Wednesday 11 September 2013

రెండూ ఉద్యమాలు కావు - దాశరథి

రెండూ ఉద్యమాలు కావు - దాశరథి రంగాచార్య

September 11, 2013




నమస్కారమండీ ఆరోగ్యం ఎలా ఉంది?
86 యేళ్లు. అలానే ఉంది.
అనుభవం రీత్యా, వయసు రీత్యా సంపూర్ణ జీవితం కదా మీది!
సంపూర్ణం అనలేను.
ఎన్నో అనుభవాలున్నాయి కదా అందుకే సంపూర్ణం అన్నాను.
సంపూర్ణం కాదంటే గుండుసున్నా అని కాదు. సాహిత్యం, సంగీతం అనేవి సముద్రం అంతటివి. అందులో మనం ఒక బిందువులాంటి వాళ్లం.
ఇంతవరకు జరిగిన జీవితం సంతృప్తిగా అనిపించిందా?
నా కోసం నేను బతకలేదు. నేనెప్పుడూ సమాజం కోసమే జీవించాను. దీనికి కారణం మార్క్సిస్ట్‌గా పనిచేశాను. ఇప్పటికీ నేను కమ్యూనిస్టునే.
ఇప్పటికీ కమ్యూనిస్టుననే నమ్ముతారా?
ఏ పార్టీలోనూ సభ్యుడిని కాదు. కాని కమ్యూనిస్టు భావజాలం ఉంది. కార్ల్‌మార్క్స్‌ని మహర్షి అంటాను నేను. ఇప్పటికీ కొన్ని దేశాల్లో మార్క్సిజం చూస్తున్నాం. రియల్ మార్క్సిజం అనేది వేరే విషయం. కాని ఏది చూసినా మార్క్సిజం కోణంలోనే చూస్తాను.
మీలో ఒక పక్క మార్క్సిజం, రెండో పక్క వేదాలు ఉన్నాయి.
వేదాంతానికి, మార్క్సిజానికి మధ్య పెద్ద తేడాలేదనేది నా ఉద్దేశం.



'మనం అందరం కలుద్దాం. కలిసి చదివింది పంచుకుందాం. పోట్లాడొద్దు' అనే అర్ధం ఉంది వేదాల్లోని ఒక శ్లోకంలో. దీన్ని మార్క్సిజం కాదనడానికి లేదు కదా.



మార్క్సిజంలో దేవుడ్ని నమ్మొద్దనీ లేదు. మార్క్సిజం ఏమంటుందంటే మతతత్వం అనేది సమాజాన్ని నాశనం చేస్తుంది అంటుంది. అలాంటిది వద్దు అంటుంది.



'రిలిజియన్ ఈజ్ ది ఓపియమ్ ఆఫ్ మాసెస్' అనే మార్క్స్ మాటొక్కటే తె లుసుకున్నారు. కాని 'రిలిజియన్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ హార్ట్‌లెస్' అని అదే మార్క్స్ అన్నది ఎవరికీ తెలియలేదు.




మేము విశిష్ట అద్వైతులం. రామానుజుడి మతం. మా నాయన చాలా విద్వాంసుడు. ఇవన్నీ వదిలిపెడితే మాకు ఎంతగా నూరిపోశారంటే ఇది తప్ప ఇంకోటి లేదనేంత. అదేమో మార్క్సిస్టు యుగం. ఎవరూ ఆ ప్రభావం నుంచి తప్పించుకోలేని పరిస్థితి. మేము కొంత ఇక్కడున్నా, కొంత పబ్లిక్ ఫీల్డ్‌లో ఉండేవాళ్లం. పబ్లిక్ ఫీల్డ్ అంటే ఆర్య సమాజం. కాబట్టి రెండిటి కలయిక ఒకటి ఏర్పడింది. ఒకటి సమాజానికి చేయాల్సింది చాలా ఉంది, రెండోది తురకోడు రాజ్యం ఏలుతున్నాడు అది తప్పించాలె. ఈ రెండూ మాకు నేర్పింది ఆర్యసమాజం.

