Friday 2 August 2013

Formation of Navyandhra

నవ్యాంధ్రకు కొత్త ప్రస్థానం - ఏ.యం.ఖాన్ యజ్దానీ (డానీ)

August 03, 2013
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సాకారం అవుతుందని రాయలాంధ్రులు చాలామంది ఊహించి ఉండరు. అందుకే వాళ్లు సిడబ్ల్యూ సీ తీర్మానాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇలాంటి సందర్భాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబకడం సహజం. ఇప్పుడు సీమాంధ్రలో జరుగుతున్నది అదే. ఒకరు అనుకున్నా అనుకోకపోయినా చరిత్రలో జరగాల్సినవి జరగక తప్పవు. గడిచిపోయిన కాలాన్ని వెనక్కు తీసుకురావడమూ కుదరదు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ స్వంత పార్టీ పెట్టిన తరువాత రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలన్నీ ఒక క్రమంలో సాగాయి. వీటిని నిశితంగా గమనించిన వారెవరికైనా తెలంగాణ ఇస్తేనే గానీ, ఆంధ్రప్రదేశ్ లో 2014 ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని చుట్టు ముట్టిందని సులువుగానే అర్థం అవుతుంది.

ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తెలంగాణకు సానుకూలంగా ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడని పార్టీ సీమాంధ్రలో లేదు. రోశయ్య హయాంలో 2009 డిసెంబర్ 7న జరిగిన అఖిల పక్ష సమావేశం తెలంగాణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఆయా పార్టీల అధికారిక తీర్మానాల్లో ఇప్పటికీ మార్పు లేదు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులతో పాటూ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టిడిపి శాసనసభ్యుల్లో కొందరు (లేదా,అందరూ) తెలంగాణ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయవచ్చు. దానివల్ల ఒనగూడే ప్రయోజనం ఏమీ వుండదు. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో శాసనసభ తీర్మానం పాత్ర నామ మాత్రమే. ఇక్కడి పరిస్థితిని రాష్ట్రపతికి తెలియపరచడానికి మాత్రమే అది పనికి వస్తుంది. శాసనసభలో అంతకుమించిన అనూహ్య ఫలితాలను సాధిస్తామని ఎవరైనా అంటే, వాటిని ఉత్తరకుమార ప్రగల్భాలు అనుకోవాలి. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడానికి ఆతృతను కనపరుస్తున్నారన్నది ఇక్కడ ముఖ్యం. తెలంగాణ ఏర్పాటు తీర్మానం ఒక వేళ శాసనసభలో వీగిపోయినా సోనియా అభిమతానికి భిన్నంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకుంటారనుకోవడం రాజకీయ అమాయకత్వమే అవుతుంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పది అడుగుల రోడ్ మ్యాప్ ను కేంద్రహోంమంత్రి షిండే ప్రకటించేశారు. ఈ పది అడుగులు వేయడానికి సాధారణంగా ఓ పదినెలలు పడుతుంది కానీ, కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆరునెలలలోపునే పూర్తిచేసేసే ఆతృతలో ఉందని షిండే చెప్పకనే చెప్పారు. ఈ పది అడుగుల్లో పార్లమెంటు ఆమోదం అనేది ఒకే ఒక అడుగు తప్ప, మిగిలిన తొమ్మిది అడుగులు సోనియా కనుసన్నల్లో సాగేవే. తన వల్లనే తెలంగాణ వస్తున్నదని బీజేపీ కూడా చెప్పుకుంటున్నది కనుక ఆ పార్టీ మద్దతిస్తే ఇక పార్లమెంటు ఆమోదం అనే పదవ అడుగు కూడా కేవలం లాంఛనమే ! వీటన్నింటి అర్థం ఏమిటి? తెలంగాణ ఆరునెలల్లో అనివార్యంగా సాకారం అవుతుందని! షిండే మాటల్ని బట్టి ఆరునెలల తరువాత ఏ క్షణాన్నయినా సాధారణ ఎన్నికలు రావచ్చు. కాంగ్రెస్ ఆతృతను ఆరు నెలల కన్నా ముందే తెలంగాణను ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రకటించే అవకాశాలు లేకపోలేదు అనిపిస్తోంది. రాయలాంధ్ర ప్రజల దగ్గర ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది. మనం ఒక్క క్షణం ఆలస్యం చేసినా భారీ మూల్యాన్ని చెల్లించాల్సివుంటుంది.

తెలంగాణ ఏర్పాటుతో పాటు పోలవరం ప్రాజెక్టు కు జాతీయ హోదా కల్పించాలని, హైదరాబాద్‌ను ఓ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా వుంచాలని సిడబ్ల్యూ సీ ఇప్పటికే ప్రకటించింది. పదేళ్ళ తరువాత రాజధాని సంగతేంటో రాయలాంధ్రులు ఇప్పుడే తేల్చుకోవాలి. చండీగఢ్ తరహాలో ఆ పదేళ్లను అనంతంగా సాగదీసుకుంటూ వుండవచ్చని మళ్ళీ కొందరు తప్పుడు భరోసాలు ఇస్తున్నారు. ఇవి ప్రమాదకరం. కొత్త రాజధానిని నిర్మంచడానికి చండీగఢ్‌ను ఆదర్శంగా తీసుకోవాల్సిందే. అయితే అస్తిత్వంలో ఉన్న రాజధానిని పంచుకోవడానికి చండీగఢ్‌కూ, హైదరాబాద్‌కూ పోలికే లేదు. తూర్పు పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌ల సరిహద్దుల్ని కలుపుతూ చండీగఢ్ నగరాన్ని కృత్రిమంగా నిర్మించారు.సీమాంధ్ర సరిహద్దుల నుంచి హైదరాబాద్ దాదాపు 200నుంచి 250 కిలో మీటర్ల దూరంలో ఉంది. రైలు మార్గం అయితే ఇంకో వంద కిలో మీటర్లు ఎక్కువ. 'మన'రాజధాని నగరానికి వెళ్ళడానికి 'పొరుగు రాష్ట్రం' లో ఇంతటి వ్యయప్రయాసలతో కూడిన ప్రయాణం చేయాల్సిరావడంలో ఉన్న సాధ్యాసాధ్యాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

