Friday 9 August 2013

రాజధాని రాజకీయాలు

రాజధాని రాజకీయాలు
1938 నుంచి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు డిమాండు
కేంద్ర ప్రభుత్వ జాప్యంతో భిన్న వాదాలు
మద్రాసులో తెలుగువారిదే ప్రాబల్యం
వివాద రహిత రాష్ట్ర ఏర్పాటుకు నెహ్రూ మొగ్గు
పొట్టి శ్రీరాములు మృతితో ఆందోళనలు
రాజధాని నిర్ణయంలో రాజకీయ స్వార్ధం
ఎవరూ కోరని కర్నూలుకు పట్టం 


కొత్త రాష్ట్రాలకు రాజధాని నగరం సమస్య. దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత ఎన్నో కొత్త రాష్ట్రాలు వెలిశాయి. కాని రాజధాని నగరం విషయంలో పంజాబ్‌ ఎదుర్కొన్నటువంటి క్లిష్ట సమస్య ఏ రాష్ట్రానికి ఎదురు కాలేదు. అవిభక్త పంజాబ్‌ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న లాహోర్‌ను పెంచి పెద్ద చేసినవారిలో ఎక్కువ మంది హిందువులు, సిక్కులే కనుక లాహోర్‌ నగరం భారత దేశానికి చెంది తీరవలసినదేనని భారత- పాకిస్థాన్‌ల సరిహద్దు వివాద పరిష్కార సంఘం భారత సభ్యుడు మెహర్‌ చంద్‌ ఖన్నా వాదించారు. కానీ దేశాన్ని ఆర్ధిక దృష్టితో కాక మత దృష్టితో విభజించడం వల్ల ముస్లింలు అధికంగా ఉన్న లాహోర్‌ పాకిస్థాన్‌కు పోయింది. ఈ విధంగా దేశ విభజన సమయంలో తూర్పు పంజాబ్‌ రాష్ట్రం రాజధాని లేని నగరమైంది. కొంతకాలం రాష్ట్ర రాజధానిగా జలంధర్‌, ఆ తర్వాత సిమ్లా పనిచేశాయి. సిమ్లా నగరం ఒక పర్వతాగ్రం మీద ఉంది. అక్కడ సమ ప్రదేశాలు తక్కువ. పర్వత పంక్తులలో స్థలం దొరికిన చోట సౌధాలు కట్టుకున్నారు.

ఇరకాటంగా ఉన్న ప్రధాన రహదారులలో మోటారు కార్లు, ఇతర వాహనాలు నడవడాన్ని బ్రిటిష్‌ వారు నిషేధించారు. ఆ రోజుల్లో ప్రజలు కాలి నడకన, లాగే రిక్షా ల్లో, గుర్రాల మీద ప్రయాణించేవారు. కమాండర్‌ ఇన్‌ చీఫ్‌, గవర్నర్‌ జనరల్‌, గవర్నర్లకు మాత్రమే మోటారు కారుల్లో ప్రయాణించే అనుమతి ఉండేది. అందువల్ల పంజాబ్‌ రాష్ట్రానికి ఒక కొత్త రాజధాని నగరం నిర్మించి పెట్టాలని నెహ్రూకు అభిప్రాయం కలిగింది. 1948 మార్చిలో పంజాబ్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి శివాలిక్‌ పర్వత శ్రేణు పాదాల వద్ద క్తొత రాజధాని నిర్మాణం కోసం భూమి కేటాయించింది. ప్రఖ్యాత ఫ్రెంచ్‌ ఆర్కిటెక్ట్‌ లీ కార్బు జర్‌ చండీగఢ్‌ నగరాన్ని 20వ శతాబ్దంలో అద్భుత నగర పాలిక నమూనాగా తీర్చి దిద్దాడు. ఇది నెహ్రూ కలల పంటగా తయారైంది. అనంతరం జరిగిన పరిణామ క్రమంలో 1966 నవంబర్‌ 1న రాష్ట్రం పంజాబ్‌, హర్యానా, హిమచల్‌ ప్రదేశ్‌గా విడిపోయినప్పుడు ఇది పంజాబ్‌ హర్యానాల రాజధానిగా నిలిచిపోయింది. హిమాచల్‌ ప్రదేశ్‌ సిమ్లాను రాజధానిగా చేసుకుంది. అదే సమయంలో చండీగఢ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు.

