Monday 2 September 2013

నేనే కాపలాదారును కాదు - Manmohan Singh

నేనే కాపలాదారును కాదు

August 31, 2013


న్యూఢిల్లీ, ఆగస్టు 30: బొగ్గు శాఖలోని ఫైళ్లకు తాను 'కాపలాదారు'ను కాదని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. అయితే, దోషులు ఎవరినీ ప్రభుత్వం కాపాడదని స్పష్టం చేశారు. కోల్ స్కాంకు సంబంధించిన కీలక ఫైళ్లు ఆ శాఖ నుంచి గల్లంతు కావడంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టు కూడా ప్రభుత్వానికి తలంటిందని, ఈ అంశంపై ప్రధాని వివరణ ఇవ్వాలని శుక్రవారం రాజ్యసభలో బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. ఈ పరిణామంతో ఇరుకునపడిన ప్రధాని శుక్రవారం రాజ్యసభ వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో అవకతవకలపై బీజేపీ సభ్యులు సంధించిన ప్రశ్నలకు కూడా ఆయన జవాబు ఇచ్చారు. "అక్కడ అవినీతి జరుగుతోంది. ఇది ఎప్పటినుంచో కొనసాగుతోంది'' అని మన్మోహన్ వ్యాఖ్యానించారు.

అవినీతి చోటు చేసుకోవడం విచారకరమేనని, అయితే, ఇటీవల సమాచార హక్కు చట్టాన్ని తీసుకు రావడానికితోడు ప్రభుత్వంలోని వివిధ సంస్థలు క్రియాశీలంగా పని చేయడం వల్ల ఇది బయటకు వచ్చిందని చెప్పారు. బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ జరుగుతున్న కీలక సమయంలో ముఖ్యమైన ఫైళ్లు గల్లంతు అయితే ఇక అవినీతిని ఎలా నిలువరిస్తారని విపక్ష సభ్యులు నిలదీయగా.. "ఆ ఫైళ్లకు నేను కాపలాదారును కాను'' అని మన్మోహన్ సూటిగా జవాబిచ్చారు. దీంతో, ఎవరు బాధ్యులని బీజేపీ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించగా.. అవినీతికి సంబంధించిన అంశాల విచారణకు కోర్టుల వంటి 'సంస్థాగత ఏర్పాట్లు' ఉన్నాయని చెప్పారు. "దోషులను శిక్షించనివ్వండి. మా ప్రభుత్వం ఎవరినీ కాపాడదు'' అని చెప్పారు. అవినీతి అంశంపై పార్లమెంటును ఏకబిగిన స్తంభింపజేయడం సరికాదని బీజేపీకి హితవు పలికారు. ప్రతిపక్షం తమను పని చేసుకోనివ్వడం లేదని, మంచి పాలన అందించడం ఉమ్మడి బాధ్యతని చెప్పారు.



"ఉల్లిపాయలను నిల్వ చేసుకోవాలని సూచిస్తూ కొన్ని నెలల కిందట వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. కానీ, ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన మాట వినిపించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు నిల్వ చేసుకుని ఉండి ఉంటే ఇప్పుడు ఉల్లిపాయల ధరలు నిలకడగా ఉండేవి. ఉత్పత్తిలో హెచ్చుతగ్గులను బట్టి ఉల్లిపాయల ధరలు పెరుగుతుంటాయి. తగ్గుతుంటాయి. అన్నిటి ధరలనూ తాము నియంత్రించగలమని ఏ కేంద్ర ప్రభుత్వమూ చెప్పలేదు'' అని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ఉత్పత్తి తీరు, నిల్వ ఉండే సామర్థ్యం, స్థానికంగా ఉత్పత్తి, డిమాండ్ మధ్య వ్యత్యాసం కారణంగా ధరలు పెరుగుతూ ఉంటాయని చెప్పారు.

No comments:

Post a Comment