Tuesday 29 July 2014

ఉల్లి మార్కెట్‌పై ఒక్కడి పట్టు

ఉల్లి మార్కెట్‌పై ఒక్కడి పట్టు

Published at: 30-07-2014 03:23 AM
-  ఒక్కడే ఏటా 500 కోట్ల వ్యాపారం
-  దళారీ దందాపై దృష్టి సారించిన ఏపీ సర్కార్‌

హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌, రబీ సీజన్లలో ఉల్లిగడ్డలు పండించే రాషా్ట్రల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంటుంది. ఒక్క కర్నూలు జిల్లాలో పండించే ఉల్లిగడ్డలతో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్ర అవసరాలు తీర్చేయవచ్చు. ఇటు రైతులకు నష్టం.. అటు వినియోగదారులకు కష్టం లేకుండా చేయవచ్చు. కానీ బహిరంగమార్కెట్‌లో కిలో రూ.26 నుంచి 30లు పలుకుతూ ఉల్లి వినియోగదారుల కంట కన్నీరుపెట్టిస్తుంటే మరోవైపు రైతుకూ శ్రమకు తగ్గ ఫలితం దక్కని పరిస్థితి. ఉల్లి మార్కెట్‌ను పట్టిపీడిస్తున్న దళారీ దందాయే దీనికి కారణం.
ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లిగడ్డ మార్కెట్‌ దళారీల చేతుల్లో చిక్కుకుపోయింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ దళారీ ఈ మార్కెట్‌ను గుప్పిటపట్టాడు. తాడేపల్లిగూడెం కేంద్రంగా రాష్ట్రంలో ఉల్లి దందాను నడిపిస్తున్నాడు. ఉల్లిని భూమిలో విత్తే దగ్గరి నుంచి అది పంటగా మారి మార్కెట్‌కు చేరేవరకు దానిపై ఆ దళారీదే పెత్తనం. అకస్మాత్తుగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంట నష్టపోతే అతను రైతుల వైపు కన్నెత్తిచూడడు. అదే రైతులకు కాలం కలిసొచ్చి మంచి పంట పండితే...పంటపై అతనిదే పెత్తనం. ఇక్కడ పండిన పంటను ఇతర రాషా్ట్రలు, ఆపై దేశాలు దాటించేస్తాడు. ప్రతియేటా ఇతనొక్కడే రూ.500 కోట్ల వ్యాపారం చేస్తున్నాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉల్లిఽగడ్డలకు కృత్రిమ కొరత ఏర్పడి ధరలు అడ్డగోలుగా పెరిగితే ఇతనికి లాభాలపంటే. కృత్రిమంగా ధరలను పెంచే దందాలో ఇతనిది అందెవేసిన చెయ్యి. ఇతని దందా తీరు తెలుసుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పెద్దలే విస్మయానికి గురయ్యారంటే ఇతని శక్తిసామర్థ్యాలు ఏమిటో అర్థమవుతాయి. ఇతన్ని నిరోధించేందుకు ఏపీ ప్రభుత్వం దృష్టిసారించింది.
ఇదీ దళారీ దందా తీరు
ఉల్లి మార్కెటింగ్‌, రవాణా, రైతులకు ధరలు చెల్లించడంలో ఉన్న చిన్న చిన్న లోపాలను ఈ దళారీ తనకు అనుకూలంగా మార్చుకొన్నాడు. కర్నూలుతోపాటు తాడేపల్లిగూడెం నుంచి ఉల్లిగడ్డలను అధికారికంగానే కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇలాంటి వారితో సమస్య లేదు. అయితే, అక్రమంగా ఉల్లిగడ్డలు నిల్వచేసి ధరల సంక్షోభంలో వాటిని ఎగుమతి చేయడం ద్వారా లాభాలు ఆర్జించే దళారులతోనే అసలు సమస్య. ఇటీవల ఉల్లిగడ్డ ధరలు పెరిగినప్పుడు పౌరసరఫరాలశాఖ ఈ సమస్యపై దృష్టిసారించింది. ఆ శాఖ మంత్రి పరిటాల సునీతతోపాటు ఉన్నతాధికారులు నేరుగా ఉల్లిగడ్డ మార్కెట్లను సందర్శించారు. కర్నూలు జిల్లాలో రైతులు, వ్యాపారులను కలిసి చర్చించారు. ఈ సమయంలోనే దళారీ బడాదందా బయటకు వచ్చింది. ఈ అంశంపై నివేదిక  