Friday 20 September 2013

ఎవరి వాదన వారిదే! ఇరు ప్రాంత నేతల తొలి భేటీ!

ఎవరి వాదన వారిదే!

September 20, 2013

హైదరాబాద్, సెప్టెంబర్ 19: రాష్ట్ర విభజన అంశంపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏర్పడిన పరిస్థితులపై చర్చించి సానుకూల వాతావరణం నెలకొల్పుదామన్న సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రయత్నం ఆదిలోనే బెడిసికొట్టింది. ఇరు ప్రాంతాల నేతలూ వారి వారి వాదనలకే కట్టుబడి ఉండడంతో మొదటి సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. సీఎల్పీ కార్యాలయంలో గురువారం తెలంగాణకు చెందిన మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, బస్వరాజు సారయ్య, ప్రసాద్‌కుమార్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిలతో సీమాంధ్రకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ చైతన్య రాజు, ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజు సీఎల్పీ కార్యదర్శి కార్యాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించారు.

కాగా.. ఈ సమయంలో సీఎల్పీ కార్యాలయంలోనే ఉన్న మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి మాత్రం చర్చల ప్రక్రియకు దూరంగా ఉన్నారు. సమైక్యాంధ్రకు తప్ప మరి దేనికీ తాను అంగీకరించబోనని, ఈ చర్చలతో ప్రయోజనమే లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరేమి మాట్లాడుకున్నా సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు లోబడి మాట్లాడుకోవాలన్నారు. విశ్వసయనీయ వర్గాల సమాచారం మేరకు.. మంత్రి శ్రీధర్‌బాబు వచ్చిన వెంటనే ఆయన, మరో మంత్రి ఏరాసు పరస్పరం పలకరించుకున్నారు. నమస్కార ప్రతి నమస్కారాల తర్వాత ఇరు వర్గాల వాదనలివీ!

దుద్దిళ్ల: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించండి.
ఏరాసు (నవ్వుతూ): మీరు కూడా సమైక్యాంధ్రకు సహకరించండి.
గంటా: ఇంతకాలం ఎలా ఉన్నా ఇరు ప్రాంతాల నేతలు సుహృద్భావ వాతావరణంలో కూర్చొని మాట్లాడుకునేందుకు ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమే.
జానారెడ్డి: ఈ సంప్రదింపుల ప్రక్రియ స్వాగతించదగ్గదే.
రుద్రరాజు: శైలజానాథ్, గాదె వెంకట రెడ్డి లేకుండా సంప్రదింపులు జరపడం సరికాదేమో!
ఏరాసు: విభజన జరిగితే నష్టపోయేది పూర్తిగా రాయలసీమ ప్రాంతమే! కృష్ణా జలాలు కర్నూలు, అనంతపురం జిల్లాలకు రానే రావు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీరు రావడమే గగనమైపోతుంది. నాగార్జున సాగర్‌లో 885 అడుగులకు నీరు చేరితే తప్ప మా జిల్లాకు నీరు పారదు. సాగునీటి సంగతి సరే.. తాగు నీటికే కటకటలాడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. వాస్తవానికి, విలీనం వల్ల కర్నూలు జిల్లావాసులమే అధికంగా నష్టపోయాం. రాజధానిని కోల్పోయాం. అభివృద్ధికీ నోచుకోలేదు.


తెలంగాణ నేతలు: ముఖ్యమంత్రి పదవులను దక్కించుకుని లబ్ధి పొందినది కూడా రాయలసీమవాసులే!
ఏరాసు: రాయలసీమకు చెందినవారే ముఖ్యమంత్రులుగా ఉన్నా సొంత ప్రాంతానికి చేసుకున్న అభివృద్ధి ఏమీ లేదు.
జీవన్ రెడ్డి: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకూ ఎన్నో ఒప్పందాలు ఉల్లంఘనకు గురయ్యాయి. తెలంగాణ ప్రాంతం చాలా నష్టపోయింది. రాజకీయ పదవుల నుంచి ఎన్నింటినో కోల్పోవాల్సి వచ్చింది.
గంటా: ఆ నష్టాలేమిటో చెబితే వాటిని పూడ్చుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయ పదవులు మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి కావాలంటే.. 15 ఏళ్లపాటు తెలంగాణ వారికే ఇచ్చేలా అధిష్ఠానాన్ని ఒప్పిద్దాం.


