Sunday 15 September 2013

సాయుధ పోరులో సాంస్కృతిక సైన్యం

సాయుధ పోరులో సాంస్కృతిక సైన్యం

September 16, 2013



తెలంగాణలోని ప్రజల దుర్భర జీవితాన్ని కళ్లకు కట్టినట్టు తమ నవలల్లో చిత్రీకరించిన రచయిత దాశరథి రంగాచార్యులు, వారి మొదటి నవల చిల్లర దేవుళ్లు. ఆనాటి తెలంగాణ రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అద్దం పట్టింది. పోలీసు చర్యకు పూర్వం తెలంగాణ ప్రాంతంలో చిల్లర దేవుళ్లు అధికార రూపంలో చేసిన దురాగతాలూ, అనుభవించిన భోగవిలాసాలు-గ్రామ వ్యవస్థ-ఈ నవలలో ప్రతిభావంతంగా చిత్రీకరింపబడ్డాయి. 1937-38 ప్రాంతంలోని భూస్వామ్య వ్యవస్థ ఎలా ఉండేదో ఈ నవల ద్వారా కొంతైనా అవగాహన చేసుకోవచ్చును. రంగాచార్య రాసిన మూడు నవలల్లోనూ కూడా తెలంగాణ మాండలిక భాష ఆయా పాత్రలకు జవ జీవాలను కల్పించాయి.
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజలను పోరాటానికి సమాయత్తం చేసేందుకు రాజకీయ చైతన్యంతో బాటు సాంస్కృతిక చైతన్యం కూడా తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది. తెలంగాణ ఉద్యమం దేశ విదేశ రచయితల మీద గాఢంగా తన ప్రభావాన్ని చూపించింది. ఉత్తేజాన్ని కలిగించే కవిత్వం, నవలలు, కథలు, నాటకాలు, ప్రజా కళారూపాలు పుంఖానుపుంఖంగా వెలువడ్డాయి.


తెలంగాణ పోరాట కాలంలో ప్రఖ్యాత కవి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ Tales of Telangana' అన్న పేరుతో తెలంగాణ విప్లవ గాథలను ఆంగ్లంలో రాశాడు. ఆరుద్ర వాటిని 'వీర తెలంగాణా విప్లవ గాథలు' పేరుతో ఆంధ్రీకరించారు.
విలేఖించనిండు నన్ను/వీర తెలంగాణా వీర గాథ!
వ్యథల తోడ నిండిననూ/వ్యాకుల త్యాగాల తోడ
పెల్లుబికే ఆశాలత/పల్లవించు పరమ గాథ
అంటూ ఉత్తేజపూరితంగా సాగుతుంది ఈ కవిత.
తెలంగాణ సాయుధ పోరాటాన్ని భావావేశంతో చిత్రీకరించిన కవి సోమసుందర్. వీరి 'వజ్రాయుధం' 1949 మార్చి నెలలో వెలువడింది. భూస్వామ్య వ్యవస్థను త్రోసిరాజని బూర్జువా పెట్టుబడిదారీ వ్యవస్థ కాలూనుతున్న దశలో; చరిత్రలో ఒక పరిణామ దశలో వెలువడిన కావ్యం వజ్రాయుధం.

