Monday 19 August 2013

ఆవేశం తగ్గించి ఆలోచన చేయండి Potluri Article

ఆవేశం తగ్గించి ఆలోచన చేయండి - పొత్తూరి వెంకటేశ్వరరావు

August 20, 2013


అతిశయోక్తి అని కొట్టి పారేయకండి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అప్రకటిత అంతర్యుద్ధ పూర్వరంగ వాతావరణం ఏర్పడింది. అంచుకు చేరింది గానీ అదృష్ట వశాత్తు అదుపులోనే ఉంది. జాగ్రత్త పడకపోతే అదుపు తప్పదన్న పూచీ లేదు.

నిన్నమొన్నటివరకు తెలంగాణలో జరిగిన ఉద్యమం గానీ, ఇప్పుడు కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాలలో జరుగుతున్న ఆందోళన గానీ 1969-70 తెలంగాణ ఉద్యమం లాంటిదిగానీ, 1972-73 ఆంధ్ర వేర్పాటు ఉద్యమం లాంటిది గానీ కాదు. ఉభయ ప్రాంతాలలోనూ ఉద్యమం లోతు పెరిగింది. 1952 డిసెంబరులో పొట్టి శ్రీరాములు నిరాహారదీక్ష చేసి మరణించినప్పుడు కోస్తా జిల్లాలలో జరిగిన విధ్వంసకాండ జ్ఞాపకం వస్తే మళ్లీ ఎప్పటికీ అలాంటిది జరగకూడదని మనలను మనం హెచ్చరించుకోవాలనిపిస్తుంది. తెలంగాణలో ఇప్పుడు నివురుగప్పిన నిప్పులాంటి పరిస్థితి ఉంది. రెండు ప్రాంతాలలోనూ పరిస్థితిని తక్కువగా అంచనా వేయరాదు.

తక్షణం జరగవలసినది ఆవేశాలు తగ్గించి ఆలోచన చేయడం. విభజన నిర్ణయం అమలు అనివార్యమన్న వాస్తవపరిస్థితిని గుర్తించి, అంతే అనివార్యంగా విభజన వల్ల తలెత్తే సమస్యలను సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కరించుకోవాలో చర్చించటం. మానవతా దృష్టితో, ఇచ్చిపుచ్చుకునే సుహృద్భావ పూర్వక వాతావరణంలో ప్రయత్నిస్తే పరిష్కారాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యపాత్ర వహించవలసినది కేం ద్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రులూ, పార్లమెంటు సభ్యులూ. ఆందోళనకారులు, వారు రాజీనామా చేయలనడం ఆవేశంలో అంటున్న మాట. అందువల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. విభజన నిర్ణయం వెనుకకు పోదు.

మరికొంతకాలం వాయిదా వేసినందువల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. కేంద్రంలోని మన మంత్రులు మొదట చేయవలసింది కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో ఆందోళనకు ముందువరుసలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల నాయకులతో మాట్లాడడం, వారి ఆంతర్యం తెలుసుకోవటం. ప్రజల మధ్యకు వెళ్ళి విభజనానంతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని హామీ ఇచ్చి, ఆవేశాలను తగ్గించటం. రాష్ట్ర విభజన బిల్లు ఆలస్యమవుతుంది గనుక పార్లమెంటులో విభజన ప్రకటన చేస్తూ, కేంద్ర ప్రభుత్వం కోస్తా, రాయలసీమలో ప్రజల భయసందేహాలను తొలగించే హామీ ఇచ్చేందుకు ప్రయత్నించటం. ప్రజలు ఎన్నుకొన్న ప్రతినిధులు ప్రజల మధ్యకు వెళ్లి వాస్తవ పరిస్థితులను వివరించి, తమ నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకొనడానికి ఇది అవకాశం.

1953లో ఆంధ్ర రాష్ట్రం, 1956లో ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా రాష్ట్రాలుగా ఏర్పడ్డాయన్న మాటేగానీ రాయలసీమ, కోస్తా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో దేని అస్తిత్వాన్ని అది పదిలంగానే కాపాడుకొంటూనే వస్తున్నాయి. ఎవరి అభిజాత్యాలూ వారికున్నాయి. మూడు ప్రాంతాల మధ్య పరిపూర్ణ విశ్వాసం ఏనాడూ లేదు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడేటప్పుడు జరిగిన శ్రీ బాగ్ ఒడంబడిక, ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో పెద్దమనుషుల ఒప్పందం మించి ఇం దుకు దాఖలాలు అక్కర్లేదు. అరవై సంవత్సరాల చరిత్ర ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఇప్పుడొక కొలిక్కి వచ్చినదనుకొంటున్న సమయంలో ఏ మాత్రం తేడా వచ్చినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఫజల్ అలీ కమిషన్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఐదేళ్లు ఉండాలని చేసిన ప్రతిపాదన అమలు జరగకపోయినప్పటికీ, 1969 ఉద్యమ సమయంలో ఇందిరాగాంధీ పట్టుదలకు తలొగ్గవలసి వచ్చినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలో మార్పులేదన్న సత్యాన్నీ, బలవంతంగా కలిపి ఉంచడం ఇంక ఎంతమాత్రం సాధ్యం కాదన్న వాస్తవాన్ని గుర్తించవలసివుంది.

