Monday 30 September 2013

సంపూర్ణ తెలంగాణ..సాధిస్తాం!

సంపూర్ణ తెలంగాణ!

September 30, 2013

హైదరాబాద్, సెప్టెంబర్ 29 : 'అప్రమత్తంగా ఉందాం! సంపూర్ణ తెలంగాణ సాధించుకుందాం!' అని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. కిరి కిరి పెడితే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. యూపీఏ గోల్‌మాల్ చేసినా... బీజేపీ, ఇతర పార్టీల రూపంలో జాతీయ స్థాయిలో మరో ప్రత్యామ్నాయం ఉందని తెలిపారు. తెలంగాణతో పెట్టుకుంటే అంతే సంగతులని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని హెచ్చరించారు. అక్టోబర్ ఆరో తేదీలోపే కిరణ్‌ను పదవి నుంచి తీసేస్తారని, ఆయన ప్లగ్ పీకేస్తారని జోస్యం చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ మైదానంలో జరిగిన 'తెలంగాణ సకల జనుల భేరీ' సభలో కేసీఆర్ ప్రసంగించారు. వివిధ అంశాలపై కేసీఆర్ స్పందన ఆయన మాటల్లోనే...


తెలంగాణ సకల జన భేరీ సభను చూడొద్దని...చాలా జిల్లాల్లో కరెంటు తీసేశారట! అందుకే... సీఎం కిరణ్‌కి కిరికిరి రెడ్డి అని పేరు పెట్టింది. కేసీఆర్, కోదండరాం ప్రసంగాలు విన్నంత మాత్రాన ఏమవుతుంది? తెలంగాణ ఇప్పుడు లేచి కూర్చుంది. కిరణ్‌కు చెబుతున్నా...తెలంగాణతో గో క్కున్నోడు ఎవడూ ముందుకు పోలేదు. 2004కు ముందు పచ్చ పార్టీ వా డు చంద్రబాబు... టీఆర్ఎస్ ఆరు నెలల్లో మాయమైపోతుందన్నాడు. తెలంగాణ ఒక్క తొక్కుతొక్కితే ఆయన మళ్లీ లేచే పరిస్థితి లేదు. 'తెలంగాణకు అడ్డం కాదు, నిలువూ కాద'న్న వైఎస్ పావురాల గుట్టలో పావురమైపోయిండు. కిరణ్... నీకు ఏపోగాలమొచ్చిందో కానీ తెలంగాణతో గోక్కుంటున్నావు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం...అక్టోబర్ 6వ తేదీ తర్వాత దినేశ్ రెడ్డిలాగే... కిరణ్ ప్లగ్ పీకేస్తారు.


ముఖ్యమంత్రి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ఒక్కమాటైనా నిజం ఉండాలి కదా? ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంత విజ్ఞతతో ఆలోచించాలి? ముఖ్యమంత్రి స్థాయికి ఈ యవ్వారం పనికొస్తుందా? ఏమాత్రం తెలివి ఉన్నా... ఇరుప్రాంతాల వారిని కూర్చోబెట్టి, మాట్లాడి, రాష్ట్ర విభజన చేయించాలి. తెలివి లేకపోతే... రాజీనామాచేసి తప్పుకోవాలి. ఇప్పుడు తెలంగాణను ఎవరూ ఆపలేరు. తెలంగాణ విషయంలో ఏనుగు వెళ్లింది, ఒక తోక మాత్రం మిగిలింది. తెలంగాణ వస్తే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్ఎల్‌బీసీ కట్టేస్తారు, మనకు నీళ్లు రావని సమైక్య ఉద్యమంలో చెబుతున్నారు. అంటే, దీనికి అర్థం ఏమిటి? కేటాయించిన నీళ్లు 90 టీఎంసీలు అయితే, 335 టీఎంసీలు వాడుతున్నట్లు ముఖ్యమంత్రే చెప్పారు. దీనికి ఏమిటి అర్థం? వెలుగోడు, వెలుగొండ, గాలేరు నగరి, హంద్రీ నీవాలకు ఒక్క టీఎంసీ కేటాయింపు ఉందా? శ్రీశైలానికి బొక్కపెట్టి అక్రమంగా తీసుకుపోవడం లేదా? మీకు మాత్రం నీళ్లు
 మహబూబ్‌నగర్, నల్లగొండకు కష్టాలా? "పోలవరం, దుమ్ముగూడెం కలుపుతారట! తెలంగాణకు గుండు కొడతారట! ఇక్కడున్న నాయకులకు కుక్కలకు బొక్కలేసినట్లుగా మంత్రిపదవులిస్తాం' ఇదే ముఖ్యమంత్రి చెప్పే సిద్ధాంతం! సీఎంగా ఉన్న వ్యక్తి ఒక ప్రాంత కష్టం గురించి మాట్లాడతారా? తెలంగాణ ప్రజలు ప్రజలుకారా? వారికి ఆశలు, కోరికలు, భావోద్వేగాలు లేవా? ముఖ్యమంత్రివి మానవత్వం ఉన్న మాటలేనా? ఆంధ్రా జేఏసీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డే. కృత్రిమ ఉద్యమాన్ని వంద శాతం ఆయనే నడుపుతున్నాడు. ఇజ్జత్ మానం ఉంటే... దుష్టబుద్ధి మార్చుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలి. ఆ తెలివి, సంస్కారం సీఎంకు ఉందో లేదో! నీళ్లు, నిధులు, ఉద్యోగాల దోపిడీ కొనసాగేందుకే సమైక్య రాష్ట్రాన్ని పాలిస్తున్నట్లుంది. ఆరు నూరైనా దోపిడీ కొనసాగనివ్వం.


