Thursday 24 July 2014

" నరకాసుర వధ''

పూర్తి రుణమాఫీ చేస్తామని మాట తప్పారు బాబు తీరుకు నిరసనగా ఇక ఆందోళన : జగన్

Published at: 23-07-2014 16:13 PM
హైదరాబాద్, జులై 23 : రైతు, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్న చంద్రబాబు మాట తప్పారని వైసీసీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ మొత్తం రుణమాఫీ చేయకుండా ఇప్పుడెందుకు ఆంక్షలు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రజలను చంద్రబాబు వంచించారని జగన్ దుయ్యబట్టారు. రూ.లక్ష కోట్లకు పైగా రుణాలున్నాయని బాబుకు తెలుసని, అయినా చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజనకు చంద్రబాబు మద్దతిచ్చారని జగన్ ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజలను వంచించిన చంద్రబాబుపై ఏ కేసు పెట్టాలని జగన్ అన్నారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపటి నుంచి మూడు రోజుల పాటు ఆందోళనలకు జగన్ పిలుపునిచ్చారు." నరకాసుర వధ'' పేరుతో గ్రామగ్రామాన చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేయాలన్నారు. వామపక్షాలు వైసీపీతో కలిసి రావాలని జగన్ కోరారు.
తెలంగాణలో రుణమాఫీపై కేసీఆర్ షరతులు విధించడంతో అక్కడ నిరసనలు వెల్లువెత్తాయని, ఆ ఒత్తిడి వల్లే కేసీఆర్ షరతులు లేవని ప్రకటించారని గుర్తు చేశారు. ఏపీలో కూడా ప్రతిపక్షాలన్నీ అదే తరహాలో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారని, ఈ ప్రాంతం రాజధానికి అనుకూలమని తాను భావించడం లేదని ఆయన అన్నారు.
రాజధానిపై తొందరపడవద్దని జగన్ పేర్కొన్నారు. రుణమాఫీపై కేసీఆర్ మాట తప్పితే ఊరుకోబోమని ఆయన తెలిపారు. విశ్వసనీయత, వంచనకు మధ్యే పోటీ అని ఎన్నికల్లో చెప్పానని ఆయన అన్నారు. చంద్రబాబు ఎర్రచందనం చెట్లు తాకట్టు పెట్టి జనం చెవ్వుల్లో పువ్వులు పెడుతున్నారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ఈ ఆందోళన కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని ఆయన వామపక్షాలను, జి.జె.పి కూడా విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment