Monday 30 September 2013

న.మో.నమః

న.మో.నమః

  • 29/09/2013
  •  వడ్డమాని సుందరరామశాస్ర్తీ sastryvsr@gmail.com
‘దేశ్ కా నేతా కైసా హై... రాజీవ్‌గాంధీ జైసా హై’ అని 1980లలో కాంగ్రెస్ వారు నినదించేవారు. కానీ ఇపుడు మన్మోహన్ సారును, రాహుల్ బాబును చూశాక, దేశ ప్రజానీకం ‘నరేంద్రమోడీ జైసా హై’ అని నినదించే పరిస్థితి వచ్చింది. ఈ దేశానికి ఓ సామ్యవాది ప్రధాని కావచ్చని నెహ్రూ నిరూపించాడు. ఓ సామాన్యుడు ప్రధాని కావచ్చని లాల్‌బహదూర్ శాస్ర్తీ నిరూపించాడు. ఓ మహిళ ప్రధాని కావచ్చని ఇందిరాగాంధీ నిరూపించింది. ఓ నవ యువకుడు ప్రధాని కావచ్చని రాజీవ్‌గాంధీ నిరూపించాడు. ఓ సమితి ప్రెసిడెంటు స్థాయి కాంట్రాక్టరు ప్రధాని కావచ్చని దేవెగౌడ నిరూపించాడు. ఓ బ్రాహ్మణుడు ప్రధాని కావచ్చని వాజ్‌పేయి నిరూపించాడు. అసలు ఈ దేశానికి ప్రధానమంత్రే అక్కర్లేదని మన్మోహన్ సింగ్ నిరూపించాడు - ఇదీ ఇటీవల ఫేస్‌బుక్‌లో ఒక విశే్లషణ. పైకి చూడడానికి ఇది సరదాగా చేసిన వ్యాఖ్యలాగా ఉన్నా, ఇందులో లోతైన ఫిలాసఫీ ఉంది. గత 9-10 సంవత్సరాలుగా ఉన్నా.. లేనట్టుగా ఉన్న ప్రధాని మన్మోహన్ స్థానే ఈ విశాల భారతదేశానికి దమ్మున్న, సమర్థుడైన ఓ మోడీ లాంటి వాడు ప్రధానమంత్రిగా రావాలని ప్రజానీకం మనసులో బీజం పడ్డట్టు కనిపిస్తోంది. బిజెపి అంటే హిందూత్వం, రామమందిరం. కమల దళంపై దేశంలో సగటు ఓటర్ల అభిప్రాయం ఇదే. కాలక్రమేణా అలాంటి అభిప్రాయాలు మారుతున్నాయి. బిజెపి అంటే అభివృద్ధి, సుపరిపాలన.. బిజెపి అంటే మోడీ అనే పరిస్థితి వచ్చింది. అందుకే అగ్రనేత అద్వానీ కాదన్నా, అంతర్గతంగా ఎంతమంది వ్యతిరేకించినా, సంఘ్ పరివార్ మోడీకే పట్టం కట్టింది. అయితే ఎవరి దయా దాక్షిణ్యాల వల్లనో, వారసత్వంగానో మోడీ ఈ స్థాయికి చేరలేదు. స్వశక్తినే నమ్ముకొని పట్టుదలతో ఎన్నో ఏళ్లు చేసిన కృషి ఫలితంగానే మోడీ దేశ అత్యున్నత పీఠం వైపు దూసుకెళ్తున్నాడు. మన్మోహన్ సింగ్ లాంటి సెలెక్టెడ్ పీఎంల స్థానంలో మోడీ లాంటి ఎలెక్టెడ్ పీఎంను భారతదేశంలో త్వరలో చూడబోతోందని చెప్పుకోవచ్చు. సాధారణ ఆరెస్సెస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన మోడీ బిజెపి ప్రధాని అభ్యర్థి స్థాయికి చేరడానికి ఎన్నో అవాంతరాలు అధిగమించారు. దశాబ్దం క్రితం కేశూభాయ్ పటేల్ నుంచి నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో ఉంది. భూకంపం దెబ్బతో తీవ్రంగా నష్టపోయి.. ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని తనదైన శైలిలో మోడీ అభివృద్ధి పథంలో నడిపించారు. భూకంపంతో నష్టపోయిన ప్రాంతాల పునర్నిర్మాణంతోపాటు, బాధితులకు పునరావాసం, ఆర్థికంగా చేయూత అందించి పరిస్థితులను గాడిలో పెట్టడంతో మోడీ పరిపాలనా దక్షత మొదటిసారి వెలుగులోకి వచ్చింది. గోద్రా ఘటన తర్వాత గుజరాత్‌లో చెలరేగిన మత ఘర్షణలతో మోడీపై కరడుగట్టిన హిందూత్వ వాది అనే ముద్ర పడిపోయింది. మత రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. గుజరాత్ సీఎం పదవి