Friday 20 September 2013

స్వార్థ ఫలితమే ఈ ప్రారబ్ధం - జయప్రకాష్ నారాయణ్

స్వార్థ ఫలితమే ఈ ప్రారబ్ధం - డాక్టర్ జయప్రకాష్ నారాయణ్

September 21, 2013


ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమాల నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభంతో అన్ని ప్రాంతాల్లోని ప్రజలు పార్టీలు, రాజకీయం మీద విశ్వాసం కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆందోళనతో కోస్తాంధ్రలోని 9 జిల్లాల్లో రాయలసీమలోని 4 జిల్లాల్లో ఉవ్వెత్తున ఉద్యమం ఎగసింది. మనందరి హక్కుల పరిరక్షణ కోసం ప్రజలలో -తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో వచ్చిన చైతన్యాన్ని, రాజకీయాసక్తిని అవకాశంగా తీసుకుని అందరి ప్రయోజనాలనూ కాపాడటానికి అందుకు తగిన వ్యవస్థీకృత ఏర్పాట్లు చేయటానికి ప్రయత్నం చేయాలన్నది లోక్‌సత్తా సంకల్పం.

రాష్ట్రంలో ఈ వేళ నెలకొన్న సంక్షోభానికి సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఆడిన వికృత రాజకీయ క్రీడే ప్రధాన కారణం. అందులో మొట్ట మొదటి బాధ్యత రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీది. ప్రజల్ని మభ్యపెట్టి తాత్కాలిక రాజకీయ లబ్ధిని, సామాన్య ప్రజల నుంచి ఓట్లను గుంజుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. 2000 సంవత్సరంలో రాష్ట్రంలో ఆనాటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఉన్న వై.ఎస్. రాజశేఖరరెడ్డి తెలంగాణ ప్రజాప్రతినిధులు వద్దంటున్నా వినకుండా ప్రత్యేక తెలంగాణ ప్రతిపాదనను లేవనెత్తారు. కేవలం ఎన్నికలలో లబ్ధి పొందేందుకే ఆ అంశాన్ని వాడుకున్నారు. మన ఎన్నికల వ్యవస్థలో 5-10 అదనపు ఓట్లు, సీట్లు వచ్చినా అధికారంలోకి రావచ్చు కాబట్టి, ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌తో అధికార తెలుగుదేశాన్ని దెబ్బకొట్టాలన్నది కాంగ్రెస్ వ్యూహం. అదే దృష్టితో 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)తో పొత్తుపెట్టుకున్నారు. ఆనాటి కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు కేవలం కాంగ్రెస్ అధికారంలో రావటమే లక్ష్యంగా వ్యవహరించారు తప్ప ఈ అవకాశవాద రాజకీయం పర్యవసానాల గురించి ఆలోచించలేదు. తెలంగాణ అంశాన్ని లేవనెత్తటం, టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవటం గురించి ఎవరూ ప్రశ్నించలేదు.

