Saturday 31 August 2013

హైదరాబాద్ ఎవరిది? - డాక్టర్ శైలజనాథ్ సాకె

హైదరాబాద్ ఎవరిది? - డాక్టర్ శైలజనాథ్ సాకె

August 31, 2013

 
జూలై 30 వ తేదీన యూపీఏ సమన్వయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ఆమోదం తెలిపాయి. ఆ నిర్ణయంతో దిగ్భ్రాంతికి గురైన తెలుగు ప్రజలు తేరుకోక ముందే, కొందరు హైదరాబాద్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమాంధ్ర ఉద్యోగులందరూ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవల్సిందేనని రెచ్చ గొట్టేటట్లు మాట్లాడారు. ఆ వ్యాఖ్యలతో కోస్తాంధ్ర, రాయలసీమాంధ్ర ప్రాంతాలు భగ్గుమన్నాయి.పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అక్కడి ప్రజల నిరసన క్రమేణా మహోద్యమం వైపు పయనిస్తోంది. ప్రజాస్వామ్య బద్ధమైన వారి ఆకాంక్షకు మద్దతు తెలుపుతున్నాం. వారి పోరాటానికి జేజేలు పలుకుతున్నాం.

రాజ్యాంగబద్ధంగా తమ రాష్ట్ర రాజధానిలో దశాబ్దాలుగా ఉద్యోగాలు చేస్తున్న కోస్తాంధ్ర రాయలసీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు తమ అస్తిత్వం, తమ పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడ్డాయని అర్థమయ్యింది. వారు తమ భయాన్ని నిరసనల రూపంలో ప్రదర్శించడం మొదలుపెట్టారు. తెలంగాణ వాదులు ఆ నిరసన కార్యక్రమాల్ని సానుభూతితో పరిశీలించవలసిందిపోయి ఇంకా రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. 'హైదరాబాదులతో మీకేమి సంబంధం -ఉద్యోగులంతా ఇక్కడ్నించి వెళ్ళిపోవలసిందే -ఇక్కడి ప్రజల రక్త మాంసాలతో మేము అభివృద్ధి చేసుకున్నాం. హైదరాబాదు జోలికొస్తే నాలుకలు చీరేస్తాం' అని ప్రకటిస్తున్నారు. ఇంతకు ముందు ఇక్కడ జరిగిన సంఘటనలు పరిశీలిస్తే కోస్తాంధ్ర, రాయలసీమాంధ్ర ప్రజల భయంలో అర్థముందనిపిస్తోంది. తెలంగాణ వాదానికి వ్యతరేకంగా మాట్లాడిన ఒక ఎమ్మెల్యేకి సాక్షాత్తు అసెంబ్లీ ఆవరణలోనే రక్షణ లేకుండా పోయింది. దేశరాజధాని ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్‌లో పనిచేసే అధికారిపై దాడి జరిగింది.

హైదరాబాదులో పుస్తకావిష్కరణ చేసుకుంటున్న విశాలాంధ్ర మహాసభ వారిపై దాడి జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు. సమైక్యవాదం వినిపించేవారిపై నిర్దాక్షిణ్యంగా దాడులుచేస్తున్నారు.
అసలు అన్ని ఉద్యమాలకు మూలకారణం హైదరాబాదులోనే అభివృద్ధి కేంద్రీకృతం కావడం అని చెప్పక తప్పదు! అది ఎంతగా అంటే , మొత్త ం రాష్ట్ర అవసరాలను తీర్చే స్థాయికి ఎదిగింది. కాబట్టే అటు తెలంగాణ వాదులు హైదరాబాదు తెలంగాణదే అంటున్నారు. ఇటు సీమాంధ్ర ప్రజలు హైదరాబాదులో తమకు న్యాయబద్ధమైన వాటా ఉందని స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ హైదరాబాదుపై ఎవరికి హక్కుందో చారిత్రక వాస్తవాలతో పరిశీలన జరపవలసిన అవసరమెంతైనా ఉంది!

గోల్కొండ నవాబు ఇబ్రహీం కుతుబ్ షా నాయకత్వంలోని దక్కను సుల్తానుల కూటమికి అళియ రామరాయలు నాయకత్వంలోని విజయనగర సామ్రాజ్యానికి 1565లో రాక్షసి-తంగడి వద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అళియ రామరాయలు మరణించాడు . దక్కను సైన్యాలు విజయనగరంలోని సంపదనంతటిని ఆరు నెలల పాటు తమ తమ ఖజానాలకు తరలించాయి. ఆ యుద్ధం తరువాత విజయనగర సామ్రాజ్య ప్రాభవం క్షీణించడం మొదలైంది. క్రమేపీ ఆ సామ్రాజ్యం బలహీనపడి తమ అధీనంలోని ఆంధ్ర ప్రాంతాల్ని పోగొట్టుకుంది. తిరిగి అవి 1646 నాటికి గోల్కొండ సామ్రాజ్యంలో భాగమయ్యాయి. కాకాతీయాంధ్ర సామ్రాజ్య విచ్ఛిన్నం తరువాత విడిపోయిన తెలుగు ప్రాంతాలన్నీ గోల్కొండ నవాబులు కృషితో తిరిగి ఏకమయ్యాయి.

మహ్మద్ కులీ ఖుతుబ్ షా గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత పెరుగుతున్న జనాభా అవసరాల కోసం 1591లో హైదరాబాదు నగర నిర్మాణానికి పునాదులు వేశాడు. తన భార్య భాగమతి ప్రేమ చిహ్నంగా ఈ నగరాన్ని నిర్మించాడని ఒక కథనం. నిర్మాణం పూర్తైనప్పటి నుంచి గోల్కొండ సామ్రాజ్యానికి హైదరాబాదు రాజధానిగా ఉంది. ఈ నగర నిర్మాణానికి 70 లక్షల హొన్నులు ఖర్చైందని మహమ్మద్ కులీ కుతుబ్ షా వద్ద నాజర్‌గా పనిచేసిన మీర్ అబూ తాలత్ తెలిపాడు. హొన్ను అంటే బంగారు నాణెం. అది 3 రూపాయల విలువ గలదని ఆనాడు అంచనా వేశారు. గోల్కొండ నవాబులు గంజాం జిల్లా నుంచి రాయవెల్లూరు వరకు కోస్తాంధ్ర ప్రాంతాల్ని ఆరు సర్కారులుగా విభజించారు. అక్కడి ప్రజల నుంచి కప్పాలను వసూలు చేసేందుకు ఫౌజుదార్లను నియమించారు.

వారు క్రమేణా బలపడి స్థానిక రాజులుగా మారి సామంతులుగా ఉండే వారు. వారి ద్వారా తమకు రావలసిన కప్పాలు వసూలు చేసుకునే వారు. గోల్కొండ నవాబులు రాయలసీమాంధ్రను జయించిన తరువాత ఆ ప్రాంతాలలో శాంతిభద్రతలు పాలెగాళ్ళ చేతుల్లోనే ఉంంచారు. కానీ రెవెన్యూ వసూలు చేయడానికి మాత్రం త మ సేనాధిపతులను పౌజుదార్లుగా నియమించారు. క్రమేపి వారు కడప, కర్నూలు , బనగానపల్లి , ఆదోనిలలో స్థానిక నవాబులుగా ఎదిగారు. అయినా గోల్కొండ సామ్రాజ్యానికి సామంతులుగా ఉంటూ, స్థానిక ప్రజల నుంచి పన్నులు వసూలుచేసి తమ ప్రభువుకి కప్పాలు చెల్లించేవారు.

