Wednesday 21 August 2013

విధాన లోపం- రూపాయికి శాపం - 1, K . Narasimha Murthy

విధాన లోపం- రూపాయికి శాపం

August 21, 2013
డాలర్ మారకంలో రోజుకో కొత్త కనిష్ఠ స్థాయితో రూపాయి విధాన నిర్ణేతలను బెంబేలెత్తిస్తోంది.
ఆసియాలోని ఏ ఇతర వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లోనూ ఆయా దేశాల కరెన్సీ విలువ ఈ స్థాయిలో పతనం కావడం లేదు. సకల శక్తులు, సర్వోపాయాలతో రూపాయికి అండగా ఆర్‌బిఐ చేస్తున్న యుద్ధం ఏమాత్రం ఫలితాన్నివ్వడం లేదు. ఆర్థిక రంగంలో సంక్షోభానికి సంకేతంగా మారడంతో పాటు ప్రభుత్వాన్ని బాహాటంగా సవాలు చేస్తున్న రూపాయి విలువ పతనానికి కారణాలేమిటి? ప్రభుత్వం నేల విడిచి సాము చేస్తోందా.. ? అర్థవంతంగా చర్యలు తీసుకుంటుందా ? రూపాయి దురవస్థకు దారితీసిన పరిస్థితుల నేపథ్యం ఏమిటి..? ప్రముఖ ఆర్థిక వేత్త, బ్యాంకింగ్ నిపుణులు కె నరసింహమూర్తి సమగ్ర విశ్లేషణ ఆంధ్రజ్యోతి పాఠకుల కోసం.

భారత కరెన్సీ రూపాయి విలువలో పతనానికి 2011 సంవత్సరంలోనే బీజం పడింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలో కర్ణాటక లో ఇనుప ఖనిజం తవ్వకాలపై విధించిన నిషేధం, విద్యుత్ ఉత్పత్తికి అత్యంతకీలకమైన బొగ్గు గనుల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వ అపసవ్య విధానాలు మన కరెన్సీని పతన బాటలోకి నెట్టాయి. 2011 సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం వల్ల కర్ణాటకలో ఇనుప ఖనిజం తవ్వకాలపై నిషేధం విధించారు. ఇనుప ఖనిజం ఎగుమతులు నిలిచిపోయి ఆ పరిశ్రమ కుప్పకూలింది. అదే సమయంలో బొగ్గు ప్రైవేటీకరణ వ్యవహారంలో ఒక దాని వెంట ఒకటిగా కుంభకోణాలు బయటపడటంతో ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త విద్యుత్ ప్లాంట్లు పని ప్రారంభించడంతో దేశీయ డిమాండును తట్టుకునేందుకు ఎక్కువ ధరతో బొగ్గు దిగుమతి చేసుకోవలసిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు బొగ్గు కొరత కారణంగా తగినంత విద్యుత్ సరఫరా లేక పారిశ్రామిక రంగం కష్టాల్లో పడి దేశంలోకి కొత్త పెట్టుబడుల రాక స్తంభించిపోయింది. ఎఫ్‌డిఐలు నిలిచిపోయాయి. దీనికి తోడు 2010 సంవత్సరం నుంచి ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, దాన్ని అదుపులోకి తెచ్చే పేరిట ఆర్‌బిఐ వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోవడం వల్ల భారత్ ఆర్థిక వ్యవస్థపై నెగిటివ్ సెంటిమెంట్ ఏర్పడింది.

సంస్కరణల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోలేని దురవస్థ కారణంగా ఆర్థిక కడగండ్లు పెరిగిపోయాయి. ఇదే సమయంలో దేశీయ మార్కెట్ నుంచి ఎఫ్ఐఐలు నిధులు ఉపసంహరించడం రూపాయి పతనానికి ఆజ్యం పోసింది. గత జూన్‌లో ఎఫ్ఐఐలు 1,050 కోట్ల డాలర్ల మేరకు నిధులు ఉపసంహరించారు. దాని ప్రభావం వల్ల డాలర్ మారకంలో రూపాయి విలువ ఒక్క సారిగా 50 నుంచి 60 స్థాయికి అంటే 10 శాతం మేరకు పతనమైంది. మన స్టాక్ మార్కెట్‌లో ప్రస్తుతం 13,700 కోట్ల డాలర్ల ఎఫ్ఐఐ నిధులున్నాయి. ఎఫ్ఐఐ పెట్టుబడులపై ఎలాంటి నియంత్రణ ఉండదు. వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ నిధులు ఉపసంహరించుకోవచ్చు. దాన్ని హాట్ మనీగా వ్యవహరిస్తారు. కేవలం 1,050 కోట్ల డాలర్లు ఉపసంహరించినందుకే రూపాయిపై ఇంత ప్రభావం పడితే మరింతగా నిధులు వెలుపలికి పోయినట్టయితే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు.
అసలు నిల్వ 11,400 కోట్ల డాలర్లే
ప్రస్తుతం మన దగ్గర 27,800 కోట్ల డాలర్ల విదేశీ మారకం నిల్వలున్నాయని, అవి ఆరు మాసాల దిగుమతులకు సరిపోతాయని ప్రధాని చెబుతున్నారు. కాని అందులో కరెన్సీ రూపంలో అందుబాటులో ఉన్నది 25,100 కోట్ల డాలర్లు మాత్రమే. 2,100 కోట్ల డాలర్లు బంగారం రూపంలోను, 4,500 డాలర్లు ఎస్‌డిఆర్ రూపంలోనూ ఉన్నాయి.

