Tuesday 15 July 2014

పోలవరం - న్యాయమూ లేదు, మానవత్వమూ లేదు


By N Venugopal Rao
పోలవరం - న్యాయమూ లేదు, మానవత్వమూ లేదు..
అంతరాల వ్యవస్థలో పాలకులు కావాలంటే న్యాయబుద్ధీ, మానవత్వమూ వదులుకోవలసి ఉంటుంది. ఏ విధానమైనా, ఆచరణ అయినా వ్యవస్థలో కొన్ని వర్గాలకే లాభదాయకంగా, మరికొన్ని వర్గాలకు నష్టదాయకంగా ఉంటాయి గనుక ఏ విధానాన్నీ న్యాయబద్ధంగా వివరించడం సాధ్యం కాదు. కొన్ని వర్గాలకు జరిగే నష్టాన్ని విస్మరించడానికి మానవతాదృష్టినీ వదులుకోక తప్పదు. అందువల్లనే ‘తటస్థంగా కనిపించే సూత్రబద్ధ, హేతుబద్ధ, చట్టబద్ధపాలన’, ‘ఎక్కువమందికి ఎక్కువ మంచిచేసే కార్యక్రమాలు’ అనే సూత్రాలు ఆధునిక పాలనలోకి వచ్చి చేరాయి. మహాఘనత వహించిన భారత పాలకులకు మాత్రం ఆ హేతుబద్ధత చట్టబద్ధత అన్నా, బహుజన హితాయ అన్నా కంటగింపు. వారికి కావలసింది తమ ఆశ్రితుల ప్రయోజనాలు. అవి ఎంత మోసపూరితంగా సాధించినా ఫరవాలేదు. పిడికెడు మంది తమవారికోసం కోట్లాది బహుజనులను మోసగించినా, చంపివేసినా ఫరవాలేదు.
ఈ న్యాయబద్ధత లేని, మానవత్వం లేని భారత పాలకవర్గ విధానాలకు నిదర్శనం కావాలంటే పోలవరం ప్రాజెక్టుకు మించిన ఉదాహరణ మరొకటి ఉండబోదు. సమాజం చేత ఆ విషగుళికను మింగించడానికి సాంకేతిక వ్యవస్థలతో, న్యాయవ్యవస్థలతో, చట్టసభలతో ఆడించిన నాటకాలు మన కళ్లముందర సాగుతున్నాయి. పోలవరం ఉదంతం పాలకుల దుర్మార్గానికి మాత్రమే కాదు, మౌనం ద్వారా ఆ దుర్మార్గాన్ని సాగనిచ్చే మనందరి సామాజిక నిర్లిప్తతా దౌష్ట్యానికి కూడ చిహ్నంగా నిలుస్తున్నది.
పోలవరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీరు, విద్యుదుత్పత్తి వంటి ప్రయోజనాలున్నాయని పాలకవర్గాలు చెపుతున్నదానిలో సగానికన్న ఎక్కువ అబద్ధాలు, అర్ధసత్యాలు. ప్రస్తుతం పోలవరం ఆనకట్ట ఎడమ కాలువ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు, కుడి కాలువ ద్వారా మూడు లక్షల ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెపుతున్నారు. కాని పోలవరం నిర్మాణ ఆలోచనలు అటకెక్కిన 1980-2005 కాలంలోనే ఈ భూమిలో చాల భాగానికి సాగునీటి సౌకర్యం కల్పించడం జరిగింది. ఇవాళ కొత్తగా పోలవరం ద్వారా సాగునీరు అందే భూమి అతి స్వల్పం. లేదా, ఇప్పటికి ఒక పంటకు అవకాశం ఉన్నచోట రెండు పంటలకు, లేదా రెండు పంటలకు అవకాశం ఉన్నచోట మూడు పంటలకు నీరు అందవచ్చు. కాని దానివల్ల అదనంగా మురుగునీటి సమస్యలు, భూమిలో ఉప్పు పెరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పోలవరం నుంచి వచ్చే నీటిలో 80 టిఎంసి నీటిని విజయవాడ దగ్గర కృష్ణా బ్యారేజికి చేర్చి, తద్వారా రాయలసీమకు నీరు అందిస్తామని చెప్పడం మరొక అబద్ధం. నిజానికి ఈ ప్రకటనలో ఇమిడి ఉన్న మోసం ఎంత దుర్మార్గమైనదో చెప్పడానికే వీలులేదు. ఈ కారణం చెప్పి పోలవరం దగ్గర 80 టిఎంసి తీసుకున్నప్పటికీ గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లో కలుపుతున్నందువల్ల, కృష్ణానది మీద ఎగువ రాష్ట్రాలయిన కర్ణాటక, మహారాష్ట్రలకు వాటా ఇవ్వవలసి వస్తుంది. అలా తెచ్చిన 80 టిఎంసిల నీటిలో ప్రకాశం బ్యారేజి దగ్గరికి చేరేసరికి ఆంధ్రప్రదేశ్‌కు మిగిలేవి 45 టిఎంసిలు మాత్రమే. అవి కూడ రాయలసీమ పేరు చెప్పి తెస్తున్నారు. కాని అవి రాయలసీమకు చాల దిగువన కృష్ణానదిలో కలుస్తున్నాయి గనుక కిందికే వెళ్తాయి గాని పైకి ఎక్కవు.