గోల్కొండ సామ్రాజ్యానికి కొండపల్లి సర్కారు నుంచి సంవత్సరానికి 40,000 హొన్నులు, మచిలీపట్టణం (కృష్ణా) సర్కారు నుంచి 18,000 హొన్నులు, నిజాంపట్టణం (గుంటూరు) సర్కారు నుంచి 60,600 హొన్నులు ఆదాయం వచ్చేదని రికార్డులు తెలియజేస్తున్నాయి. అలాగే, డచ్చి వారు 1610-23 సంవత్సరాల మధ్య మహ్మద్ కుతుబ్ షా నుంచి అనుమతి పొంది గుంటూరు జిల్లాలోని కొల్లూరు వజ్రాల గనులను కౌలుకు తీసుకున్నారు. అందుగ్గాను, వారు నవాబుకు సంవవత్సరానికి మూడు లక్షల హొన్నులు కౌలుగా చెల్లించారు. డచ్చివారు అప్పటి గోల్కొండ నవాబైన మమమ్మద్ కులీ కుతుబ్ షా ను దర్శించి ఒప్పందం చేసుకుని మచిలీ పట్టణం , నిజాంపట్టణంలో స్థావరాలు నిర్మించారు. ఆ ఒప్పందం ప్రకారం ఆయా రేవు పట్టణాలలో జరిగే వ్యాపారంలో గోల్కొండ రాజ్యానికి నాలుగున్నర శాతం ఎగుమమతి సుంక ం, 11 శాతం సముద్ర సుంకం చెల్లించే వారు. ఆనాటి రికార్డుల ప్రకారం సర్కారు ప్రాంతం నుంచి గోల్కొండ సామ్రాజ్యానికి సంత్సరానికి సుమారు రెండు కోట్ల హొన్నులు ఆదాయంగా వచ్చేది. అందులో కోటి హొన్నులు హైదరాబాదు నగరాభివృద్ధికి, పరిపాలనాసంబంధ ఖర్చులకు వ్యయం చేయగా, కోటి హొన్నులు వరకు నికర ఆదాయం ఉండేదని తెలుస్తోంది.

మొగలుల దండయాత్రలో గోల్కొండ సామ్రాజ్యం పతనమైంది. సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాలు మొగలుల అధీనంలోకి వెళ్ళాయి. ఔరంగజేబు మరణానంతరం దక్కనులో వారి రాజప్రతినిధి అయిన నిజాం-ఉల్-ముల్క్ 1724లో స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. నిజాం-ఉల్ -ముల్క్ మరణానంతరం వారసత్వ యుద్ధం సంభవించింది. ఫ్రెంచి వారు ముజఫర్ జంగ్ ను దక్కను సుబేదారుగా ప్రకటించి పుదుచ్చేరిలో పట్టాభిషేకం జరిపారు. అందుకు కృతజ్ఞతతగా మచిలీ పట్టణం, దివిసీమను వారికి దత్తం చేశాడు. ముజఫర్ జంగ్ హైదరాబాదు బయలుదేరి మార్గమధ్యంలో లక్కిరెడ్డిపల్లి వద్ద హత్యకు గురయ్యాడు. ఫెంచ్ సేనాని బుస్సీ హైదరాబాదు చేరి నిజాం మూడవ కుమారుడైన సలాబత్ జంగ్‌ను నిజాంగా ఆచేశాడు. అందుకు కృతజ్ఞతగా సలా బత్ జంగ్ నిజాం పట్టణం, నరసాపూర్‌లను చ్చి యానాంలో ఫ్రెంచ్ స్థావరం నిర్మాణానికి అనుమతి ఇచ్చాడు. సలాబత్ జంగ్‌కు హైదరాబాదులో రక్షణ లేనందు వల్ల తన రక్షణ కోసం బుస్సీని హైదరాబాదులో ఉంచుకున్నాడు.

ఫ్రెంచ్ సైన్యం హైదరాబాదులో మకాం వేసినందుకు నెలకు రెండు లక్షల రూపాయాలు ఖర్చు అయ్యేవి. నిజాంకు అంత పెద్ద మొత్తం చెల్లించేందుకు కష్టంగా ఉండేది. అందువల్ల తూర్పు కోస్తాలోని గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళం సర్కారులను 1753 నవంబర్ 23న ఫ్రెంచి వారికి దత్తం చేశాడు. ఈ ఒప్పందానికి ఔరంగాబాద్ ఒప్పందమని పేరు. ఈ నాలుగు సర్కారులపై 42 లక్షల ఆదాయమొచ్చేది. సైనిక ఖర్చులకు 29 లక్షలు పోను, 13 లక్షల మిగులు ఆదాయం ఫ్రెంచి వారికి ఇచ్చారు. అప్పటి నుంచి 1760 వరకు ఆ ప్రాంతాలపై ఫ్రెంచి వారి అధికారం కొనసాగింది. 1760లో ఇంగ్లీషు వారితో జరిగిన వాండివాష్ యుద్ధం తరువాత సర్కారు ప్రాంతంలో ఫ్రెంచి వారు అధికారం కోల్పోయారు. ఫ్రెంచ్ వారి స్థావరాలన్నీ ఇంగ్లీషు వారి అధీనంలోకి వచ్చాయి.

