Friday 20 September 2013

'తెలుగు వాలే జాగో... కేసీఆర్ బాగో'

దిగి రావాల్సిందే !

September 21, 2013


విజయవాడ, సెప్టెంబర్ 20 : విజయవాడలోని స్వరాజ్ మైదాన్‌లో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరిట భారీ బహిరంగ సభ జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ సంఘాల ప్రతినిధులతో స్వరాజ్ మైదాన్ కిటకిటలాడింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9.30 గంటల దాకా వక్తల ప్రసంగాలతో, జై సమైక్యాంధ్ర నినాదాలతో మైదానం దద్దరిల్లింది. సాయంత్రం 6 గంటల నుంచి నింగి నుంచి ఏకధాటిగా పడుతున్న చినుకులు సూదుల్లా గుచ్చుతున్నా... సభికులు కట్టుకదలకుండా కూర్చున్నారు.

ఈ సభ మొదలైన కొద్దిసేపటికే.... 'తెలంగాణపై అడుగు ముందుకే. నిర్ణయం తీసేసుకున్నాం. ఇక పునరాలోచన ఏదీ లేదు. రాజీనామాలు చేస్తే చేసుకోండి' అంటూ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు చేసిన ప్రకటించినట్లు నేతలకు సమాచారం అందింది. దీంతో... వక్తలంతా స్వరం పెంచారు. రాజీనామాలపై పట్టు బిగించారు. 'విభజన తథ్యమని ఢిల్లీ పెద్దలే అంటున్నారు. ఇక నాటకాలు కట్టిపెట్టండి. రాజీనామాలు చేయండి' అని నినదించారు. అత్తెసరు మెజారిటీతో, అంకగణితం మీద నడుస్తున్న యూపీఏ సర్కారు పడిపోతే... ఇక బిల్లే ఉండదని తేల్చిచెప్పారు. 'కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా రాజీనామాలు చేయాలి. ఉద్యమంలోకి రావాలి.

లేకుంటే... సీమాంధ్రలో తిరగనివ్వం' అని హెచ్చరించారు. "సమైక్యాంధ్రను కాపాడుకునేందుకు రాజకీయ సంక్షోభం తప్పదు. అన్ని దారులూ మూసుకుపోయాయి. ఇక... రాజకీయ, రాజ్యాంగ సంక్షోభం ఒక్కటే మార్గం'' అని తెలిపారు. వర్షంలోనే నేతల ప్రసంగాలు నడిచాయి. ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు సభలో క్లుప్తంగా ప్రసంగించారు. "ఈ సభకు ప్రకృతి సహకరించకున్నా ప్రజలు మా వైపే ఉ న్నారు. జోరున కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, కట్టుకదలకుండా కూర్చోవడం సమైక్యాంధ్రకాంక్షను ఎంత బలోపేతంగా ఉందో తెలియచేస్తోంది. ఈ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది'' అని తేల్చిచెప్పారు.

'కనక దుర్గమ్మా... కదలి రావమ్మా' అంటూ కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన అంధ టీచర్ గంగాధర్ తన పాటలతో సభికులను ఉర్రూతలూగించారు. జనంతో వేదికపై ఉన్న వారు నేతలు సైతం ఆయన పాటకు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. నెల్లూరు నుంచి వచ్చిన బాలకృష్ణ అనే ఉద్యోగి సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల ఎద్దేవా చేస్తూ ఆలపించిన గీతంతో అందరూ కోరస్ కలిపారు. 'తెలంగాణ ఉద్యమానికి 50 ఏళ్ల చరిత్ర ఉంటే... తెలుగుజాతిని సమైక్యంగా ఉంచాలనే ఉద్యమానికి వందేళ్ల చరిత్ర ఉంది' అంటూ విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన నలమోతు చక్రవర్తి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

'తెలుగు వాలే జాగో... కేసీఆర్ బాగో' అంటూ ఆయన కేసీఆర్ నినాదాన్ని తిరగరాసారు. కేబినెట్ నోట్ తయారైతే మళ్లీ సమ్మెలోకి వెళతామని, కరెంటు సరఫరాకూడా నిలిపివేస్తామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత సాయిబాబా ప్రకటించారు. 'కరెంటు కావాలా? చీకటైనా సరే, సమైక్యాంధ్ర కావాలా?' అని ప్రశ్నించడంతో... జనంత లేచి 'సమైక్యాంధ్రే కావాలి' అని జనం నినదించారు. ఈ సభ అంచనాకు మించి విజయవంతం కావడంతో సమైక్యవాదుల్లో మరింత పోరాట స్ఫూర్తినింపింది

No comments:

Post a Comment