Friday 2 August 2013

Andhra Employees Should Go - KCR

ఆంధ్ర ఉద్యోగులు పోవాల్సిందే !

August 03, 2013
వారికి ఆప్షన్లు ఉండవు
ఉద్యోగుల ఉద్యమ స్ఫూర్తిని మరువలేం
రాష్ట్రం రాగానే ప్రత్యేక ఇంక్రిమెంట్ : కేసీఆర్

  హైదరాబాద్, ఆగస్టు 2: "రాష్ట్రం వచ్చాక తెలంగాణ ప్రాంతంలో పని చేస్తున్న ఆంధ్ర ఉద్యోగులంతా వెళ్లిపోవాల్సిందే. ఆప్షన్లు ఏమీ ఉండవు. అక్కడ కూడా ప్రభుత్వం ఉంటుంది. తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తారు'' అని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణపై ప్రకటన నేపథ్యంలో టీఎన్జీవోల సంఘం ప్రతినిధులు శుక్రవారం కేసీఆర్‌ను తెలంగాణ భవన్‌లో అభినందించారు. సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగించారు. "తెలంగాణ ఏర్పడ్డాక మనవాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పని చేస్తున్న ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రకు వెళ్లిపోవాల్సిందే. అక్కడ ప్రభుత్వం పని చేయాలంటే వెళ్లక తప్పదు. ఏ ప్రాంతాన్ని ఎంచుకోవడమనే ఆప్షన్ వారికి ఉండదు. కచ్చితంగా వెళ్లిపోవాల్సిందే. వాళ్లు వెళ్లిపోతేనే మనవాళ్లకు ప్రమోషన్లు వస్తాయి'' అని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో అన్యాయంగా ఉద్యోగాలు పొందిన వారినే గతంలో 'జాగో.. భాగో' అన్నానని కేసీఆర్ తెలిపారు.

"అప్పటికే తెలంగాణ ప్రాంత యువత ఉద్యోగాలు రాక ఆందోళన బాట పడుతుంటే 14ఎఫ్‌ను తెచ్చారు. దీంతో తెలంగాణేతరులు ఉద్యోగాలు పొందారు. అందుకే 14ఎఫ్‌ను తొలగించాలంటూ సిద్దిపేట ఉద్యోగ గర్జన సభలో తెలంగాణేతర ఉద్యోగులను జాగో భాగో అన్నాను. అన్యాయంగా ఎవరైతే ఉద్యోగాలు పొందారో వారినే జాగో భాగో అన్నాను. ఇక లాభం లేదనుకుని, చచ్చినా ఫర్వాలేదని అనుకుని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాను'' అని కేసీఆర్ గుర్తు చేశారు. తన నిరాహారదీక్షతో వెలువడిన ప్రకటనను ఆంధ్రోళ్లు రాజీనామాలతో అడ్డుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యోగులు సాగించిన ఉద్యమం మరువరానిదని, అపురూపం, అసమాన్యమైనదని కొనియాడారు. "అరెస్టులు, నిర్బంధాలు, చివరకు... ఏసీబీ కేసులు కూడా పెట్టి వేధించారు. అయినా ప్రభుత్వాన్ని ఎదిరించి ఉద్యమించారు. ఈ ఉద్యమ స్ఫూర్తిని మరిచిపోము. తెలంగాణకు ఒక దశ దిశ ఏర్పడ్డాక... ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలిస్తాం.

సకల జనుల సమ్మె సందర్భంలో నిలిచిపోయిన వేతనాలను వడ్డీతో సహా కలిపి చెల్లిస్తాం. పెన్షనర్లకు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతో సమానంగా పింఛన్లు ఇస్తాం. ఉద్యోగులకు... రాష్ట్రం రాగానే తెలంగాణ సాధన ఇంక్రిమెంట్ ఇస్తాం. ఉద్యోగులపై నమోదైన కేసులన్నింటినీ ఎత్తేస్తాం. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తాం'' అని హామీలు గుప్పించారు. రాష్ట్రం ఏర్పడ్డాక మూడు నాలుగేళ్లలో దిశ, దశ వస్తాయి. ఉద్యోగులందరికీ న్యాయం చేస్తాం. ముందుగా అన్ని శాఖల ఉద్యోగుల వివరాలు అందించండి. మీ వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని దేవీప్రసాద్‌కు అందించండి.

మీరంతా సహకరిస్తే... తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. మనకు అన్ని వనరులున్నాయి. దేశంలోనే తెలంగాణను నెంబర్‌వన్‌గా నిలుపుదాం'' అని కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. "మహిళా రిజర్వేషన్ బిల్లు వంటివి పార్లమెంటులో ప్రవేశపెట్టి నాన్చుతున్న చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. అందుకే తెలంగాణ బిల్లు ఆమోదం పొందేవరకు అప్రమత్తంగా ఉండాల్సిందే'' అని గుర్తు చేశారు.

పొమ్మనడానికి నువ్వెవరు?