నుంచి తప్పించాలని అప్పటి ప్రధాని వాజ్‌పేయి భావించడంతో మోడీ ప్రస్థానం ముగిసిందని అంతా అనుకున్నారు. అయితే అద్వానీ అండగా నిలవడంతో మోడీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ఐరోపా సమాఖ్య దౌత్యాధికారులందరూ మోడీతో సమావేశాలు నిషేధించారు. అమెరికా మోడీకి వీసా నిరాకరించింది. ఈ పరిణామాలతో మోడీ తన వ్యూహాలకు మరింత పదును పెట్టారు. జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయంగా తనపై పడిన ముద్రను చెరిపేసుకుని, సానుకూలత సాధించాల్సిన అవసరంపై దృష్టి పెట్టారు. గోద్రా అనంతర మత ఘర్షణల తర్వాత దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన విమర్శలతో ఎన్నికలకు వెళ్లిన మోడీ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా- కాంగ్రెస్ హైకమాండ్ ఎంత ప్రయత్నించినా గుజరాత్‌లో మోడీ ప్రభంజనాన్ని అవి అడ్డుకోలేక పోయాయి. 2007, 2012 ఎన్నికల్లోనూ బిజెపిని విజయపథంలో నడిపించి మోడీ హ్యాట్రిక్ సాధించాడు. ఈ అప్రతిహత విజయాలే ప్రధాని అభ్యర్థిత్వానికి బలమైన పునాది వేశాయి. గుజరాత్ అల్లర్ల విషయంలో జాతీయ స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న మోడీ వాటన్నింటికీ అభివృద్ధితోనే సమాధానమిచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలపై సత్వర నిర్ణయాలు, దృఢమైన వైఖరితో మోడీ గుజరాత్‌లో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించారు. పరిశ్రమలకు సులభంగా అనుమతులు కల్పించటం, వౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోయింది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు ఉద్యోగ, వ్యాపారాల కోసం ముంబై బాట పట్టే గుజరాతీలకు ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే అపారమైన అవకాశాలు పుట్టుకొచ్చాయి. ఇలా వాణిజ్య, వ్యాపార వర్గాలతోపాటు యువత, మధ్యతరగతి ప్రజల మన్ననలు పొందారు. జాతీయ స్థాయి విమర్శలు ఎదుర్కొని తన చేతలతో వాటిని దీటుగా తిప్పికొట్టడంతో మోడీకి దేశవ్యాప్తంగా పాపులారిటీ పెరిగింది. జాతీయ మీడియా మోడీపై సాగించిన వ్యతిరేక ప్రచారం కూడా ఆయన పాపులారిటీని పెంచడంలో గణనీయ పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. మోడీపై హిందూత్వ ముద్ర ఆయన్ను దమ్మున్న నేతగా ఆవిష్కరించింది. ప్రతిపక్షాల సూడో సెక్యులరిజం విధానాలు సైతం ఈ దళపతికి కలిసొచ్చాయి. మరోవైపు విధాన నిర్ణయాల్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు యూపీఏ ప్రతిష్ఠను మసకబార్చాయి. ముఖ్యంగా యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చాక బయటపడిన కుంభకోణాలు, అవినీతి బాగోతాలతో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. మోడీయే సరైన ప్రత్యామ్నాయమనే భావన మొగ్గ తొడిగింది. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టలేదు. ఈ పరిస్థితికి తోడు బడా పారిశ్రామికవేత్తలు, విదేశీ పెట్టుబడిదారులకు అనుకూల నిర్ణయాలతో ముందుకెళ్తున్న కేంద్రం.. వంటగ్యాస్, పెట్రోలు ఇతర నిత్యావసరాలపై సబ్సిడీలను తగ్గించుకుంటూ వస్తోంది. ఈ పరిస్థితులతో విసిగిపోయిన సామాన్య, మధ్యతరగతి ప్రజలు యూపీఏపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తిన మోడీ.. జాతీయ స్థాయిలో అన్ని వర్గాల ప్రజలను విశేషంగా ఆకట్టుకొన్నారు. యూపీఏ ప్రభుత్వానికి సరైన ప్రత్యామ్నాయం తానేనని ప్రజలను ఒప్పించి మెప్పించగలిగారు. ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ గానీ, కాంగ్రెస్ భవిష్యత్ ప్రధానిగా భావిస్తున్న రాహుల్‌గాంధీ కానీ.. నరేంద్ర మోడీకి కనీస పోటీ కూడా కాదని కాంగ్రెస్‌కు కూడా ఇపుడిపుడే అర్థమవుతోంది. విగ్రహంలో అయినా, వాక్చాతుర్యంలో అయినా.. అనుభవంలో అయినా, కాంగ్రెస్ వారసుడి కంటే తాను అనేక రెట్లు మిన్న అని మోడీ నిరూపించుకున్నారు. మాటలతోపాటు గుజరాత్‌లో మోడీ చేతలు కూడా ప్రజలకు ఆయనపై విశ్వాసాన్ని పెంచాయి. ఇక బిజెపిలో జాతీయ స్థాయిలో మోడీని ఢీకొట్టగల మరో నాయకుడు లేకపోవడం ఆయనకు బాగా కలిసొచ్చింది. పార్టీకి భీష్మ పితామహుడి వంటి అద్వానీ మాత్రమే మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని సవాల్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అద్వానీ కంటే, మోడీ సారథ్యంలో ఎన్నికలకు వెళ్తేనే పార్టీకి శ్రేయస్కరమనే భావన వ్యక్తమైంది. బిజెపిలో సామాన్య కార్యకర్తల దగ్గర్నుంచి పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ వరకూ అత్యధికులు మోడీకే ఓటేయడంతోపాటు.. ఆరెస్సెస్ నాయకులు కూడా మోడీ కోసం పట్టుబట్టడంతో అద్వానీ వగైరాల అభ్యంతరాలన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విచక్షణాయుత ఓటర్లు మోడీకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలి అనే ఆలోచనలో ఉన్నారు. జాతీయ మీడియాలో వస్తున్న సర్వేల ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీల కంటే మోడీకే అత్యధికులు మద్దతిస్తున్నారు. అయితే ప్రజల్లో ఉన్న మోడీ ప్రభంజనం బిజెపికి ఓట్లు కురిపిస్తుందా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. మోడీకి మద్దతిస్తున్న వాళ్లంతా బిజెపి కార్యకర్తలు, అభిమానులు కాదు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. స్థానిక అంశాలు, కులం, మతం, వర్గం, ప్రాంతం వంటివి కూడా ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. బిజెపి ప్రచార సారధిగా, ప్రధాని అభ్యర్థిగా ఎన్నికైన నరేంద్ర మోడీకి.. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలు మొదటి సవాల్ విసరనున్నాయి. ఐదు రాష్ట్రాల్లో మిజోరాంను మినహాయిస్తే మిగిలిన 4 రాష్ట్రాల్లోనూ ప్రధాన ప్రత్యర్థులు బిజెపి, కాంగ్రెస్ పార్టీలే. ఈ నాలుగు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లో బిజెపి అధికారంలో ఉండగా, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలు కాంగ్రెస్ పాలనలో ఉన్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయావకాశాలు నామమాత్రంగానే ఉన్నాయి. రాజస్థాన్ బిజెపి సొంతం కాబోతోంది. అంతా ఆశిస్తున్నట్లుగా ఐదింటిలో కనీసం 3 రాష్ట్రాల్లో బిజెపి విజయం సాధిస్తే మోడీ ప్రభంజనం మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో ప్రధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ ముఖాముఖి తలపడనున్న ఈ ఎన్నికల ఫలితాలు 2014 ఎన్నికలకు ముందు పార్టీలకు గోడ మీద రాతల్లా నిలుస్తాయనడంలో సందేహం లేదు. బిజెపి ప్రచార సారధిగా ఎన్నికైన వెంటనే నరేంద్ర మోడీ.. 2014 ఎన్నికలకు ప్రచారం ప్రారంభించేశారు. ఏ విషయంలోనైనా సూటిగా, ఘాటుగా అభిప్రాయాలు చెప్పే మోడీ.. స్వాతంత్య్ర దినోత్సవం నాడే ప్రధాని మన్మోహన్‌కు సవాల్ విసిరి తన లక్ష్యమేంటో చెప్పేశారు. అభివృద్ధి, సుపరిపాలన నినాదాలతో ప్రజల్లోకి వెళ్తున్న మోడీ.. తన బలహీనతలు ప్రత్యర్థులకు బలం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థిగా మోడీకి అనేక సానుకూలతలు కనిపిస్తున్నా.. అంతకు మించిన సవాళ్లూ ఎదురుచూస్తున్నాయి. ప్రతిపక్షాలను ఎదుర్కోవడం కంటే అంతర్గత వ్యతిరేకతను అధిగమించడమే మోడీ ముందున్న అతి పెద్ద సమస్య. ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో అద్వానీ అభ్యంతరాలను అధిగమించినా - వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి మిత్రపక్షాలతో పొత్తు వరకూ ప్రతి విషయంలోనూ ప్రతిబంధకాలు తప్పవు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా బిజెపి ముస్లిం ఓట్లను పూర్తిగా దూరం చేసుకొందనే వాదన వినిపిస్తోంది. అయితే మోడీ ప్రధాని అభ్యర్థి అయినా కాకపోయినా.. ముస్లింలు బిజెపికి ఓట్లు వేయరు అనే విషయంలో ఎవరికీ సందేహాలు ఉండవు. మోడీ ముందున్న మరో పెద్ద సమస్య.. ఎన్నికల తర్వాత బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించినా పూర్తి మెజారిటీ రాకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయగలదా అనేది. బిజెపి నమో నమామి అనడంతో.. సుదీర్ఘ కాలం నుంచి మిత్రపక్షంగా ఉన్న జెడియూ ఎన్డీయేకు రాంరాం చెప్పేసింది. బిజూ జనతాదళ్, అన్నాడిఎంకె, టిడిపి వంటి పార్టీలు ఇప్పటికే ఎన్డీయేలో చేరడానికి విముఖత చూపిస్తున్నాయి. ఎన్సీపీ, తృణమూల్, ఉత్తరప్రదేశ్‌లో చక్రం తిప్పుతున్న సమాజ్‌వాది పార్టీ, బిఎస్పీలతో పాటు కమ్యూనిస్టులు బిజెపిని అంటరాని పార్టీగానే చూస్తున్నారు. అయితే ఎన్నికల తర్వాత కమ్యూనిస్టులు తప్ప మిగిలిన పార్టీల్లో ఏవైనా మనసు మార్చుకొని ఎన్డీయేతో దోస్తీకి సిద్ధమైనా ఆశ్చర్యం లేదు. మోడీ మహత్తు అలాంటిది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ మన ప్రధాన మంత్రులను చూస్తే.. నెహ్రూ కుటుంబ సభ్యులు తప్ప మిగిలిన వాళ్లంతా అనుకోకుండా అదృష్టం కలిసొచ్చి ఆ పీఠంపై కూర్చున్న వాళ్లే. ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా, ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా స్వశక్తితో ప్రజల మద్దతుతో, ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న నరేంద్ర మోడీకి ఓటర్లు నమో నమామి అంటారో బెటర్ లక్ నెక్స్ట్‌టైమ్ అంటారో వేచి చూడాలి మరి! * * * 2004, 2009 జనరల్ ఎలక్షన్స్‌లో వరసగా రెండుసార్లు ఓటమి పాలైన బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేను తిరిగి ఎలాగైనా గట్టెక్కించే బాధ్యత ఇప్పుడు నరేంద్ర మోడీపై పడింది. గుజరాత్‌లో హ్యాట్రిక్ సాధించిన మోడీ.. ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకోవాలని భావిస్తున్న మోడి, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. పరిణతి చెందిన నేతలా వ్యవహరిస్తున్నారు. ప్రధాని అభ్యర్థిగా తనకు తగిన అర్హతలున్నాయని నిరూపించుకునే యత్నంలో ఉన్నారని భావించవచ్చు. దేశ వర్తమాన పరిస్థితులపై అవగాహనతోపాటు, అన్ని వర్గాలను కలుపుకుని పోయే దిశలో ఆయన పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత నెల పర్యటించిన మోడీ, ప్రత్యేక తెలంగాణను గట్టిగా సమర్థిస్తూనే, ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలు దృష్టిలో ఉంచుకుంటామని.. అందరికీ న్యాయం చేస్తామని.. అందరూ ఇది గమనించాలన్నట్టుగా మాట్లాడారు. నిజానికి ప్రత్యేక తెలంగాణయే బిజెపి ఎజెండా అయినా.. సీమాంధ్ర వారిని కూడా ఆకట్టుకునే విధంగా మోడీ వ్యవహరించారు. మొన్న హర్యానాలో సైనిక దళాలను కలిసిన మోడీ దేశ రక్షణలో కీలక బాధ్యత వహించే సైనికులను సదా గౌరవించాలంటూ వారిని ఆకట్టుకునే యత్నం చేశారు. చైనా, పాకిస్తాన్‌లపై తొడగొట్టారు. ఇదే మన్మోహన్‌కు, మోడీకీ తేడా. అసలు ఈ దేశానికి ప్రధాని అనే మనిషి ఉన్నాడా లేడా! అన్నట్టు మన్మోహన్ వ్యవహరిస్తే, ‘ఇడుగో! ఇతడు కాబోయే ప్రధాని’ అని విదేశాలు సైతం గుర్తించే రీతిలో మోడీ కనపడుతున్నారు. కరడు గట్టిన హిందూత్వ వాదిగా పేరు పొందినా.. అభివృద్ధిపై మోడీ పెట్టిన ప్రత్యేక దృష్టి ఆయన్ను గుజరాత్‌లో తిరుగులేని నేతగా తీర్చిదిద్దింది. అందుకే గుజరాతీలు వరుసగా మూడుసార్లు ఆయనకే పట్టం కట్టారు. అవినీతికి తావునివ్వకుండా - ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పనులు, పథకాలు అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నాయి. గుజరాత్‌లో రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి వౌలిక సదుపాయాలతో పాటు, ఉపాధి కల్పనపై మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు. పట్టణాల్లోనే ఈ పనులు ఎక్కువగా జరిగాయని విమర్శలు ఉన్నా.. గ్రామాల్లో సైతం కొంత మార్పు వచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సాధారణంగా ఇతర ఏ నేతా పెద్దగా దృష్టి పెట్టని.. ఏరియాలపై మోడీ ప్రత్యేకంగా పని చేశారు. గుజరాత్ రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేసేందుకు సోలార్ ప్లాంట్లు విరివిగా ఏర్పాటు చేయడం మోడీ ఘనత. ముఖ్యంగా పట్టణాల్లో స్ట్రీట్‌లైట్ల పవర్ సప్లై కోసం.. అలాగే హైవేల వెంట పెద్దఎత్తున సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం గొప్ప విషయం. దీనివల్ల