Friday 18 July 2014

2 లక్షల్లో సినిమా.. వర్మ మ్యాజిక్‌!

2 లక్షల్లో సినిమా.. వర్మ మ్యాజిక్‌!

Published at: 18-07-2014 08:03 AM
సినిమా అంటే.. ఒకప్పుడైతే కథ! ఇప్పుడు ఖర్చు!! తారల తళుకుబెళుకులకు తోడు కోట్లాది రూపాయల వెల్లువ. 10, 20, 30, 40.. హీరో పాపులారిటీని బట్టి రూ.50 కోట్ల బడ్జెట్‌ సైతం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అయితే.. ‘శివ’ సినిమాతో సినీ పడికట్టు సూత్రాలను వెక్కిరించిన రామ్‌ గోపాల్‌ వర్మ.. తాజాగా ‘ఐస్‌క్రీమ్‌’ సినిమాతో తెలుగు సినిమా బడ్జెట్‌ మూసను బద్దలుకొట్టారు. అతి తక్కువ ఖర్చుతో సినిమా తీసి మరోసారి చరిత్ర సృష్టించారు. ఇంతకీ ఆ సినిమాకు అయిన ఖర్చెంతో తెలుసా? కేవలం.. 2,11,832 రూపాయలు! తెలుగు సినీ పరిశ్రమ ఊహించని మరో అద్భుతం కూడా ఈ సినిమా విషయంలో చోటు చేసుకుంది. అదేంటంటే.. సక్సెస్‌ మీట్‌లో చిత్ర బృందానికి పారితోషికం చెక్కుల పంపిణీ!! సినిమా విడుదలకు ముందే తమకు రావాల్సిన పారితోషికాన్ని వసూలు చేసుకునే పరిశ్రమలో నిజంగా ఇదో కొత్త ట్రెండ్‌ అనే చెప్పాలి.
ఎలా తీశారు?
రెండు లక్షల బడ్జెట్‌లో సినిమా అంటే చాలా మందికి వచ్చే సందేహం.. అదెలా సాధ్యం అని! సినిమా అంటే వర్మకు ప్యాషన్‌! తనలాగా అంతే ప్యాషన్‌ ఉన్నవారందరినీ కూడగట్టి.. ‘‘అందరం కలిసి పని చేద్దాం- లాభాల్లో వాటా పంచుకుందాం’’ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను మొదలుపెట్టారాయన. ఆయన అభిప్రాయంతో ఏకీభవించిన వారే చిత్ర బృందంలో చేరడంతో ఇది సాధ్యమైంది. రోజూ అందరూ పొద్దున్నే ఇంటిదగ్గరే టిఫిన్‌ చేసి రావడం.. మధాహ్నానికి కేరేజ్‌ తెచ్చుకోవడంతో చాలా ఖర్చు తగ్గిపోయింది.   మరి ఇతరత్రా షూటింగ్‌ పరికరాలకైనా ఖర్చయి ఉండాలి కదా? అనే సందేహానికీ రాము సమాధానమిచ్చారు. ‘ఐస్‌ క్రీమ్‌’ షూటింగ్‌లో లైట్లు, ట్రాక్‌ ట్రాలీలు, జిమ్మీజిబ్‌లు, స్టడీ క్యామ్‌లు.. ఏవీ వాడలేదని, ఫ్లోక్యామ్‌ టెక్నాలజీకి అవసరమైన గింబల్‌ రిగ్‌ను మాత్రమే వాడుకున్నట్టు చెప్పారు. ఫ్లో క్యామ్‌ టెక్నాలజీ వినియోగం వల్ల.. చిత్ర బృందం సంఖ్య 90 శాతం తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఆ రెండు లక్షల ఖర్చు కూడా సినిమా తీసిన ఇంటి అద్దెకు, టీలు, కాఫీలకు అయిన ఖర్చు అని వర్మ తెలిపారు. ‘‘ఈ సినిమా తీసిన ఇంటి ఓనర్‌ మా టీమ్‌లో భాగం కాదుగనక రెంట్‌ ఖర్చు తప్పలేదు’’ అని ఆయన చెప్పారు. కొన్ని పెద్ద బడ్జెట్‌ సినిమాలు సూపర్‌డూపర్‌ హిట్టయినా నిర్మాతలకు మాత్రం చివరికి విషాదమే మిగిలిన సందర్భాలున్నాయి. కానీ, రామ్‌గోపాల్‌ వర్మ మదిలో పుట్టిన ఈ కొత్త ఆలోచన.. సినిమా విఫలమైనప్పటికీ నిర్మాతను మాత్రం సేఫ్‌గా ఉంచింది. ఆయనొక్కరే కాదు.. ఈ సినిమాకు పని చేసిన బృందం మొత్తం ఆనందంగా ఉంది. ఆ విషయాన్ని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ స్వయంగా చెప్పారు. ‘‘వర్మతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. సినిమా గురించి మా మధ్య డిస్కషన్‌ రాగానే బడ్జెట్‌, టైమ్‌ లిమిట్‌ గురించి వర్మ నాకు భరోసా ఇచ్చారు.   సినిమా విడుదలయ్యాక మాత్రం అందరికీ పారితోషికం తప్పకుండా ఇవ్వాలని, మోసం చేస్తే పైకి రాలేనని చెప్పారు. దానికి తగ్గట్టే ప్లాన్‌ చేశాం. నా సినిమాకి రూపాయికి రూపాయి మిగిలింది.’ అని ఆయన వివరించారు. ఇక.. ‘‘ఎంతోమందికి సినిమా తీయాలని ఉంటుంది. అందుకు డబ్బులు అవసరం లేదు. ‘ఐస్‌క్రీమ్‌’ తీసిన విధానంలో ఎవరైనా సినిమా తీసి అవతలివారిని మెప్పించగలిగితే తప్పకుండా సినిమాలను విడుదల చేసి లాభాలను చవిచూడవచ్చు. కాకపోతే సమిష్టిగా పనిచేయాలి.  ఇప్పటి వరకు అందరూ వర్మ స్కూల్‌ అని అంటుంటారు. నిజంగా నాకు స్కూల్‌ లేదు. కానీ ఈ టెక్నిక్‌ల గురించి వీడియోల ద్వారా వివరించాలని ఉంది’’ అన్నది వర్మ మాట! రామ్‌గోపాల్‌ వర్మ తీసిన సినిమాల్లో హిట్లకు రెండు రెట్లు ఫెయిల్యూర్లు ఉండొచ్చు. కానీ, వర్మ మాత్రం రెండిటికీ అతీతుడు. తాను అనుకున్నది, తనకు నచ్చింది తీసుకుపోవడమే ఆయన శైలి. దేవుణ్ని నమ్మని వర్మ.. ‘పని చెయ్యి.. ఫలితం ఆశించకు’ అంటూ గీతాకారుడు చెప్పిన సూత్రాన్ని అక్షరాలా పాటించడమే అసలు విశేషమన్నది అభిమానుల మాట. ఒకటి మాత్రం నిజం.. ‘ఐస్‌క్రీమ్‌’ సినిమా నిర్మాణం వెనుక ఉన్న మెలకువలను అర్థం చేసుకుంటే ప్రస్తుతం ఉన్న చిత్ర పరిశ్రమ స్థానంలో ఒక కొత్త పరిశ్రమ.. ప్రతి ఊళ్లో పుడుతుందన్న రామ్‌గోపాల్‌ వర్మ మాటలు అతిశయోక్తి కాదు!!             -సెంట్రల్‌ డెస్క్‌

No comments:

Post a Comment