2009లో తెలుగుదేశం పార్టీ కూడా అదే రీతిలో తిరిగి అధికారంలోకి రావటం కోసం తెలంగాణ అంశాన్ని ఉపయోగించుకుని టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంది. అప్పుడు కూడా తెలుగు తమ్ముళ్లు ఎవరూ దీని పర్యవసానాల గురించి మాట్లాడలేదు. మనోడు సీఎం అవుతాడు, మనం అధికారంలోకి వస్తే చాలు, ఇదో రాజకీయ ఎత్తుగడ అన్నట్టే వ్వవహరించారు. అధికారంలోకి రావటానికి దగా రాజకీయం చేస్తూ ప్రజలను ఓటు వేసే యంత్రాలుగా భావిస్తూ ఆ పూటకి పబ్బం గడుపుకుని ఓట్లు గుంజుకున్నారు తప్ప, తెలుగు ప్రజల ప్రయోజనాల గురించి ఏ మాత్రం ఆలోచించలేదు.
ఇప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీకూడా 2014 ఎన్నికలలో రాయలసీమ, కోస్తాంధ్రలో ఓట్లు, సీట్లు వచ్చే అవకాశం కనిపించటం లేదు కాబట్టి కనీసం తెలంగాణలోనైనా కాసిని ఓట్లు, సీట్లు దండుకుందామని రాష్ట్ర విభజన ప్రకటన చేసింది తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ ఉండి కాదు. విభజన ప్రకటన చేసినప్పుడు అన్ని ప్రాంతాల ప్రయోజనాలనూ పరిరక్షించేలా ఉండాలన్న కనీస పరిజ్ఞానాన్ని కూడా ప్రదర్శించక పోవటం వికృత రాజకీయక్రీడలో భాగమే. సీమ, కోస్తాలో ఓట్లు రాలనప్పుడు వారిని కొట్టినట్టు విభజన చేస్తే ఇవతల తెలంగాణలో ప్రజలు తమకేదో కాంగ్రెస్ ఒరగ బెట్టిందనే భ్రమలోకి వెళ్లి ఓట్లు వేసేస్తారని ఆ పార్టీ ఆశ.అందుకే అసెంబ్లీలో చర్చించాల్సిన, తేల్చాల్సిన పన్లేదు; అంతా మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అని అహంకారపూరితంగా నియంతృత్వ «ధోరణితో మాట్లాడుతున్నారు. ఈ పాపంలో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన పాత్ర . మిగిలిన ప్రధాన పార్టీలు కూడా ఓట్లు, సీట్లు కోసం అదే వికృత రాజకీయాన్ని అనుసరించాయి.

అసెంబ్లీలో తెలంగాణ అంశాన్ని చర్చించి ఇక్కడే మన సమస్యకు పరిష్కారం తేల్చుకుందాం అని లోక్‌సత్తా ప్రతినిధిగా రాష్ట్ర శాసనసభలో గత నాలుగేళ్లుగా పదే పదే అన్ని పార్టీలనూ కోరాను. 'గదిలో ఏనుగు ఉంది, ఏమీలేనట్టు నటించొద్దు, దాచిపెట్టొద్దు. చర్చిద్దాం. ఎక్కడ లోపముంది? ఎక్కడ పొరపాటు జరిగింది? అన్యాయం ఎక్కడ ఎవరికి జరిగింది? పరిష్కారాలేమిటి? అని లోతుగా అసెంబ్లీలో చర్చిద్దాం. విభజన చేయడం అనివార్యమైతే సమైక్యతను కోరుకునే వారిని సంతృప్తి పరచటానికి ఏమేం చర్యలు చేపట్టాలి? ఒక వేళ సమైక్యమే కొనసాగించాలనుకుంటే, విభజన కోరుకుంటున్నవారి ఆందోళనలను తొలగించటానికి ఎలాంటి ఏర్పాట్లు కావాలి? ఈ అంశాల్ని అసెంబ్లీలోనే తేల్చుకుందాం.

తెలుగు ప్రజల సర్వోన్నత సభ అసెంబ్లీలో చర్చించకుండా తెలుగువారి భవిష్యత్తును సామంతరాజుల్లా ఢిల్లీలో తాకట్టు పెట్టొద్దు' అని అసెంబ్లీలో, బైట కూడా మొత్తుకున్నా. ఈ మాట ఒక్క లోక్‌సత్తా తప్ప ఏ పార్టీ చెప్పలేదు. అయితే గత నాలుగేళ్లుగా స్పీకర్‌గా, ముఖ్యమంత్రిగా ఏదో ఒక రూపంలో ఈ అసెంబ్లీలోనే ఉన్న ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి గానీ ముఖ్యమంత్రులుగా చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, కె.రోశయ్య గానీ పట్టించుకోలేదు. ప్రజల మధ్య వైషమ్యాలను పెంచకుండా నిజాయితీగా అసెంబ్లీలో సమగ్ర చర్చ చేసి అందరికీ ఆమోదయోగ్య పరిష్కారాన్ని సాధించి ముందుకు వెళ్దామన్న లోక్‌సత్తా వాదనను ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టి రెండున్నరేళ్లు దాటిపోయింది. ఆ పార్టీకి సభ్యులు ఉన్నారు. వారు కూడా ఈ అంశం మీద చర్చ పెడదామన్న లోక్‌సత్తా మాట విన్పించుకోలేదు. ఫలితంగానే తెలుగు ప్రజలకు పెను సంక్షోభం ముంచుకొచ్చింది. ఈ వేళ తెలుగుప్రజలు ఎదుర్కొంటున్న సంక్షోభానికి కాంగ్రెస్, తెలుగుదేశం, వైకాపా కారణం కాదని ఎవరినైనా చెప్పమనండి! మన రాష్ట్రంలోని పార్టీల మూర్ఖత్వం, అవినీతి మోసపూరిత విధానాలలో అవి కూరుకుపోవటం, ప్రజలకు మేలు చేసే సంస్కారం, నాయకత్వం వాటి నేతలలో లోపించటం వల్లే రాష్ట్రంలో ఈ అసాధారణ సంక్షోభం తలెత్తింది. మన సమస్యను పరిష్కరించమని ఢిల్లీ ముందు మోకరిల్లాయీ పార్టీలు. మన తలకాయ వారి నోట్లో పెట్టాం.