అంటే కృష్ణా డెల్టా పైన ఉన్న ప్రాజెక్టులలో ఆ మేరకు తన వాటా వదులుకుని రాయలసీమకు ఇవ్వాలి. కాని కృష్ణా డెల్టా శక్తులు అటువంటి ఔదార్యాన్ని ప్రదర్శించబోవని గత ఆరు దశాబ్దాల అనుభవం రుజువు చేస్తున్నది. అంటే ప్రకాశం బ్యారేజి కింది భూములకు అదనంగా 45 టిఎంసిల నీరు, అంటే మరొక పంట, లేదా అక్కడ పారిశ్రామిక అవసరాలకు నీరు అందడం తప్ప జరగబోయేదేమీ లేదన్నమాట. రాయలసీమ దుర్భిక్షాన్ని సాకుగా చూపి కృష్ణా డెల్టాకు మరింత నీరు కట్టబెట్టబోతున్నారన్నమాట.
ఇక విశాఖపట్నంతో సహా నాలుగు వందల గ్రామాల తాగునీటి అవసరాల కోసం 23 టిఎంసిల నీరు పోలవరం నుంచి ఇస్తామని అంటున్నారు గాని అది అర్ధసత్యమే. విశాఖపట్నానికైనా, ఆయా గ్రామాలకైనా తాగునీరు కల్పించడానికి ప్రత్యామ్నాయ అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అందుకొరకు పోలవరం కట్టనక్కర లేదు. అలాగే పోలవరం ద్వారా సాధిస్తామంటున్న విద్యుదుత్పత్తికి కూడ ఇతర అవకాశాలున్నాయి. విద్యుత్తు కొరకైనా పోలవరం కట్టనక్కరలేదు. ఈ ప్రకటిత కారణాలన్నీ అరకొరగా అమలయ్యేవే గాని, పారిశ్రామిక అవసరాలకోసం నీరు అనే ప్రకటిత కారణం మాత్రం నూటికి నూరు శాతం అమలవుతుంది.
ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు విశాఖపట్నం – కాకినాడ పెట్రోకెమికల్ పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదన ఉండేది. ఇప్పుడది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లోనే విశాఖపట్నం – చెన్నై పారిశ్రామిక కారిడార్‌గా మారింది. అక్కడ వచ్చే బహుళజాతి సంస్థలకు, మరీ ముఖ్యంగా తూర్పు కనుమల్లోని బాక్సైట్ ఖనిజాన్ని అక్రమంగా, 170 చట్టాన్ని కూడ ఉల్లంఘించి, తవ్వి ఏర్పాటు చేయదలచుకున్న అల్యూమినియం శుద్ధి కర్మాగారాల వంటి పరిశ్రమలకు విపరీతంగా నీరు కావాలి. పోలవరం నిర్మిస్తున్నది ఆ బహుళ జాతి సంస్థల అవసరాలు తీర్చడానికే గాని ప్రజల కోసం కాదు. ఎక్కడైనా ప్రజల ప్రయోజనాలు ఏమాత్రమైనా నెరవేరితే అవి ఉప ఉత్పత్తులుగానే తప్ప అసలు లక్ష్యం అది కాదు.