రాయలసీమ నాయకులు ఎవరు మాట్లాడినా 'తెలంగాణతో కలసి ఉంటాము కాదంటే మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి' అంటారే గానీ కోస్తా జిల్లాలతో కలసి ఉంటామని ఒక్కరూ అనటం లేదన్న సత్యాన్ని కూడా కోస్తా ఆంధ్ర ప్రజలు గమనించవలసి ఉంది. రాష్ట్ర మంత్రివర్గం ఎప్పుడో చీలిపోయింది. ప్రాంతాలవారీ లెక్కలతో ఏర్పడిన మంత్రి వర్గంలో ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం ప్రయోజనాలను గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు చీలిపోయారు. న్యాయవాదులు (న్యాయమూర్తులు సైతం), డాక్టర్లు, కార్మికులు, ఇంకా అనేక ఇతర వర్గాలు చీలిపోయారు. సచివాలయంతో సహా ప్రభుత్వ కార్యాలయాల్లో పక్కపక్కన కూర్చున్న రెండు ప్రాంతాల ఉద్యోగులు పరస్పరం కోర చూపులు చూసుకోకపోవచ్చును గానీ ఉభయుల మధ్య ఎడం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది. వాదోపవాదాల్లో పౌరుష్యం దాగటంలేదు. పోలీసుల జోక్యంతో ఉద్యోగస్తుల సమావేశాలలో ఘర్షణలు తప్పిన సందర్భాలు ఉన్నాయి.

జిల్లాలలో అన్య ప్రాంతీయులను ఇబ్బంది పెడుతున్న సంఘటనలు ఉన్నాయి. ఏది నిజమో, ఏదికాదో తెలియనంతగా పుకార్లు వ్యాపిస్తున్నాయి. తెలుగు వారు రెండు రాష్ట్రాలుగానో మూడు రాష్ట్రాలుగానో చీలిపోకూడదని హృదయపూర్వకంగా విశ్వసించే కొందరు ఆందోళన చేస్తున్న వారిలో ఉన్నారు. వారి విశ్వాసాన్ని గౌరవించవలసిందేగానీ, వారు సైతం భౌగోళిక, రాజకీయ పరిపాలనా సంబంధమైన సమైక్యం అవాస్తవికమని గుర్తించి, సాంస్కృతిక, భాషా సంబంధమైన సమైక్య, సహకార, సమన్వయాల కోసం కృషి చేయడం మేలు.

కోస్తా ఆంధ్రలో గానీ, రాయలసీమలో గానీ విశాఖపట్నాన్ని తప్పిస్తే ఏ నగరమూ గణనీయంగా అభివృద్ధి చెందలేదు. విశాఖ పట్టణమైనా అభివృద్ధి ప్రభుత్వం వల్ల జరిగింది కాదు. ప్రభుత్వానికి శ్రద్ధ ఉంటే అపారంగా అవకాశాలు ఉన్న విశాఖ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచి ఉండేది. రాష్ట్రం మొత్తంలో ఒక్క కొత్త భారీ పరిశ్రమ రాలేదు. ప్రజాపోరాటం వల్ల విశాఖ ఉక్కు కర్మాగారం వచ్చింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా సిమెం టు కర్మాగారాలు, ఇంకా అలాంటి చిన్న పరిశ్రమలు తప్పిస్తే ఉపాధి అవకాశాలు పెంచే ఒక్క పరిశ్రమ రాలేదు. కొత్త రాజధాని ఏర్పడటానికి ఇప్పుడు అవకాశం వస్తే హైదరాబాద్‌తో సమానంగా ఇంకా అంతకంటే మిన్నగా ఆధునిక నగరాన్ని నిర్మించుకొనడానికి ఆ అవకాశాన్ని ఎందుకు జార విడుచుకోవాలనుకొంటున్నారో తెలియదు.

