Wednesday 21 August 2013

సీమకు న్యాయం చేయాలి: ఆర్. విద్యాసాగర్ రావు

సీమకు న్యాయం చేయాలి: ఆర్. విద్యాసాగర్ రావు

August 22, 2013

హైదరాబాద్, ఆగస్టు 21: రాష్ట్ర విభజన నేపథ్యంలో నీటి వనరుల లభ్యత విషయంలో రాయలసీమ ప్రజల ఆందోళనే ప్రధానమైనదని కేంద్ర జలసంఘం మాజీ సభ్యుడు ఆర్.విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాయలసీమ ప్రాంత అవసరాల కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కృష్ణా నది మిగులు/వరద జలాలు లభిస్తాయన్న గ్యారంటీ ఏమీలేదని ఆయన తెలిపారు.

ఈ నేప«థ్యంలో సీమ నీటి అవసరాలు తీర్చడానికి ఆయన మూడు పరిష్కార మార్గాలు చూపారు. నీటి వనరుల పంపిణీ విషయంలో ఆంధ్రా ప్రజలకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని విద్యాసాగర్ రావు వివరించారు. తెలంగాణకు దక్కే జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని కోటి ఎకరాల ఆయకట్టును సృష్టించడమే తన కలగా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగితే తలెత్తే నీటి సమస్యలు, వాటి పరిష్కారాలపై 'ఆంధ్రజ్యోతి'తో ఆయన ముచ్చటించారు.


కృష్ణా జలాల వినియోగంలో ఆంధ్రుల ఆందోళన అనవసరమైనది. కృష్ణా నికర జలాలను ప్రాంతాలవారీగా కాకుండా ప్రాజెక్టులవారీగా ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. కృష్ణా డెల్టా, కేసీ కెనాల్ ఆధునికీకరణ, పునరుత్పత్తి నీటి లభ్యత పేరుతో మన రాష్ట్రం పులిచింతల, బీమా, ఎస్ఆర్‌బీసీ ప్రాజెక్టులకు కృష్ణా నికరజలాలను పునఃకేటాయించింది. ఇక కృష్ణానదిపై డ్యాంలు కట్టేందుకు ఆస్కారమే లేదు. భవిష్యత్తులో కృష్ణా నదీజలాల వినియోగంపై కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు కావాల్సిందే. అలాంటప్పుడు.. ఆంధ్రా ప్రజలకు నీటి విడుదల విషయంలో ఎలాంటి భయం ఉండనక్కర్లేదు. కేవలం ప్రజల్లో భయాందోళనలు కలిగించడం కోసమే అలాంటి వాదనను తెరపైకి తెస్తున్నారు. ఒక్క సాగర్ ఎడమకాల్వ కింద ఉన్న నూజివీడు, నందిగామ ప్రాంత ఆయకట్టు విషయంలో విభజన సమయంలోనే తెలంగాణ, ఆం«ధా ప్రజలమధ్య స్పష్టమైన ఒప్పందం కుదుర్చుకుని.. ఎవరికీ అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

నిజమే. తెలంగాణ ఏర్పాటు తర్వాత కృష్ణాజలాల వినియోగం మొత్తం కేంద్ర బోర్డు అజమాయిషీలోకి వెళుతుంది కాబట్టి.. రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన నికర జలాలు మినహా అదనంగా మిగులు జలాల లభ్యత కూడా కష్టమే. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపుల తర్వాత ఎగువ నుంచి మహారాష్ట్ర, కర్ణాటకలు మిగులు జలాలను కిందకు వదులుతాయన్న గ్యారంటీ ఏమాత్రం లేదు. రాయలసీమ ప్రాంత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆంధ్రా వారిని సీమ ప్రజలు నమ్మరు. వీరిని వారు కూడా నమ్మరు. వారి మధ్య జల వివాదాలు చాలా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి.


