Thursday 5 September 2013

అర్ధంతరంగా ముగిసిన వసంతం - Suraiah

అర్ధంతరంగా ముగిసిన వసంతం

September 02, 2013

అత్యంత మృదుమార్ధవ స్వరం ఉన్న ఆమెకు ' సురైయా' అన్న పేరు అక్షరాలా సార్ధకమయ్యింది. ఆ స్వరానికి ఆమె నటనా సామర్థ్యం కూడా తోడై అసమాన కథానాయకిగా హిందీ చిత్రసీమలో దాదాపు రెండు దశాబ్దాలు రాజ్యమేలింది. అయితే, దేవానంద్‌తో సాగిన ఆ మె ప్రేమ ఇరువురి మతాలు వేరు వేరు అన్న కారణంగా పెళ్లి దాకా రాకుండా ఆమె కుటుంబ పెద్దలు అడ్డుకున్నారు. ఫలితంగా జీవితమంతా ఆమె కుమారిగానే ఉండిపోయింది. దేవానంద్‌కు దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చేదాకా జీవించి ఆ తరువాత ఏడాదికే అంటే 2004లో తన 74వ ఏట ఆమె కనన్నుమూసింది. 'విద్యా' సినిమా కోసం ప్రేమ్ «ధవన్, రచిస్తే, ఎస్‌డి భర్మన్ స్వరపరచగా సురయ్యా గానం చేసిన ఈ పాట ఆమె విషాదకర జీవితానికి ప్రతిరూపంగా నిలిచింది.

కిసే మాలూమ్ థా దో దిన్ మే సావన్ బీత్ జాయేగా
సావన్ బీత్ జాయేగా
తమన్నాయే హమారీ యూఁ తడప్‌తీ ఛోడ్ జాయేగా
సావన్ బీత్ జాయేగా
(ఎవరికి తెలుసు,,, రెన్నాళ్లలోనే వసంతం ముగిసిపోతుందని!
వసంతం ముగిసిపోతుందని!
నా ఆశలన్నీ విలవిల్లాడుతుంటే ఇలా వదిలేసి వసంతం వెళ్లిపోతుందని
వసంతం ఇలా ముగిసిపోతుందని?/ఎవరికి తెలుసు/)

వసంతం వచ్చినట్టే వచ్చి ఆ నిర్ణీతకాలానికన్నా ముందే ముగిసిపోతుందని ఎవరైనా ఎలా ఊహించగలరు? జీవితంలోని ఏ ఆనందమైనా ఆశించినదాని కన్నా ఎక్కువ కాలమే ఉండాలనిపిస్తుంది. కానీ అందుకు భిన్నంగా అవి అర్ధంతరంగా ముగిసిపోతుంటే ఎలా ఉంటుంది? సుదీర్ఘమైన జీవన వసంతాన్ని నమ్ముకుని హృదయంలో ఎన్నెన్నో ఆశలు, ఆకాంక్షలూ పుట్టుకొస్తాయి. నూరేళ్లకు సరిపడే కలలు కంటాం. స్వప్పసౌధాల నిర్మాణానికి అవసరమైనవన్నీ సమకూర్చుకుని సిద్ధమైపోతాం. కానీ, వచ్చిన వసంతం కాస్తా మధ్యలోనే వెనుతిరిగిపోతుంటే ఆ హృదయం ఏమైపోవాలి? ఈ విషాదాల్ని ముందే ఊహించడానికి ఏ హృదయమైనా ఎందుకు సిద్ధమవుతుంది? కానీ, జరగుతున్నది అదే కదా!

దిలే బేతాబ్ తేరీ యాద్ మే ఆసూ బహాయేగా
ఆసూ బహాయేగా
హమే రహ్-రహ్ కే యే జాలిమ్ జమానా యాద్ ఆయేగా / కిసే మాలూమ్ థా/
( తపించే నా హృదయం నీ జ్ఞాపకాలతో కన్నీళ్లు కారుస్తోంది ఉన్నట్లుండి ఈ క్రూరలోకం తీరంతా జ్ఞాపకం వచ్చేస్తోంది.
వసంతం ఇలా ముగిసిపోతుందని /ఎవరికి తెలుసు/)
జీవితానికి అపురూపమైన దే కోల్పోయిన తాలూకు అంతర్వేదనలో ఎవరైనా ఏంచేస్తారు? కన్నీళ్లు కార్చడం తప్ప. కన్నీళ్లు కార్చడం అంటే ఒక రకంగా పోరాడటానికి ఉన్న అన్ని మార్గాలూ మూసుకుపోవడమే. పోరాటం ద్వారా కొంద రు వ్యక్తుల్ని, కొన్ని సమూహాల్ని ఎదిరించడం సాధ్యమవుతుంది కానీ, సవాలక్ష నియమాలతో సమాజమే ఎదురుదాడి చేస్తే చాలా సార్లు నిస్సహాయంగా నిలబడి చూడటం తప్ప మరేమీ చేయలేకపోవచ్చు. అలాంటి స్థితిలో సమాజపు కోరలే అడుగడుగునా కనిపిస్తాయి. కన్నీళ్లకు కరిగిపోయే స్థితి ఎక్కడుంది. ఆ స్థితిని సమాజం ఎప్పుడో కోల్పోయింది. అందుకే సమాజం మరిన్ని గాయాలు చేయడానికే సిద్ధమవుతుంది. సమాజపు ఆ హృదయ పాషాణాన్ని కరిగించే ప్రయత్నాలు ఎవరు చేస్తారో చూడాలి మరి!