హైకోర్టు పంజాబ్‌- హర్యానా హైకోర్టు పేరుతో నడుస్తున్నది. ప్రస్తుతం ఇక్కడున్న అసెంబ్లీ, హైకోర్టు భవనాలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగానే వాడుకుంటున్నాయి. ఈ నగరానికి పంజాబ్‌ గవర్నర్‌ పరిపాలనాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు ఈ సమస్య లేదు. మద్రాసు విడిచిపెట్టిన ఆంధ్రులకు హైదరాబాద్‌ లభించింది. బొంబాయిని విడిచిపెట్టిన గుజరాతీయులు అహమ్మదాబాద్‌ని రాజధానిగా చేసుకున్నారు. షిల్లాంగ్‌ని వదిలేసిన అస్సామీయులకు గౌహతి రాజధాని నగరమైంది. 1966లో షా కమిషన్‌ తీర్పును దృష్టిలో పెట్టుకుని చండీగఢ్‌ను హర్యానాకు ఇచ్చివేసిన పంజాబ్‌ ప్రజలు మరొక రాజధాని నగరాన్ని కట్టుకోవడంలో వారి తాత్సారం సమస్యను జటిలం చేసింది.ఆంధ్రుల సమస్య: 1938 ఆగస్టులో ఆంధ్రులు కాంగ్రెస్‌ హైకమాండ్‌ వద్దకు రాయబారం వెళ్ళారు. స్వరాజ్యంలో స్వరాష్ట్రం వస్తుందని, త్వరపడవలదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జాప్యం కారణంగా విభిన్న దృక్పథాలవారు తలెత్తసాగారు. ఆనాటి మంత్రివర్గంలో రాయలసీమవారికి స్థానంలేదు.

అది అసమ్మతికి అసలు కారణమైంది. రాయలసీమకు వెళ్ళిన సర్కారు ఉద్యోగుల ప్రవర్తన కూడా ప్రజలలో అసంతృప్తి కలిగిస్తూ వచ్చింది. ఉద్యోగాల విషయంలో, పదవులలో, విశ్వవిద్యాలయ కేంద్రంలో ఆర్ధికంగా వెనుకబడిన రాయలసీమ ఒక సమస్యగా ఉండి పోయింది. దీన్ని కొందరు తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకొని రాయలసీమ అభ్యున్నతి తర్వాతనే ఆంధ్రరాష్ట్ర నిర్మాణం అనే నినాదంతో ఆంధ్రోద్యమంలో చీలిక తీయ ప్రయత్నించారు. విభజించి పాలించడం నేర్చుకున్న బ్రిటిష్‌ గవర్నరు ఆంధ్ర పెద్దలను పిలిచి ఆంధ్రులు కూడా తమనే ఉమ్మడి గవర్నర్‌గా అంగీకరించే పక్షంలో మద్రాసు నగరాన్ని ఆంధ్ర, తమిళ రాష్ట్రాలకు రాజధానిగా రెండు రాష్ట్రాలు నిర్మిస్తానని ఆశలు కల్పించాడు. శ్రీబాగ్‌ ఒడంబడికలో ఆంధ్ర రాజధాని, హైకోర్టుల్లో రాయలసీమ ఏది కోరితే అది ముందు వారికి ఇచ్చి, మిగిలినది తీసుకుంటామనే హామీకి ఇది విరుద్ధం. మద్రాసును రెండు రాష్ట్రాలకు రాజధానిగా చేస్తే రక్తం ఏరులై పారుతుందని ముఖ్యమంత్రి రాజాజీ భయపెట్టారు.
1940 ఫిబ్రవరి 20న ఆంధ్ర మహాసభ ఉపాధ్యక్షుడు వెంకటాచలం చెట్టి రాజాజీకి రాసిన లేఖ ఈ విధంగా ఉంది. అది మద్రాసుపై ఆంధ్రుల హక్కును వెల్లడిస్తుంది- ‘చెన్నపట్నం నిర్మాణం జరిగి 350 సంవత్సరాలైంది.