ఇవి లిక్విడిటీకి అవకాశం లేని నిల్వలు. కరెన్సీ రూపంలో అందుబాటులో ఉన్న 25,100 కోట్ల డాలర్లలో ఎఫ్ఐఐ నిధులు 13,774 కోట్ల డాలర్లను కూడా తీసివేస్తే నికరంగా మన దగ్గర ఉన్న విదేశీ మారకం నిల్వ 11,400 కోట్ల డాలర్లే. ఈ నిల్వలు రెండు నుంచి మూడు నెలల దిగుమతులకు సరిపోతాయి. మన ప్రస్తుత ఆర్థిక తిరోగమన స్థితి మరింతగా కొనసాగి ఎఫ్ఐఐలు భారీ మొత్తంలో నిధులు ఉపసంహరించినట్టయితే దేశం సంక్షోభంలో పడుతుంది. రూపాయి విలువ మరింత నేలమట్టం అవుతుంది. గత ఏడాది కాలంలో ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోయింది. ఇదే కరెంట్ ఖాతా లోటు లేదా సిఎడి. 2011-12లో ఇది 2.4 శాతం ఉండగా 12-13లో 4 శాతానికి చేరింది. ఈ ఏడాది ఆరు శాతాన్ని తాకుతోంది. ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగిపోవడం వల్ల రూపాయిపై ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది. పెట్రోలియం, ఎరువులు, వంటనూనెలు, బంగారం, ఇనుప ఖనిజం, బొగ్గు మన దిగుమతుల్లో అధిక వాటా కలిగి ఉన్నాయి. మనం యంత్రపరికరాల రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోకపోవడం వల్ల వాటిని భారీగానే దిగుమతి చేసుకోవాల్సివస్తోంది. వీటిలో ఇనుప ఖనిజం, బొగ్గు, యంత్రపరికరాల వంటివి నివారించ దగ్గ దిగుమతులే. మన ఆర్థిక విధానాల్లో లోపానికి ఇవి నిఖార్సైన నిదర్శనం. ఈ మూడు విభాగాలను మనం సమర్థవంతంగా అభివృద్ధి చేసినట్టయితే పెద్ద మొత్తంలో విదేశీ మారకం ఆదా అయి ఉండేది. రూపాయికి ఈ దుస్థితి పట్టేది కాదు.

అడ్డగోలుగా దిగుమతులు....
దేశ ఆర్థికాభివృద్ధికి ఏ మాత్రం దోహదకారి కాని, విలాసవంతమైన వస్తువుల దిగుమతి 2012-13 ఆర్థిక సంవత్సరంలో భారీ ఎత్తున జరిగింది. గత ఏడాది మనం అవసరం లేని వస్తువుల దిగుమతులపై ఖర్చు చేసిన తీరిలా ఉంది. యాపిల్స్ (1,152 కోట్లు), లిక్కర్ (1,150 కోట్లు), ఆట బొమ్మలు (1,232 కోట్లు), కాస్మోటిక్స్ (2,173 కోట్లు), చాక్లెట్లు (172 కోట్లు), విలాసవంతమైన చలువ కళ్లద్దాలు (366 కోట్లు), ఇళ్లకు వేసే తాళాలు (400 కోట్లు), గడియారాలు (1,236 కోట్లు), శరీరానికి పూసుకునే సుగంధ ద్రవ్యాలు (2,848 కోట్లు), డిజిటల్ కెమెరాలు (1,880 కోట్లు), సిల్క్ (1,700 కోట్లు), కార్లు (3,000 కోట్లు), మొబైల్స్ (25,838 కోట్లు), కలర్‌టీవీలు (3,411 కోట్లు).

చివరికి బాలబాలికలకు స్కూళ్లలో ఇచ్చే మొమెంటోలు, ఇంట్లో వాడే కాలింగ్ బెల్స్, టార్చిలైట్లు, బాత్‌రూమ్ ఫిటింగ్స్ వంటివి కూడా చైనా, కొరియాల నుంచి భారీగా దిగుమతి అవుతున్నాయి. ఇలాంటి వస్తువుల దిగుమతులను నివారించి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా మారేది కాదు. పైగా చైనా నుంచి వస్తున్న వస్తువులన్నీ అత్యంత నాసిరకమైనవి కావడం గమనించదగ్గ అంశం. ఇలాంటి నాణ్యత లేని వస్తువుల దిగుమతి అవసరమా ? వీటి వల్ల మన విదేశీ మారకం నిల్వలు తరిగిపోవడమే కాదు...దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కుంగిపోతున్నాయి. ఈ ధాటికి మన దేశంలోని బాత్‌రూమ్ ఫిటింగ్స్, పెన్నుల పరిశ్రమలు పూర్తిగా మూతపడ్డాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు

No comments:

Post a Comment