ఖబడ్దార్! ఖబడ్దార్!/ నైజాం పాదుషాహీ
బానిసత్వ విముక్తికై/ రాక్షసత్వ నాశనముకై
హిందూ ముస్లిం పీడిత/శ్రమజీవులు ఏకమైరి... అంటూ నిజాంను తీవ్రంగా హెచ్చరిస్తాడు కవి 'బానిసల దండయాత్ర' అన్న శీర్షికతో రాయబడిన ఈ గేయంలో. జనగామ, బాలేముల, నల్లగొండల్లో జరిగిన వీరోచిత పోరాటాల ప్రస్తుతి ఉద్వేగంగా రచింపబడింది. ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవిస్తారని, ఒక నెత్తుటి బొట్టులోన ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లుతాయని ఆశాగీతం ఆలాపిస్తుంది వజ్రాయుధం.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రాయబడిన మరొక కావ్యం ఆరుద్ర 'త్వమేవాహం'. ఇది సామాన్యులకు కొరకుడుపడని ప్రతీకాత్మక కావ్యం. విడమర్చి చెబితేగాని వివరంగా బోధపడని సాంకేతిక పదాలు, పదబంధాలు, బింబాలు గల కావ్యం. ఇది 1949 జూలైలో వెలువడింది.
రెంటాల 'సర్పయాగం'లో తెలంగాణా సమరగీతం అన్న ఖండికలో 'పగలేయి నిజాం కోట, ఎగరేయి ఎర్రబావుటా!' అని నిజాం నిరంకుశత్వాన్ని ప్రతిఘటించారు. తెలంగాణ విముక్తి సమర కవిత్వాన్ని శక్తివంతంగా ఆవిష్కరించిన మరొక కావ్యం గంగినేని వెంకటేశ్వరరావు 'ఉదయిని'. గంగినేని ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్న కవి. కమ్యూనిస్టు ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఉండడంతో ఉద్యమ తీవ్రతను ఉదయినిలో పలికించగలిగాడు. ఇందులో అరణ్య పర్వం, యుద్ధ పర్వం, శాంతి పర్వం అన్న మూడు పర్వాలున్నాయి. మానవ హక్కులు కాలరాయబడ్డ నైజాం రాజ్యంలో భూస్వాముల, అధికార్ల, వారి తాబేదార్ల గూండాల ఇనుప పాదాల కింద సామాన్య ప్రజల జీవితాలు ఏ విధంగా నలిగిపోయాయో వాస్తవికతకు దగ్గరగా చిత్రించారు గంగినేని. ప్రజల్ని జైళ్లలో కుక్కడం, కొంపాగోళ్లను తగలబెట్టడం, దోపిళ్లు, మానభంగాలు, ఖూనీలు, ప్రజల బానిసత్వం మొదలయిన విషయాలను ఇందులో రాశారు.

'తల్లి తనయునికి' అన్న గేయంలో- ఒక తల్లి జీవన్మరణ సమస్యలో కూరుకుపోయి కూడా పోరాటంలో ఉన్న కుమారునికి ఇలా రాస్తుంది-
కాళ్లు కళ్లు లేని నాకు మంచి నీళ్లిచ్చే దిక్కు లేదు/ఇల్లు పోలీసుల కప్పజెప్పి
పరుల పంచల్లో పడి ఉంటున్నా/ ఏడ్చే ఓపిక కూడా లేక బూడిద ముద్ద లాగున్నా
గడ్డ కట్టిన కాపారాలలా ఉన్న కనుగుడ్ల వెంట నీళ్లు రావు
కాని నా నిమిత్తం- అరనిమిషం విప్లవ మార్గం తప్పవద్దు -కాటికి కాళ్లు చాచుకున్న తనకోసం సమాజ ప్రయోజనాన్ని పణంగా పెట్టొద్దన్న ఆ తల్లి మాటలు తెలంగాణలోని నాటి వీర మాతల పరిస్థితిని తెలుపుతున్నాయి.