కూడా తయారు చేశారు ఉల్లిగడ్డల సాగుకు కర్నూలు జిల్లా ప్రధాన కేంద్రం. కర్నూలు, హైదరాబాద్‌, తాడేపల్లిగూడెంతోపాటు కర్ణాటక వ్యాపారులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉల్లిగడ్డలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. అయితే కర్నూలుతోపాటు మరో నాలుగు జిల్లాలో పండించే ఉల్లిగడ్డలను పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యాపారి కొనుగోలు చేస్తుంటాడు. ఈయన అధికారికంగా కొనుగోలు చేసేది గోరంతే.. మధ్య దళారుల ప్రమేయంతో కొనుగోలు చేసేది కొండంత. అదెలాగంటే... ఉల్లిసాగును రైతులు ప్రారంభించాక వారి వివరాలు సేకరిస్తారు. మరో నెల రోజుల్లో పంట చేతికొస్తుందనగానే ఆ వ్యాపారి మనుషులు రంగంలోకి దిగి రైతులను వలలో వేసుకుంటారు. పండే పంటను పూర్తిగా తమకే అమ్మాలని ఒప్పందాలు చేసుకుంటారు. ఇందుకోసం అడ్వాన్సు సొమ్ము చెల్లిస్తారు. ఇలా అడ్వాన్సుల కిందే రూ.250 కోట్లు రైతులకు ఇస్తారు. పంట చేతికి వచ్చిన తర్వాత రైతులు నేరుగా మధ్య దళారులకే పంటను పూర్తిగా అప్పగిస్తారు. అలా దళారులు చేతికి చిక్కిన పంటను మార్కెట్లకు కాకుండా నేరుగా గోదాములకు తరలించి నిల్వ చేస్తుంటారు. అందులో 20 శాతం స్టాకును అధికారికంగా చూపించి విక్రయిస్తారు. మిగతా 80 శాతం స్టాకును ఆ దళారీ తన సొంత గోదాముల్లో దాచిపెడతారు. మార్కెట్‌లో ఉల్లిగడ్డలకు కొరత ఉండి ధరలు పెరుగుతున్నప్పుడు గోదాముల్లో ఉన్న స్టాకు బయటకు వదిలి లాభాల పంటపండించుకుంటాడు. ఉల్లిగడ్డలకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నప్పుడు తొలుత స్టాకును మహారాష్ట్ర, బీహార్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాషా్ట్రలకు ఎగుమతి రూపంలో తీసుకెళుతారు. నాసిక్‌ మార్కెట్‌లో ఉన్న పరిస్థితులను బట్టి కొంత స్టాకును డంప్‌ చేస్తారు లేదంటే అరబ్‌ దేశాలకు ఎగుమతి చేస్తారు.
ధరల నియంత్రణపై దృష్టిసారించిన ప్రభుత్వం
ఉల్లిగడ్డలపై దళారీ దందాను చూశాక ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉల్లిగడ్డలను పండించే రైతులకు ఏవిధంగా నష్టం కలిగించకుండానే చర్యలు చేపట్టాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది.  అక్రమంగా ఉల్లిగడ్డల ఎగుమతిని నిరోధించాలని, చెక్‌పోస్టుల్లో తనిఖీలు కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. అలాగే, ఒక జిల్లాల్లో పండిన ఉల్లిగడ్డలను మరో జిల్లాకు తరలించకుండా నిరోధించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఈ నిర్ణయంతో రైతులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్లను ఆదేశించారు. అలాగే, కర్నూలుసహా ఇతర మార్కెట్లలో రైతులు పంటను అమ్ముకున్న వెంటనే కనీసం రెండు రోజుల వ్యవధిలో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతోపాటు ఉల్లిగడ్డల ధరల స్థిరీకరణ కోసం కార్పస్‌ఫండ్‌ను ఏర్పాటు చేయడంతోపాటు, నే రుగా రైతుబజార్లనే ఉల్లి విక్రయాల్లోకి దించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

No comments:

Post a Comment