Friday 20 September 2013

అహ్మద్ పటేల్ అలా అనలేదు

అహ్మద్ పటేల్ అలా అనలేదు

September 21, 2013


న్యూఢిల్లీ సెప్టెంబర్ 20 : తెలంగాణపై తొందరపడి నిర్ణయం తీసుకున్నట్లు సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ చెప్పినట్లు వచ్చిన వార్తలను ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, లగడపాటి రాజగోపాల్ ఖండించారు. దీనిపై కేవీపీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేయగా, లగడపాటి 'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడారు. "అహ్మద్ పటేల్‌తో జరిగిన భేటీకి నేనూ హాజరయ్యాను. తెలంగాణపై తొందరపడిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అనలేదు. అహ్మద్ పటేల్ ఉన్నత వ్యక్తిత్వంగల నాయకుడు. పార్టీకి, పార్టీ అధ్యక్షురాలికి ఎంతో విధేయుడైన నాయకుడు. ఆయన మార్గదర్శకత్వం, వివేకవంతమైన సలహాలు మాకు ఎంతో విలువైనవి. సోనియా రాజకీయ సలహాదారుగా ఆయన నిర్వహిస్తున్న పాత్ర అసాధారణమైనదని మేమంతా భావిస్తున్నాం'' అని కేవీపీ తన ప్రకటనలో తెలిపారు.

పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయంపై కానీ, చర్యలపైకానీ ఆయన వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన దృష్టాంతాలు లేవన్నారు. సోనియాగాంధీ రాజకీయ సలహాదారుగా ఆయన తమ భావాలను ఓపిగ్గా విని, వాటి గురించి మేడమ్‌కు చెబుతానని మాత్రమే చెప్పారని తెలిపారు. ప్రస్తుత సంక్షోభానికి పరిష్కారం కనుగొనే విషయంలో తమకు సహాయపడుతున్న అహ్మద్ పటేల్ అనని మాటల గురించి వార్తలు రావడం విచారకరమని కేవీపీ అన్నారు. ఇదే అంశంపై లగడపాటి స్పందిస్తూ... "అహ్మద్ పటేల్‌తో భేటీ అయినప్పుడు మేం చెప్పిందంతా ఆయన విన్నారు. సహజంగా ఆయన ఏమీ మాట్లాడరు. మా అభిప్రాయాలను సోనియా దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. అంతకు మించి ఆయన ఎలాంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేయలేదు'' అని తెలిపారు.

No comments:

Post a Comment