జుబాఁ బేదర్దియా ఉన్‌కీ న కహ్‌నా పాయేగీ లేకిన్
హమారీ ఆంఖ్ కా పానీ కహానీ కహ్ సునాయేగా
సావన్‌బీత్ జాయేగా / కిసే మాలూమ్ థా/
(ఆ గాయాల గురించి నా నాలుకేమీ చెప్పలేదు గానీ,
నా కన్నీళ్లు ఆ విషాదగాధను వినిపిస్తాయి
వసంతం ఇలా ముగిసిపోతుందని/ ఎవరికి తెలుసు/)

బాషకున్న పరిమితులు తెలియని చాలా మంది మాటల ద్వారా చెప్పలేని విషయం ఏముంటుందిలే అనుకుంటారు గానీ, భాషకున్న పరిమితులు ప్రపంచంలో మరిదేనికీ లేవు. సమస్త మానవ భావోద్వేగాల్ని భాష ద్వారా ఆవిష్కరించాలనుకోవడం సముద్రాన్ని కడవలోకి దింపాలనుకోవడమే. కాలం గడిచే కొద్దీ ప్రతి ఒక్కరికీ ఈ సత్యం బోధపడుతుంది. అప్పుడింక తమ దుఃఖాగ్ని ని భాష ద్వారా కాకుండా కన్నీళ్ల ద్వారా వ్యక్తం చేస్తారు. నిజానికి కన్నీళ్లను చదవగలిగేవాడికి బోధపడని పాఠం ఉండదు. అందుకే మనుషులు అక్షరాల భాషను కాదు, కన్నీటి భాష నేర్చుకోవాలి అంటారు మానసిక వేత్తలు.

జహాఁ వాలో ఆరే హమ్‌నే కిసీ కా క్యా బిగాఢా థా
హమారీ రాహ్ మే భగవాన్ భీ కాంఠే బిఛాయేగా
కిసే మాలూమ్ థా దో దిన్ మే సావన్ బీత్ జాయేగా
సావన్ బీత్ జాయేగా.... / కిసే మాలూమ్ థా/
( లోకమా! నేను ఎవరికేమి ద్రోహం చేశాను? దేవుడు కూడా నా బాటలో ముళ్లు పరిచాడు
ఎవరికి తెలుసు... రెన్నాళ్లలోనే వసంతం ముగిసిపోతుందని? వసంతం ముగిసిపోతుందని / ఎవరికి తెలుసు/)

ఏనాడూ ఎవరికేమీ నష్టం చేయకపోయినా ఎదుటి వారు అంత క్రూరంగా మనల్ని బలితీసుకోవడానికి ఎందుకు సిద్ధమవుతారో ఎంతకూ బోధపడదు. ఎవరైనా మరొకరిపట్ల హింసాత్మకంగా వ్యవహరిస్తునారూ అంటే, వాళ్లలో వాళ్లకే ఏవో భయాలు ఉన్నాయని అర్థం. ఆ భయాలన్నీ వాస్తవిక పునాధిలేని ఏవేవో అపోహలు,అనుమానాలు. భగవంతుడ్ని చూసి మనిషి భయపడాలే గానీ, మనిసిని చూసి భగవంతుడు భయపడటమేమిటి ? ఆ భయాలే లేకపోతే, తన దారిన తాను సాగిపోయే మనిషి మార్గంలో దేవుడు అవరోధాలు పేర్చడం ఎందుకు? సాటి మనుషులెవరో అలా చేశారంటే ఏదోలే మానవ దౌర్భల్యం అనుకోవచ్చు కానీ సమస్త మానవాళికీ సారధ్యం వహించే దైవమే మనిషి దారిపొడవునా ముళ్ల రాసులు పోస్తే ఏమనుకోవాలి?

No comments:

Post a Comment