Sunday 15 September 2013

దండోపాయానికి దాసోహం !

దండోపాయానికి దాసోహం !

September 16, 2013


హైదరాబాద్ సంస్థానం అంతటా రజాకార్లు ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారు. వారి వేధింపులకు ప్రజలు గ్రామాలు వదిలి వలస వెళ్లారు. సుమారు 60 వేల మంది హిందువులు నిజాం సంస్థానం నుంచి వలస బాట పట్టారని అంచనా. అదే సమయంలో, దేశ విభజన అల్లర్లలో శరణార్థులైన ముస్లింలను హైదరాబాద్ సంస్థానానికి వచ్చి స్థిరపడాల్సిందిగా రజాకార్లు వారిని ప్రోత్సహించడం ప్రారంభించారు. పరిస్థితి చేయి దాటుతోందని గ్ర హించిన భారత ప్రభుత్వం యుద్ధభేరి మోగించింది. అప్పట్లో నిజాం సైనికుల సంఖ్య సుమారు 32 వేలు. రజాకార్లను ఒక పారా మిలటరీ దళంగా నిర్మించారు. వీరి సంఖ్య సుమారు 44 వేలు. మరో లక్షన్నరమంది సాయుధ రజాకార్లు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. వీరే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి వలస వచ్చిన ముస్లిం కాందిశీకులతో మరో దళం ఏర్పాటైంది. వీరిని ఎదుర్కొనేందుకు భారత సైన్యం పకడ్బందీ వ్యూహం రూపొందించింది.


ఆపరేషన్‌పోలో!... నిజాంను అధికారం నుంచి దించడానికి హైదరాబాద్ సంస్థానంలో నిర్వహించిన సైనిక చర్యకు 'ఆపరేషన్ పోలో' అని పేరు పెట్టారు. సైనిక చర్యను అడ్డుకునేందుకు లార్డ్ మౌంట్ బాటన్ వంటి వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నిజాం వైఖరి కారణంగా వారి ప్రయత్నాలు ఫలించలేదు. అపారమైన భారత సైన్యం ముందు, ఆయుధ సంపత్తి ముందు తన సైన్యం నిలబడలేదని నిజాంకు తెలుసు. కానీ, ఖాసిం రజ్వీ మాటలు, రాజ్యకాంక్ష ఆయనను వాస్తవాల్ని విస్మరించేలా చేశాయి. ఇక, ఆపరేషన్ పోలో వ్యూహం ప్రకారం సంస్థానంపై రెండు మార్గాల్లో దాడి చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌కు పశ్చిమ భాగంలో సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్ నుంచి కొన్ని దళాలు దాడికి దిగుతాయి. మరికొన్ని హైదరాబాద్‌కు తూర్పు భాగంలోని విజయవాడ నుంచి దాడి చేస్తాయి. విజయవాడ నుంచి వచ్చే దళాలకు తోడుగా ఉత్తర, దక్షిణాల నుంచి కూడా దళాలను రంగంలోకి దింపాలని నిర్ణయించారు.

అవసరమైనచోటవైమానిక సాయం అందించాలని, విమానాల నుంచి బాంబు దాడులు చేయాలని నిర్ణయించారు. ఈ సైనిక చర్యకు మేజర్ జనరల్ జేఎన్ చౌధురి నాయకత్వం వహించారు. భారత సైన్యం సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్థానంపై యుద్ధం మొదలుపెట్టింది. హైదరాబాద్ సంస్థానం సేనలకు ఎల్.ఇద్రూస్ నాయకత్వం వహించాడు. సెప్టెంబర్ 13: షోలాపూర్ నుంచి భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంలోకి అడుగుపెట్టింది. ఆ మార్గంలో సైన్యానికి మొదటి అడ్డంకి సరిహద్దు లోపల 19 కిలోమీటర్ల దూరంలోని నల్‌దుర్గ్. ఇక్కడి బోరీ నదిమీద ఉన్న ఇరుకు వంతెనను నిజాం సైన్యం పేల్చివేస్తే భారత సైన్యం ముందుకు సాగేందుకు తంటాలు పడా ల్సి ఉండేది. కానీ, అది నిక్షేపంగా ఉంది. భారత సైన్యం ఉత్సాహంతో ముందుకు సాగింది. కేవలం రెండే రెండు బుల్లెట్లు ఖర్చుచేసి కీలకమైన నల్‌దుర్గ్ పట్టణాన్ని, కోటను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత కీలక పట్టణం తల్ముడి. అక్కడికి వెళ్లాలంటే ఇరుకు లోయ గుండా 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఆ సమయంలో ఆకస్మిక దాడులు జరిగే ప్రమాదం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా వైమానికి దాడి చేసింది. ఆశ్చర్యంగా తల్ముడి పట్టణం ఖాళీగా భారత సైన్యానికి స్వాగతం పలికింది.

అక్కడికి సమీపంలోని తుల్జాపూర్‌లో భారత సైన్యాన్ని 200 మంది రజాకార్లు అడ్డుకున్నారు. 2 గంటల పోరాటం తర్వాత లొంగిపోయారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో రజాకార్లు మరణించారు. మరోవైపు హోస్‌పేట నుంచి బయలుదేరిన భారత సైన్యం హైదరాబాద్ సైన్యం నుంచి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. సెప్టెంబర్ 14: ఉమర్గ్ నుంచి 48 కిలోమీటర్ల దూరంలోని రాజసూర్‌కు సైన్యం కదిలింది.