మూడు పరిష్కారాలున్నాయి. రాష్ట్ర విభజన సమయంలోనే రాయలసీమకు కనీసం 120 నుంచి 130 టీఎంసీల నికర జలాలు ఇచ్చేలా చూడాలి. 75 టీఎంసీల వరకుకృష్ణా నికర జలాలను పునఃకేటాయించాలి. అందుకు ఆంధ్రా, తెలంగాణలు మానవతా దృక్పథంతో అంగీకరించి తమ వాటాను వదులుకోవడానికి సిద్ధపడాలి. కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కుడి కాల్వల్లో ఆంధ్రా ప్రజలు వినియోగం తగ్గించుకుంటే.. కనీసం 50 టీఎంసీల వరకు సీమకు ఇవ్వొచ్చు. సాగర్ ఎడమ కాల్వలో వినియోగం తగ్గించుకుంటే మరో 25 టీఎంసీల వరకు ఇవ్వొచ్చు. అలాగే.. దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును కేంద్రమే ప్యాకేజీలో భాగంగా తన ఆధ్వర్యంలో నిర్మించి 160 టీఎంసీల గోదావరి వరద జలాలను శ్రీశైలం దిగువన కృష్ణా బేసిన్‌కు తరలించాలి. అందులో ఆంధ్రా, తెలంగాణలకు కనీసం 90 టీఎంసీలు లభిస్తే.. మహారాష్ట్ర, కర్ణాటకలకు 70 టీఎంసీల వరకు వెళతాయి. అయినా పర్వాలేదు. ఆ మేరకు రాయలసీమకు మరో 50 టీఎంసీల వరకు లబ్ధి చేకూర్చవచ్చు. అయితే దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ నిర్మాణానికి ముందే గోదావరి నికర జలాల విషయంలో ఎలాంటి భంగం ఉండదంటూ తెలంగాణ ప్రాంత ప్రజలకు స్పష్టమైన హామీని కేంద్రం ఇవ్వాలి.

దుమ్ముగూడెం నీళ్లతో సాగర్ ఎడమ కాల్వ కింద మరికొంత కొత్త ఆయకట్టును ఇస్తామని తెలంగాణకు హామీ ఇవ్వాలి. ఇదంతా కూడా రాష్ట్ర విభజన సమయంలోనే జరగాలి. అలా జరగకుండా తెలంగాణ ఏర్పడిన తర్వాత రాయలసీమకు కృష్ణా నదీ జలాలు అదనంగా లభిస్తాయన్నది ఒక భ్రమే. మిగులు/వరద జలాలు కూడా కచ్చితంగా వస్తాయన్న గ్యారంటీ లేదు. ఇది కూడా కాదంటే రాయలసీమ కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి.. కృష్ణా మిగులు/వరద జలాలు లభ్యమైనప్పుడు దాచుకుని వాడుకునే విధంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలి. అక్కడి ఖనిజ సంపదతో దుబాయ్‌లాగా సీమను అభివృద్ధి చేసుకోవాలి. ఇంతకుమించిన పరిష్కారాలు లేవు. మేం భారత పౌరులం కాదా? మాకు నీటి అవసరాలు ఉండవా? అని విభజన తర్వాత ఎంతగా వాదించినా కావేరి నదీజలాల విషయంలో తమిళనాడు వాదనలాగే/నర్మద నదీజలాల విషయంలో రాజస్థాన్ వాదనలాగే సీమ వాదన కూడా మిగిలిపోతుంది.


కచ్చితంగా తలెత్తుతాయి. కృష్ణా జలాల విషయంలో మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల మధ్య, సాగర్ జలాల విషయంలో నల్లగొండ, ఖమ్మం జిల్లాల మధ్య, శ్రీరాంసాగర్ జలాల విషయంలో ఆదిలాబాద్, నిజమాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల మధ్య వివాదాలొస్తాయి. ఎగువన ఉన్న రైతాంగం ఎక్కువ నీటిని వాడుకుంటుందనే వివాదాలు ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. కృష్ణా, గోదావరి జలాలను అన్ని జిల్లాల మధ్య పునఃపంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కసరత్తును ఇప్పటికే మొదలుపెట్టాం. అందుకు గోదావరి జలాలకు ఒక కమిటీని, కృష్ణా జలాలకు ఒక కమిటీని నియమించాం. ఆ కమిటీలిచ్చే సూచనల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో పునఃపంపిణీ జరుగుతుంది.


