Friday 20 September 2013

ఐటీ భాగ్య'నగ'రి

ఐటీ భాగ్య'నగ'రి

September 21, 2013


న్యూఢిల్లీ : హైదరాబాద్ చుట్టూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటిఐఆర్)కు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 2.19 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ రీజియన్ ప్రాజెక్టు ఏర్పాటుకానుంది. హైదరాబాద్‌లో ఐటిఐఆర్ ఏర్పాటుకు శుక్రవారంనాడిక్కడ సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) కొన్ని షరతులతో ఆమోదం తెలిపినట్టు సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి మనీష్ తివారీ విలేకరులకు తెలిపారు.

ప్రతిపాదిత పెట్టుబడుల్లో ఐటి/ఐటిఇఎస్ రంగం 1.18 లక్షల కోట్ల రూపాయలు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఇహెచ్ఎం) రంగం 1.01 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. ఈ రీజియన్ వల్ల ప్రత్యక్షంగా దాదాపు 15 లక్షల మందికి, పరోక్షంగా 55.9 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. మొత్తం పెట్టుబడుల్లో అధికంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాల ద్వారానే వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఐటిఐఆర్‌ను 202 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. మూడు క్లస్టర్లుగా దీనిని అభివృద్ధి చేస్తారు. ఇదిలా ఉంటే... మూడు రేడియల్ రోడ్ల ఆధునికీకరణతోపాటు 3,275 కోట్ల రూపాయల వ్యయంతో ఫలక్‌నుమా నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైల్‌ను పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.


ఇదీ ఐటిఐఆర్ రీజియన్..
కొన్నేళ్లుగా నానుతున్న ఐటిఐఆర్ రీజియన్ హైదరాబాద్‌కు మూడు వైపులా విస్తరించి ఉంటుంది. అంటే దీనిని మూడు క్లస్టర్లుగా అభివృద్ధి చేస్తారు. ఇప్పటికే ఐటి కంపెనీలకు కేంద్రంగా ఉన్న మాదాపూర్,గచ్చిబౌలీ, నానక్‌రామ్ గూడ సహా సైబరాబాద్ డెవలప్‌మెంట్ ఏరియాలో ఒక క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తారు. మరో క్లస్టర్‌ను శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతం, దానిని ఆనుకొని ఉన్న మహేశ్వరంలో ఏర్పాటు చేస్తారు. మూడోది ఉప్పల్, పోచారం మధ్యలో విస్తరించి ఉంటుంది. ఈ మూడు క్లస్టర్లను రెండు దశల్లో పూర్తి చేస్తారు. మొదటి దశ 2013 నుంచి 2018 సంవత్సరం వరకు, రెండో దశ 2018 నుంచి 2038 సంవత్సరం వరకు అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భవిష్యత్ కూడా ముడివడి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజనకు సంబంధించిన అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భారీ ప్రాజెక్టును ప్రకటించడం కొన్ని వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

No comments:

Post a Comment