అంతకు పూర్వం ప్రధానంగా ఉండే పట్టణం శాంథోమ్‌. అందులో తమిళుల సంఖ్యే అధికం. పోర్ట్‌ సెయింట్‌ జార్జ్‌లో ఉత్తర భాగంలో ఉండే వారంతా తెలుగువారే. చెన్న కేశవ పెరుమాళ్‌ దేవాలయం కూడా అప్పుడు కంపెనీవారి కోట సరిహద్దులలో ఉండేది. వ్యాపార పరిశ్రమలలో అఖండమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నవారంతా తెలుగువారే. ఆ రోజులలో గృహ పరిశ్రమలు విశేషంగా వర్ధిల్లినవి. దేవాంగులు, కంసాలులు, కుమ్మరులు మొదలైన వృత్తుల్లో పనిచేసేవారంతా తెలుగువారే. ఇంకా వైశ్యులు, నాయిళ్ళు, బలిజలు మొదలైన చిన్న చిన్న వర్తకులు తెలుగువారే. జార్జ్‌ టౌన్‌ యావత్తు తెలుగు పట్టణమే. కృష్ణప్ప నాయకుని వీధి, రత్నాల వీధి, కుమ్మరిపేట, అవధ్యానం పాపయ్య వీధి, షరాబు అంగళ్ళు మొదలైనవన్నీ తెలుగు పేర్లే. ఇవి తెలుగువారి నివాస స్థలాలనడానికి ప్రబల నిదర్శనాలు. దక్షిణ దేశానికి రైలు పడేంతవరకూ చెన్నపురి తెలుగు పట్నంగానే ఉంటూ వచ్చింది. అనంతరం తమిళులు ఉద్యోగాలకోసం వచ్చి చెన్నపురిలో స్థానం ఏర్పరచుకుని చాలా భాగాలు ఆక్రమించుకున్నారు’. చెన్న రాష్ట్రంలో 1921 నుంచి 1937 వరకు జస్టిస్‌ పార్టీ మంత్రివర్గాలు పనిచేశాయి. జస్టిస్‌ పార్టీ పరిపాలనలో కులతత్వాల పునాదులు పడ్డాయి. 1937 ఎన్నికల్లో జాతీయ పార్టీల నాయకులు పోటీలో నిలబడగానే జస్టిస్‌ పార్టీ చిత్తుగా ఓడిపోయింది.

1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం లభించింది. రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంట్‌ అయింది. స్వదేశీ సంస్థానాలు, పాతరాష్ట్రాలు వెంటనే ఏకం చేయడం రాజ్యాంగపరంగా సాధ్యంకాదు. మద్రాసులో ఉన్న 11 తెలుగు జిల్లాలు మాత్రం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా విభజించవచ్చునని నెహ్రూ ప్రకటించారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం విషయం విచారించి నివేదిక సమర్పించవలసిందిగా థార్‌ కమిషన్‌ను నియమించారు. కమిషన్‌ ప్రకాశం అందించిన నివేదికలో మద్రాసు నగరం పుట్టుపూర్వోత్తరాలు ఉటంకించి ఆ నగరం ఆంధ్రులదేననే అంశం నిరూపించారు.థార్‌ కమిషన్‌ మద్రాసుకు వచ్చినప్పుడు ఆంధ్రమహాసభ అధ్యక్షుడుగా ఉన్న ఉయ్యూరు కుమారరాజ్‌, కాళేశ్వరరావు సహాయంతో ఆంధ్రరాష్ట్రం గురించి ఒక మెమొరాండం తయారు చేసి దానికి అందించారు. కమిషన్‌కు ప్రకాశం కూడా ఒక మెమొరాండం అందజేశారు. అప్పటికే రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రయత్నించడానికి రాయలసీమ మహాసభ ఏర్పడి ఉంది. అప్పుడు ఆ మహాసభకు అధ్యక్షుడు నీలం సంజీవరెడ్డి. తన సభ తరపున నీలం సంజీవరెడ్డి కూడా థార్‌ కమిషన్‌కు ఒక నివేదిక సమర్పించాలి. ఆంధ్రరాష్ట్రం ఏర్పడితే రాయలసీమకు ఏఏ రక్షణలు కావాలని కోరారు.