గుజరాత్‌లో పవర్ కట్ అనేది లేకుండా పోయింది. నదీ జలాల వినియోగం - సుందరీకరణ నదీ జలాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేస్తూ.. నర్మద నదితోపాటు, పరిసరాలనూ అందంగా తీర్చిదిద్దారు. అహ్మదాబాద్ నగరంలో ప్రవహించే సబర్మతీ నది.. అక్కడ ఓ టూరిస్ట్ స్పాట్‌లా మారిందంటే అతిశయోక్తి కాదు. అంతలా నదీ తీరాన్ని తీర్చిదిద్దారు. మంచినీటి సరఫరా కోసం పెద్దఎత్తున పైప్‌లైన్ల ఏర్పాటు.. అక్కడి గ్రామాల్లో తాగునీటి సమస్యను తీర్చింది. ఓవైపు రహదారుల నిర్మాణం, మరోవైపు మంచినీటి సరఫరా, ఇంకా నిరంతర విద్యుత్ సరఫరా గ్రామీణ ప్రజలను కూడా మోడీకి దగ్గర చేసింది. విద్యుత్ కోతలు లేకపోవడం వల్ల పంటలూ బాగానే పండుతున్నాయి. ఆర్థికాభివృద్ధితోపాటు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎందరికో ఉపాధి కల్పించే పారిశ్రామిక రంగంపై మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు. పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి ప్రోత్సాహం అందించారు. టాటా మోటార్స్ పశ్చిమ బెంగాల్‌లోని సింగూరులో నానో కార్ల ప్లాంట్ పెట్టింది. అయితే రైతు, కార్మిక ఉద్యమంతో ఆ కంపెనీని గుజరాత్‌కు తరలించారు. ఈ ప్లాంట్ కోసం ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా.. చివరకు గుజరాత్‌లోనే ఏర్పాటు చేశారు. అంతలా పారిశ్రామిక రంగాన్ని మోడీ ప్రభావితం చేశారు. పరిశ్రమల వల్లనే అత్యధిక ఉపాధి కల్పన జరుగుతుందని.. మోడీ దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. జిల్లాల్లోనూ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా వాడల అభివృద్ధి, పలుచోట్ల సెజ్‌ల ఏర్పాటు మోడీ ప్రత్యేకతలని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా ‘నీకిది - నాకది’ వంటి వై.ఎస్. మార్కు స్వప్రయోజనాల కోసం కాకుండా నిజంగానే పరిశ్రమల పురోగతి కోసం సెజ్‌లు ఏర్పాటు చేశారు. తాను ఉన్నది చాదస్తపుకాషాయ పార్టీలోనే అయినా నరేంద్ర మోడీ సోషల్ మీడియాను బాగా వినియోగిస్తున్నారని చెప్పవచ్చు. పర్సనల్‌గా వెబ్‌సైట్, బ్లాగ్‌తోపాటు ఫేస్‌బుక్ వినియోగించే మోడీ.. అలా ఎందరికో ముఖ్యంగా యూత్‌కు చేరువయ్యారు. మ్లాగ్‌లో పోస్ట్ అయ్యే వాటికి వెంటనే సమాధానం చెబుతారు. రోజూ వేల మందికి మెయిల్స్ పంపిస్తారు. అలాగే ఫేస్‌బుక్‌లో కూడా. కేవలం ఒకచోట ప్రసంగిస్తూ.. అదే సమయంలో మరో మూడు చోట్ల కనిపించేలా 3-డి టెక్నాలజీ వినియోగించిన నేతల్లో మోడీ మొదటివారు. పలుచోట్ల ఒకేసారి కనిపిస్తూ మాట్లాడ్డం.. నిజంగా గుజరాతీయులను ఎంతో ఆకట్టుకుంది. అదే ఆయన్ను ప్రజలకు మరింత చేరువ చేసింది. ప్రత్యర్థులపై ఎప్పుడూ నేరుగా విమర్శలు చేయకపోవడం మోడీ మరో ప్రత్యేకత. ముఖ్యంగా చౌకబారు విమర్శలకు ఆయన దూరమని చెప్పవచ్చు. ఆయన ప్రసంగాలు ఎప్పుడూ హుందాగా ఉంటాయి. చూడగానే ఎవ్వరైనా గుర్తుంచుకునే విధంగా ఆహార్యాన్ని కలిగి ఉండడం మోడీ ప్రత్యేకత. డ్రెస్సింగ్, హావభావాలు, డిగ్నిటీ ఇవన్నీ ఆయన్ను