Monday 12 August 2013

కాలగర్భంలోకి భారతీయ భాషలు!

కాలగర్భంలోకి భారతీయ భాషలు!

August 10, 2013
వడోదర, ఆగస్టు 9: భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబమైన భారతదేశంలో భాషల మనుగడకు ప్రమాదం ఏర్పడింది. వందలాది భాషలు కాలగర్భంలో కలుస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 1961లో దేశంలో 1100 భాషలుంటే.. నేటికి వాటిలో 220 భాషలు కనుమరుగయ్యాయి. వడోదరకు చెందిన 'భాషా రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ సెంటర్' ప్రతినిధులు రెండేళ్లుగా నిర్వహించిన 'పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా (పీఎల్ఎస్ఐ)'లో ఈ వాస్తవం వెల్లడైంది. తమ అధ్యయనంలో భాగంగా 1961 నాటి లెక్కల్లోని భాషల్లో దాదాపు 880 భాష లు గుర్తించామని సర్వే ప్రధాన సమన్వయకర్త గణేష్ దేవీ చె ప్పారు.

మిగిలిన 220 భాషలు అంతరించినట్టుగానే భావిస్తున్నామన్నారు. సంచార జాతులకు చెందిన ప్రజల భాషలే అంతరిస్తున్నవాటిలో ఉన్నాయని చెప్పారు. 1961 జనాభా లెక్కల్లో మొత్తం 1652 భాషలను గుర్తించారు. కానీ.. వాటి మనుగడ, మాట్లాడుతున్నవారి సంఖ్య వంటి పలు కారణాలతో ఆ సంఖ్యను 1100కు తగ్గించారు. అయితే.. కనీసం 10వేల మంది మాట్లాడితేనే భాషగా గుర్తించాలని 1971 జనాభా లెక్కల సమయంలో నాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా.. కేవలం 108 భాషలనే అధికారులు గుర్తించగలిగారు. అది అలా కొనసాగుతూ నేటికి అనేక భాషలు మరుగున పడ్డాయని గణేష్ చెప్పారు. మాతృభాషలో స్వేచ్ఛగా మాట్లాడుకోగలిగే వాతావరణం లేకపోవడం, వాటికి తగిన గుర్తింపు లేకపోవడమే ఈ స్థితికి కారణాలుగా నిలుస్తున్నట్టు చెప్పారు

No comments:

Post a Comment