ఈ లోపల కమ్యూనిస్టు పార్టీ వచ్చింది. కమ్యూనిస్టు పార్టీతో నేర్చుకున్నది ఏమిటంటే... ఎవడ్నీ ద్వేషించొద్దు. ఎవడి మతం వాడు ఆచరించుకుంటాడు. దానితో నీకేంటి సంబంధం అనేది స్థిరపడింది.
ఆ తరువాత సికింద్రాబాద్ కార్పొరేషన్‌లో ట్రాన్స్‌లేటర్ ఉద్యోగానికి వచ్చాను. అప్పుడు మా అన్నయ్య ఇంట్లో ఉండేవాడిని. ఇంటి దగ్గరలో స్టేట్‌లైబ్రరీ ఉండేది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా రామాయణం చదవడం మొదలుపెట్టాను. అదెందుకు అంటే ఉన్న వాటన్నింటిలో రామాయణమే 'సెక్యులర్' అనేది నా దృష్టి. మానవజీవితాన్ని గురించి, కుటుంబం గురించి అంతకంటే ఎవరూ బాగా చెప్పలేరు.




విమర్శించడం అంటే అతను కొన్ని తప్పులు చేసిన మాట నిజం. వాలిని చంపడం వంటివి విమర్శ దృక్పథంతో చూస్తే విమర్శే వస్తుంది. కాని పూర్తిగా చూస్తే అనిపించదు. కొన్ని తప్పులు చేయడం నిజంగా మనిషికి అవసరం. తప్పులు చేయకుండా ఏ మనిషీ లేడు. అదే రామాయణం చెప్పింది. మానవజీవితాన్ని రామాయణం విశ్లేషించిందనేది నా ఉద్దేశం.




లేదండీ. మా నాన్న మద్రాస్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వెళ్లారు. మేము ఇక్కడ వాళ్లమే. భద్రాచలం. సరిగ్గా చెప్పాలంటే రామానుజుడు ఉన్నాడు కదా ఆయన మేనల్లుడు దాశరథి. అతను రామానుజుడికి కుడి భుజం. అతని పేరే దాశరథి పేరు. రామానుజుడు తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు అంటే ప్రతాపరుద్రుని సమయంలో దాశరథిని ఇక్కడ ప్రచారానికి వదిలేశాడు. మాది చాలా చిన్న వంశం. పదిమంది కంటే ఎక్కువ ఉండం. కుటుంబంలో ఒక్కో బిడ్డే ఉంటాడు. మా ఇంట్లో మాత్రమే మేమిద్దరం అన్నదమ్ములం.


నిప్పులు కడిగే ఆచారం నుంచి వచ్చిన మీరు నిజాం వ్యతిరేకపోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది? అటువంటి భావావేశం కలగడానికి కారణం ఏమిటి?
మొదలే మనవి చేశాను మీకు. నిజాం మీద కోపం ఆర్యసమాజం వల్లే వచ్చింది కాని కమ్యూనిస్టు కావడం వల్ల కాదు. అప్పట్లో కమ్యూనిస్టు రాజకీయ పార్టీ లేకపోవడం వల్ల ఆర్య సమాజానికి ఆకర్షితుడయ్యాను. హిందువు, ముస్లిం అన్న భావంతో పోరాటం చేశాం. కాని తరువాత అర్థం చేసుకుంది ఏమిటంటే మనం చాలా తప్పు పని చేశాం... తురకోడు అనే కారణంగా పోరాటం చేయడమనేది తప్పు అనిపించింది. కమ్యూనిస్టులు మీరు చేసింది మంచో, చెడ్డో మీరే తెలుసుకోవాలన్నారు. అప్పట్నించీ మార్క్సిజం చదివాను.