హైదరాబాద్ వంటి నగరాన్ని పునర్నిర్మించగలమా? అని నిస్పృహతో నిట్టూరిస్తే ప్రయోజనం ఉండదు. హైదరాబాద్ ను మించిన నగరాన్ని నిర్మించగలం అనుకుంటే మార్గం కనపడుతుంది. కొత్తగా హైదరాబాద్ వంటి నగరాన్ని నిర్మించడానికి దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు అవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. దాన్ని పరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వ సాలీన బడ్జెట్‌లో ఇది సుమారు మూడవ వంతు. హైదరాబాద్ వంటి నగరాల మౌలిక సదుపాయాల గురించి ప్రస్తావించే సమయంలో కొన్ని గణాంకాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. 600 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం గల భూమి, 30 వేల కిలో మీటర్ల రోడ్లు, ప్రతి రోజు శతకోటి లీటర్ల తాగునీటి సరఫరా, ఐదు వేల మెగా వాట్ల విద్యుత్ స్తోమత అనేవి కీలకమైనవి. రాజధాని నగరం అంటే ప్రభుత్వ విభాగాలన్ని ఒకేచోట వుండితీరాలా? లేక వాటిని వికేంద్రీకరించి మూడు నాలుగు నగరాల్లో ఏర్పాటు చేయడం సాధ్యమేనా? వంటి అంశాల మీద విస్తృతంగా చర్చ జరగాలి.

పదేళ్ల లోపు కొత్త రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే, దాని నిర్మాణం తెలంగాణ ఆవిర్భావం రోజున మొదలవ్వాలి. కొత్త రాజధానిని నెలకొల్పడానికి అవసరమైన భవనాలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి డిజైన్లు, అంచనా వ్యయాలు సిద్ధం చేయాలి. ఆ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాలి. పోల వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వడంతో పాటూ కొత్త రాజధానికి నిధుల కేటాయింపు అంశం, తెలంగాణ బిల్లుతో పాటే పార్లమెంటులో ఆమోదం పొందేలా కేంద్ర ప్రభుత్వంపై అన్ని రకాల ఒత్తిళ్ళు తేవాలి. రాయలాంధ్రులు తమ పోరాట పటిమని ఆ దిశగా చూపించాలి. దాని కోసం అవసరమైతే, ఇన్నాళ్ళూ తెలంగాణ కోసం పోరాడిన శక్తులతోనూ ఐక్య సంఘటన కట్టడానికి అవకాశం వుంది. వాళ్ళు కలిసి వస్తారుకూడా.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి భవిష్యత్తులో వివాదాలు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంది. అప్పటివరకు భద్రాచలం రెవిన్యూ డివిజన్‌ను (1959లో దీన్ని ఖమ్మం జిల్లాలో కలిపారు) పరిపాలన సౌకర్యం కోసం తిరిగి తూర్పు గోదావరి జిల్లాలో కలపాలి. సరిగ్గా ఈ రెవిన్యూ డివిజన్‌లోనే కూనవరం వద్ద శబరినది గోదావరిలో కలుస్తుంది. దిగువ గోదావరి నదిలోనికి నీరువచ్చేది ప్రధానంగా శబరి నది ద్వారానే. తెలంగాణ వాదులు కోరుకుంటున్నది 1956 కన్నా ముందున్న తెలంగాణ కనుక భద్రాచలం రెవిన్యూడివిజన్ ను తిరిగి ఇవ్వడానికి వాళ్లకూ అభ్యంతరం వుండదు. సుశీల్‌కుమార్ షిండే ప్రకటించిన పదిమెట్లలో భాగంగా, ఒక నెలరోజులు లోపునే కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రానికి వస్తుంది. రాష్ట్ర విభజన విధివిధానాలపై రాష్ట్రపతికి నివేదించేది ఈ కమిటీయే. ఆ కమిటీ రాష్ట్రానికి రాకముందే రాయలాంధ్రులు సమష్టిగా కొత్త రాజధాని ప్రతిపాదనలతో సిద్ధం కావాలి. కొత్త రాజధానిని ఎంపిక చేయడం, దానిమీద ఏకాభిప్రాయం సాధించడం అంత సులభమైన వ్యవహారం కాదు. చర్చోప చర్చలకు ఖండన మండనలకు ఇప్పుడు సమయం నెలరోజులు కూడా లేదు. కౌంట్ డౌన్ మొదలయ్యి పోయింది ఈరోజే, ఇప్పుడే. వివేకాన్ని ప్రదర్శించాల్సిన చారిత్రక సమయంలో భావోద్వేగాలకు లోనయ్యి సమయాన్ని వృధాచేస్తే, తెలంగాణ ఎలాగూ ఆగదు. మన రాజధాని నిర్మాణమూ జరగదు. అది జరిగితే భావితరాలు మనల్ని ఎన్నటికీ క్షమించవు.

No comments:

Post a Comment