Sunday 15 September 2013

ఒక విభజన..వంద సందేహాలు

ఒక విభజన..వంద సందేహాలు

September 15, 2013



(హైదరాబాద్) 8 విభజనపై నోట్‌ను కేబినెట్ ఆమోదించిన తర్వాత దానిని రాష్ట్రపతి రాష్ట్ర అసెంబ్లీకి పంపేందుకు నిర్దిష్టమైన గడువు ఉంటుందా?
అలాంటి గడువు ఏదీ ఉండదు. రాష్ట్రపతి విచక్షణాధికారాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. సాధారణంగా... కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతిని సంప్రదించిన తర్వాతే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అందువల్ల, నోట్ విషయంలో ఇబ్బంది ఉండకపోవచ్చు.

8 కేబినెట్ నోట్‌ను అసెంబ్లీకి పంపకుండా రాష్ట్రపతి తన దగ్గరే అట్టిపెట్టుకుంటే ఏం జరుగుతుంది?
రాజ్యాంగం ప్రకారం అలా అట్టిపెట్టుకోకూడదు. అయినప్పటికీ... గతంలో అలాంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పోస్టల్, టెలికం చట్ట సవరణలకు పంపిన ప్రతిపాదనలను అప్పటి రాష్ట్రపతి జైల్‌సింగ్ వెంటనే ఆమోదించకుండా ఏడాదిన్నర అట్టిపెట్టుకున్నారు. ఇలా చేసినప్పుడు పార్లమెంటులో రాష్ట్రపతిపై అభిశంసన తీర్మానం పెట్టవచ్చు.

8 రాష్ట్రపతి పంపిన నోట్‌పై రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిరోజుల్లోపు తన అభిప్రాయం చెప్పాలి? దీనికి నిర్దిష్ట గడువు ఉంటుందా?
ఔను. ఫలానా సమయంలోపు అభిప్రాయం చెప్పాల్సిందిగా రాష్ట్రపతి గడువు విధిస్తారు. అయితే... తమకు మరింత సమయం కావాలని అసెంబ్లీ కోరితే, గడువు పొడిగించవచ్చు. చట్టంలో దీనికి వెసులుబాటు ఉంది.
8 గడువులోపు అసెంబ్లీ తన అభిప్రాయం వెల్లడించకుండా, గడువు పొడిగించాలని కోరకుండా ఉంటే ఏం జరుగుతుంది?
గడువు ముగిసేలోపు చెప్పాల్సిందే. లేనిపక్షంలో రాష్ట్రపతిని అవమానించినట్లవుతుంది. అసెంబ్లీ తన అభిప్రాయం చెప్పకున్నా... చెప్పినట్లుగానే భావించి (డీమ్డ్) కేంద్రం తదుపరి నిర్ణయం తీసుకుంటారు.

8 రాష్ట్ర విభజనకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం తప్పనిసరా? కేవలం చర్చ జరిపితే చాలా?
'విభజనపై శాసనసభ అభిప్రాయం తెలుసుకోవాలి' అని రాజ్యాంగం చెబుతోంది. దీనికి భిన్నమైన భాష్యాలు చెబుతున్నారు. అయితే... శాసన సభ అభిప్రాయం స్థూలంగా తెలుసుకునేందుకు తీర్మానం మాత్రమే మార్గం. ఏకాభిప్రాయం ఉంటే 'మూజువాణి' ఓటుతో తీర్మానం నెగ్గుతుంది. విభజనపై 294 మంది సభ్యుల్లో భిన్నమైన అభిప్రాయాలున్నప్పుడు 'డివిజన్' తప్పదు. ఓటింగ్‌లో వచ్చిన ఫలితాన్నే శాసనసభ అభిప్రాయంగా పరిగణించాల్సి ఉంటుంది.

