Thursday 24 July 2014

మాట్లాడితేనే మహాపరాధమా? - కె. శ్రీనివాస్‌

మాట్లాడితేనే మహాపరాధమా? - కె. శ్రీనివాస్‌

Published at: 24-07-2014 01:08 AM
ఉద్దేశ్యపూర్వకంగా కవిత అట్లా అన్నారా, అనుభవ రాహిత్యం వల్ల అట్లా మాట్లాడారా, ఉద్యమం సందర్భంగా మాట్లాడిన మాటలనే పునరుద్ఘాటించారా- అన్న ప్రశ్నలను పక్కన పెడితే, వీరందరి అభ్యంతరాలకు ప్రాతిపదిక ఏమిటో అర్థం కావడం లేదు. కశ్మీర్‌కు స్వతంత్రం ఇవ్వాలని ఆమె వైదిక్‌ లాగా సూచించలేదు. ఇప్పుడున్న వాస్తవాధీన రేఖను శాశ్వత సరిహద్దుగా చేసుకుని, సమస్యను పరిష్కరించుకోవాలని ప్రతిపాదించారు.
కాంగ్రెస్‌కూ బీజేపీకీ నిజంగా తేడా ఉందా, లేదా అవి రెండూ ఒకే నాణేనికి రెండు ముఖాలా?- ఈ ప్రశ్న వేస్తే అటు కాంగ్రెస్‌కూ ఇటు బీజేపీకీ కూడా కోపం వస్తుంది. మేమంత అరాచకపు అవినీతి పరులమా, మాది నీతి వంతమయిన క్రమశిక్షణ కలిగిన పార్టీ అని బీజేపీ అంటుంది, మాదేమన్నా మతవాద పార్టీయా, మేము లౌకికవాదంలో ఆరితేరిన ప్రగతిశీలురము అని కాంగ్రెస్‌ వారు అంటారు. ఆర్థిక విధానాల్లో ఇద్దరికీ మౌలికమయిన తేడా కాదు కదా, పద్ధతుల్లో కూడా తేడా లేదని చెప్పడానికి పెద్ద కష్టం అక్కరలేదు. మతవాదంలో తేడా ఉందా- అని చూస్తే రామజన్మభూమి వివాదానికి ప్రాణం పోసి దాన్నొక పెనుసమస్యగా మార్చింది కాంగ్రెస్‌ హయాంలోనే. సంఘపరివారం కరుణాకటాక్షాల కోసం కాంగ్రెస్‌ పార్టీ కూడా తాపత్రయపడిన సందర్భాలూ వారు కనికరించిన సందర్భాలూ చరిత్రలో రహస్యాలేమీ కావు.
కాకపోతే, కాంగ్రెస్‌-బీజేపీ అప్పుడప్పుడు పరస్పరం పాత్ర లను మార్చుకుంటుంటాయి. అసహనంగా ఉండవలసిన చోట బీజేపీ ఎంతో సహనం తోను, ఔదార్యంతోనూ వ్యవహ రిస్తుంటుంది. అటువంటప్పుడు కాంగ్రెస్‌ పచ్చి మితవాద పార్టీలాగా వీరంగం వేస్తుం టుంది. వేదప్రతాప్‌ వైదిక్‌ వ్యవహారమే తీసుకోండి. అతను సీనియర్‌ పాత్రికేయుడే, సందేహం లేదు. దానితోపాటు, ఆయన బాబా రామ్‌దేవ్‌కు రాజకీయ సలహాదారుగాను, సంఘ పరివార్‌కు సానుభూతిపరుడిగానూ, బీజేపీకి ఆంతరంగికుడు గానూ ప్రసిద్ధులు. అతను ఏదో ఒక బృందంలో పాకిస్థాన్‌ వెళ్లి, అక్కడ బహిరంగ జీవితంలో ఉన్న హఫీజ్‌ సయీద్‌ అనే వివా దాస్పద వ్యక్తిని కలుసుకున్నాడు. లష్కరే తోయిబా సంస్థ నాయకుడిగా ఉన్న ఆ సయీద్‌ భారతదేశంలో జైలులో ఉండే వాడు. గత ఎన్‌డీఏ హయాంలో కాంధహార్‌ హైజాక్‌ ఉదంతం సందర్భంగా భారత ప్రభుత్వం అతన్ని వదిలిపెట్టవలసి వచ్చింది. పాకిస్థాన్‌లో అతను మరో సంస్థ పెట్టి కశ్మీర్‌ మిలిటెన్సీని పరోక్షంగా నిర్వహిస్తున్నాడని, ముంబయి దాడు లకు సూత్రధారి అతనేనని భారత్‌ బలంగా విశ్వసిస్తోంది, అతన్ని అప్పజెప్పాలని పాక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది. అటువంటి వ్యక్తిని వైదిక్‌ కలుసుకుని ఏదో మాట్లాడాడు. ఆ తరువాత పాక్‌లో ఒక టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్‌, పాక్‌ రెండూ చర్చించుకుని కశ్మీర్‌ సమస్యను పరిష్క రించుకోవాలని, కశ్మీర్‌కు స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన ఆ ఇం టర్వ్యూలో వాదించారు. ఈ ఉదంతంపై కాంగ్రెస్‌ చాలా గగ్గోలు పెట్టింది. వైదిక్‌-సయీద్‌ భేటీ వెనుక బీజేపీ ప్రభుత్వమే ఉన్నదని ఆరోపించింది. అతన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది. బీజేపీ మాత్రం వైదిక్‌ను సమర్థించింది. పాత్రికేయుడు ఎవరిని కలిసినా తప్పుపట్టలేమని చెప్పింది.
