాష్ట్రంలోనూ మహిళా ఉద్యోగులకు శిశు సంరక్షణ సెలవులను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చంద్రబాబు ప్రకటించడంతో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అప్పుడే పుట్టిన బిడ్డల నుంచి 15 ఏళ్లలోపు పిల్లల సంరక్షణ కోసం మహిళా ఉద్యోగులు సెలవు తీసుకోవచ్చు. ఈ మేరకు గరిష్ఠంగా 736 రోజుల సెలవు పొందేలా  ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు వీలు కల్పించింది. పిల్లల సంరక్షణ అంటే... ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు, పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో వారికి తోడుగా ఉండేందుకు మహిళా ఉద్యోగులు సెలవు తీసుకోవచ్చు.
30 ఏళ్లు అధికారం మనదే!
ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మనకు ఒక పాఠం వంటిదని, ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ అమలు చే యాల్సిన గురుతర బాధ్యత మనపై ఉందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. విజయవాడలో శనివారం కృష్ణా జిల్లా టీడీపీ కుటుంబసభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. దీనికి చంద్రబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి, ముస్లింలతో కలిసి నమాజ్‌ చేశారు. రెండు సమావేశాల్లోనూ ఆయన మాట్లాడారు. రాష్ట్ర నిర్మాణానికి ప్రభుత్వంతోపాటు పార్టీ నాయకత్వం కూడా సమాంతరంగా కృషి చేయాల్సి ఉందని పిలుపునిచ్చారు. ‘‘122 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు అడ్రస్‌ లేకుండా ఓడించారు. సమైక్య వాదమని నటించి డబ్బులతో గెలుపొందాలనుకున్న వైసీపీని కూడా ప్రజలు ఓడించారు.  ఎన్నికల తీర్పును పాఠంగా తీసుకుని సరిగా పనిచేస్తే 30 ఏళ్లపాటు నిరవధికంగా అధికారం మనదే’’ చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం కంటే తనకు పార్టీయే ముఖ్యమని చెప్పారు. గెలిచామన్న ఆనందంతో ఉంటే సరికాదని, ఎన్నికలొచ్చే వరకు పడుకుంటామంటే కుదరదని గట్టిగా చెప్పారు.  రాజధానిపై పది పదిహేను రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అన్నారు.  ఆగస్టు నెలాఖరుకు రాజధాని కమిటీ రిపోర్టు ఇస్తుందని, దానినిబట్టి నూతన రాజధానిని ఎంపిక చేసుకోవాల్సి ఉందని, అప్పుడు ఇక్కడి నుంచే పాలనను కేంద్రీకృతం చేయాల్సి ఉందని చెప్పారు. విశాఖపట్నం, గంగవరం, కృష్ణపట్నం వంటి పోర్టులతోపాటు కొత్తగా మచిలీపట్నం పోర్టు కూడా సాకారం కానుందని చెప్పారు. తొమ్మిది జిల్లాలను కలుపుతూ జాతీయ రహదారి ఉందని, భవిష్యత్తులో దీనిని పది లేన్ల వరకు అభివృద్ధి చేసే అవకాశం ఉందని, ఫాస్ట్‌ ట్రెయిన్స్‌ వంటివి కూడా వస్తాయని చెప్పారు. ప్రజలతో కలిసి పని చేసే వారికి పదవుల్లోనూ, పార్టీలోనూ పదోన్నతులు కల్పిస్తానని, పార్టీకి నష్టం కలిగించే వారిని వదులుకుంటానని చెప్పారు.    ఎన్నికల హామీ మేరకు ఇమామ్‌లకు నెలకు రూ.5 వేలు జీతంగా ఇస్తామని ప్రకటించారు.   ఎటువంటి నిబంధనలు, షూరిటీలు లేకుండా రూ.లక్ష రుణాన్ని ఇస్తామన్నారు.

No comments:

Post a Comment