దారి పొడవునా నిజాం సేనలు భారత సైన్యాన్ని అడ్డగించాయి. కాలం చెల్లిన యుద్ధ విధానాలు, ఆయుధాలతో రజాకార్లు, నిజాం సైన్యం భారత సైన్యం ఎదుట నిలవలేకపోయారు. మధ్యాహ్నానికే రాజసూర్ పట్టణాన్ని సైన్యం స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఉస్మానాబాద్ వద్ద రజాకార్లు భారత సైన్యంతో తలపడ్డారు. ఇరు వర్గాల మధ్య భారీ పోరాటం జరిగింది. వందలాదిమంది రజాకార్లు మరణించారు. ఇదే సమయంలో మేజర్ జనరల్ బ్రార్ ఔరంగాబాద్‌ను ముట్టడించాడు. ఆరు దళాల సైన్యంతో వచ్చిన బ్రార్‌కు ఔరంగాబాద్ దాసోహం అంది. జల్నా పట్టణం వద్ద కూడా యుద్ధ శకటాలతో వస్తున్న భారత సైన్యాన్ని నిలువరించేందుకు నిజాం సేనలు విఫల యత్నం చేశాయి.


సెప్టెంబర్ 15: జల్నా నుంచి ఉదయాన్నే బయలుదేరిన సైన్యం లాతూర్‌కు చేరుకుంది. అక్కడ నుంచి మొమినాబాద్‌కు చేరుకుంటుండగా గోల్కొండ లాన్సర్ల నుంచి ప్రతిఘటన ఎదురైంది. భారత సైన్యం నిజాం సేనలను చిత్తుగా ఓడించింది. మరోవైపు తూర్పు దిశలో ఎటువంటి ప్రతిఘటన లేకపోవడంతో భారత సైన్యం సూర్యాపేట చేరుకుంది. మేజర్ ధనరాజులు నాయుడు ఆధ్వర్యంలో సైన్యం ముందుకు సాగుతుండగా 20 ఏళ్లలోపు యువకులు నినాదాలు చేసుకుంటూ సాయుధ శకటాలపై దాడికి సాహసించారు. వారికి నచ్చచెప్పాలని చూశాడు మేజర్ నాయుడు. ఫలితం లేకపోయింది. శతఘ్ని పేలింది. కొందరు నేలకూలారు. మిగిలిన వారు పలాయనం చిత్తగించారు. ఆ తర్వాత భారత సైన్యం ముందుకు సాగకుండా మూసీ నదిపై ఉన్న వంతెనను నిజాం సైన్యం పేల్చివేసింది. దానిని మరమ్మతు చేసుకుని ముందుకు వచ్చిన భారత సైన్యం చేతిలో నార్కట్‌పల్లి వద్ద నిజాం సేనలు చావుదెబ్బ తిన్నాయి.


సెప్టెంబర్ 16: లెఫ్టినెంట్ కల్నల్ రాంసింగ్ ఆధ్వర్యంలో భారత సైన్యం ఉదయాన్నే జహీరాబాద్ చేరాయి. అడుగడుగునా మందు పాతరలను నిర్వీర్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్న సైన్యంపై రజాకార్లు మాటువేసి కాల్పులు జరిపారు. సైన్యంలో కొంతమందిని అక్కడ ఉంచి, మిగిలిన వారు మధ్యలో కొన్నిచోట్ల ప్రతిఘటన ఎదురైనా జహీరాబాద్ దాటి 15 కిలోమీటర్ల దూరం ముందుకు సాగారు. ఆ మార్గంలో రజాకార్లు దొంగదెబ్బ తీసే ప్రయత్నాలు చేసినా భారత సైన్యాలు అధునాతన 75 ఎంఎం తుపాకులతో వారి ఆట కట్టించాయి.


సెప్టెంబర్ 17: ఉదయం 5 గంటల ప్రాంతంలో భారత సైన్యం బీదర్‌ను స్వాధీనం చేసుకుంది. మరోవైపు హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని చిట్యాల కూడా స్వాధీనమైంది. డకోటా విమానంలో దిగిన సైనికాధికారి జనరల్ చౌధురికి రెపరెపలాడుతున్న భారత పతాకాలు స్వాగతం పలికాయి. ప్రజలు గుంపులు గుంపులుగా చేరి ఆయనను పలకరించారు. ఇలా యుద్ధం ప్రారంభమైన ఐదో రోజు ఉదయానికే రజాకార్లు, నిజాం సేనలు తోకముడిచాయి. ఆరోజు సాయంత్రం 5 గంటలకు నిజాం తన ఓటమిని అంగీకరించాడు. భారత సేనలు విజయ ధ్వానాల మధ్య హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకున్నాయి. దశాబ్దాల నిజాం పాలనకు, రజాకార్ల దుర్మార్గాలకు తెరపడింది. లక్షలాదిమంది హైదరాబాద్ సంస్థానం ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. - స్పెషల్ డెస్క్

No comments:

Post a Comment