ఆ వెంటనే సలాబత్ జంగ్‌కి మహరాష్ట్రులతో యుద్ధం వచ్చింది. సలాబత్ జంగ్ తన సోదరుడైన నిజాం అలీఖాన్‌తో కలసి యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో సలాబత్ జంగ్ పూర్తిగా ఓడిపోయి తన ప్రతిష్ఠను కోల్పోయాడు. అలాంటి పరిస్థితిని తనకనుకూలంగా మార్చుకుని సలాబత్ జంగ్ సోదరుడు నిజాం అలీఖాన్ 1761 జూలై 8న అన్నను బంధించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఈయన కాలం నుంచే ఈ వంశం వారు అసఫ్‌జాహీలు అని ప్రఖ్యాతి గాంచారు.

నిజాం అలీఖాన్ అధికారంలోకి వచ్చే నాటికి ఉత్తర సర్కారుల్లో అరాచక పరిస్థతులు నెలకొన్నాయి. పేరుకే అక్కడ నిజాం అధికారం. నిజాం పట్టణం, మచిలీపట్టణం ప్రాంతాలు ఇంగ్లీషువారు అధీనంలో ఉండేవి. చీకాకోలు ( శ్రీకాకుళం) , రాజమహేంద్రవరం ( తూర్పు గోదావరి ) సర్కారులు విజయనగరం రాజుల అధీనంలో ఉండేవి. ఎవరూ గత మూడు సంవత్సరాలనుంచి పేష్కస్ చెల్లించలేదు . సర్కారు ప్రాంతంలోని సామంత రాజులందరిని అదుపులోనికి తీసుకుని గత మూడు సంవత్సరాల పేష్కస్ వసూలుచేయాలని నిర్ణయించుకున్నాడు . మొదటి చర్యలో భాగంగా తన తమ్ముడు బసాలత్ జంగ్‌ను గుంటూరు సర్కారుకు అధిపతిగా నియమించాడు . అక్కడ నుంచి కొండపల్లి ( గుంటూరు) చేరి అక్కడ కప్పం వసూలుచేశాడు. తరువాత కొవ్వూరు (పశ్చిమ గోదావరి) చేరాడు. చికాకోల్ సర్కారు వరకు నిజాం అలీఖాన్ రాక తెలియపరచబడింది. అందరూ స్థానిక రాజులు నిజాంని సందర్శించి పేష్కస్ చెల్లించి నిజాం ఆధిపత్యాన్ని అంగీకరించారు. ఆ విధంగా మళ్ళీ గుంటూరుతో సహా ఉత్తర సర్కారులన్నీ నిజాం అలీ అధికారం కిందకి వచ్చాయి. ఇంగ్లీషువారికి సలాబత్ జంగ్ ఇచ్చిన హక్కులను రద్దుపరచడం జరిగింది.

కానీ బ్రిటిషు వారు ఉత్తర సర్కారులపై హక్కులు సాధించడానికి ప్రయత్నిస్తూనే వచ్చారు. 1766లో కాండ్రేగుల జోగిపంతులు మధ్య వర్తిత్వంలో నిజాం అలీఖాన్ ఇంగ్లీషువారితో ఒప్పందం చేసుకున్నాడు. గుంటూరు మినహా ముస్తాఫానగర్ , ఏలూరు, రాజమండ్రి, చికాకోల్ సర్కారులన్నీ సంవత్సరానికి 15 లక్షల కౌలు చెల్లించే షరతుపై ఇంగ్లీషు వారికి దత్తం చేశాడు . అప్పటి కప్పుడే ఇంగ్లీషు వారు నిజాం అలీకి 9 లక్షలు చెల్లించారు.
భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా 1766 నవంబర్ 12న నిజాం అలీ ఇంగ్లీషు వారి మధ్య ఇంకొక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం మూర్తజానగర్, ముస్తాఫానగర్, ఏలూరు, రాజమండ్రి, చికాకోల్ సర్కారులను ఇంగ్లీషువారికి దత్తం చేశాడు. ఈస్టిండియా కంపెనీ ముస్తాఫానగర్, ఏలూరు, రాజమండ్రి సర్కారులకు ఐదు లక్షల రూపాయలు కౌలుగా చెల్లిస్తుంది.

