Friday 20 September 2013

రాజీనామాలా..చేస్తే చేసుకోండి ! - Digvijay Singh

రాజీనామాలా..చేస్తే చేసుకోండి !

September 21, 2013

(న్యూఢిల్లీ) సీమాంధ్ర నేతల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. అధిష్ఠానం పెద్దలను ఒప్పించలేక.. తమ ప్రాంత ప్రజలను మెప్పించలేక వారు నానా ఇక్కట్లు పడుతున్నారు. అధిష్ఠానం పెద్దలు తమ పట్ల ప్రదర్శిస్తున్న కఠిన వైఖరిపై లోలోపల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూనే.. తమకనుకూలంగా వ్యక్తమైన కనీస స్పందన గురించి మాత్రమే బయటికి చెబుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌తో గురువారం రాత్రి పొద్దుపోయేదాకా జరిగిన భేటీలోనూ ఇదే జరిగింది. 'ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చేదాకా నోట్‌పై ముందుకు వెళ్లవద్దని షిండేకు చెబుతాను' అని దిగ్విజయ్‌సింగ్ హామీ ఇవ్వడం నిజమే అయినప్పటికీ.. విభజనపై మాత్రం వెనక్కి వెళ్లేదిలేదని తేల్చిచెప్పారు.

ఈ భేటీకి సంబంధించిన అంశాలు కొంత ఆలస్యంగా బయటికి వచ్చాయి. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. "తెలంగాణ విషయంలో వేరే ఆలోచనకు ఆస్కారమే లేదు. ఇక విభజన అంశంపై మీరు మాట్లాడకపోవడమే మంచిది '' అని స్పష్టం చేశారు. అయితే.. తమపై పెరుగుతున్న ఒత్తిడి మేరకు రాజీనామాలు చేయక తప్పదని నేతలు చెప్పినప్పుడు ఆయన తీవ్రంగా స్పందించారు. 'రాజీనామాలు చేయాలనుకుంటే చేయొచ్చు. ఇక నాతో మాట్లాడాల్సిన పని కూడా లేదు' అని దిగ్విజయ్ సీటు నుంచి పైకి లేవబోయారు. దాదాపు గంటకుపైగా జరిగిన ఈ భేటీలో ఏ దశలోనూ డిగ్గీ సీమాంధ్ర నేతలకు అనుకూలంగా మాట్లాడలేదని తెలిసింది.

ముఖ్యంగా విభజన విషయంలో సీడబ్ల్యూసీ నిర్ణయానికి తిరుగులేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసేసుకుందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తుందని ఆయన నిక్కచ్చిగా చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే పార్టీ పరిస్థితి ఏమవుతుందో నేతలు చెప్పినప్పుడు.. "మీరు ఇవన్నీ ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. మీరేం చెబుతారో నాకు తెలుసు. నేనేం చెబుతానో మీకు తెలుసు. మన మధ్య ఇది ఎప్పుడూ జరిగేదే. కాబట్టి, ఇక తెలంగాణపై మాట్లాడకపోవటమే మంచిది. హైదరాబాద్ సమస్యను ఎలా పరిష్కరించాలన్న దానిపై మాత్రం మీ వద్ద ఏమైనా సలహాలు, ప్రతిపాదనలు ఉంటే ఇవ్వండి'' అని దిగ్విజయ్ సూటిగా చెప్పారు.

నోట్ తయారైనట్లు షిండే చేసిన ప్రకటనను సీమాంధ్ర నాయకులు ప్రస్తావించగా, "ఎప్పుడో ఒకప్పుడు నోట్ వెళ్లాల్సిందే కదా! అయితే, మీరడుగుతున్నట్లు ఆంటోనీ నివేదిక ఇచ్చేంతవరకూ నోట్ ఆపాలని షిండేతో చెబుతాను' అని దిగ్విజయ్ అన్నట్లు సమాచారం. ఆ వ్యాఖ్యలతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు తీవ్ర నిరాశ చెందారు. "దిగ్విజయ్ గత కొంత కాలంగా తెలంగాణపై ఒకే స్వరంతో మాట్లాడుతుండటం నిజమే. కానీ.. ఆయన మాతో ఇంత తీవ్ర స్వరంతో మాట్లాడటం మాత్రం మొదటిసారి. తెలంగాణ ఏర్పాటుపై అధిష్ఠానం ఎంత పట్టుదలగా ఉందో దీన్నిబట్టి అర్థమవుతోంది'' అని ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. మరొక ఎంపీ మాట్లాడుతూ... "రాష్ట్రాన్ని విభజించాలని అధిష్ఠానం నిర్ణయించుకుంది కాబట్టి... చేసే తీరుతుంది.