August 03, 2013
(న్యూస్ నెట్‌వర్క్) 'తెలంగాణ వచ్చాక ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందే. వారికి ఆప్షన్లు ఉండవు' అంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన ప్రకటనపై ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా పలువురు నేతలు మండిపడ్డారు. అసందర్భ వ్యాఖ్యలు కట్టిపెట్టాలని సూచించారు. 'ఉద్యోగులను పొమ్మనే అధికారం కేసీఆర్‌కు ఎక్కడిది? ఆయన ముఖ్యమంత్రా?' అని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. " ఉద్యోగులు ఎవరు, ఎక్కడ ఉండాలనేది విభజనపై నియమించే అధికారిక కమిటీ చూసుకుంటుంది.

వారి ఆప్షన్ ప్రకారం ఎక్కడ ఉండాలనేది పర్యవేక్షిస్తుంది. ఉద్యోగులను పంపించడం కేసీఆర్‌కు సాధ్యం కాదు. బహుశా ఆంధ్రా ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ రాకుండా అడ్డుకోవాలని కేసీఆర్ భావిస్తున్నటుంది'' అని పాల్వాయి వ్యాఖ్యానించారు. "తెలంగాణ రావడంవల్ల తనకు లబ్ధిచేకూరదని కేసీఆర్ అనుకుంటున్నారేమో! టీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనమైతే కేసీఆర్ మాటలు, అభిప్రాయాలకు విలువుండదు. కాంగ్రెస్ సీమాంధ్ర ప్రజలను కంటికిరెప్పలా కాపాడుకుంటుంది'' అని తెలిపారు. ఉద్యోగుల స్థాన చలనం మొత్తం విధివిధానాలు, సర్వీసు నిబంధనల ప్రకారమే జరుగుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. "కేసీఆర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. వాటితో తెలంగాణకు సంబంధం లేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా... అవి దురుద్దేశంతో కూడినవే'' అని తెలిపారు.


విభజనకు అడ్డంకి: విజయశాంతి
"సీమాంధ్ర ఉద్యమాన్ని మరింత రెచ్చగొట్టి తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేలా కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి'' అని టీఆర్ఎస్ బహిష్కృత నేత, ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు. ఆయన తీరు పుండుమీద కారం చల్లినట్లుగా ఉందన్నారు. హైదరాబాద్ కేసీఆర్ సొంత జాగీరు కాదని, ఎవరు ఎక్కడ ఉండాలన్నది ఆయన నిర్ణయించలేరని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేసీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ (టీడీపీ) డిమాండ్ చేశారు. "కేసీఆర్ నోరు జాగ్రత్త. హైదరాబాద్‌లో సీమాం«ద్రులకు అన్యాయం జరిగితే... ఇక్కడి నుంచి యావత్ ప్రజలు తరలివచ్చి నగరాన్ని ఆక్రమించుకుంటారు'' అని హెచ్చరించారు. ఉద్యోగుల్ని పొమ్మనేందుకు హైదరాబాద్ ఏమైనా కేసీఆర్ బాబుసొత్తా అని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. "విభజన జరగకముందే కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు. ఆయన నైజం బయటపడింది. ఇప్పటికైనా కేంద్రం వాస్తవాన్ని గ్రహించి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి'' అని గంటా కోరారు.

పొమ్మనే హక్కు కేసీఆర్‌కు ఎక్కడిదని మరో మంత్రి కోండ్రు మురళి ప్రశ్నించారు. కేసీఆర్ వ్యాఖ్యలు అసందర్భమని సీపీఐ నేత నారాయణ అభిప్రాయపడ్డారు. "రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోయడమే. కేసీఆర్ వ్యాఖ్యలు ఆయన అపరిపక్వత, తొందరపాటుకు నిదర్శనం. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేవారికి ఈ వ్యాఖ్యలు ఉపయోగపడతాయి. రాష్ట్ర సాధనకు సమస్యలెదురవుతాయి'' అని నారాయణ అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ రావడం ఇష్టంలేదని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమైందని తెలుగు జాతి ఐక్యతా సమితి అధ్యక్షుడు ఆళ్ల హరి విమర్శించారు. "సీమాం«ద్రులను కడుపులోపెట్టుకుని చూసుకుంటామని చెప్పి రెండు రోజులైనా గడవలేదు. అప్పుడే కడుపుకొట్టే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సెంటిమెంట్‌తో ఆయన ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి'' అని సూచించారు. కేసీఆర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే.. ఎలా బుద్ధి చెప్పాలో తమకు బాగా తెలుసునని కడప జిల్లా మేధావుల సమాఖ్య కన్వీనర్ వివేకానంద రెడ్డి పేర్కొన్నారు.

"మా ప్రాంత ఉద్యోగులు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అక్కడే ఉంటారు. చట్టాలను గౌరవించని మాటలు ఆపండి'' అని కేసీఆర్‌కు సూచించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం రాత్రి కృష్ణా జిల్లా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. 'ఎవరికీ ఇబ్బంది ఉండదు అని చిలుక పలుకులు పలికిన కేసీఆర్ నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది' అని ఏపీఎన్జీవోల నేతలు మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా శనివారం విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. "రెచ్చగొట్టేందుకే కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇది ఆయనకు మామూలే'' అని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

No comments:

Post a Comment