పత్రికాస్వేచ్ఛే ముఖ్య విషయమైతే, వైదిక్‌ చేసిన నేరమేమీ లేదు. శేఖర్‌ గుప్తా అన్నట్టు, పాత్రికేయుడు ఏమి చేయాలి? ఉగ్రవాదిని కలిసినప్పుడు కాల్చివేయాలా? దోపిడీ దొంగతో మాట్లాడినప్పుడు పట్టుకుని అప్పగించాలా? వైదిక్‌కు ఇంకా వేరే విశేషణాలు కూడా ఉన్నాయి కాబట్టి, పత్రికా స్వేచ్ఛ ఒక్కటే ఆయనను రక్షించదనుకుందాం. ఆయన స్వచ్ఛంద దౌత్యవేత్త గానో, ఒక రాజకీయపార్టీ తరపున అనధికార దూతగానో వెళ్లాడనుకోండి. అందులో మాత్రం తప్పేముంది? సంఘర్ష ణలను నివారించడమూ, శాంతిని స్థాపించడమూ తన అభి రుచులూ వ్యాపకమూ అని వైదిక్‌ గొప్పగా చెప్పుకుంటారు. సయీద్‌తో కలిసి ఏదైనా చట్టవ్యతిరేక కార్యక్రమానికి పూను కోనంత కాలం, వైదిక్‌ ఏ హోదాలో అయినా నేరం చేసినట్టే కాదు. అటువంటి పెద్ద మనుషులను ప్రోత్సహించాలి. సమా జాలూ ప్రపంచమూ అంతా నిలువునా చీలిపోతే, కాసింత సంభాషణకు, చర్చకు ఆస్కారమివ్వగలిగే మధ్యవర్తులు కొందరన్నా మిగలాలి కదా? - అయితే, ఆర్భాటం ఉన్నంతగా ఫలితాలు సాధించిన ఘనత వైదిక్‌కు లేదంటారు, అది వేరే సంగతి. వివాదం రేగే సరికి, ఆయన తన మాటలకు వేరే వ్యాఖ్యానం ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను కశ్మీర్‌ వేర్పాటును సూచించలేదని, కశ్మీరీలకు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు కావాలన్నా నని అసమర్థ వివరణ ఇచ్చుకున్నారు.
తాజాగా, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఒక జాతీయ పత్రికకు చెప్పిన అభిప్రాయాలు కూడా వివాదంగా మారాయి. ఇక్కడ కూడా వైదిక్‌ విషయంలో లాగానే విశేషం జరిగింది. కశ్మీర్‌ గురించి, తెలంగాణ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలకు జాతీయస్థాయిలో భారతీయ జనతాపార్టీ మౌనంగానే ఉండిపోగా, కాంగ్రెస్‌ ప్రతి నిధి మాత్రం తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలంగాణ, కశ్మీర్‌ ఈ రెండూ మునుపు స్వతంత్ర దేశాలుగా ఉండేవని కవిత అన్నారు. ఈ రెండు చోట్లా భూయాజమాన్యానికి సంబంధించిన చట్టాలు ఒకేరీతిగా ఉండేవని కూడా వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లోని కొన్ని భాగాలు మన అధీనంలో లేవని, ఆ వాస్తవాన్ని గుర్తించి అంతర్జాతీయ సరిహద్దును కొత్తగా గీసుకోవాలని, సమ స్యను పరిష్కరించుకుని ముందుకు పోవాలని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు అభిషేక్‌ సింఘ్వీకి అభ్యంతరకరంగా అనిపిం చాయి. రాష్ట్రంలో కూడా కొందరు నాయకులు కవిత మాటలను తీవ్రంగా తప్పు పట్టారు. ఆమె మాటలు దేశ సార్వభౌమాధి కారానికి చేటు తెస్తాయని, వేర్పాటు వాదులకు శత్రుదేశాలకు ఉపయోగపడతాయని విమర్శించారు.