8 రాష్ట్ర శాసనసభ ఆమోదం లేకుండా గతంలో ఏవైనా రాష్ట్రాలను విభజించారా?
ఇప్పటిదాకా అలా జరగలేదు.
8 విభజన తీర్మానం అసెంబ్లీలో వీగిపోతే ఏం జరుగుతుంది?
తీర్మానం వీగిపోయినా పర్వాలేదు. రాష్ట్రపతి దానికి తలొంచాల్సిన అవసరం లేదు. ఆర్టికల్ 3 ప్రకారం విభజనపై శాసనసభ అభిప్రాయాన్ని మాత్రమే తీసుకోవాలి.
8 అసెంబ్లీలో తీర్మానం వీగిపోయినప్పటికీ... విభజనపై కేంద్రం అడుగు ముందుకు వేయవచ్చునా?
రాజ్యాంగపరంగా ఆ అవకాశం ఉంది. అయితే... అసెంబ్లీ అభిప్రాయానికి విరుద్ధంగా పార్లమెంటు వ్యవహరించవచ్చా? అసెంబ్లీ కాదంటే రాష్ట్రపతి ముందుకు వెళతారా? అన్నది వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ తలెత్తలేదు.

8 రాష్ట్రపతి మళ్లీ మరోమారు అసెంబ్లీకి తీర్మానాన్ని పంపవచ్చునా?
మళ్లీ పంపించే అధికారం రాష్ట్రపతికి ఉంది.
8 ఒకవేళ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేకుండానే విభజనకు ప్రతిపాదిస్తే... ఆ కారణంగా బిల్లును రాష్ట్రపతి వెనక్కి పంపే అవకాశం ఉందా?
అసెంబ్లీలో నిర్ణీత గడువులోగా చర్చ ముగించి, విభజన వద్దని తీర్మానం చేస్తే దీనిపై పార్లమెంటును రాష్ట్రపతి ప్రశ్నించవచ్చు.
8 రాష్ట్రపతి బిల్లును వెనక్కి పంపితే... కేంద్రం మళ్లీ అదే బిల్లును యథాతథంగా తిరిగి రాష్ట్రపతికి పంపవచ్చా?
పంపవచ్చు. ఈసారి 'అప్రూవ్' చేయాల్సిందే అని పంపొచ్చు. ఇక దానిని రాష్ట్రపతి ఆమోదించాల్సిందే.

8 రాష్ట్రపతి ఎంతకీ బిల్లుపై ఆమోద ముద్ర వేయకపోతే కేంద్రం ఏం చేస్తుంది?
మళ్లీ బిల్లును పార్లమెంటు పాస్ చేసి పంపవచ్చు. రాష్ట్రపతి అట్టిపెట్టుకుని కూర్చుంటే గడువు తీరిపోతుంది. కేంద్రం ఏమీ చేయలేదు. రాష్ట్రపతితో కేంద్ర ప్రభుత్వానికి ఉండే సమన్వయం నేపథ్యంలో సాధారణంగా ఇలాంటివి జరగవు. ఒకవేళ జరిగితే... రాష్ట్రపతి రాజ్యాంగపరంగా పనిచేయడం లేదంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టవచ్చు.
8 రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన వెంటనే రాష్ట్ర విభజన జరిగిపోయినట్లేనా?
కాదు. తొలుత నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ ప్రకారం అపాయింటెడ్ డేట్ ఇస్తారు. అధికార గజిట్ విడుదల చేయాలి. బిల్లు ఆమోదం పొందిన కొద్ది రోజుల్లోనే (నాలుగైదు రోజులు) ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

8 విభజనపై అంతిమ ప్రకటన (రాష్ట్ర ఆవిర్భావం) ఏరూపంలో ఉంటుంది? (గెజిట్, జీవో, రాజ్యాంగ సవరణ?)
విభజనపై జీవో, గజిట్ ఇవ్వాలి.
8 రాష్ట్ర విభజన తర్వాత రాజ్యాంగంలోని షెడ్యూలును సవరించాల్సి ఉంటుందా?
భారత దేశంలోని రాష్ట్రాలు, వాటి సరిహద్దులు, అవి ఏ చట్టం ప్రకారం ఏర్పడ్డాయి... ఇలాంటి వివరాలన్నీ రాజ్యాంగంలోని షెడ్యూలు-1లో ఉంటాయి. ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు షెడ్యూలు-1లో ఆ రాష్ట్రం పేరును కూడా చేరుస్తారు. రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించిన బిల్లులోనే ఈ క్లాజు కూడా ఉంటుంది. అందువల్ల, రాష్ట్ర ఏర్పాటుతోపాటే షెడ్యూలు-1లో ఆ రాష్ట్రం పేరు కూడా చేరుతుంది. షెడ్యూలు అనేది రాజ్యాంగానికి అనుబంధం మాత్రమే. దీనికి సవరణ అవసరం లేదు.