విశిష్ట వ్యక్తిగా నిలిపాయి. ముఖ్యంగా ఖాదీ పాలిస్టర్ లాల్చీ, పైజామా ఆయనకు హుందాతనం తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు. ప్రత్యర్థులైనా సరే, వయసులో పెద్దవారైతే వారిని గౌరవించడం మోడీ ప్రత్యేకత. గత ఎన్నికల్లో ఆయన బద్ధశత్రువు, సీనియర్ లీడర్ కేశూభాయ్ పటేల్ సొంత పార్టీ పెట్టి ఓటమి పాలయ్యారు. గెల్చాక వెంటనే స్వయంగా పటేల్ ఇంటికి వెళ్లి.. పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకోవడం మోడీ పట్ల జనంలో సదభిప్రాయం పెరగడానికి ఉపకరించింది. అలాగే, ఇప్పుడు ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత.. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అగ్రనేత అద్వానీ ఇంటికి స్వయంగా వెళ్లిన మోడీ.. ఆయనకు పాదాభివందనం చేశారు. ఇలా తనకు ప్రత్యర్థులైనా, తనను వ్యతిరేకించిన వారైనా సరే.. వారి ఆశీర్వాదం తీసుకోవడం మోడీ ప్రత్యేకత. ఇది గుజరాతీల వ్యాపార దక్షత రహస్యమేమో! ఇక ప్రతి సందర్భంలో తల్లిని కలుసుకోవడం, ఆమెకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం కూడా మోడీకి ఉన్న మంచి అలవాటు. ఎకనమిక్ క్యాపిటల్ నిర్మాణం దేశ ఆర్థిక రాజధాని ముంబై తరహాలో ఓ నగరం నిర్మాణం చేపట్టిన మోడీ.. గుజరాత్‌లో వాణిజ్య రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసే పనిలో పడ్డారు. వ్యాపార, వాణిజ్య వర్గాలకు అన్ని విధాల ఉపయోగపడే విధంగా అహ్మదాబాద్ సమీపంలో.. అన్ని వసతులు, సౌకర్యాలతో అత్యాధునిక నగర నిర్మాణం చేపట్టారు. ఈ నగర నిర్మాణం పూర్తయితే, వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ అక్కడికి తరలి వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే, ఆ నగరం మరో ముంబై కావడమన్నది ఖాయం. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నది మోడీ నమ్మకం. ఇలా అన్ని వర్గాల వారి అభివృద్ధి, సంక్షేమం కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న మోడీ.. ఇప్పుడు జాతీయ నేతగా ఎదుగుతున్నారు. అందుకే బిజెపి నుంచి ప్రధాని అభ్యర్థి అయ్యారు. మన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఢిల్లీలోని కాంగ్రెస్ దర్బారును ఢీకొన్నట్టు, గుజరాత్‌లో మోడీ కూడా గుజరాతీల ఆత్మగౌరవాన్ని తెర మీదికి తెచ్చారు. గుజరాత్‌లో కాంగ్రెస్ అనే జాతీయ పార్టీని దాదాపు నామ రూపాల్లేకుండా చేశారు. ఇపుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపించేందుకు మోడీ సిద్ధమవుతున్నారు. బిజెపిలోని అవలక్షణాలు పూర్తిగా ఆకళింపు చేసుకున్న మోడీ తన ఈ తాజా భగీరథ యత్నంలో పూర్తిగా బిజెపి స్కంధావారాలపైనే ఆధారపడకుండా తన సొంత ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఓ విభిన్నమైన, విశిష్టమైన ఈ ఒకే ఒక్కడు ఏం చేయబోతున్నాడో, అతడివల్ల ఈ దేశానికి ఏమి రాసి పెట్టి ఉందో, అతడి నుదుటన ఆ బ్రహ్మ ఏమి రాశాడో మరో 8-9 నెలలు ఆగితేగాని తెలియదు. శుభం భూయాత్ ఇండియా! *

No comments:

Post a Comment