ఉద్దేశ్యపూర్వకంగా కవిత అట్లా అన్నారా, అనుభవ రాహిత్యం వల్ల అట్లా మాట్లాడారా, ఉద్యమం సందర్భంగా మాట్లాడిన మాటలనే పునరుద్ఘాటించారా- అన్న ప్రశ్నలను పక్కన పెడితే, వీరందరి అభ్యంతరాలకు ప్రాతిపదిక ఏమిటో అర్థం కావడం లేదు. కశ్మీర్‌కు స్వతంత్రం ఇవ్వాలని ఆమె వైదిక్‌ లాగా సూచించలేదు. ఇప్పుడున్న వాస్తవాధీన రేఖను శాశ్వత సరిహద్దుగా చేసుకుని, సమస్యను పరిష్కరించుకోవాలని ప్రతి పాదించారు. ఈ ప్రతిపాదన కవిత కొత్తగా చేస్తున్నది కాదు. కశ్మీర్‌ సమస్యకు అదొక ఉభయతారక పరిష్కారంగా గతంలో చాలా మంది సూచించారు. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఆలోచించాయి. కశ్మీర్‌ను కేవలం ద్వైపాక్షిక సమస్యగా భావిస్తే, అదొక ఆచరణీయ పరిష్కారమే. కానీ, పోరాటవాదులు కశ్మీరీ ప్రజలను కూడా పరిష్కారంలో భాగం చేయాలని, తమకు స్వయం నిర్ణయాధికారం కావాలని కోరుతున్నారు. అందువల్ల కశ్మీర్‌ను భారత్‌-పాక్‌లు పంచుకునే ప్రతిపాదన ముందుకు వెళ్లడం లేదు. ఆ ప్రతిపాదనను భారత అధికార వర్గాలు ఎన్నడూ అపచారంగా భావించలేదు. ఈ సందర్భంగా పాతికేళ్ల కిందట కశ్మీర్‌లో అలజడి ఆరంభమైన తొలిరోజుల్లో ప్రముఖ పాత్రికేయుడు, బీజేపీ సానుభూతిపరుడు ఎం.వి. కామత్‌ చేసిన ఒక ప్రతిపాదన గుర్తుకు వస్తున్నది. భారత్‌, పాకిస్థాన్‌, కశ్మీర్‌ కలిసి ఒక సమాఖ్య (కన్‌ఫెడరేషన్‌)గా ఏర్పడాలని, మూడు దేశాలు విదేశాంగం, రక్షణ, టెలికం రంగాలలో ఉమ్మడి వ్యవస్థను, ఆంతరంగిక పాలనల్లో వేరువేరు యంత్రాంగాన్ని కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఒక సమస్య పరిష్కారం కావాలనుకున్నప్పుడు సాధ్యమయ్యే అన్ని పరిష్కారాలను ఆలోచించడం అపచారమెట్లా అవుతుంది?