తెలంగాణ ఉద్యమాన్ని సజీవమైన ప్రజల భాషలో రాసిన కాళోజిని నిజాం ప్రభుత్వం ఎన్నోసార్లు జైల్లో నిర్బంధించింది. వరంగల్లు నుండి బహిష్కరించింది. వీరి 'నా గొడవ' అందరి గొడవగా ప్రసిద్ధి చెందింది. నా గొడవను 1953లో శ్రీశ్రీ ఆవిష్కరించారు.
నల్లగొండలో నాజీ శక్తుల/నగ్న నృత్య మింకెన్నాళ్లు?
పోలీసు అండను దౌర్జన్యాలు/పోషణ బొందేదెన్నాళ్లు? -అంటూ నిజాం సంస్థానంలోని నాజీల్లాంటి పోలీసుల దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తాడు. నా గొడవలోని ప్రతీ కవితా తెలంగాణలో ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. ప్రజాకవిగా కాళోజి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు.
తెలంగాణ విమోచనోద్యమాన్ని భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటుగా భావించి కుందుర్తి 'తెలంగాణా' కావ్యాన్ని రచించాడు. ఇది నిజాంకు వ్యతిరేకంగా కర్షకులు, కార్మికులు సమిష్టిగా జరిపిన తిరుగుబాటును సమగ్రంగా చిత్రించిన సంపూర్ణ కావ్యం. 1956లో ప్రచురింపబడింది.
బహుశా యిదే మొదలనుకుంటాను/ తెలంగాణాలో దిగిన వెలుగు దేశ దేశాలలోని చీకట్లను/ శిక్షిస్తుంది చివరకు -అన్న ఆశాభావంతో ముగుస్తుంది కుందుర్తి 'తెలంగాణా'. ఇంకా అనిసెట్టి, అవసరాల, రమణారెడ్డి మొదలగువారు కూడా ఈ ఉద్యమాన్ని ప్రతిబింబించే కవిత్వం రాశారు.


తెలంగాణా పోరాటం ఇతివృత్తంగా రాయబడ్డ నవలలు ఈ కాలంలో ఎక్కువగా వెలువడలేదు. ఉద్యమ కాలంలో అంత వ్యవధి ఉండకపోవడమే అందుకు కారణం కావచ్చును. అయితే వట్టికోట ఆళ్వారుస్వామి 'ప్రజల మనిషి' ఈ కాలంలోనే రాయబడింది. ఇందులో జాతీయోద్యమం శక్తివంతంగా చిత్రీకరింపబడింది. నిజాంకు వ్యతిరేకంగా నడచిన ఉద్యమం పునాదులు ఈ నవలలోని సంఘటనల ద్వారా మనకు తెలుస్తాయి. ఈ నవలలోని కథా నాయకుడు కంఠీరవం. నిజాం నిరంకుశాధికారాన్ని, దేశ్‌ముఖుల్ని, దొరల్ని అతడు సాహసోపేతంగా ఎదుర్కొంటాడు. ప్రజల కోసం పోరాడుతూ ప్రజల్ని చైతన్య వంతుల్ని చేస్తాడు.

బొల్లిముంత శివరామకృష్ణ 'మృత్యుంజయులు' నవల 1947లో ప్రకటించబడింది. "తెలంగాణా ప్రజల చైతన్య స్రవంతికి చిహ్నం 'సంఘం'. దోపిడి ఏ రూపాన ఉన్నా దానిపై తిరుగుబాటుకు ప్రతిరూపం 'సంఘం'. మొక్కవోని ధైర్యానికీ, అడుగడుగునా గుండె నెత్తురులు వారబోసిన అమోఘ త్యాగానికీ మారుపేరు సంఘం. ఒకనాడు ఊరుపేరూ లేని అజ్ఞాని- ఒకనాడు 'నీ కాల్మొక్తా దొరా' - అనే బానిస- వెట్టిచాకిరి, తిట్లు, చీవాట్లు, కొరడా దెబ్బలు, హత్యలు, మానభంగాలు - ఇలా పాశవికత ఎన్ని రూపాలు ధరించిందో వాటన్నిటికీ తల ఒగ్గి, దిగమింగి రెండు కన్నీటి బొట్లను కూడా రాల్చలేని సాధారణ రైతు - మామూలు కూలీ - చేతికందిన ప్రతి ఆయుధంతోనూ ఎదిర్చి, గెరిల్లా పోరాటం చేసి, నిజాం ప్రభుత్వం సైన్యాలను ముప్పుతిప్పలు పెట్టిన మహోజ్వల సమరగాధను రచించినదే 'సంఘం'' -అంటూ ఈ నవలకు పరిచయం రాశారు తుమ్మల వెంకట్రామయ్య.
హిందూ ముస్లింల సమైక్యత కూడ దీనిలో చిత్రీకరింపబడింది. పేద హిందూ ముస్లింలకు, నిజాం ఉమ్మడి శత్రువని ఈ నవలలో నిరూపింపబడింది.
మహీధర రామమోహన్‌రావు 'ఓనమాలు' ఉద్యమ ప్రభావంతో రాసినదే. కిషన్ చందర్ 'జబ్ ఖేత్ జాగె', నారాయణరావు నవలలూ కొంతవరకు ఇలా ప్రభావితమైనవే. ఉద్యమం ఆగిపోయింతర్వాత కూడ ఆ ప్రభావానికి లోనై కొందరు నవలలు రాశారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంగా భాస్కరభట్ల కృష్ణారావు 'యుగసంధి'ని రాశాడు. సింగరాజ లింగమూర్తి 'ఆదర్శాలు-ఆంతర్యాలు' నవల రాశాడు.