పచ్చని తెలంగాణయే మా కల. అందుకు నైజాం సర్కారులో ఉన్న చెరువులన్నింటినీ పునరుద్ధరిస్తాం. నాటి కాల్వలన్నింటినీ అభివృద్ధి చేస్తాం. అలాగే.. కృష్ణా, గోదావరిలపై నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలు, ప్రవాహ ఆధారిత ప్రాజెక్టుల ద్వారా లభ్యమయ్యే 1300 టీఎంసీల నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న దానిపై ఇప్పటికే ఒక బ్లూ ప్రింట్‌ను తయారుచేశాం. గోదావరిలో తెలంగాణకు 900 టీఎంసీల నికర జలాలున్నాయి. వాటిలో కేవలం 50 శాతం నీటిని మాత్రమే వాడుతున్నాం. ఆ నీటిని కొత్త ప్రాజెక్టుల ద్వారా వినియోగంలోకి తేవాలి. ఇప్పటికే ఉన్నది కాకుండా.. హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగిలిన జిల్లాల్లో కనీసం 10లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును.. మొత్తంగా కోటి ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించాలన్నదే మా లక్ష్యం.


తెలంగాణ ఏర్పడ్డాక మా ముందున్న ప్రధాన సవాల్ ఇదే. అందుకే.. బొగ్గు ఆధారిత క్యాప్టివ్ పవర్ ప్లాంటులను ఏర్పాటు చేసి.. మూడు నాలుగు నెలలు లిఫ్టులకు కరెంటు ఇచ్చి.. మిగిలిన రోజుల్లో ఆ విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌లో అమ్మి.. ఆ ప్రాజెక్టులను నిర్వహించాలన్నది ఒక ఆలోచన. ఇది విజయవంతం కాకపోతే ఇతరత్రా ఏ మార్గాలున్నాయన్నదే ప్రధాన ప్రశ్న. దానిపై లోతుగా అధ్యయనం జరుగుతోంది.



నా వైఖరి మారలేదు - ఆర్. విద్యాసాగర్ రావు

August 24, 2013

'రాయలసీమకు న్యాయం చేయాలి' (జూలై 22, ఆంధ్రజ్యోతి) అన్న శీర్షికన నాతో జరిపిన ఇంటర్వ్యూ సారాంశాన్ని ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. ఉప శీర్షికలో ఆంధ్రా, తెలంగాణ కృష్ణా జలాల్లో కొంత వదులుకోవాలి, ముందే నీటి కేటాయింపులు జరపాలి అన్నవి కూడా ప్రముఖంగా చోటుచేసుకున్నాయి. ఇవి చాలా మంది నా అభిమానుల్లో, సాటి ఇంజనీర్లలో, మేధావులలో కొంత గందరగోళం, అస్పష్టత, నేను వైఖరి మార్చుకున్నానేమో అన్న సందేహాలు తలెత్తడానికి ఆస్కారమయ్యాయి. ఫలితంగా ఎందరో ఫోన్లు చేయడం, వారందరికీ విడివిడిగా వాస్తవాలు చెప్పుకోవడం కొంత ఇబ్బందికి గురిచేసిన మాట నిజం. జరిగిందేమిటంటే, 'ఆంధ్రజ్యోతి' విలేఖరి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు 'రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, విడిగా ఉన్నా కృష్ణా, గోదావరి నదులలో అటు ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు, లేక ప్రభుత్వం తీసుకున్న కేటాయింపు నిర్ణయాలలో ఎలాంటి తేడా రాదు - కృష్ణా నికర జలాల్లో రాయలసీమకు 144.70 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలు, కోస్తాంధ్రకు 367.34 టీఎంసీలు వెరసి 811 టీఎంసీల పంపకంలో ఎలాంటి తేడా రాదు.

