Tuesday 27 August 2013

ఉచితమే ! V V


ఇసుక తోడేవాళ్ళు లారీలకెత్తేవాళ్ళు
ఇటుక చేసేవాళ్ళు సిమెంటు కలిపేవాళ్ళు
రాళ్ళు కొట్టేవాళ్ళు నీళ్ళు తోడేవాళ్ళు
తమ ఊపిరితో నిప్పు రాజేసేవాళ్ళు
తమ రక్తమాంసాలతో తాజ్ మహళ్లకు
రంగులద్దేవాళ్ళు
ఇళ్ళు కట్టేవాళ్ళు ఇళ్లల్లో పనిచేసేవాళ్లు
అడ్డా కూలీలు అట్టడుగు బతుకుల వాళ్ళు
అంటరానివాళ్లు ఆదివాసీలు ఆడవాళ్లు
జెరూసలెం వంటి పురానా షహర్‌లోని
పేద ముస్లింలు
బాసల్నను కడిగేవాళ్లు బట్టలుతికేవాళ్లు
ఇళ్లు ఊడ్చేవాళ్ళు చెత్త ఎత్తుక పోయేవాళ్లు
రాళ్లు కొట్టేవాళ్లు తోళ్లు శుభ్రం చేసేవాళ్లు
సఫాయి పని వాళ్లు సడక్ పనివాళ్లు
ఒళ్లమ్ముకునేవాళ్లు పూలమ్ముకునేవాళ్లు
పాలూ పత్రికలూ వేసేవాళ్లు
బస్తీల్లో బతుకులీడ్చే వాళ్లు
అనేకులంతా భాగ్యనగరంలోని
అభాగ్యులంతా
ఒకరేమిటి
నీ నా ప్రసంగాలకు వేదికలు మైకులు
అమర్చేవాళ్లంతా
నీ నా జెండాలు మోసే వాళ్లంతా
సంఘటిత అసంఘటిత కార్మికులంతా
'ఇన్నేళ్లూ సేవలు చేసినందుకు
ఉచితంగా మాకు ఇళ్లు ఇచ్చి వెళ్లండ'ని
నీ నా భాషలో 'పనివాళ్లు'
ఉచితంగానే ఆడిగే రోజొకటి
తప్పకుండా త్వరలోనే వస్తుంది నాయకా!
('రాష్ట్రం' విభజన జరిగితే వెళ్లిపోతారు కదా? ఇన్నేళ్లు సేవలు చేసినందుకు ఉచితంగా మాకు ఇళ్లు ఇచ్చి వెళ్లండని పనివాళ్లు అడుగుతున్నారు' అని విజయవాడ సభలో 'హైదరాబాదు మరోపాలస్తీనా అవుతుందని చెప్పిన తులసిరెడ్డిగారికి కృతజ్ఞతలతో.. ఆంధ్ర జ్యోతి దినపత్రిక 26, ఆగస్టు పేజీ 9 ఆధారంగా)
- వి.వి.

No comments:

Post a Comment