Sunday 15 September 2013

స్వేచ్ఛా భారతంపై నిజాం ధిక్కారం - 1

స్వేచ్ఛా భారతంపై నిజాం ధిక్కారం

September 15, 2013


యావత్ దేశానికి దాస్య శృంఖలాలు తెగాయి! కానీ... ఒక్క ప్రాంతం మాత్రం బందీగానే ఉంది. దేశమంతటా స్వాతంత్య్రపు వెలుగులు విరజిమ్ముతున్నాయి! కానీ.. ఒక్క ప్రాంతం మాత్రం చీకట్లోనే మగ్గుతోంది. దేశమంతా ప్రజాస్వామ్య, స్వీయ పరిపాలనలోకి వచ్చింది. కానీ... ఒక్క ప్రాంతంలో మాత్రం రాజరికమే బుసలు కొడుతోంది. ఒకటీ రెండూ రోజులు కాదు! ఏకంగా 13 నెలలు ఇదే పరిస్థితి కొనసాగింది! అది... నైజాము రాజ్యం. ప్రధానంగా... తెలంగాణ ప్రాంతం. 'సెప్టెంబర్ 17'న హైదరాబాద్ సంస్థానం విమోచన దినోత్సవ సందర్భంగా 'ఆంధ్రజ్యోతి' అందిస్తున్న వరుస కథనాలు నేటి నుంచి... 1947.. ఆగస్టు 15! శతాబ్దాల బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన మధుర క్షణాలవి.

యావత్ భారతావని స్వేచ్ఛా పవనాలతో పులకించిపోతుండగా.. హైదరాబాద్ సంస్థానంలో మాత్రం నిర్వేదం అలముకుంది. దీనికి కారణం.. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానం మాత్రం స్వేచ్ఛకు నోచుకోలేదు. దీనిని భారతదేశంలో విలీనం చేసేందుకు అప్పటి నిజాం ఉస్మాన్ అలీఖాన్ ససేమిరా అన్నాడు. భారత ప్రభుత్వం నిజాంకు నచ్చచెప్పేందుకు విశ్వప్రయత్నం చేసింది. కానీ, ప్రభుత్వ సూచనలను నిజాం ఖాతరు చేయలేదు. పైగా ఖాసిం రజ్వీ సారథ్యంలోని రజాకార్ల దండును నమ్ముకుని భారత ప్రభుత్వానికే సవాలు విసిరాడు. పాకిస్థాన్‌తో చేతులు కలిపే ప్రయత్నం చేశాడు. ఫలితంగా, హైదరాబాద్ సంస్థానం పరిధిలోని కోటిన్నర మందికి పైగా ప్రజలు 1947 ఆగస్టు 15 నుంచి 13 మాసాలపాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించారు. చివరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసోపేతంగా సైనిక చర్య చేపట్టి నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించారు.


దక్షిణ భారతదేశంలోని దక్కన్ పీఠభూమి అంతటా విస్తరించి ఉన్న హైదరాబాద్ సంస్థానం 1724లో ఏర్పాటైంది. మొగలాయుల పాలన అంతరించిన వెంటనే నిజాం ఉల్ ముల్క్ అసఫ్ ఝా హైదరాబాద్ సంస్థానాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని మిగిలిన సంస్థానాలతో పోలిస్తే హైదరాబాద్ సంస్థానం సిరిసంపదలతో తులతూగుతూ ఉండేది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లోని కొన్ని ప్రాంతాలతో కలిపి 2 లక్షల 14 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హైదరాబాద్ సంస్థానంలో 1941 జనాభా లెక్కల ప్రకారం ఒక కోటి 63 లక్షల మంది జనాభా ఉండేవారు. వీరిలో 85 శాతం మంది హిందువులు. వారిలో తెలుగు మాట్లాడేవారు 48 శాతం, మరాఠీ 26 శాతం, కన్నడ మాట్లాడేవారు 12 శాతం, ఉర్దూ మాట్లాడేవారు 10 శాతం ఉండేవారు. హైదరాబాద్ సంస్థానానికి సొంత సైన్యం, విమాన సర్వీసులు, రైల్వే, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేది.