సీమాంధ్రలో గాయి గాయి చేయగానే కేంద్రం ఆందోళన పడొద్దు. ప్యాకేజీ ఇవ్వాల్సింది ఆంధ్రకు కాదు. రాష్ట్రం విడిపోయినప్పుడు నష్టపరిహారం, ప్యాకేజీ ఇవ్వాల్సింది ఎవరికి? దొబ్బితిన్నోళ్లకా? నష్టపోయిన వాళ్లకా? తెలంగాణ వాళ్లకే ప్యాకేజీ ఇవ్వాలి. సమైక్య రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా ఒక్కటే 45 వేల కోట్లు నష్టపోయింది. ఫ్లోరైడ్‌తో నల్లగొండ జిల్లా నడుం వంగిపోయింది. చందమామల్లాంటి లక్షన్నర మంది పిల్లలు సర్వనాశనమైపోయారు. ఆదిలాబాద్‌లో అంటురోగాలతో ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ ఇచ్చేటప్పుడు కేంద్రం జాగ్రత్తగా వ్యవహరించాలి. పాలమూరు ఎత్తిపోతలు, ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి. మనకు ఐఐటీ వచ్చింది, ఐఐఎం కూడా కావాలి. ఎయిమ్స్ పూర్తి చేయాలి. కొత్త రైల్వే లైన్లు వేయాలి. తెలంగాణ ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయాలి. సంపూర్ణ తెలంగాణ సాధించేదాకా ఉద్యమం కొనసాగించాలి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యమం ముగిసినట్లు కాదు. తెలంగాణలో 85 శాతం బలహీనవర్గాల వారున్నారు.

వాళ్ల కళ్లలో మెరుపులు, సంతోషం, చిరునవ్వులు చూడాలి. ఆంధ్రాలో ఉన్న దళిత, బహుజన సంఘాలు తెలంగాణ కావాలని మద్దతు ఇస్తున్నారు. కానీ... ఆంధ్రా డబ్బాలు (టీవీ చానళ్లు) వారి గురించి చూపించవు. ఈ మధ్య ఫేస్‌బుక్ చూస్తున్నాను. సోషల్ మీడియా మిత్రులు చూపిస్తున్న స్ఫూర్తి కొనసాగాలి.మేధావి అనేవాడున్నాడా? మన కోదండరాం అమాయకుడు, మంచోడు. ఆయనలాగా అందరూ ధర్మం పాటిస్తారా? ఆంధ్రలో మేధావి అనేవాడు ఉన్నాడా? అక్కడ విజ్ఞానం ఉన్నవాడు ఎవరైనా ఉన్నారా? రెండు ప్రాంతాల మధ్య మానసికంగా ఎప్పుడో విభజన వచ్చేసింది. ఇంత జరిగిన తర్వాత కూడా రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని మెడకాయమీద తలకాయ ఉన్న బేవకూఫ్ ఎవరైనా కోరుకుంటారా? అది సాధ్యమవుతుందా?