అది చెప్పలేను. కాని వ్యక్తులు మాత్రం కాదు. సమాజమే కారణం. పోరాటాలే నేర్పాయి. పుస్తకాలు చాలా చదివాను. నేర్చుకున్నదంతా పోరాటాల వల్లనే. ఒక్క పోరాటం వంద పుస్తకాల సాటి. ఒక దశలో బొట్టు చెరిపి, జంధ్యం తెంపేసిన మీరు మళ్లీ వాటిని ఆచరించడం ఎప్పట్నించి మొదలుపెట్టారు?
రామాయణం రాయడం మొదలుపెట్టినప్పుడు చిన్నగా కనపడీ కనపడనట్టు బొట్టుపెట్టుకున్నాను. భాగవతం రాయాలనుకున్నప్పుడు ప్యాంట్, చొక్కా కాకుండా ధోవతి కట్టుకున్నాను. చొక్కా వేసుకోలేదు. వేదం రాయాలనే ఆలోచన వచ్చినప్పట్నించీ అదే డ్రస్ నాది. ఇంకోటేమిటంటే మార్క్సిస్టులు ఇలాంటివి వద్దనలేదనేది నా అభిప్రాయం. అంతా మనం అనుకోవడమే తప్ప. భగవంతుడు రాయిస్తున్నాడు అనేది నా నమ్మకం.




నాకు తెలిసింది. తెలంగాణ కోరుకున్నారు కదా మీరు?
నాకేం సంబంధం లేదు.
ఇప్పుడు కాదు. అప్పట్లో...
ఎప్పుడూ నాకు సంబంధం లేదు.
చిల్లరదేవుళ్లతో మొదలుపెట్టి మోదుగు పూలు రాశారు కదా...
మొదలుపెట్టడం పెద్ద ఆశయంతో మొదలుపెట్టాను. రేపు నైజాం నవాబు ఉండడు. హైకోర్టు కట్టాడని తరువాత వాడ్ని పొగుడుతారేమోననే భయంతో రాశాను.




చేయకుండా ఉండాలనే భయంతోనే పుస్తకాలు రాశాను. ఉస్మాన్ అలీఖాన్ హైకోర్టు కట్టాడు. కాని అది ప్రజల సొమ్ముతోనే కదా కట్టింది. అందువల్ల అతను మంచివాడు కావడానికి వీలులేదు. అతను చేసిన వెధవ కార్యాలు చాలా ఉన్నాయి కదా. కెసిఆర్ ఉస్మాన్ అలీఖాన్ మంచివాడని మొదలుపెట్టాడు. దాని మీద పెద్ద వ్యాసం రాశాను. అది చూసి తెలంగాణ వాళ్లు నిన్ను క్షమించరు అన్నాడు. నేను తెలంగాణ వాడినే కాని తెలంగాణ కావాలన్న వాళ్లలో ఒకడిని కాదు, అలాగే విశాలాంధ్ర కావాలన్న వాళ్లలో ఒకడినీ కాదు.




అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. వాటిని ఇప్పుడు అర్థం చేసుకోలేను. ఆంధ్రప్రదేశ్ ఎంత ఉన్నదో అంతా కులీకుతుబ్‌షా పరిపాలించిందే. దీన్ని మొత్తాన్ని తెలంగాణ అన్నాడు. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని తెలంగి అంటారు. పోగాపోగా ఒక ముక్క మిగిలింది. ఈ ముక్క కోసం వాళ్ల బద్మాషి, వీళ్ల బద్మాషి ఉంది. ఇద్దరి పాలిటిక్స్ వల్ల ఈ గొడవంతా జరుగుతోంది. అసలు జరగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఫజల్ అలీఖాన్ కమిషన్‌లో "వాడు వీళ్లని వేరే ఉంచాలి కొంతకాలం'' అన్నాడు. ఉంచొచ్చు కదా. రంగారెడ్డి, చెన్నారెడ్డి ఇద్దరూ కలిసి దస్కత్‌లు పెట్టి వాళ్ల వాళ్ల పొజిషన్ల కోసం చూసుకున్నారే కాని ఎంత ద్రోహం చేస్తున్నారో ఆలోచించలేదు. దానివల్ల విశాలాంధ్ర అయ్యింది. లేకపోతే అయ్యేదేకాదు. నైజాం నవాబులు పరిపాలించినప్పుడు కూడా ఆంధ్రమే అనేవారు. తెలంగాణ వాళ్లే మొదట విశాలాంధ్ర కోరారు. మిగతా వాళ్లు కోరింది కేవలం ఆంధ్రమే.