తెలంగాణ నేతలు: ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. తెలంగాణ నేతలెవరూ ఒక్కరోజు కూడా పదవులను చేపట్టే స్థితిలో లేరు.
గంటా: కానీ, సీమాంధ్రలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గత 50 రోజులుగా నాయకులెవరూ లేకుండానే ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగితే విద్య, ఉద్యోగాలు, జలాల సమస్యలు తలెత్తుతాయి.
రుద్రరాజు: సీమాంధ్రలో సరైన వైద్య సదుపాయాలతోపాటు.. ఉపాధిని కల్పించే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలుగానీ, ప్రైవేటు కర్మాగారాలు గానీ లేవు. కానీ, హైదరాబాద్ చుట్టుపక్కల 200 వరకూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. ప్రధానంగా నీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉంటుంది.
జానారెడ్డి: ఈ సమస్యలు పరిష్కరించుకోవడం సులువే! దేశం నుంచి బంగ్లాదేశ్, పాకిస్థాన్ విడిపోయాయి. ఆ రెండు దేశాలతోనూ జల ఒప్పందాలు కుదరలేదా? అక్కడి ప్రజలు సంతోషంగా లేరా? రాష్ట్ర విభజన జరిగినా.. అంతర్రాష్ట జల వివాదాలను పరిష్కరించేందుకు ట్రిబ్యునళ్లు ఉంటాయి. రాష్ట్రాల విభజన జరిగినప్పుడే.. రాష్ట్రాల వారీ జలాల వాటాను కేంద్ర జలవనరుల ట్రిబ్యునల్ నిర్థారిస్తుంది. దాని ప్రకారమే నీటి వినియోగం ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగినా శుభకార్యాలూ జరుపుకోవచ్చు. సీమాంధ్ర రాష్ట్రానికి చెందిన ఆడపిల్లను తెలంగాణ రాష్ట్రానికి చెందిన మగ పిల్లవాడికి ఇస్తే.. అక్కడి అమ్మాయని భావించి సరిగ్గా చూసుకోవడం మానేస్తామా!?


తెలంగాణ నేతలు: సీమాంధ్రలో ఆందోళన పేరిట కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. ప్రధానంగా సోనియా గాంధీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారు? అధినేత్రిపైనే విమర్శలు గుప్పిస్తుంటే ఎందుకు మౌనం దాల్చుతున్నారు.
సీమాంధ్ర నేతలు: తెలంగాణకు సానుకూల నిర్ణయం తీసుకున్నందున సోనియా గాంధీ ఈ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు దేవత కావచ్చు. కానీ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు తీవ్ర ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. మేం మాట్లాడే పరిస్థితే లేదు.
గంటా: మేం ఇటీవల విశాఖపట్నంలో సమైక్యాంధ్ర డిమాండ్‌తో దాదాపు 5000 మందితో సభను నిర్వహించాలని ఏర్పాట్లు చేశాం. కానీ, మాకు ఆ సభలో పాల్గొనే అవకాశమే లేకుండాపోయింది. అక్కడి పరిస్థితులు అలా ఉన్నాయి.
జానారెడ్డి: ఆ పరిస్థితులను మేం అర్థం చేసుకున్నాం. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం జరిగేలా మేం సహకరిస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం వెనక్కు వెళ్లే పరిస్థితి లేనే లేదు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే! ఇదే సమయంలో రాజధాని అంశం ప్రస్తావనకు రాగా.. మరోసారి దానిపై చర్చించుకుందామని చెప్పారు.
కొసమెరుపు: చర్చల ప్రక్రియ సాగుతున్న సమయంలో కేబినెట్ నోట్ తయారైందని ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావుకు సమాచారం అందింది. ఇదే సమయంలో హైదరాబాద్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పడం కూడా ప్రస్తావనకు వచ్చింది. కేబినెట్ నోట్ తయారైందన్న సమాచారం విన్న తెలంగాణ నేతలు 'హమ్మయ్య' అంటూ ఊపిరి పీల్చుకుంటే.. సీమాంధ్ర నేతలు కాస్త కలవరానికి గురయ్యారు.