ఇక, తెలంగాణ, కశ్మీర్‌ల చరిత్ర గురించి ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలు మరో వివాదం. ఒకనాడు ఈ రెండు ప్రాంతాలు స్వతంత్ర దేశాలుగా ఉండేవని, భారత్‌ బలప్రయోగంతో వాటిని కలుపుకున్నదనే అర్థంలో ఆమె వ్యాఖ్యానించారు. స్వతంత్ర దేశాలు అనే మాట ఆమె ఏ అర్థంలో అన్నారో తెలియదు కానీ, హైదరాబాద్‌, కశ్మీర్‌ - ఈ రెండూ దేశీయ సంస్థానాలుగా ఉండే వన్నది చారిత్రక సత్యం. వాటి స్వతంత్రత సాపేక్షికం మాత్రమే. 1857 ప్రథమ స్వాతంత్య్ర పోరాటం అనంతరం, బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు, దేశీయ సంస్థానాలను ఆక్రమించడాన్ని నిలిపి వేయడంతో కొన్ని సంస్థా నాలు విడిగా మిగిలి పోయాయి. కానీ, అవి కూడా బ్రిటిష్‌ పరమాధి కారానికి లోబడి ఉన్నవే. హైదరాబాద్‌ రాజ్యానికి వస్తే, సొంత సైన్యం లేదు, సొంత విదేశాంగం లేదు కానీ, సొంత కరెన్సీ, సొంత న్యాయవ్యవస్థ, సొంత పోలీసు ఉన్నాయి. ఆ ప్రత్యేకత లేకపోతే, పోలీసు చర్య అనబడే సైనికచర్య ద్వారా విలీనం చేసుకోవలసిన అవసరం ఏముంది? అంతా ఒకటిగానే ఉండి ఉంటే, సంస్థానాలను బ్రిటిష్‌ వారు తామే ఎందుకు భారత్‌లో కలిపివేయలేదు? స్వతంత్రంగానో, భారత్‌ పాక్‌లో విలీనం కావడానికో ఎందుకు అవకాశం ఇచ్చారు?
ఒకనాడు మొగల్‌ సామంతులుగా ఉన్న హైదరాబాద్‌ పాలకులు, 1860 తరువాతి నుంచి బ్రిటిష్‌ అధీనంలో ‘స్వతంత్రం’గానే ఉన్నారు. బ్రిటిష్‌ వారితో బేరార్‌ భూభాగానికి సంబంధించిన వివాదంలో, మూడో పక్షం దగ్గరికి తీర్పుకోసం వెడదామని ప్రతిపాదించి ఏడో నిజాం భంగపడ్డారు కూడా. కశ్మీర్‌ ప్రత్యేకమైన పాలనలో లేకపోతే, దాని పాలకునితో ‘సంధాన’ (యాక్సెషన్‌) ఒప్పందం చేసుకోవలసిన అవసరం ఏముంది? ఎటువంటి ఒప్పందం లేకుండా, సైనికచర్య ద్వారా కలుపుకోవడం వల్ల, నాటి హైదరాబాద్‌ రాజ్యానికి ఎటువంటి ప్రత్యేక ప్రతిపత్తీ లభించలేదు. కశ్మీర్‌ పాలకునితో సంప్రదింపుల ద్వారా ‘సంధానం’ చేసుకోవడం వల్ల, ఆ ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇవ్వవలసి వచ్చింది. 1975 దాకా కశ్మీర్‌ ముఖ్యమంత్రిని ప్రధాని అనీ, హైకోర్టుని సుప్రీంకోర్టు అనీ వ్యవహరించేవారు. కశ్మీర్‌ భారత్‌లోనే కొనసాగాలని కోరుకోవడం వేరు, చరిత్రలోని ప్రతిపత్తిని కూడా మార్చాలనుకోవడం వేరు. దేశమనే భావన చుట్టూ ఇవాళ అనేక మనోభావాలు, ఉద్వేగాలు ఉండవచ్చు. కానీ, వాటి వల్ల దేశాలు ఉనికిలో ఉండవు. ప్రత్యేకమైన పాలనా వ్యవస్థ, సరిహద్దులు మాత్రమే దేశాలను, రాజ్యాలను నిర్ణయిస్తాయి. ఆ లెక్కన, కశ్మీర్‌, హైదరాబాద్‌ రెండూ బ్రిటిష్‌ ఇండియాకు భిన్నమయిన పాలనావ్యవస్థలో, పాలనలో ఉండేవి.
ఈ విషయాల్లో అభిప్రాయభేదాలు ఉన్నవారైనా సరే, అసలు అభిప్రాయాల వ్యక్తీకరణే కూడదనడం ఎందుకు? కేవలం మాటలతోనే మన సరిహద్దులు చెదిరిపోతాయా? పరిష్కా రాలను చర్చించకుండా, సమస్యలను నానబెట్టుకుంటే దేశభక్తులమవుతామా?
- కె. శ్రీనివాస్‌ రాష్ట్ర అధ్యక్షులు, కులనిర్మూలన పోరాట సమితి
(‘దళిత ప్రతిఘటనా నినాదం’ అనే సంకలనం నేడు  హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరణ జరుగుతున్న సందర్భంగా ముందుమాటలోని కొన్ని భాగాలు)

No comments:

Post a Comment