బచావత్ ట్రిబ్యునల్ నిర్ధారించిన నీటి వాటాలనే కొత్త ట్రిబ్యూలైన బ్రిజేష్‌కుమార్ కూడా సమర్థించింది' అని స్పష్టం చేయడం జరిగింది. రాయలసీమ కేటాయింపులలో ప్రధానంగా తుంగభద్ర నుంచి వచ్చే వాటా కాకుండా ట్రిబ్యునల్ తదనంతరం 'పోతిరెడ్డిపాడు' నుంచి కేంద్రం నుంచి అనుమతి పొందిన మరో 19 టీఎంసీలు శ్రీశైలం కుడి గట్టు కాలువకు కూడా దక్కుతాయి. అదనంగా మరో 15 టీఎంసీలు చెన్నైకి తాగునీటి కోసం కేటాయించడం జరిగింది. అంటే ఈ 34 టీఎంసీలు తప్ప మరో చుక్క కూడా నికర జలాల రూపంలో పోతిరెడ్డి పాడు ద్వారా విడుదలయ్యే అవకాశం లేదని, అందుకే ప్రభుత్వం కృష్ణా మిగులు జలాల్లో 107 టీఎంసీలకు సరిపడా హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, సీమ ప్రాజెక్టులను చేపట్టిందని అయితే వాటికిప్పటి వరకు ఎలాంటి సాధికారత లేదని (Legal Sanctity) ట్రిబ్యునల్ వాటిని పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు జరిపితే తప్ప ఎలాంటి ఉపయోగముండదని స్పష్టం చేయడం జరిగింది. అందుకు ఆ విలేఖరి 'రాయలసీమ వాళ్ళు సాటి తెలుగు వారిగా కృష్ణా నికర జలాలను, అదనంగా, హక్కుగా పొందే అవకాశం లేదా' అన్న ప్రశ్నకు 'తెలుగువారు కాబట్టి నీటిపైన హక్కు కావాలంటే కుదరదు. ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నికర జలాల కేటాయింపులను చేసింది. అందులో మార్పు ఉండదు. ఇలాంటి వాదనలే గతంలో తమిళనాడు, రాజస్థాన్ చేశాయి -

'మేము భారతదేశంలో ఉన్నాం కనుక మా అవసరాలను తీర్చాల్సిన బాధ్యత కేంద్రానిది' - అని. కానీ ఈ వాదనలేవీ ఆయా రాష్ట్రాల కడుపు నింపలేదు. రాజస్థాన్ నర్మదా బేసిన్ నీళ్లు కోరినప్పుడు అది బేసిన్ రాష్ట్రం కాదన్న కారణంగా ట్రిబ్యునల్ దాని అభ్యర్థనను కొట్టిపారేసింది. అంతిమంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు మానవతా దృక్పథంతో తమ వాటాలలో కొంత తగ్గించుకుని రాజస్థాన్‌కు ఇవ్వడం జరిగింది. ఇదే మాదిరిగా మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ తమ వాటాలలో 5 టీఎంసీలు తగ్గించుకుని మొత్తం 15 టీఎంసీలను చెన్నైకి ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అదే పద్ధతిన కొత్తగా ఏర్పడే సీమాంధ్రలోని కోస్తా ప్రాంతం, తెలంగాణ రాష్ట్రాలు తమ వాటాలను కొంతమేరకు తగ్గించుకుని రాయలసీమకు ఇవ్వవచ్చు (ఇవ్వవచ్చుకు ఇవ్వాలికి గల తేడా గమనించ ప్రార్థన). అయితే ఎవరూ తమ వాటా కోల్పోవడానికి సిద్ధపడరు. గత 57 ఏళ్లుగా సమైక్యంలో ఉన్నప్పుడు చేయలేని పనిని 'విభజన' సమయంలో ప్రభుత్వం చేస్తుందనుకోవడం భ్రమ. ఇందుకు తెలంగాణ కానీ, కోస్తాంధ్ర కానీ ఒప్పుకునే అవకాశం లేదు' అని స్పష్టం చేయడం జరిగింది.

మరో ప్రత్యామ్నాయంగా గోదావరి వరద జలాలను (నికర జలాలు కావు) సంబంధిత రాష్ట్రాన్ని ఒప్పించి, కేంద్రం తన స్వంత ఖర్చుతో కృష్ణా బేసిన్‌కు తరలించడం వల్ల సీమకు మరిన్ని జలాలు పొందే అవకాశముంది. అయితే ఇవి నికర జలాలు కావు, వరద లేక మిగులు జలాలు అని గుర్తుంచుకోవాలి. ఇవేవీ కుదరకపోతే రాయలసీమ తనకు అధికారికంగా వచ్చే నీటితోనే సంతృప్తి చెంది తనకున్న ఖనిజ సంపదతో మరో దుబాయ్‌గా రూపాంతరం చెందవలసి ఉంటుంది అని కూడా తెలియచెప్పడం జరిగింది. రాయలసీమ గురించి టూకీగా జరిగిందిది.

No comments:

Post a Comment