ఇటు చంద్రబాబు నాయుడుదైనా, అటు వెంకయ్య నాయుడుదైనా, నరేంద్ర మోడీదైనా ఆ బహుళజాతి సంస్థల ప్రయోజనాలు తీర్చే అభివృద్ధి నమూనానే గనుక పోలవరం ఇంత వేగంగా ముందుకు కదులుతున్నది. మొత్తంగా చెప్పాలంటే పోలవరం ప్రకటిత ప్రయోజనాలలో ప్రజా ప్రయోజనాలు అరకొరగా ఉన్నాయి. బహుళజాతి సంస్థల ప్రయోజనాలు పూర్తిగా ఉన్నాయి. ప్రజా ప్రయోజనాలు లేకపోవడం మాత్రమే కాదు, అప్రకటితంగా అనేక ప్రజావ్యతిరేక దుర్మార్గాలు ఇమిడి ఉన్నాయి.
ఆ ప్రాజెక్టు ఒరిస్సా, చత్తీస్‌గడ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని విస్తారమైన భూములను, ఖనిజ వనరులను, అడవులను, ఆ అడవులలో నివసిస్తున్న నాలుగు లక్షల ఆదివాసులను ముంచివేస్తుంది. ప్రకృతి సౌందర్యానికి నిలయమైన పాపికొండలను కనబడకుండా చేస్తుంది. శబరి నది మొత్తంగానే పోలవరం జలాశయంలో అదృశ్యమైపోతుంది.
గోదావరి నదికి చరిత్రలో వచ్చిన వరదల ఉధృతిని బట్టి చూస్తే పాపికొండల చివరన పోలవరం నిర్మాణం తెగిపోవడానికి, తద్వారా కోస్తాంధ్ర లో జలప్రళయం జరగడానికి అవకాశం ఉంది. అక్కడ నది లోతు వల్ల జలాశయంలో అతి ఎక్కువ నీరు నిలువ ఉండడంతో ఆ ఒత్తిడికి భూకంపాల సంభావ్యత పెరుగుతుంది. ఇక ఈ పథక రచనలో మొదటి నుంచీ అమలయిన ఆర్థిక అక్రమాలు, నిర్మాణ వ్యయాన్ని ఎక్కువ చేసి చూపడం, మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద కంట్రాక్టర్లకు ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ముట్టజెప్పడం, కాలువల్లో ఎంత నీరు ప్రవహిస్తుందని ప్రతిపాదన పత్రాల్లో రాసి ఉన్నారో, ఆ సామర్థ్యం కన్న రెట్టింపు సామర్థ్యంతో కాలువలు తవ్వడం వంటి అనేక అక్రమాలు జరిగాయి. చట్టప్రకారం రావలసిన పర్యావరణ, అటవీ, కేంద్ర జల సంఘ, గ్రామసభ వంటి అనుమతులేవీ రాకుండానే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
అందువల్లనే పోలవరం ప్రాజెక్టును అసలు కట్టవద్దనీ, భారీ ఆనకట్ట బదులు భిన్నమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయనీ వాదిస్తున్న వర్గం ఉంది. పోలవరం అక్కడే కట్టదలచుకున్నా ఆనకట్ట ఎత్తు తగ్గించి, డిజైన్ మార్చి కట్టినా నష్టాలు తగ్గించి, అవే ప్రయోజనాలు సాధించవచ్చునని వాదిస్తున్న వర్గమూ ఉంది. ఈ రెండు వర్గాల వాదనలలో ఏ ఒక్కదాన్నీ పరిశీలించడానికి, చర్చించడానికి కూడ పాలకవర్గాలు సిద్ధంగా లేవు.