భారత ప్రభు త్వం అనేక క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటున్న అప్పటి పరిస్థితులలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వాంఛనీయం కాదని థార్‌ కమిషన్‌ స్పష్టీకరించింది. దీన్ని అంగీకరించలేని అధిష్ఠానం జెవిపి కమిటీని నియమించింది. జెవిపి కమిటీ1949 ఏప్రిల్‌లోగానే తన నివేదికను సమర్పించింది. అందులో ఆంధ్రరాష్ట్రం కోరేవారు మద్రాసుపై తమ హక్కులు వదులుకోవాలని చెప్పింది. దీనిదో రగడ బయల్దేరింది. ఈ కమిటీ రిపోర్టును ఆంధ్రులు పలువురు తీవ్రంగా విమర్శించారు. ప్రకాశం తన అసమ్మతి తెలిపారు. శొంఠి రామమూర్తి, కల్నల్‌ తాడేపల్లి శంకర శాస్ర్తి ఈ వ్యతిరేకోద్యమంలో ముందు నిలిచారు. శొంఠి రామమూర్తి తరపున ఒక రాయబారం హైకమాండ్‌ వద్దకు వెళ్ళింది. నెహ్రూ వారి వాదన విన్నారు. మద్రాసు రాష్ట్ర పటం తెప్పించి చూశారు. పట్నం ఇరు ప్రాంతాలకూ సంబంధించిన ప్రదేశంలో ఉందని నెహ్రూ అన్న విషయాన్ని అనంతశయనం అయ్యంగార్‌ రాష్ట్ర కాంగ్రెస్‌కు తెలియచేశారు. కాని మద్రాసు విషయమై జెవిపి కమిటీ అన్నదానిలో ఒక్క అక్షరం కూడా మారలేదు.

స్వామీ సీతారాం 36 రోజుల నిరసన దీక్ష వల్ల ఏమీ ప్రయోజనం లేకపోయింది. కొంత అలజడి మాత్రం తగ్గింది. విద్యార్ధులు ఆందోళన చేశారు. సత్యాగ్రహం అనే పేరుతో రైళ్ళలో టికెట్‌ లేకుండా ప్రయాణించడం, మద్రాసు ప్రభుత్వ కార్యాలయాలముందు నిరసనలు, పికెటింగ్‌లు వంటివి చేశారు. అంతా తెలుగులోనే మాట్లాడుకోవాలి, శాసన సభల్లో తెలుగు మాట్లాడాలి అనే ఉద్యమం బయల్దేరింది.1952 అక్టోబర్‌ 19న పొట్టి శ్రీరాములు ప్రారంభించిన ఆమరణ దీక్షతో ఆంధ్రదేశమంతటా చెలరేగుతున్న తీవ్ర ఆందోళన పార్లమెంట్‌లో, అసెంబ్లీలో వినిపిస్తున్నా దీని ప్రతిధ్వని కేంద్రప్రభుత్వానికి భీతి కలిగించింది. డిసెంబర్‌ 9న ప్రధాని నెహ్రూ ‘మద్రాసు నగరంతో ప్రమేయం లేకుండా ఆంధ్రులంతా నిర్వివాద ప్రాంతాలతో రాష్ట్రం ఇమ్మని కోరితే ఆంధ్రరాష్ట్రం ఏర్పడడానికి ఇండియా ప్రభుత్వానికి అభ్యంతరం లేదు’ అని ప్రకటించారు. డిసెంబర్‌ 15 అర్ధరాత్రి, 58 రోజల కఠోర నిరసన వ్రతం తరువాత పొట్టి శ్రీరాములు ఆమరత్వం పొందారు. అది 58 రోజుల దీక్ష!
శ్రీరాములు ఆత్మార్పణంతో ఆంధ్ర ప్రపంచం భగ్గుమంది.