మూర్తజానగర్ బసాలత్ జంగ్ ఆధిపత్యంలో ఉన్నందున ఆయన మరణానంతరం మాత్రమే అది ఇంగ్లీషు వారి ఆధిపత్యంలోకి వస్తుంది. అలాగే విజయనగర రాజుల ఆధిపత్యంలో ఉన్న చికాకోల్ సర్కార్‌ను ఇంగ్లీషువారు తమ అధీనంలోకి తీసుకోవాలి. ఈ రెండు సర్కారులు తమ అధీనంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కదానికి రెండు లక్షల చొప్పున మొత్తం నాలుగు లక్షలు చెల్లించబడుతుంది. అంటే కౌలు మొత్త ం 9 లక్షలుగా నిర్ణయించబడింది. నిజాంకు అవసరమైనప్పుడు ఇంగ్లీషు వారు సైన్యాన్ని పంపుతారు. సైన్యాన్ని పంపితే కౌలు చెల్లించనక్కరలేదు . విజయనగర రాజుల అధీనంలో గల చికాకోల్ సర్కార్ 1767లో ఇంగ్లీషు వారికి సామంతరాజ్యంగా మారిపోయింది.

1776లో ఆనాటి మైసూర్ పాలకుడు హైదర్ అలీ రాయలసీమాంధ్ర ప్రాంతాలపై దండెత్తాడు. 1781 నాటికి ఆ ఆప్రాంతాలన్నీ జయించాడు. 1782లో బసాలత్ జంగ్ మరణించగానే ఇంగ్లీషువారు గుంటూరు సర్కారును స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు సర్కారు తన చేజారి పోతే తూర్పు సముద్రంతో సంబంధాలు తెగిపోతాయని భావించిన నిజాం అలీ గుంటూరు సర్కారు తనకే కావాలని పట్టుపట్టాడు. టిప్పు సుల్తాను మరాఠా నాయకుడైన నానా ఫడ్నవీసుతో కలిసి జంగ్ ఇంగ్లీషువారిపై యుద్ధ ప్రయత్నాలు మొదలుపెట్టాడు . దాంతో భయపడిన ఇంగ్లీషువారు నిజాం మద్దతు కోసం గుంటూరు సర్కారును నిజాం అలీకి తిరిగి ఇచ్చివేశారు. మహారాష్ట్రులతో జరిగిన యుద్ధాల వల్ల ఇంగ్లీషువారితో ఒప్పందాల వల్ల , మైసూరు పాలకుడైన హైదర్ అలీ , అతని కుమారుడు టిప్పు సుల్తాన్ రాయలసీమాంధ్ర ప్రాంతాల్ని ఆక్రమించినందువల్ల నిజాం అలీ తన రాజ్యంలో మూడు వంతుల రాజ్యాన్ని కోల్పోవలసి వచ్చింది. ఇంగ్లీషువారి సహాయంతో రాయలసీమాంధ్ర ప్రాంతాల్ని తన అధీనంలోకి తెచ్చకోవాలని తలపోశాడు.

అందుకనుగుణంగా ఇంగ్లీషువారి సహాయం కోరాడు. ఆ పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకున్న ఇంగ్లీషు వారు గుంటూరు సర్కారు తమకు కావాలని నిజాం అలీని కోరారు. తన అవసరం కోసం 1788 సెప్టెంబరు 18న గుంటూరు సర్కారును నిజాం అలీ ఇంగ్లీషు వారికి దత్త ం చేశాడు. దాంతో సర్కారు జిల్లాలపై ఇంగ్లీషువారి ఆక్రమణ పూర్తయ్యింది.