రాష్ట్రం సమైక్యంగా ఉండటం తప్ప వేరే మార్గమే లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సీఎల్పీలో భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ మంత్రులకు నచ్చచెప్పామన్నారు. విభజనతో మీకున్న అడ్డంకులేమిటని వారు అడిగారని, రాజధాని, సాగు, తాగునీరు తదితర సమస్యలన్నీ సమైక్యంగా ఉంటేనే సాధ్యమని వివరించామని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పామన్నారు. మరో మంత్రి ఏరాసు మాట్లాడుతూ సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తెలంగాణ మంత్రులు కోరారన్నారు.

భూమి, సంస్కృతిలో ఎలాంటి విబేధాలు లేవని, పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాలేదని విభజన చేయడం అవసరమా? అని ప్రశ్నించామన్నారు. ప్రస్తుతం అడ్వొకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల్లో తెలంగాణకు చెందిన వారే ఉన్నారన్నారు. తాను రాయల తెలంగాణ కోసం మాట్లాడటం లేదని, సమైక్యంగా ఉండటం ద్వారా రాయలసీమ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తన వ్యాఖ్యలను కొంత మంది వక్రీకరించినట్లు మీడియా, పత్రికల్లో చూశానన్నారు. సుహృద్భావ వాతావరణంలో కలిసికట్టుగా విమర్శలను తిప్పికొట్టాలని కాంగ్రెస్ నేతలందరం నిర్ణయించామని రుద్రరాజు అన్నారు.


రాష్ట్రంలో ప్రస్తుత వివాదాలన్నింటికీ టీడీపీతోపాటు ప్రతిపక్ష పార్టీలే కారణమని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. సీఎల్పీ కార్యాలయంలో భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం వేసిన కమిటీతో ఆయా పార్టీలు గతంలో ఏమి మాట్లాడాయో, ఇప్పుడేమి మాట్లాడుతున్నాయో బేరీజు వేసుకోవాలన్నారు. అప్పుడు ఒక మాట చెప్పి.. ఇప్పుడు యూటర్న్ తీసుకోవడానికి కారణాలను ప్రజలకు చెప్పాలన్నారు. కాంగ్రెస్ అభిప్రాయం చెప్పలేదని ఎన్నోసార్లు ప్రశ్నించిన పార్టీలు యూపీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత తప్పుపట్టి రాజకీయాలు చేస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారానికి సహచర మంత్రులతో చిన్నపాటి చర్చ జరిపామని, కాంగ్రెస్ పార్టీ మిత్రులు కలవడం గొప్ప విశేషమేమీ కాదని తెలిపారు. విభజనకు ప్రత్యామ్నాయంగా వారు కొన్ని ప్రతిపాదనలు చేశారని, పది జిల్లాల తెలంగాణకు సంబంధించి తీర్పు వచ్చిందని సహకరించాలని కోరామని తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి వద్దకు కూడా రెండు మూడుసార్లు వెళ్లి సహకరించాలని కోరామని చెప్పారు.

సోనియాను టార్గెట్ చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్న పార్టీలను తిప్పికొట్టాలని నిర్ణయించామని బస్వరాజు సారయ్య చెప్పారు. తప్పుడు రాజకీయాలతో కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించాలని ప్రయత్నిస్తున్న పార్టీలను వ్యతిరేకించాలని నిర్ణయించామని ఎమ్మెల్సీ పొంగులేటి చెప్పారు. ఇక, చర్చల ప్రక్రియకు ముందు జానారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. తామంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులమని, కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలున్నా వాటిని పరిష్కరించుకునేందుకు సామరస్య వాతావరణంలో కూర్చొని మాట్లాడుకుంటామన్నారు. తెలంగాణ ప్రక్రియ ఆగలేదని, ఆగినట్లు పత్రికల్లో వస్తున్న వార్తలను నమ్మవద్దని ఎంపీ పొన్నం ప్రభాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

No comments:

Post a Comment