ఢిల్లీలో వాళ్లు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారంటే, అందుకు మన పార్టీల దివాళాకోరుతనం, అసమర్థతే ప్రధాన కారణం. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కేంద్రం ఇంత బరి తెగించి వ్యవహరించగలదా? మన రాష్ట్రంలో చేసినట్టు తమిళనాడులో చేయమనండి చూద్దాం. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు, వారి అధికారం తప్ప, ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టడం, రెచ్చగొట్టడం, భావోద్రేకాల నుంచి ఓట్లు దండుకోవటం తప్ప ఏ మాత్రం తెలుగు ప్రజల ప్రయోజనాలు ఏమవుతాయి? అందరికీ న్యాయం చేయటం ఎలా? అని పొరపాటున కూడా ఈ పార్టీలు ఆలోచించలేదు. ఈ ఎడతెగని అనిశ్చితిని పరిష్కరించాలని అన్ని ప్రాంతాల ప్రజలూ కోరుతున్నారు. ఎందుకు 13 జిల్లాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు? అని మనం ఆలోచించాలి. వారి స్పందనలో నిజాయితీ ఉంది. దీన్ని గుర్తించాలి. అంశాల వారీగా అందుకు పరిష్కారాలను చూపాలి.

హైదరాబాద్ తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్‌కి గుండెకాయగా మారింది. గతంలో చేసిన తప్పిదాల వల్ల 40 శాతం ఆర్థిక వ్యవస్థ హైదరాబాద్‌లోనే కేంద్రీకృత మయింది. ఆంధ్రప్రదేశ్ జీ ఎస్ డీపీ రూ.7.5 లక్షల కోట్లు ఉంటే, 3 లక్షల కోట్లు హైదరాబాద్ నగరం నుంచే వస్తోంది. ఈ వేళ హెచ్చు జీతాలు పొందేవారిని లెక్కేస్తే , ఏటా రూ.1 కోటి జీతం పొందేవారు హైదరాబాద్‌లో కనీసం కొన్ని వందల మంది ఉంటే కోస్తా, సీమలో మచ్చుకైనా కనిపించరు. ఐటి ఉత్పత్తుల్లో 99 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, వైద్యసేవలు అన్నీ హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైనాయి. రాష్ట్రంలోని 20 పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో 18 హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ప్రైవేటురంగంలో 80 శాతం ఉపాధి అవకాశాలను హైదరాబాద్‌లోనే సృష్టించారు. రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర పన్ను వసూళ్లలో 80 శాతం హైదరాబాద్ నుంచే. అక్కడున్న ఆర్థిక వ్యవస్థకి, పన్నులకి సంబంధం ఉంది. దాంతో గ్రామ గ్రామానా హైదరాబాద్ ముఖం చూడని కుటుంబాలలో సహా తమ పిల్లల భవిష్యత్తుకు హైదరాబాద్ పైనే ఆశలు పెట్టుకున్నారు. డిగ్రీ కాగితం చేతికి వస్తే హైదరాబాద్‌కి వెళ్లి ఉద్యోగం తెచ్చుకోవచ్చన్న భావన కోస్తా, సీమ గ్రామీణ ప్రజలలో కూడా నరనరానా వ్యాపించి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోతే మా భవిష్యత్తు ఏమిటి? అనే భయం అక్కడ సర్వత్రా కనిపిస్తోంది. అదే ఆందోళనలకు పురిగొల్పాయి.