8 రాష్ట్ర విభజనకు రాజ్యాంగ సవరణ కూడా అవసరమా?
సాధారణంగా రాష్ట్ర విభజనకు, రాజ్యాంగ సవరణకు సంబంధం ఉండదు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు మాత్రం ఇది అవసరమే. ఎందుకంటే... ఆర్టికల్ 371(డి)లో ఆంధ్రప్రదేశ్‌కు రాజ్యాంగపరంగా కొన్ని ప్రత్యేక రక్షణలు ఏర్పడ్డాయి. విద్యా ఉద్యోగాల వర్గీకరణ, జోనల్ వ్యవస్థ, ట్రిబ్యునల్ ఏర్పాటు, రాష్ట్రపతి ఉత్తర్వులు... వీటన్నింటికీ 371(డి)యే ప్రాతిపదిక. రాష్ట్ర విభజన, ఆర్టికల్ 371(డి) అనేవి ఒకదానితో ఒకటి ముడిపడినవి.
8 ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత... 371(డి)కి అర్థమేముంటుంది? అది మురిగిపోయినట్లే కదా?
కానే కాదు. రాజ్యాంగంలో ఏ అధికరణా అచేతనంగా ఉండదు. దానంతట అది మురిగిపోదు.

దానిని సవరించాలి, లేదా తొలగించాలి. రాజ్యాంగంలో ఒక అధికరణను చేర్చాలన్నా, సవరించాలన్నా, తొలగించాలన్నా... ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి. ఇందుకు... మొత్తం సభ్యుల సంఖ్యలో సింపుల్ మెజారిటీతోపాటు, ఆ సమయంలో సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది ఆమోదిస్తేనే రాజ్యాంగ సవరణ జరుగుతుంది. ఉజ్జాయింపుగా చెప్పాలంటే... సభకు కనీసం 410 మంది హాజరై, అందులో మూడింట రెండు వంతుల మంది ఆమోదించాలి.

8 రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి ఏ దశలోనైనా, ఎవరైనా కోర్టును ఆశ్రయించే అవకాశ ముందా? అప్పుడు ఏం జరుగుతుంది?
ఉంది. ఎవరైనా కోర్టును ఆశ్రయించవచ్చు. పిటిషన్‌ను అనుమతించడం, అనుమతించకపోవడంపై 'మెరిట్స్' ఆధారంగా కోర్టులు నిర్ణయం తీసుకుంటాయి.
8 రాష్ట్రంలో అసలు అసెంబ్లీయే లేకుండా, రాష్ట్రపతి పాలన ఉంటే ఏం జరుగుతుంది?
రాష్ట్రపతి పాలన ఉంటే అసెంబ్లీ అధికారాలు పార్లమెంటుకు వెళతాయి. అప్పుడు విభజనపై కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకోవచ్చు. గవర్నర్‌ను సంప్రదించాల్సిన అవసరం లేదు. అయితే... మనది ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని, అసెంబ్లీని కాదని... రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో విభజన నిర్ణయం తీసుకోవడం దుష్ట సంప్రదాయంగా మిగిలిపోతుంది. 'ఏకపక్ష విభజన'కు కేంద్రం బలమైన కారణాలను చూపించాల్సిన అవసరం ఏర్పడుతుంది.