సొంత కరెన్సీ, రేడియో వ్యవస్థ కూడా ఉండేది. నిజాం ఉస్మాన్ అలీఖాన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరొందారు. పూర్వీకుల నుంచి వచ్చిన కోట్ల విలువ చేసే రత్నాలు, ఆభరణాలతోపాటు ఏటా పన్నులు, భరణాల రూపంలో కోట్ల రూపాయలు వచ్చి పడేవి. ఇక, సంస్థానంలో హిందువులు అధిక సంఖ్యలో ఉన్నా అన్ని రంగాల్లో ఆధిపత్యం ముస్లిములదే. సైన్యంలో 1765 మంది అధికారులుంటే వారిలో 421 మంది మాత్రమే హిందువులంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతేనా.. బ్రిటిష్ పాలనలోకి వెళ్లిన తొలి సంస్థానంగా కూడా హైదరాబాద్ వాసికెక్కింది. శతాబ్దాల పోరాటం ఫలితంగా భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. భారతదేశంతో ఉంటారో లేక పాకిస్థాన్‌తో కలుస్తారో లేక స్వతంత్రంగా ఉంటారో తేల్చుకోవాలంటూ దేశంలో ఉన్న 565 సంస్థానాలను భారత ప్రభుత్వం కోరింది. దీంతో, స్వతంత్ర రాజ్యంగా ఉండాలని నిజాం నిర్ణయించాడు.


భారత ప్రభుత్వంతో విలీనానికి ఒప్పుకోని నిజాం బ్రిటిష్ ప్రభుత్వాన్ని సంప్రదించాడు. హైదరాబాద్ సంస్థానాన్ని బ్రిటిష్ కామన్ వెల్త్ దేశాల్లో ఒక దాన్నిగా పరిగణించాలని విజ్ఞప్తి చేశాడు. నిజాం ప్రతిపాదనను బ్రిటిష్ ప్రభుత్వం తోసిపుచ్చింది. అయితే, స్వతంత్ర సంస్థానంగా ఉండాలని నిజాం ప్రకటించగానే హైదరాబాద్ సంస్థానంలోని అధిక శాతం ప్రజలు నిర్వేదానికి గురయ్యారు. దేశం నడిబొడ్డున ఉన్న ఒక ప్రాంతం స్వతంత్ర రాష్ట్రంగా ఉంటే భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తుతాయని భారత ప్రభుత్వం భావించింది. నిజాంకు ఎలాగైనా నచ్చచెప్పేందుకు ప్రయత్నించింది. హైదరాబాద్ సంస్థానంలో యథాతథ స్థితిని కొనసాగించే ఒప్పందంపై సంతకాలు చేయాలని నిజాంను కోరింది. అందుకు కూడా నిజాం అంగీకరించలేదు. హైదరాబాద్ సంస్థాన ఏజెంట్ జనరల్ కేఎం మున్షి, నిజాం అనుయాయుడు లాయక్ అలీ తదితరులతో అప్పటి గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. ఎటువంటి రాజీ ప్రయత్నాలకు నిజాం ఒప్పుకోలేదు.

పైగా భారత ప్రభుత్వం తమ భూభాగం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి, తమను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని హైదరాబాద్ సంస్థాన అధికారులు ఆరోపించారు. అదే సమయంలో, హైదరాబాద్ ప్రభుత్వం పాకిస్థాన్ కొమ్ము కాస్తోందని, ఆ దేశానికి రూ.20 కోట్లు పంపడంతోపాటు అక్కడి నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటోందని భారత అధికారులు ఆరోపించారు. పరస్పర ఆరోపణల నేపథ్యంలోనే, 1948 జూన్‌లో మౌంట్ బాటెన్ ఒక ఒప్పందానికి రంగం సిద్ధం చేశారు. హైదరాబాద్ సంస్థానం సారథిగా నిజాం కొనసాగుతారని, పాలనంతా నిజాం ఆధ్యర్యంలోనే నడుస్తుందని, అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి శాసనసభ ఏర్పాటుకు అనుమతించాలనేది ఒప్పంద సారాంశం. ఇందుకు భారత ప్రభుత్వం ఒప్పుకొని సంతకాలు చేసినా నిజాం మాత్రం భారత్ ఆధిపత్యాన్ని ఏ కోశానా ఒప్పుకోనని స్పష్టం చేశాడు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో ఐక్య రాజ్య సమితి జోక్యం చేసుకునేలా చొరవ చూపాలంటూ అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్‌ను కూడా ఆశ్ర యించాడు.

No comments:

Post a Comment