Sunday 8 September 2013

కేసీఆర్! ఓ 15ఏళ్లు రాష్ట్రాన్ని ఏలుకో!

FILE
సామాజిక కార్యకర్త గొట్టిపాటి సత్యవాణి శనివారం జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ వేదికగా తన అదుర్స్ స్పీచ్‌తో అదరగొట్టారు. కేసీఆర్.. కావాలంటే ఓ పదిహేనేళ్ళు రాష్ట్రాన్ని ఏలుకో.. అంతేకానీ రాష్ట్రాన్ని మాత్రం విడగొట్టొద్దు అంటూ సత్యవాణి చేసిన ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. 

భారత రామాయణాల్లో కర్ణుడు, మారీచుడు, భీష్ముడు అని ముగ్గురున్నారు. కర్ణుడు మంచివాడైనా ఉద్యోగం కోసం దుర్యోధనుని వద్దకు చేరాడు. కానీ దుర్యోధనుడు మాటలు విని బలైపోయాడు. అలాగే ప్రధాని మన్మోహన్ సింగ్ మంచి వాడు. తెలివైన వాడు.. అయినప్పటికీ ఉద్యోగిగా మాత్రమే వ్యవహరిస్తున్నందున బలైపోతున్నారు. 

అన్నీ తెలిసిన మారీచుడు కూడా రావణాసురుడు చెప్పినట్లు ఓ దుష్టశక్తిగా మిగిలిపోయాడు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అన్నీ తెలిసినప్పటికీ విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నాడు. 

బతకమ్మ అంటే బతుకును కోరే తల్లి. అన్ని ప్రాంతాల వాళ్లూ ఆమెను కొలుచుకుంటారు. అలాంటి బతుకమ్మను కూడా ఒక ప్రాంత చట్రంలో బంధించింది కేసీఆర్ కూతురు కాదా.. ఇదే సంస్కృతి? తెలంగాణ ప్రజలది గొప్ప హృదయం. అలాంటి వారిని కూడా కేసీఆర్ తన మాటలతో విషపూరితం చేస్తున్నాడు అని సత్యవాణి ప్రసంగించారు.

తాను ఈ సభకు వస్తుంటే కొందరు తెలంగాణ అక్కచెల్లెళ్లు కలిశారని, కాలే కడుపుతో వస్తున్నందున భోజనం పెట్టాలని ఉన్నా, ఇంటికి పిలిస్తే తెలంగాణ వ్యతిరేకులంటారనే భయంతో పిలవలేకపోతున్నామని సత్యవాణి వాపోయారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు తెలంగాణ నేతలు అలా మాట్లాడుతున్నారు. తోటి తెలుగువారిపై ఎవరికీ కోపం ఉండదన్నారు. యుద్దంలో సోదరులందరినీ పోగొట్టుకున్న దుర్యోధనుని వద్దకు వచ్చిన ధర్మరాజు " మనం మనం కొట్టుకుని సోదరులు విడిపోయారన్న చెడ్డ పేరు ఎందుకు? కావాలంటే నా రాజ్యం నీకిస్తాను. అందరం కలిసుందాం అని కోరాడు. 

ఇప్పుడూ మేం అదే చెబుతున్నాం. కేసీఆర్ కావాలనుకుంటే రాష్ట్రాన్ని 15ఏళ్ల పాటు ఏలుకోవడానికి మాకు అభ్యంతరం లేదు. మేమిచ్చేస్తాం. కానీ తెలుగు నేలను మాత్రం చీల్చకండి. చేతులెత్తి నమస్కరిస్తున్నా" అని కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ఈ వినాయక చవితికైనా కేసీఆర్‌కు, కోదండరామ్‌కు మంచి బుద్ధి రావాలని దేవుడిని వేడుకుంటున్నానని సత్యవాణి అన్నారు. 

ఇంకా ఆమె మాట్లాడుతూ.. భారతంలో అన్నదమ్ముల మధ్య చెలరేగిన చిచ్చే నేడు కూడా ఆంధ్రప్రదేశ్‌లో రేగిందని గుర్తు చేశారు. తప్పుడు వ్యక్తుల చెప్పుడు మాటలు విని ప్రజలు మోసపోవద్దని హితవు పలికారు. భారత మాత కానీ తెలుగుతల్లి కానీ తన పుత్రులు తన్నుకు చావడాన్ని హర్షించదని చెప్పారు. 

ముఖ్యంగా తెలుగు ప్రజలు విడిపోయారనే అపప్రధ మనకొద్దని సత్యవాణి పిలుపునిచ్చారు. స్వార్థ ప్రయోజనాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారు చాలామంది ఉన్నారని వారిని వదిలెయ్యాలని ఆమె సూచించారు. తెలంగాణ సంస్కృతి ఎంతో ఉన్నతమైనదని, అక్కడ ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. 

మేధావివర్గం మొత్తం ఒక్కసారి ఆలోచించాలని సత్యవాణి కోరారు. చట్ట సభలోనే మేధావిపై చేయిచేసుకుంటే జరిగిందేమిటని ఆమె గుర్తు చేశారు. మేధావులు ఇంకా నోరుమూసుకుని ఉంటే కేంద్రం అయితే ఇంకా విభజనే అంటూ ముందుకెళ్తే భీష్ముడు అంపశయ్యమీద పడుకున్నట్టు పడుకోబెడతారని గుర్తించాలని కోరారు. 

తాను శ్రీకృష్ణ కమిటీకి లేఖ ఇచ్చిన సందర్భంగా నాటి భారతంలో కూడా శ్రీకృష్ణుడే రాయబారం నడిపిన సంగతి గుర్తు చేశానని, దానికి ఆయన అప్పటి రాయబారం విఫలమైందని ఇది విఫలం కాదని అన్నారన్నారు. అలాగే కమిటీ నివేదికలో వాస్తవాలు గ్రహించకుండా విభజిస్తే తిరుగుబాటు వస్తుందని పేర్కొన్నారని ఇప్పుడు జరిగింది అదేనని ఆమె గుర్తు చేశారు. 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్‌లో కర్రీ పాయింట్ పెట్టుకోమని చెప్పిన సోదరుడు కేసీఆర్‌ను ఆమె తూర్పారబట్టారు. కర్రీపాయింట్ పెట్టుకోమని కొందరు నేతలు చెబుతున్నారు.. మీ అమ్మలు, మీ భార్యలు కర్రీలు చేయడం లేదా ఆ కర్రీలు మీరు తినడం లేదా అని సత్యవాణి ప్రశ్నించారు. 

చివరి మాటగా సత్యవాణి గారు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించారు. ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేయకపోతే ఆ ప్రజలే ప్రభుత్వాలకు సెలవు ప్రకటిస్తారని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన విషయాన్ని సత్యవాణి ఈ సందర్భంగా ఊటంకించారు. దీంతో సభాప్రాంగణం కరతాళధ్వనులతో మారుమ్రోగింది.

No comments:

Post a Comment