2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడు ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చారు. ఇప్పుడు... సీడబ్ల్యూసీ తెలంగాణ ఇచ్చేస్తామనగానే మళ్లీ రంగులు మార్చారు. లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులే. ఆంధ్రోడు ఆంధ్రోడే! టీడీపీ, కాంగ్రెస్, జగన్ పార్టీ... ఏదైనా అంతే! ఆంధ్రలో పుట్టిన వాళ్లంతా తెలంగాణ ద్రోహులే. దోచుకోవాలని చూసినోళ్లే. కానీ తెలంగాణకు, ప్రజలకు భగవంతుడి ఆశీర్వాదం ఉంది. ఆంధ్రావాళ్లతో ఏమీ కాదు. లక్షమంది చంద్రబాబులు, లక్ష మంది జగన్‌లు, లక్ష మంది కిరణ్‌లు వచ్చినా తెలంగాణ వెంట్రుక కూడా పీకలేరు.


గడ్డి తినడం, కోడీకలు పీకడం, బట్టలు విప్పి ఆకులు కట్టుకోవడం, సమాధుల మీద పడటం, పార్లమెంటులో కొరడాతో కొట్టుకోవడం... ఇదేం దిక్కుమాలిన ఉద్యమం? తెలంగాణ ఉద్యమం తొలికోడి కూత, మోత లాంటిది. కానీ, ఆంధ్రా ఉద్యమం అలారం కుయ్ కుయ్‌లాంటిది. అది కీ ఇస్తేనే నడుస్తుంది. ఉద్యమం చేసే బిడ్డలు సింహాల్లా ఉంటారు. మన విద్యార్థులు సింహాలే! సింహం సింగిల్‌గా పోతుంది. అందుకే ఆంధ్రోళ్ల మీటింగ్ అని తెలిసి కూడా బాల్‌రాజ్ ఒక్కడే పోయాడు. పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఒక్కడే జై తెలంగాణ నినాదాలు చేశాడు. అశోక్‌బాబును అడుగుతున్నాను! నువ్వూ ప్రభుత్వ ఉద్యోగివే, కానిస్టేబుల్ కూడా ప్రభుత్వ ఉద్యోగే. నువ్వు జై సమైక్యాంధ్ర అంటున్నావు. ఆయన జై తెలంగాణ అన్నాడు. మరి పోలీసును ఎందుకు కొట్టారు? మరి హైదరాబాద్‌లో ఉండి జై సమైక్యాంధ్ర అంటున్న సీఎంని ఎలా కొట్టాలి?


తెలంగాణ ప్రజలు గొప్పవాళ్లు. విభజన తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి అందరూ ఒప్పుకొన్నాం. పీడ, దోపిడీ నుంచి శాశ్వతంగా విముక్తం కావాలంటే... మనం కొంచెం వెసులుబాటు కల్పించేలా ఉండాలి. అందుకే, ఉమ్మడి రాజధానికి ఒప్పుకున్నాం.
భయంలేదు... ప్రత్యామ్నాయం ఉంది
తెలంగాణపై అప్పటి నుంచి ఇప్పటిదాకా మాటమీద నిలబడి ఉన్న పార్టీ బీజేపీ. అందుకే... సుష్మాస్వరాజ్‌కు ధన్యవాదాలు చెబుతున్నాం. యూపీఏ గోల్‌మాల్ చేసినా మనకు భయం లేదు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం ఉంది.


2001లో నేను ఒకే ఒక్క మనిషిని. ముందున్నది కారుచీకటి. లాంతరు పట్టుకుని ధైర్యంచేసి అడుగేశాను. బక్కగా ఉన్నాడు ఏం చేస్తాడులే అనుకున్నారు. దుష్ప్రచారాలు చేశారు. దాడులు జరిపారు. కానీ...13 ఏళ్ల ప్రస్థానంలో అవన్నీ కారుమబ్బుల్లా కరిగిపోయాయి. జయశంకర్ సార్ ఆశీస్సులతో కోదండరాం ఆధ్వర్యంలో విద్యావంతుల వేదిక ఏర్పాటైంది. తెలంగాణ ఎంత నష్టపోతోందో, ఎంత దోపిడీకి గురి అవుతోందో తెలిపారు. 2001లో అందెశ్రీ, నేను ఇంట్లో అన్నం తింటూ మాట్లాడుకున్నాం. పాశుపతాస్త్రంలాంటి పాటలు రాశాను, ఇంకా రాస్తాను.. ముందుకు వెళ్లమని ఆయన చెప్పారు. గోరటి వెంకన్న, రసమయి, దేశపతి శ్రీనివాస్, గూడ అంజన్న, సిధారెడ్డి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. వాళ్లందరికీ వందనాలు.