కోస్తా, సీమలోని విజయవాడ, కర్నూలు వంటివిపెరిగినా అవి పెద్ద ఆర్థిక కేంద్రాలుగా రూపుదిద్దుకోలేకపోయాయి. కరీంనగర్‌లోనో, వరంగల్‌లోనో కూడా కాకుండా అన్నీ హైదరాబాద్‌లోనే పెట్టారు. సుమారు 18 ఏళ్ళ క్రితం నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు పారిశ్రామికంగా అన్ని ప్రాంతాల అభివృద్ధికై కరీంనగర్‌లో, విశాఖపట్నంలో, కాకినాడలో, వాడపల్లిలో, కృష్ణపట్నంలో, రాయలసీమలో మరి కొన్ని ఇతర ప్రాంతాలలో పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు కృషి చేశాను. కానీ రాష్ట్రంలో కోట్ల మంది ప్రజలున్నారని, వారికో భవిష్యత్తు ఉందని ఏమాత్రం ఆలోచన లేకుండా అన్నిటినీ హైదరాబాద్‌లో కేంద్రీకరించేశారు. ఇదీ సంక్షోభానికి అసలు మూలం.

తెలంగాణ, సమైక్యాంధ్ర ప్రదేశ్ ఏకకాలంలో సాధ్యంకానట్టే, హైదరాబాద్‌ను యూటీ (కేంద్ర పాలిత ప్రాంతం) చేయటం, చేయకపోవటం కూడా ఏకకాలంలో సాధ్యం కాదు. దాని మీద చర్చ జరగాలి. హైదరాబాద్‌లో ఎక్కడున్నా కోస్తా, సీమ ప్రజలకు భద్రత, ఆర్థికాభివృద్ధి అవకాశాలు ఉండేందుకు నిర్దిష్ట రాజ్యాంగబద్ధ ఏర్పాట్లు చేయాలి. నిజానికి ఇది రాజ్యాంగ హక్కు కానీ రాజ్యాంగ హక్కులు పనిచేస్తాయన్న విశ్వాసాన్ని రాజకీయ పార్టీలే దెబ్బ తీశాయి. కాబట్టి ఇప్పుడు భరోసాకి అదనపు ఏర్పాట్లు కావాలసి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతలను గుర్తించాలి.

ఇక వనరుల పంపిణీని చూస్తే తెలంగాణలో కోస్తా, -సీమలో వచ్చే ఆదాయం కంటే ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఖర్చులే ఎక్కువ. ఒక్కో ప్రాంతం ఏటా రూ.7000 కోట్లకు పైగా లోటును భరించాల్సి ఉంటుంది. ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంలో ఏటా రూ.13,000 కోట్ల వరకూ మిగులు ఉంటుంది. హైదరాబాద్ డబ్బు లేకపోతే తెలంగాణ కోస్తా, సీమ మనుగడే కష్టమవుతుంది. కాబట్టి హైదరాబాద్ వనరుల పంపిణీలో ఏదో రకంగా రెండు ప్రాంతాలకు ఏర్పాటు ఉండాలి. నిర్దిష్ట కాలంపాటు కోస్తా, సీమకు వాటా ఉండాలి. ఉద్యోగులు ఎందుకు రోడ్ల మీదకు వచ్చారు? తమ జీతాలు, తమ పించన్‌ల పట్ల భయంతోనే. వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్ ఆదాయాన్ని పంపిణీ చేయాలి.

హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాలకొస్తే 6 సూత్రాల ప్రణాళిక కింద ఇప్పటికే రాష్ట్రం విభజనయి ఉంది కాబట్టి ప్రభుత్వోద్యోగాలలో సమస్య రాదు. అయితే ప్రభుత్వోద్యోగాలు ఉన్న కొద్దీ తగ్గిపోతాయి కాబట్టి ప్రైవేటురంగంలో వరకు వివక్ష లేకుండా తెలుగువారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించటానికి స్పష్టమైన ఏర్పాట్లు కావాలి. విద్యావకాశాలలో కూడా ఆరుసూత్రాల ప్రణాళిక వర్తిస్తుందిగానీ, కొన్ని కోర్సులు హైదరాబాద్‌లో మాత్రమే ఉన్నాయి. మిగిలిన ప్రాంతాలలో కూడా అవి ఏర్పాటయ్యేంతవరకు అందరికీ హైదరాబాద్‌లో అవకాశం కల్పించాలి.

హైదరాబాద్ జాతీయస్థాయి నగరం. దేశంలోని అన్ని ప్రాంతాల వారూ సామరస్యంగా జీవించే కాస్మోపాలిటన్ నగరంగా గుర్తింపు పొందింది. దాన్ని కాపాడుకోవాలి. కోస్తా, రాయలసీమ నుంచి వచ్చిన సుమారు 33 లక్షల మంది (40 శాతం) హైదరాబాద్‌లో ఉన్నారు. వీరిని రాజకీయంగా సంఘటితం చేయాలి. వీరు కాకుండా మరో 35 లక్షల మంది నిజాం కాలంలో, నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణం తర్వాత తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఉన్నారు. వీరందరూ, వీరితోపాటు కోస్తా, సీమ ప్రాంతాలలో ఉన్న డ్యాం నిర్మాణం తర్వాత తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఉన్నారు. వీరందరూ, వీరితోపాటు కోస్తా, సీమ ప్రాంతాలలో ఉన్న తెలంగాణ ప్రాంత వాసులూ ఏ రకమైన వివక్ష లేకుండా రాజకీయ ప్రాతినిధ్యం సహా అన్ని హక్కులనూ పొందేందుకు నిర్దిష్ట ఏర్పాట్లు చేయాలి.

సీమ ప్రాంతం సమస్య ప్రత్యేకమైనది. ఈ వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది రెండు ప్రాంతాల సమస్య కాదు. మూడు ప్రాంతాల సమస్య. దీనికి ఇప్పుడు శాశ్వత పరిష్కారం చూపకపోతే మున్ముందు మరో సంక్షోభం రగులుకుంటుంది. రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలు, ఆ జిల్లాల్లో వెనక బడినప్రాంతాలు ఉన్నాయి. కానీ సరైన వర్షపాతం, పారిశ్రామికాభివృద్ధి లేకపోవటం వల్ల ఒక ప్రాంతం మొత్తంగా సీమ వెనకబడివుంది. ఇప్పుడు మహానగరం అండ కూడా లేకపోతే మరింత తీవ్రంగా నష్టపోతుంది. సీమ ప్రాంతాన్ని అత్యంత వెనకబడిన ప్రాంతంగా గుర్తించి ఏర్పాట్లు చేయటమా, ప్రత్యేక రాష్ట్రం చేసి హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలాగా ప్రత్యేక కేటగిరీ కింద అదనపు నిధుల్ని అందించటం, ఎక్సైజ్ పన్నులు తదితర రాయితీల్ని ఇచ్చి పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించటమా అనే అంశాల్ని తేల్చాలి. అలాగే వెనకబడిన ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎక్పైజ్ పన్ను మినహాయింపునిచ్చి తెలుగు గడ్డ మీద ఉపాధి, ఆర్థికాభివృద్ధి అవకాశాల్ని కల్పించటం మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి.