నేడు కావలసినది మూడుప్రాంతాల మధ్య సుహృద్భావం. అందుకోసం వెంటనే చేపట్టవలసిన చర్యలు కొన్ని వున్నాయి. ఇవేమీ అసాధ్యమైనవి కావు. రాష్ట్ర విభజన బిల్లు రావడానికి ఆలస్యమవుతోంది కనుక మంత్రివర్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యూపీఏ నిర్ణయాన్ని ఆమోదిస్తూ, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రజలు, ప్రత్యేకించి ప్రభుత్వోద్యోగుల భయ సంకోచాలనూ, హైదరాబాద్‌లోనూ, తెలంగాణలోని మరికొన్ని చోట్ల అన్య ప్రాంతాల నుంచి వచ్చి భూములు కొనుక్కొని సేద్యం చేసుకుంటూ స్థిరపడిన వారికి, హైదరాబాద్ చుట్టూ పక్కల అదేవిధంగా భూములు కొనుక్కున్న వారికి అవసరమైన హామీ ఇస్తూ పార్లమెంటు ప్రకటన చేయాలి. ఆంధ్రప్రదేశ్ విభజన కాంగ్రెస్ పార్టీ వ్యవహారం మాత్రమే కాదని గుర్తించి, ఆంటోనీ కమిటీని కేంద్ర మంత్రివర్గ ఉపసంఘంగానో, మరో ఉన్నతాధికార సంఘంగానో మార్చి, విభజనకు సంబంధించిన అన్ని సమస్యలపై రాష్ట్రానికి వచ్చి చర్చలు జరపాలి. అన్ని పార్టీల వారు, అన్ని వర్గాల వారు కమిటీని కలుసుకునే అవకాశం ఉండాలి.

రాయలసీమ జిల్లాల ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకొని, వారు కోరితే, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఇప్పుడే ఏర్పాటు చేయటం శ్రేయస్కరం. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా అక్కడున్న ఖనిజ సంపదను వినియోగించుకునే పర్రిశమలు ఏర్పడాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే అది సాధ్యం అని గత అరవై సంవత్సరాల అనుభవం నిరూపిస్తున్నది.

సాగునీటి సమస్య కోస్తా ఆంధ్రులను, రాయలసీమ రైతులను కలవరపెడుతున్నది. ఇతర రాష్ట్రాల మధ్య నీటి తగాదాలు ఉన్నప్పుడు కంట్రోల్ బోర్డులను ఏర్పాటు చేసుకొన్నట్లే విభజనానంతరం రాష్ట్రాలలో కూడా శాసనబద్ధమైన కంట్రోల్ బోర్డులను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రముఖ ఇంజనీరు టి.హనుమంతరావు (ఐక్యరాజ్యసమితి సలహాదారు) ఈ మేరకు ఒక ప్రతిపాదన చేశారు కూడా. కేంద్ర ప్రభుత్వం నదుల పరీవాహక ప్రాంతాలకు సంబంధించి ఒక కొత్త చట్టాన్ని తెస్తున్నది (రివర్స్ బోర్డ్ చట్టం స్థానే). ఏ ప్రాంతంలోనూ ఇప్పుడున్న ఆయకట్టుకు భంగం ఏమీ ఉండదు. చట్టాలు ఉన్నాయి. న్యాయసూత్రాలు ఉన్నాయి. నదీజలాల విషయాలలో కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగరీత్యా విశేషాధికారాలు ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలలో ఇక ముఖ్యమైనది హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ ఇక్కడే రిటైరవుతామనుకొని ఇళ్లు కట్టుకొని స్థిరపడిన కొందరికి సంబంధించినది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలోనూ, ఛత్తీస్‌గఢ్ మొదలైన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఉద్యోగుల పంపకానికి సంబంధించి కొన్ని నియమనిబంధనలు ఏర్పరచి అమలు జరిపారు. అవి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనూ అమలు జరుగుతాయి. అందులో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాధాన్యక్రమంలో ఆప్షన్ ఉంటుంది. అడిగిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వలేకపోవచ్చు గానీ వీలైనంత మందిని ఆప్షన్ ప్రకారం పనిచేయనివ్వవచ్చు. కేంద్రప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే పెద్దలెవరైనా వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ ఉద్యోగుల నాయకులతో మాట్లాడడం రాష్ట్రంలో పరిస్థితిని మెరుగుపరుస్తుంది.

రాష్ట్రంలో ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితులు అదుపు తప్పిపోకుండా చూడవలసిన బాధ్యత అన్ని వర్గాల మీద ఉన్నది. విద్వేషాలు మితిమీరితే, అదుపుతప్పితే ఈ తరమే కాదు, భావితరాలు కూడా వాటి దుష్ఫలితాలను అనుభవించవలసి వస్తుంది. విద్వేష వాతావరణంలో సమస్యల పరిష్కారం దుస్సాధ్యం. సామరస్య పూర్వక వాతావరణంలోనే అవి సుసాధ్యం.
- పొత్తూరి వెంకటేశ్వరరావు
విశ్రాంత సంపాదకులు

No comments:

Post a Comment