తెలంగాణలోని ప్రజల దుర్భర జీవితాన్ని కళ్లకు కట్టినట్టు తమ నవలల్లో చిత్రీకరించిన రచయిత దాశరథి రంగాచార్యులు, వారి మొదటి నవల చిల్లర దేవుళ్లు. ఆనాటి తెలంగాణ రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అద్దం పట్టింది. పోలీసు చర్యకు పూర్వం తెలంగాణ ప్రాంతంలో చిల్లర దేవుళ్లు అధికార రూపంలో చేసిన దురాగతాలూ, అనుభవించిన భోగవిలాసాలు-గ్రామ వ్యవస్థ-ఈ నవలలో ప్రతిభావంతంగా చిత్రీకరింపబడ్డాయి. 1937-38 ప్రాంతంలోని భూస్వామ్య వ్యవస్థ ఎలా ఉండేదో ఈ నవల ద్వారా కొంతైనా అవగాహన చేసుకోవచ్చును. వారిదే మరొక నవల మోదుగుపూలు. భూమి లేక, భుక్తి లేక స్వేచ్ఛ లేక కనీసం పత్రికలను చదవడం కూడా నేరంగా పరిగణింపబడే నిజాం నిరంకుశ జాగీర్లలోని ప్రజల జీవితాలు దానిలో చూపించారు. రచయిత గిరిజనుల ఆచార వ్యవహారాలు కూడా ఎంతగానో పరిశోధించి రాశారు. పోలీసు చర్య నుండి రెండు దశాబ్దాల చరిత్రను 'జనపదం'లో చిత్రీకరించారు. ఈ మూడు నవలల్లో కూడా తెలంగాణ మాండలిక భాష ఆయా పాత్రలకు జవ జీవాలను కల్పించాయి.


తెలంగాణ ఉద్యమ ప్రభావంతో కథా సాహిత్యం అంతగా వెలువడలేదనే చెప్పవచ్చు. అయితే నిజాం సంస్థానంలోని ప్రజా జీవితాన్ని చిత్రించిన కథలు లేకపోలేదు. ఈ విధమైన కథలు సృష్టించిన తెలంగాణ రచయితల్లో ప్రథమాగ్రగణ్యులు సురవరం ప్రతాపరెడ్డి.
విమర్శకులు కవులగుట, కవులు కథానిక రచయితలగుట క్వాచిత్కము. సాంఘిక జీవితాన్ని విమర్శనా దృష్టితో పరిశీలించి, తత్కాల సమస్యలకు స్పందించి, తత్ప్రయోజనం కొరకు కలం సాగించినవారు ప్రతాపరెడ్డి. తెలంగాణలో వెట్టిచాకిరి, మూఢాచారాలు, అధికారుల దుండగాలు ముప్పిరిగొన్న కాలమది. కక్షలతో నిండిన గ్రామాలు, ఉర్దూమయములైన వేషభాషలు, విద్యారాహిత్యం మొదలైన గుణాలతో నిండిన సమాజాన్ని రచనలలో ప్రతిఫలింపజేసి సమస్యలకన్నింటికి చక్కని పరిష్కారం చెప్పినవారు ప్రతాపరెడ్డి.

