Sunday 22 September 2013

ఎన్డీయేతో కలిసి ఎంతో అభివృద్ధి చేశాం - Babu

ఎన్డీయేతో కలిసి ఎంతో అభివృద్ధి చేశాం

September 23, 2013

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22 : దేశం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ.. జాతీయ స్థాయిలో సానుకూల పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో ఎన్డీయేతో కలిసి దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశామని ఆదివారమిక్కడ ఆయన వ్యాఖ్యానించారు. "ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న విశాలమైన రోడ్లు,సెల్‌ఫోన్లు అప్పటి మా కృషి ఫలితమే. దేశం గర్వించే రీతిలో పనిచేశాం'' అని వివరించారు. కాంగ్రెస్, యుపీఏ మాత్రం దేశాన్ని దోచుకుంటోం దని, ఆర్థిక రంగం అధోగతి పాలైందన్నారు. "ప్రజలంతా నిరాశలో ఉన్నారు. జాతి మొత్తం ఇలా సమస్యల్లో పడినప్పుడు టీడీపీ మరోసారి కీలక పాత్ర పోషిస్తుంద''ని వెల్లడించారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు ఎప్పుడు పెట్టుకుంటున్నారు? అన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు.

"రాజ్‌నాథ్‌ని కలిశాను. రాష్ట్రం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఆయనతో రాజకీయాలు ఎలా మాట్లాడగలను. సమస్యలు ముగియగానే తప్పకుండా దేశంపై దృష్టి సారిస్తాను. దానికి ఇంకా సమయం ఉం ది'' అని వివరించారు. "ఎన్డీయే కన్వీనర్‌గా మిమ్మల్ని చూడొచ్చా?''.."మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై మీ వైఖరి ఏమిటి?'' అంటూ పలు విధాలుగా ప్రశ్నించినప్పటికీ చంద్రబాబు నవ్వుతూ.. వ్యాఖ్యానించేందుకు సున్నితంగా తిరస్కరించారు. విలేకరులు తెలివైన వారని, అయితే ఇప్పుడు తాను రాజకీయాల గురించి మాట్లాడదల్చుకోలేదని బదులిచ్చారు.

No comments:

Post a Comment