ఆనాటి గవర్నర్ జనరల్ కారన్ వాలీస్ 1790లో నిజాం మహారాష్ట్రులను కలుపుకుని టిప్పు సుల్తానుకు వ్యతిరేకంగా త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేశాడు. 1792 మార్చి 18న శ్రీరంగపట్టణం సంధితో యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో నిజాం వాటాగా బళ్ళారి, గుర్రంకొండ, గండికోట, కడప, కంభం ప్రాంతాలు, కృష్ణా తీరంలోని భద్ర, అంతర్వేది ప్రాంతాలు వచ్చాయి. వాటితోపాటు కోటి రూపాయల నగదు కూడా నిజాంకు ముట్టింది. కర్నూలు మాత్రం ఇవ్వడానికి టిప్పు సుల్తాను అంగీకరించలేదు . ఈ యుద్ధం ద్వారా నిజాం బాగా లాభపడ్డాడు.

ఆ తరువాత ఇంగ్లీషు వారితో జరిగిన నాల్గవ మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాను వీరోచితంగా పోరాడి 1799లో మరణించాడు. మైసూరు రాజ్యంలో కొంత భాగాన్ని ఒడయారు వంశస్తుల కిచ్చి , మిగతా భాగాన్ని ఇంగ్లీషు వారు , నిజాం అలీ పంచుకున్నారు. ఈ పంపకాలపై 1799 జూలై 13న మహారాష్ట్రులు, నిజాం, ఇంగ్లీషు వారు సంతకాలు చేశారు. ఈ యుద్ధంలో భాగంగా నిజాంకు గుత్తి , చితల్ దుర్గం, నంది దుర్గం, సిద్ధవటం, కోలారు, కర్నూలు ప్రాంతాలు వచ్చాయి. ఈ విధంగా రెండు మైసూరు యుద్ధాల ద్వారా రాయాలసీమాంధ్ర ప్రాంతాలన్నీ నిజా ం రాజ్యంలో భాగమయ్యాయి. కానీ, రాయలసీమాంధ్ర ప్రాంతాల్ని నిజా ం ఎక్కు వ కాలం నిలుపుకోలేక పోయాడు. వెల్లస్లీ బ్రిటిష్ గవర్నర్ జనరల్‌గా వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి ఒప్పందంలో చేరిన నిజాం అలీ, సైన్యం ఖర్చుల కింద రాయాలసీమాంధ్ర ప్రాంతాల్ని బ్రిటిషు వారికి తిరిగి ధారదత్తం చేశాడు.

నిజాం అలీఖాన్ కాలంలో బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీతో మొత్తం ఆరు ఒడంబడికలు కుదుర్చుకున్నాడు. ఈ ఆరు ఒప్పందాలలో 1766, 1768 ఒప్పందాల వల్ల ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలను, 1788 ఒప్పందం ద్వారా గుంటూరు సర్కారును, 1800 ఒప్పందం ద్వారా రాయలసీమాంధ్ర ప్రాంతాలను కోల్పోయాడు. అందువల్ల యావదాంధ్ర దేశం రెండుగా చీలిపోయింది. తెలంగాణాంధ్ర ప్రాంతం నిజాం ఏలుబడిలో ఉండగా కోస్తాంధ్ర, రాయలసీమాంధ్ర ప్రాంతాలు బ్రిటిషు వారి ఏలుబడిలోని మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమయ్యాయి. మన దేశానికి స్వతంత్రం వచ్చే నాటికి హైదరాబాదు సంస్థానం ఒక దేశంగా ఉండేది. ఆ సంస్థానంలో మరఠ్వాడా, కర్ణాటక, తెలంగాణాంధ్ర ప్రాంతాలు భాగంగా ఉండేవి. హైదరాబాదు ఆ దేశానికి రాజధానిగా ఉండేది. తనకు మహారాష్ట్రులతో ఉన్న వైరం వల్ల, బ్రిటిషు వారి మైత్రి కోసం కోస్తాంధ్ర జిల్లాలను రాయలసీమాంధ్ర ప్రాంతాల్ని వారికి తెగనమ్మాడు నిజాం. అక్కడి ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పిచేసి వసూలుచేసి కప్పాలను తెచ్చి హైదరాబాదు సంస్థానంలో పరిపాలనకు హైదరాబాదు నగర అభివృద్ధికి, ఆడంబరాలకు ఉపయోగించారనేది చారిత్రక వాస్తవం. గోల్కొండ నవాబుల కాలం నుంచి ఇదే తంతు జరిగింది.

No comments:

Post a Comment