రాజ్యసభ చర్చలో ఎంతో మంది సభ్యులు చెప్పినట్టు ఈ ప్రాజెక్టు రాజకీయ నాయకుల – కాంట్రాక్టర్ల కూటమి ప్రయోజనాల కోసం వస్తున్నది. ఆ కూటమి తన ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఎంత విధ్వంసం జరిగినా సరే అనుకుంటున్నది. మరొక కోణం ఉంటుందని అంగీకరించడానికి కూడ సిద్ధంగా లేదు. దాని లాభాపేక్షలో, బకాసుర ఆకలిలో అది అనేక ఆర్థిక, సాంకేతిక, చట్టపరమైన, సామాజిక వాస్తవాలనూ, లక్షలాది ఆదివాసులనూ తొక్కివేస్తున్నది, ముంచివేస్తున్నది. తన దుర్మార్గానికి మద్దతు సమకూర్చుకోవడం కోసం కోస్తాంధ్ర లోని కొన్ని జిల్లాల రైతాంగానికీ, మధ్యతరగతికీ అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకుంటున్నది.
పోలవరం ఆనకట్ట నిర్మాణాన్ని వ్యతిరేకించడానికి సాంకేతిక కారణాలు, మానవీయ కారణాలు మాత్రమే కాదు, అసంఖ్యాకమైన చట్టపరమైన వివాదాలున్నాయి. ఇప్పటికీ సుప్రీంకోర్టు ముందర అపరిష్కృతంగా ఉండిపోయిన వ్యాజ్యాలున్నాయి. అసలు ఈ ప్రాంతం షెడ్యూల్డ్ ప్రాంతం గనుక రాజ్యాంగం ఐదవ షెడ్యూల్ కింద అక్కడి ఆదివాసులకు ప్రత్యేకమైన హక్కులు, అధికారాలు ఉన్నాయి. వాటన్నిటినీ తొక్కివేసి పోలవరం ముందుకు వెళ్లదలచింది.
రాజ్యాంగం మాత్రమే కాదు, పంచాయతీరాజ్ విస్తరణ చట్టం, భూసేకరణ చట్టం వంటివి కూడ ఆదివాసులకు ప్రత్యేక హక్కులను వాగ్దానం చేశాయి. అవన్నీ ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఇంత విస్తృతమైన చర్చను కేవలం అభివృద్ధి మాయాజాలపు చర్చగా మార్చడానికి పాలకవర్గాలు ప్రయత్నిస్తున్నాయి. పోలవరం ఆనకట్ట కింద ఏర్పడబోయే ఆయకట్టు రైతుల అభివృద్ధి, విద్యుత్తు, పరిశ్రమల అభివృద్ధి అనేవి ఎంత అబద్ధాలో ఇప్పటికే డజన్ల కొద్దీ అధ్యయనాలు వెలువడి ఉన్నాయి. వాటిని కనీసంగా పట్టించుకోని పాలకులు ఇప్పుడు ముంపుకు గురికానున్న ఆదివాసులను అభివృద్ధి చేస్తామనీ, పునరావాసం కల్పిస్తామనీ అంటున్నారు. ప్రశ్నించినవారే ఆదివాసుల అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టు ఆరోపిస్తున్నారు.
ఇక్కడ అడగవలసిన ప్రశ్న ఎవరి అభివృద్ధి కోసం ఎవరు త్యాగం చేయాలి అని. దేశంలో గత ఆరు దశాబ్దాలలో “అభివృద్ధి” పథకాల వల్ల ఆరు కోట్ల మంది నిర్వాసితులయ్యారని అందులో కనీసం రెండు కోట్ల మంది ఆదివాసులని ఒక అంచనా. దేశ జనాభాలో 8 శాతం ఉన్న ఆదివాసులు, నిర్వాసితులలో మాత్రం 30 శాతం పైన ఉన్నారంటే ఎవరి అభివృద్ధికి వాళ్లు సమిధలయిపోయారో అర్థమవుతుంది. ఆదివాసులు ఎప్పటికీ వారి చింకిపాతలతో, రోడ్లు లేని, విద్యుత్తులేని, కారడవుల్లో ఉండాలా వారికి అభివృద్ధి అక్కరలేదా అని బుద్ధిమంతులు మరొక ప్రశ్నవేస్తున్నారు.
