Thursday 15 August 2013

ఎస్సార్సీ వేయండి - Seemandhra Ministers

ఎస్సార్సీ వేయండి

August 16, 2013

న్యూఢిల్లీ, ఆగస్టు 15:
"రాష్ట్ర విభజనపై నిర్ణయాన్ని పునః సమీక్షించండి. రెండో రాష్ట్ర్లాల పునర్వ్యవస్థీకరణ కమిటీ (ఎస్సార్సీ)ని వేసి నిర్ణయం తీసుకోండి''
- ఆంటోనీ కమిటీ ఎదుట కేంద్ర మంత్రులు
"రాష్ట్ర విభజన విషయంలో వెనక్కు వెళ్లడం కష్టం. ఇతరత్రా సమస్యలు చెప్పుకోండి''
- కేంద్ర మంత్రులతో కమిటీ సభ్యుడు దిగ్విజయ్
.. ఆంటోనీ కమిటీ ఎదుట జరిగిన వాదనల తీరు ఇది! రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరదామని, అంతా ఒకే మాటపైనే ఉందామని నిర్ణయం తీసుకుని వెళ్లిన మంత్రులు కూడా.. దిగ్విజయ్ ప్రకటనతో విభజన అనంతర పరిణామాలపైనే చర్చించాల్సి వచ్చింది.

కేంద్ర మంత్రులు కావూరి, చిరంజీవి, పళ్లంరాజు, కిశోర్ చంద్రదేవ్, పురందేశ్వరి, పనబాక, జేడీ శీలం, కృపారాణి, కోట్ల, ఎంపీ చింతా మోహన్ గురువారం ఆంటోనీ కమిటీతో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర సేపు తమ వాదనలను వినిపించారు. నియోజకవర్గాల్లో పర్యటించలేకపోతున్నామని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని సీమాంధ్ర ప్రజలంతా భావిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌కు కూడా వెళ్లాలని కోరారు. అయితే, పార్లమెంట్ సమావేశాలున్నందున కమిటీ రాష్ట్రంలో పర్యటించలేదని, తానే హైదరాబాద్ వస్తానని దిగ్విజయ్ తెలిపారు.

ఒకే మాట వినిపించాలని వెళ్లి..
ఆంటోనీ కమిటీతో భేటీకి ముందు కేంద్ర మంత్రులంతా చిరంజీవి నివాసంలో సమావేశమయ్యారు. కలిసికట్టుగా అంతా ఒకే వాదనను వినిపించాలని నిర్ణయించారు. కానీ, రాష్ట్ర విభజన విషయంలో వెనక్కు వెళ్లడం కష్టమని, ఇతరత్రా సమస్యలు చెప్పుకోవాలని దిగ్విజయ్ ముందే స్పష్టం చేయడంతో మంత్రులు వేర్వేరుగానే తమ వాదనలను వినిపించారు. రాష్ట్రాన్ని విభజిస్తే జల వనరుల విషయంలో తీవ్ర సమస్యలు వస్తాయని ఒక మంత్రి చెప్పారు. ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని, నైపుణ్యాల అభివృద్ధి కుంటుపడుతుందని మరో మంత్రి వాదించారు. హైదరాబాద్‌లో తాము రెండో శ్రేణి పౌరులుగానే ఉండిపోవాల్సి వస్తుందని ఇంకొక మంత్రి చెప్పారు. సేవల రంగం బాగా దెబ్బతింటుందని ఒక మంత్రి చెబితే.. తన నియోజకవర్గంలో జరిగినంత నష్టం మరే నియోజకవర్గంలోనూ జరగలేదని ఇంకో మంత్రి తెలిపారు.

రాయల తెలంగాణ అయితే సమస్యలు తగ్గిపోతాయని ఒక మంత్రి చెప్పినట్లు తెలిసింది. మంత్రులందరి తరపున పళ్లంరాజు ప్రధానంగా వాదనలు వినిపించినా.. సమైక్యాంధ్ర వాదనను డిగ్గీ రాజా కొట్టిపారేయడంతో ఇతరత్రా వాదనలను వినిపించాల్సి వచ్చింది. సమావేశంలో ఆంటోనీ కూడా జల వనరులు, ఉపాధి, హైదరాబాద్ తదితర అంశాలపై ప్రశ్నలు లేవనెత్తడంతో మంత్రులు వాటిపైనే చర్చించాల్సి వచ్చింది. ఆంటోనీ కమిటీలో సభ్యులైన అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీ చర్చలో మౌన ప్రేక్షకులుగానే ఉండిపోయారు.

సానుకూలంగా పరిష్కారం: దిగ్విజయ్
సమావేశంలో అందరి వాదనలు విన్నామని, సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని దిగ్విజయ్ తెలిపారు. భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. 19, 20 తేదీల్లో కమిటీ మళ్లీ సమావేశమవుతుందని, తొలుత తెలంగాణ మంత్రులు, తర్వాత సీమాంధ్ర మంత్రులు, శాసన సభ్యులతో చర్చిస్తామని వివరించారు. కేంద్ర మంత్రులు తమ వాదనలను వినిపించుకోవడానికి మరోసారి అవకాశం ఉంటుందని తెలిపారు.

కాగా, రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితిని, ఇతర వాస్తవాలను వివరించామని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరామని పళ్లంరాజు చెప్పారు. సీమాంధ్రుల ఆందోళనను వివరించామన్నారు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులను అర్థం చేసుకోవాలని, అందరికీ సమన్యాయం చేయాలని కోరామని చిరంజీవి చెప్పారు. ప్రజలు సంయమనం పాటించాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరామని, విద్యార్థులు, రైతుల సమస్యలను వివరించామని పురందేశ్వరి చెప్పారు. కాగా, తన అభిప్రాయాలను మళ్లీ కలిసినప్పుడు వివరిస్తానని కోట్ల తెలిపారు.

No comments:

Post a Comment