'సంఘాల పంతులు' అన్న కథానికలో వెట్టిచాకిరికి సంబంధించిన ప్రజల బాధలు వర్ణింపబడ్డాయి. గోల్కొండ పత్రికలో 'మొగలాయి కథలు' అన్న పేరుతో కొన్ని అధిక్షేపాత్మక కథలను ప్రతాపరెడ్డి ప్రకటించారు. 'గ్యారా కద్దూ బారా కొత్వాల్' అన్న కథ ఆ రోజుల్లో బాగా ప్రసిద్ధి పొందిన సెటైర్. 'వింత విడాకులు' కథ తెలంగాణ సాంఘిక జీవితాన్ని ప్రతిబింబించిన కథ. వేలూరి శివరామశాస్త్రి సుల్తానీ, పిత్తల్ కా దర్వాజా మొదలైన కథలు రాశారు.
గంగినేని వెంకటేశ్వరరావు 'ఎర్రజెండాలు' తెలంగాణ ఉద్యమాన్ని వివరంగా తెలిపే కథా సంపుటి. ఇందులో కథలయితేనేమి, జీవిత చిత్రణలయితేనేమి మొత్తం 32 ఉన్నాయి. మొదటి కథ 'ఎర్రపులి' ప్రతీకాత్మకంగా రాయబడింది. ఓ పుత్రుణ్ణి పోగొట్టుకున్న మాతృ హృదయాన్ని దయనీయంగా చిత్రీకరించాడు రచయిత. ఆ మాతృమూర్తి తెలంగాణ. రణం ఆమె మారు పేరు. కథలోని కుర్రాడి పేరు ఆంధ్ర. అమ్మాయి రాయలసీమ...
'మృత్యువుపై సమరం' కథలో స్వేచ్ఛపై ఎలాంటి ఆంక్షలు ఉండేవో స్పష్టంగా తెలియజేశాడు రచయిత. ఆంధ్ర మహాసభకు వెళ్లినందుకు, సంగం పెడదామని ప్రయత్నించినందుకు, కూలీ పెంచాలని కూలీ వారికి చెప్పినందుకు, రాత్రిపూట బడిపెట్టి వయోజనులకు చదువు చెప్పినందుకు, హరిజనుల ఇంట్లో అన్నం తిన్నందుకు, పేపరు తెచ్చి పదిమందికి పంచినందుకు వీరయ్యను వెలివేస్తారు గ్రామాధికార్లు.

ఇక దళంలో పనిచేసే కామ్రేడ్సు బంధువులను ఎట్లా చిత్రహింసలు పెట్టేవారో 'ఓ నవ్వు ఆగింది' అన్న కథలో వర్ణించారు. ఇంకా అనేక విషయాల గురించి, తెలంగాణ ఉద్యమంలో ఆత్మార్పణ చేసిన వీరుల గురించి, అనేక గ్రామాలు తిరిగి విషయ సేకరణ చేసి శక్తివంతంగా రాశాడు గంగినేని వెంకటేశ్వరరావు.


తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో వెలువడిన నాటకాలు చాలా తక్కువైనప్పటికీ- వెలువడిన ఒకటి రెండు కూడా ప్రజలను ఉర్రూతలూపిన నాటకాలే. 'ముందడుగు' వంటి నాటకంతో అభ్యుదయ భావాలను ప్రచారం చేసిన నాటకకర్తలు సుంకర, వాసిరెడ్డి సుప్రసిద్ధమైన 'మా భూమి' నాటకం రాశారు.
బందగీ అనే పేద ముస్లిం కథ ఆధారంగా రాయబడ్డదీ నాటకం. బందగీ, అబ్బాసలీ అనే ముస్లిం సోదరులకు భూమి దగ్గర పేచీ వచ్చింది. దుష్ట భూస్వామి విసునూరు రామచంద్రారెడ్డి అబ్బాసలీ పక్షాన చేరి భూమిని మిగిలిన సోదరులకివ్వకుండా కుట్ర పన్నాడు. న్యాయంగా తమకు రావలసిన భూమికోసం బందగీ ఎదురుతిరిగాడు. భూస్వామి అండతో అబ్బాసలీ కోర్టులో దావా వేశాడు. కోర్టు తీర్పు బందగీకి అనుకూలంగా వచ్చింది. కోర్టు తీర్పుతో తన ప్రతిష్ట దెబ్బతిన్నట్టు భావించాడు భూస్వామి. ప్రతీకార వాంఛతో, బస్సు దిగి వస్తున్న బందగీని దారుణంగా హత్య చేయించి పగ తీర్చుకున్నాడు. న్యాయం కోసం పోరాడిన అమాయకుణ్ణి చంపించిన భూస్వామి మీద ప్రజలకు ద్వేషం, అసహనం పెరిగింది. భూమికోసం తెలంగాణలో జరిగిన మొదటి పోరాటంగా దీన్ని భావించారు. భూస్వామి క్రూరత్వానికి బలి అయిన బందగీని ప్రజలు యిప్పటికీ భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటారు. ఆ అమరగాధ స్ఫూర్తితో రచింపబడినదే 'మా భూమి'.


రాజకీయ ఉద్యమాలు సామాన్య ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి ప్రజా కళారూపాల కున్నంత శక్తి ఇతర ఏ సాహిత్య ప్రక్రియలకూ లేదనడం నిర్వివాదాంశం. కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల్లో నాజర్, సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు, గరిమెళ్ల సత్యనారాయణ మొదలైనవారి గేయాలు, కథలు ఎంతో ప్రాశస్త్యాన్ని పొందాయి. బుర్రకథ, జముకుల కథ, ఒగ్గు కథ, వీధి నాటకాలు మొదలైన కళారూపాలు ప్రజల్ని ఎంతో ఉత్తేజపరిచేవిగా ప్రచారం పొందాయి.
యాదగిరి రాసిన 'బండెనక బండి కట్టి' పాట ఆ బాల గోపాలాన్ని ఊర్రూతలూగించడానికి అది జానపద కళారూపానికి సంబంధించినది కావడమే కారణం.

ఈ విధంగా తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఎందరో అజ్ఞాత కవులు కూడా పాటలు, పద్యాలూ రాసి తెలంగాణ విముక్తి కోసం తమ వంతు బాధ్యత నెరవేర్చుకున్నారు. తెలంగాణ పోరాటం ప్రభావితం చేసినంతగా మరే యితర ఉద్యమమూ తెలుగు కవుల్నీ కళాకారుల్నీ ప్రభావితం చేయలేదంటే అతిశయోక్తి ఏ మాత్రమూ కాదు.
ఈ నేపథ్యంలో దాశరథి 'తీగలను తెంపి అగ్నిలో దింపినావు. నా తెలంగాణా కోటి రత్నాల వీణ' అంటూ కలం, గళం ఎత్తి తెలంగాణ ఉద్యమాన్ని తన కవిత్వంలో ప్రతిబింబిస్తూ, తెలుగు సాహిత్య రంగంలోకి ప్రవేశించాడు. దాశరథి ఉద్యమ కవిత్వం గురించి రాయాలంటే అదో పెద్ద గ్రంథమే అవుతుంది. అందుకే ఆ సాహసం చేయడం లేదు.

No comments:

Post a Comment