క్రోధాగ్ని కట్టలు తెంచుకుంది. కోస్త, రాయలసీమ, తెలంగాణ- యావదాంధ్ర, ఊరు ఊరు, వాడ వాడ, ఆపిల్ల బాలాది ప్రజానీయం అట్టుడికినట్టు ఉడికిపోయారు. హర్తాళ్ళు, ఊరేగింపులు, బహిరంగ సభలు సాగాయి. ఆగ్రహం, ద్వేషం, ఆవేశం ప్రజ్వరిల్లి పోయిన విద్యార్ధిలోకం ఎక్కడి రైళ్ళను అక్కడే ఆపివేసింది. కొన్ని రైల్వే స్టేషన్లలో పోలీసులు కాల్పులు జరపగా కొందరు చనిపోయారు. ఏర్పడుతున్నది చిరకాల వాంఛితమైన ఆంధ్ర రాష్ట్రం. కాని తాము ఆంధ్రులమనే భావం అప్పటి రంగంలో నిలబడి ఉన్న నాయకులలో ఏ ఒక్కరికీ కలగలేదు. రాజధాని విషయంలో ఎవరిదారి వారిదే అయ్యింది. ఏ నగరాన్ని నిర్ణయిస్తే ఎవరి పార్టీ బలం పడిపోతుందో, ఎవరి స్థానబలం పెరుగుతుందో అనే ఆందోళనలో అన్ని ప్రాంతాలవారూ ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక్కొక్క నగరం గురించి చర్చించి త్రోసిపుచ్చుకున్నారు. విశాఖ- రాయలసీమకు దూరమైంది. కాంగ్రెస్‌ను పరాభవించి కమ్యూనిస్టుల్ని ఎన్నుకున్న బెజవాడ- కాంగ్రెస్‌వారికి గిట్టలేదు. ముందుగా కృషికార్‌ లోక్‌పార్టీవారు పేరు చెప్పినందుకు- సంజీవరెడ్డి, ప్రకాశంలకు తిరుపతి పట్టణం నచ్చలేదు.

తన స్వస్థానమైన అనంతపురం ఇతరులెవ్వరికి సమ్మతం కాదని సంజీవరెడ్డికి తెలుసు. రాజాజీ పేరు పెట్టనందుకు ఇందులో ఏదో కుట్ర ఉందని అందరూ ఏకమై నెల్లూరును తిరస్కరించారు. ఇక మిగిలింది కర్నూలు ఒక్కటే. ఆఖరుకు శంకరరెడ్డి అయినా అడగని కర్నూలుకు అందరూ కలిసి రాజధానిగా పట్టం కట్టారు. మూడు పార్టీలు అంగీకరించాయి.అయితే, మద్రాసు శాసన సభలో ఆంధ్ర రాష్ట్ర శాసనం చర్చకు వచ్చినప్పుడు తాత్కాలిక రాజధాని పేరు కర్నూలు తీసివేసి బెజవాడ ఉండాలని కమ్యూనిస్టులు, తిరుపతి ఉండాలని కెఎల్‌పి వారు సవరణలు ప్రతిపాదించారు. కమ్యూనిస్టులకు బలం లేని రాయలసీమలో, కాంగ్రెస్‌ బలాన్ని విచ్ఛిన్నం చేసి తన బలం పెంచుకోవడానికి కెఎల్‌పి ఎత్తు వేసిందని విమర్శకుల అభిప్రాయం. అయిదుగురే ఆంధ్రేతర సభ్యులు కర్నూలుకు అనుకూలంగా ఓటు వేయడంతో విజయవాడ సవరణ వీగిపోయింది. తిరుపతికి చెప్పుకోదగ్గ ఓట్లు పడలేదు. శ్రీబాగ్‌ ఒడంబడికలోని మొదటి షరతు ప్రకారం రాయలసీమకు రాజధాని ఇచ్చినట్టయింది.

అయితే ఇలా రాజధాని ఇచ్చినందుకు రాయలసీమ- సర్కారు విభేదాలు పెరిగినవా, తరిగినవా అని పరిశీలిస్తే, పెరిగినవనే చెప్పాలి. అంతేకాదు, ఇంత వరకు సర్కారు- రాయలసీమ విభేదాలు ఉన్నవి. ఇప్పుడు సర్కారు- విశాఖ తగాదాలు కూడా ప్రారంభమైనాయి. ఆంధ్రకేసరి ప్రకాశం ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయ్యారు.

No comments:

Post a Comment