ఇక నీటి వనరుల పంపిణీ విషయానికొస్తే, పోలవరం ప్రాజెక్టు ఖాయం కావటంతో కృష్ణా డెల్టాకు 45 టీఎంసీల నీరు మన రాష్ట్రం వాటాగా వస్తుంది. ఆ నీటిని పైనున్న తెలంగాణ మెట్ట ప్రాంతాలు, రాయలసీమ ప్రాంతాలకు ప్రధానంగా నికర జలాలుగా మళ్లించాలి. సీమ ప్రాజెక్టులలో వరద నీటి కేటాయింపులను నికర జలాలుగా కేటాయించాలి.
విద్యుత్ రంగాన్ని పాలకులు నాశనం చేశారు. ఈ ఏడాది వర్షాలు బాగా పడినాఆ, బోర్‌ల వినియోగం తగ్గి జలవిద్యుత్‌కు పుష్కల అవకాశశలున్నా కూడా గ్రామాలలో 4-8 గంటల విద్యుత్ కోత ఉండటం దారుణం. విద్యుత్ రంగాన్ని ఎలా బాగు చేయాలో పదే పదే చెబుతూ, చేసి చూపింది లోక్‌సత్తా. రూ. 1,40,000 కోట్లతో, 7,000 మెగావాట్ల విద్యుత్ అవసరమైన ఎత్తిపోతల పథకాలను తెలంగాణ ప్రాంతంలో చేపట్టటంపై లోక్‌సత్తా ఒక్కటే అసెంబ్లీలో, బయట నిర్దిష్టంగా పోరాడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ భారీ ఎత్తిపోతల పథకాలు ఆ రాష్ట్రానికి శాపంగా మారతాయని హెచ్చరించింది. రేపు ఏ ఏర్పాటు చేసినా అందులో భాగంగా భారీ ఎత్తిపోతల పథకాలను సమీక్షించటం, విద్యుత్‌రంగ అభివృద్ధికి సమూల చర్యలు చేపట్టటం అవసరం.
కోస్తా, సీమ ఉద్యోగులను విద్యార్థులను వినమ్రంగా కోరుతున్నా -బంద్‌లు, రాస్తారోకోలు వంటి ఆందోళన వల్ల తెలంగాణ ప్రజలు ఇప్పటికే చాలా నష్టపోయారు. అభివృద్ది, ఉద్యోగాల విషయంలో నష్టపోయారు.

పెట్టుబడులు వెనక్కిపోయాయి. ఇప్పుడు అదే తప్పును కోస్తాంధ్ర, సీమలోకూడ చేస్తే అసలు తెలుగు గడ్డ మీద పెట్టుబడులే పెట్టకూడదన్న భావన కలిగించిన వారమవుతాం. ఉద్యమాలు చేయండి, అభిప్రాయాలు చెప్పండి. కానీ ముఖం మీద కోపంతో ముక్కు తెగ్గేసుకునేలా కాదు, మన వాళ్లతో మన కళ్లు పొడుచుకునేలా కాదు. పరిశ్రమల్ని రానివ్వండి, విద్యా సంస్థల్ని నడవనివ్వండి, వైద్యశాలల్ని పనిచేయనివ్వండి, రవాణాను సాగనివ్వండి. మంచి చదువు, ఆరోగ్యం, నైపుణ్యాలు, ఉపాధి, ఇంటి ముందుపాలన, హద్దులేకుండా ఎదిగే అవకాశాలూ కంటే ఏ తల్లితండ్రులైనా, ఏ విద్యార్థి అయినా ఏ ఉద్యోగయినా కోరుకునేదేముంది? ఇప్పుడు కోస్తా, సీమలలో చేస్తున్న ఆందోళనలు ఆ జీవితలక్ష్యాలకు విఘాతం కలిగిస్తాయి తప్ప వాటిని సాధించేందుకు ఉపయోగపడవు. ఇప్పటికే దేశంలో చాలా పోటీ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న సంక్షోభం చూసి తమకు పోటీ తగ్గిందని ఇతర ప్రాంతాలు సంబరపడి అవకాశాల్ని చేజిక్కించుకోవటానికి ప్రయత్నిస్తుంటాయి తప్ప మనకోసం వేచివుండవు. అందుకే రాష్ట్రంలోని సంక్షోభానికి సమగ్ర, సామరస్య పరిష్కారాన్ని సాధించేందుకు కలిసిరావాలని రాయలసీమ, తెలంగాణ, కోస్తాంధ్రలోని అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా యువతకు విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను.

No comments:

Post a Comment