అభివృద్ధి అంటే ఏమిటనే మౌలిక ప్రశ్న కూడ వేయనక్కరలేదు. ఆదివాసులను అభివృద్ధి చేయాలంటే వారి స్వస్థలాల నుంచి నిర్వాసితులను చేస్తే తప్ప కుదరదా ఇంతకూ దేశంలో ఇప్పటివరకూ ఏ ఒక్క అభివృద్ధి పథకం లోనూ నిర్వాసితులకు గౌరవప్రదమైన, సంపూర్ణమైన పునరావాసం దొరకలేదు. నాగార్జునసాగర్, శ్రీశైలం నిర్వాసితులలో ఇప్పటికీ పునరావాసం దొరకని వారున్నారు. భూమికి సమానమైన భూమి ఇవ్వాలనే కొత్త పునరావాస చట్టం ప్రకారం పోలవరం నిర్వాసితులకు ఇవ్వగలిగిన భూమీ లేదు. ఇవ్వాలనుకున్నా, నిర్వాసితులవుతున్న ఆదివాసులకు పట్టాలు లేవు గనుక ఎగ్గొట్టి, వారిని బిచ్చగాళ్లుగా మార్చడానికి ప్రభుత్వానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. కనుక ఇది అభివృద్ధికి దారితీసే పథకం కాదు, అణచివేతకు, అన్యాయానికి దారితీసే పథకం.
తమ ఎన్నికల వ్యయానికి మదుపు పెట్టిన కాంట్రాక్టర్ల ప్రయోజనాలు కాపాడడమే రాజకీయపార్టీల విధ్యుక్తక్తధర్మం అయిన వేళ ఈ వివాదంలోకి రాజకీయాలు ప్రవేశించాయి. రాజకీయ నాయకుల పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ ఈ పాపంలో అన్ని రాజకీయపక్షాలకూ భాగం ఉంది. సోమవారం నాడు రాజ్యసభ చర్చలో “చాల కాలంగా మోసం చేస్తున్నాం. ఇకనైనా ఆపుదాం” అని కె. కేశవరావు ఎందుకు అన్నప్పటికీ, అది అక్షరసత్యం.
ముంపుకు గురయ్యే ఆదివాసి గ్రామాలు తెలంగాణలో ఉండడం, ఆ గ్రామాల గ్రామ సభలన్నీ తెలంగాణలోనే ఉంటామని తీర్మానాలు చేయడంతో ఇది తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సమస్యగా కూడ మారింది. డిజైన్ మార్చాలని వాదిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి, తదితర సంస్థలు, అసలు పోలవరం నిర్మాణమే వద్దని వాదిస్తున్న ఇతర ప్రజాసంస్థలు జరిపిన ఆందోళనలతో రాష్ట్ర విభజనకు ముందు ఇది ప్రధాన సమస్య అయింది.
చట్టం తయారయ్యే క్రమంలో పోలవరం అనుకూల వర్గాలు ఆ క్రమాన్ని ప్రభావితం చేసి పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింప జేశాయి. ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచితే వివాదం పెరుగుతుందేమోనని, ఆటంకాలు ఎదురవుతాయేమోనని ఆ గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయడానికి చట్టవ్యతిరేక, చట్టాతీత చర్యలనెన్నో తీసుకునేలా చేశాయి.
అవి ముంపు గ్రామాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మారుస్తున్నాం అని వాదించదలచుకుంటే, ఒరిస్సా, చత్తీస్‌గడ్‌లలో కూడ ముంపు గ్రామాలు ఉన్నాయి. రాష్ట్రాల సరిహద్దులు మార్చడం అధికరణం 3 ప్రకారం రాష్ట్రపతి అనుమతితో జరగవలసిన పని అయినప్పటికీ ఆ రాజ్యాంగ నియమాలేవీ పాటించలేదు.
అంతకన్న ఘోరంగా, హాస్యాస్పదంగా ఈ ముంపు గ్రామాల బదిలీకి ముందు ఆ గ్రామాల ప్రజాప్రతినిధిగా ఎన్నికైన శాసనసభ్యులు తెలంగాణ శాసనసభలో ఉండగా, వారు ప్రాతినిధ్యం వహించవలసిన గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాయి. ఇంత గందరగోళ, అపసవ్య, అక్రమ, అమానవీయ పాలన ఎవరికోసం, ఎందుకోసం జరుగుతున్నట్టు?

No comments:

Post a Comment