తెలంగాణ వల్ల ప్రజలకేం ప్రయోజం లేదు. వ్యక్తులకే ప్రయోజనం. ఇది ప్రజా తెలంగాణ కాదు. ఎవరు సా«ధించారు? వాడు దయతలచి ఇచ్చాడు. వీళ్లు తీసుకున్నారు. కానీ ఇంతటి ఉద్యమం ఎక్కడా జరగలేదు.
ప్రజా తెలంగాణ ఎలా ఉండాలని మీ ఉద్దేశం?
మంచిగా ఉండాలి. కాని అలా ఉండే వీలు లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా పరిపాలించేది. ఏజెంట్‌లు కదా. ఏమీ చేయలేరు. ఇదివరకు పంచిన పొలాలు ఉంచితే బాగుండని ఉంది. అదీ అబద్ధమే. అది కూడా ఉంచరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్క్సిజం బతకదు. ఎందుకంటే క్యాపిటలిజమ్ ప్రబలిపోయింది.




తెలంగాణ, సమైక్యం - ఈ రెండూ అసలు ఉద్యమాలే కావు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేస్తున్నవే. ఎవరికీ చాలాకాలం ఏదీ ఉండదు. ఎవరికి వాళ్లు పంచుకోవాల్సిందే. సొసైటీ ఇట్‌సెల్ఫ్ ఈజ్ నాట్ ఫర్ సొసైటీ. అలాంటపుడు ఈ సమాజంలో సామాజిక ఉద్యమాలేం వస్తాయి?
ఇప్పటి యువత మీద మీకెటువంటి అభిప్రాయం ఉంది?
వెనక్కిపోతున్నారు.




మా అప్పుడు గుడి ఉండేది కాని గుడికి వెళ్లే వాళ్లు కాదు. పండగలప్పుడు ప్రసాదంకోసమే వెళ్లే వాళ్లం. ఇప్పుడు అర్థం లేకుండా దేవుడి వద్దకు వెళ్తున్నారు. దోపిడీకి పనికొస్తుందనుకున్నదానికే పరిమితం అవుతున్నారు. మా అప్పుడు పత్రికల్లో జ్యోతిష్యం, వారఫలాలు లేవు. ఇప్పుడెక్కువగా ఎందుకుంటున్నాయంటే వాళ్ల మీద వాళ్లకి నమ్మకం లేదు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. తర్కానికి తావు లేకుండా ఉంటోంది యువత. హేతుబద్ధంగా ఆలోచించడం లేదు. ఇంట్లో మా ఆవిడ నా మాట వినడం లేదని దేవుడ్ని ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు? నిజమైన భక్తి లేదు. ప్రతీది స్వార్థమే.



వంద సంవత్సరాల తరువాత మెషిన్ నాగరికత ఉండదు. మళ్లీ పేడ, పిడకలకు వెళ్లక తప్పదు. ఆసుపత్రుల్లో నిజం మందులు ఇవ్వడంలేదు, బడుల్లో నిజం చదువు చెప్పడంలేదు. మెషిన్ సిద్ధాంతం బతకదనే విషయం అందరికీ తెలిసిపోయింది.

No comments:

Post a Comment