8 రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్‌కు శాసనసంబంధ అధికారాలు సంక్రమిస్తాయా?
గవర్నర్‌కు ఎలాంటి అధికారాలూ ఉండవు. అవి పార్లమెంటుకే ఉంటాయి.
8 విభజనకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు... వాటి ప్రతులను సభ్యులు చించి పారేస్తే ఏం జరుగుతుంది?
ఏమీ కాదు. ప్రతులను చింపినంత మాత్రాన బిల్లుకు వచ్చిన నష్టమేమీ లేదు.
8 పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందేందుకు ఎలాంటి మెజారిటీ కావాలి?
సాధారణ మెజారిటీ చాలు.

8 పార్లమెంటులో ఒకవేళ ఓటింగ్ జరిగి, బిల్లు వీగిపోతే ఏం జరుగుతుంది?
బిల్లు పాస్‌కాదు... క్లోజ్ అవుతుంది. మరోసారి సమావేశాల్లో పెట్టుకోవచ్చు.
8 లోక్‌సభలో నెగ్గిన బిల్లు, రాజ్యసభలో వీగిపోతే ఏం జరుగుతుంది?
ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి బిల్లుపై ఆమోదం పొందవచ్చు.
8 ఉభయ సభలలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత దానిపై రాష్ట్రపతి ఆమోద ముద్ర పడేందుకు నిర్దిష్టమైన గడువు ఉంటుందా?
ఎలాంటి గడువు లేదు. రాష్ట్రపతి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. చేయకపోనూవచ్చు.

8 మంత్రుల బృందం మాటేమిటి?
మంత్రుల బృందం ఏర్పాటు తప్పనిసరేమీ కాదు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్‌లకు ఇలాంటి బృందాలను ఏర్పాటు చేయలేదు. రాజధానికి దూరంగా ఉన్న ప్రాంతాలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరాయి. ఆ ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండానే విభజన జరిగింది. కొత్త రాజధానులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరు. అనేక అంశాలపై స్టేక్ హోల్డర్ల వాదనలు వినాలి. గతంలో జార్ఖండ్‌కు, బీహార్‌కు కలిపి జలమండలిని ఏర్పాటు చేశారు. వనరులు, ఆస్తులు, ఆదాయ పంపిణీలపై ఇరు ప్రాంతాల పెద్దలే కూర్చుని ఒప్పందాలు చేసుకున్నారు. ఇదంతా రెండేళ్లలో కొలిక్కి రావాలని, లేదంటే తాము జోక్యం చేసుకుని... ఏడాదిలో పరిష్కరిస్తామని కేంద్రం చెప్పింది. కానీ, కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం రాలేదు.
8 మంత్రుల బృందాన్ని ఏ దశలో నియమిస్తారు?

విభజనపై కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత.. ఇక విభజనకు సంబంధించిన విధి విధానాలను పూర్తి చేసేందుకు మంత్రుల బృందాన్ని నియమించవచ్చు. ఈ బృందం కేబినెట్‌కు ఇచ్చే నివేదిక ఆధారంగానే ముసాయిదా బిల్లు తయారవుతుంది.
8 ఏయే శాఖల మంత్రులతో జీవోఎం ఏర్పాటు చేస్తారు?
సమస్యలు ఉన్న అంశాలకు సంబంధించిన శాఖల మంత్రులతో! మంత్రులకు సలహాదారులుగా అధికారులు, నిపుణులు వ్యవహరిస్తారు.
8 అప్పులు, ఆస్తులు, నీళ్లు, నిధులు, ఉద్యోగులు.. ఇలాంటి విషయాల్లో మంత్రుల బృందం చెప్పిందే అంతిమమా?
నీళ్లు, నిధులు తదితర సమస్యలున్న అంశాల్లో ఇరు ప్రాంతాల వారు ఒప్పందానికి రావాలి. లేదంటే కేంద్రమే చూసుకుంటుందని చెప్పే అవకాశం ఉంటుంది.
8 మంత్రుల బృందం నిర్ణయాలకు ఎలాంటి చట్టబద్ధత ఉంటుంది?
మంత్రుల బృందం నిర్ణయాన్ని ఇరు ప్రాంతాల వారు అంగీకరించి ఒప్పంద సంతకాలు చేయాలి. భాగస్వామ్యులు ఎవరెవరు అనేది గుర్తించాలి.

No comments:

Post a Comment