ఏం టర్న్ తీసుకున్నావురా బాబూ అంటే పీ-టర్న్ అని చంద్రబాబు అంటున్నాడు. నీ బతుక్కి ఎన్ని టర్న్‌లు? మా బిడ్డలు వెయ్యిమంది ఆత్మహత్య చేసుకున్నప్పుడు, తల్లులు గర్భశోకంతో రోదించినప్పుడు తెలంగాణ ప్రజలు ప్రజల్లా కనిపించలేదా? జగన్ పార్టీ... సమన్యాయం అంటోంది. అసలు న్యాయమే లేనప్పుడు సమన్యాయం ఎక్కడిది? మీ డిమాండ్‌లోనే న్యాయం లేదు. అర్థం లేదు.
సంపూర్ణ తెలంగాణ..సాధిస్తాం!

September 30, 2013

నిజాం మైదానం నిజంగా జనసాగరమైంది.జనప్రవాహం పొంగిపొరలి  రాజధాని రహదారులపై ప్రవహించింది. తెలంగాణపై సీడబ్ల్యూసీ ప్రకటన వచ్చి 60 రోజులైనా మరో అడుగు ముందుకు పడని తరుణంలో ఆదివారం నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన 'తెలంగాణ సకల జన భేరి' సదస్సు భారీ స్థాయిలో విజయవంతమైంది. తెలంగాణ జేఏసీ సవాలుగా, ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సభలో ప్రసంగించిన ప్రతి ఒక్కరి మాటల్లో 'హైదరాబాద్ సిర్ఫ్ హమారా' అనే నినాదం ఏదో ఒక రూపంలో ప్రతిధ్వనించింది. 'హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ' సాధనే లక్ష్యమని వక్తలు తేల్చిచెప్పారు. హైదరాబాద్‌పై కిరికిరి పెడితే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని కేసీఆర్ ప్రకటించారు.
సంపూర్ణ తెలంగాణ సాధించేదాకా అప్రమత్తంగా ఉండాలని ఉద్యమకారులకు సూచించారు. యూపీఏ గోల్‌మాల్ చేసినా భయపడాల్సిన అవసరంలేదని... ఎన్డీయే రూపంలో ప్రత్యామ్నాయం ఉందని కేసీఆర్ పేర్కొనడం, బీజేపీని ప్రశంసించడం గమనార్హం. లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులే... సీమాంధ్రలో పుట్టిన వారంతా తెలంగాణ ద్రోహులే అని కేసీఆర్ తేల్చి చెప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే... సీమాం«ద్రులకు నాలుగైదు బంగ్లాలు ఇస్తామని కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి రాజధానిలో సీమాంద్రులకు హక్కులు ఉండవని... బిల్డింగులు, బల్లలు, పరదాలు, చీపుర్లు మాత్రమే ఇస్తామని టీఆర్ఎస్ నేత కె.కేశవరావు పేర్కొన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలు కేంద్రీకృతమైన ఖైరతాబాద్, నాంపల్లి ప్రాంతాలు మాత్రమే ఉమ్మడి రాజధానిలో భాగమై ఉంటాయని మరికొందరు తెలిపారు. హైదరాబాద్‌సహా తెలంగాణ అభివృద్ధిలో సీమాంధ్రుల ప్రమేయం లేదని చెప్పటానికి వక్తలు ప్రయత్నించారు. సీమాంధ్రలో జరుగుతున్నది ఉద్యమమే కాదని తేల్చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ వైఖరిని దాదాపు అందరూ దునుమాడారు. సభ జరుగుతున్న సమయంలోనే... డీజీపీ దినేశ్ రెడ్డి పదవీకాలం ముగిసినట్లు స్పష్టం కావడంతో... 'దినేశ్ రెడ్డి పీడ విరగడైంది' అని కోదండరాం పదేపదే చెప్పారు.

No comments:

Post a Comment