ఆ తర్వాత ఏర్పడే పరిణామాలను పట్టించుకోకుండా ముందుకెళితే తప్పకుండా ఫలితం అనుభవిస్తుంది. అప్పుడు ఇవేమీ మాకు తెలియదు అని అధిష్ఠానం చెప్పేందుకు వీల్లేకుండా... వారికి వివరాలన్నీ ఇప్పుడే చెబుతున్నాం. పట్టించుకోకుంటే మేం చేయగలిగిందేమీ లేదు'' అని చెప్పారు. పార్లమెంటు భవనంలోని కేంద్ర మంత్రి కావూరు సాంబశివరావు కార్యాలయంలో శుక్రవారం కేంద్ర మంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు. గంటన్నరకు పైగా జరిగిన ఈ సమావేశంలో కోట్ల, పురందేశ్వరి, కిల్లి కృపారాణి, కేవీపీ, అనంత వెంకట్రామిరెడ్డి, సాయి ప్రతాప్, ఉండవల్లి, కనుమూరి బాపిరాజు, జీవీ హర్షకుమార్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజీనామాలు చేస్తే చేసుకోవాలని దిగ్విజయ్ తేల్చేయడంతో ఇక రాజీనామాలతో కూడా ఒత్తిడితేలేమని కొందరు అభిప్రాయపడ్డారు.

అయితే... కనీసం రాజీనామాలు చేస్తే అయినా ప్రజల్లో తిరిగే అవకాశం లభిస్తుందని మరికొందరు తెలిపారు. ముఖ్యంగా ఉండవల్లి, సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డిలు రాజీనామాలు చేయాల్సిందేనని పట్టుబట్టినట్లు తెలిసింది. అధిష్ఠానం పట్టించుకున్నా పట్టించుకోకున్నా ప్రజల్లోకి వెళ్లి వారి మనోభావాల ప్రకారం నడుచుకోవటమే ఉత్తమమని సూచించగా... కొందరు మాత్రం రాజీనామాలు చేస్తే పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు అడ్డుకునే అవకాశం ఉండదని గుర్తు చేశారు. మరోవైపు కేబినెట్‌లోను నోటు పెట్టినప్పుడు, పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు వాటిపై తీవ్రమైన నిరసనను నమోదు చేసి, వీలైతే అడ్డుకోవాలని సూచించారు. తర్వాత హైదరాబాద్‌ను ఏం చేయాలన్న అంశంపై అధిష్ఠానానికి తగిన సూచనలు ఇవ్వాలని కూడా వీరు నిర్ణయించారు.

కాగా, రాజీనామాలపై మాత్రం ప్రజల అభిప్రాయం, మనోభావాల మేరకే నడుచుకోవాలని తీర్మానించారు. రాజీనామాలు చేస్తే తలెత్తే పరిణామాలు, పదవులు వదులుకుని తాము ఏమేం చేయగలమో... రాజీనామాలు చేయకుంటే తలెత్తే పరిస్థితులు, పదవుల్లో ఉండి తాము చేయగలిగిందేమిటో సవివరంగా వెల్లడిస్తూ ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాస్తే బాగుంటుందని కొందరు సూచించారు. అయితే, రాజీనామాలపై మిగిలిన వారు కలిసిరాకపోవడంతో ఇప్పటికే పత్రాలు ఇచ్చిన వారిలో ఇద్దరు ముగ్గురు తాము స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలు ఆమోదింపచేసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు పళ్లంరాజు, చిరంజీవి, జేడీ శీలం, ఎంపీలు లగడపాటి, రాయపాటి, బొత్స ఝాన్సీ తదితరులు అందుబాటులోలేకపోవడంతో మరొకమారు సమావేశం కావాలని నిర్ణయించారు. 23 లేదా 24వ తేదీన అందరూ కలిసి మరొకసారి ఢిల్లీలోనే సమావేశమై తర్వాత భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించాలని తీర్మానించారు.


ఆంటోనీని కలుస్తాం: మాగుంట, అనంత
సమావేశం అనంతరం ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంటోనీ ఆరోగ్యం సరిగా లేదని, సోమవారం లేదా మంగళవారం కలుస్తామన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో ఎవ్వరి ప్రోద్బలం లేకుండానే స్వాతంత్య్ర పోరాటాన్ని మరిపించే రీతిలో ఉధృతంగా ఉద్యమం జరుగుతోందని చెప్పారు. ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే కేబినెట్‌లో నోట్‌ను ప్రవేశపెడతారని చెప్పారు. అప్పుడైనా నోట్ కేబినెట్‌కు వెళుతుంది కదా? అని ప్రశ్నించగా.. "అది కాదనడంలేదు. అయితే, అలాంటి నిర్ణయం తీసుకోవద్దనే తమ అధిష్ఠానాన్ని కోరుతున్నాం'' అని తెలిపారు.

No comments:

Post a Comment