Wednesday 21 August 2013

సీమకు సాగునీరు సుసాధ్యమే - T. Sivaji Rao

సీమకు సాగునీరు సుసాధ్యమే

August 21, 2013
రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమకు తాగునీరు, సాగునీరు లభించక ఎడారి ప్రాంతంగా మారుతుందని రాజకీయ నాయకులు అంటున్నారు. మరేం భయపడవలసిన అవసరం లేదు. మూడు దశాబ్దాలకు పూర్వమే కేంద్ర ప్రభుత్వం రాయలసీమకే కాకుండా తమిళనాడులోని కరువు జిల్లాలకు కూడా సాగునీరు సరఫరా చేయడం కోసం ఇంద్రావతి-వైనగంగ-శ్రీశైలం లింకు కాలువల ప్రాజెక్టు రూపొందిచింది. ఈ నీటిపారుదుల ప్రాజెక్టు రూపకల్పనలో ఒరిస్సాలోని కోలాబ్ జలాశయం, నదుల నుంచి దాదాపు 30 శతకోటి ఘనపుటడుగుల (టీఎంసీల) నీటిని ఇంద్రావతి నదిలోకి మళ్ళించడం అటుపైన ఇంద్రావతి నదిపై విద్యుచ్ఛక్తి కోసం చిన్న చిన్న జలాశయాలలో 434 టీఎంసీల నీటిని నిల్వచేయడానికి సంకల్పించారు.

ఇంద్రావతిలోని మిగులు జలాలతో డుడుమ వద్ద సముద్రమట్టంపై 750 అడుగుల ఎత్తున ఒక భారీ జలాశయాన్ని నిర్మించి అక్కడి నుంచి 126 కిలోమీటర్లు పొడవు కాలువ ద్వారా గడ్చిరోలి ప్రాంతంలో వైనగంగ నదిలోకి మళ్లిద్దామన్నారు. గడ్చిరోలి దగ్గర నిర్మించే జలాశయం సామర్థ్యం 174 టీఎంసీలుగా ఉంచుతూ అక్కడ 715 అడుగుల మట్టం నుంచి 566 టీఎంసీల నీటిని రెండు మైళ్లకి ఒక అడుగు వాలుతో ప్రవహించే కాలువ ద్వారా శ్రీశైలం జలాశయంలో 885 అడుగుల మట్టం వద్ద కృష్ణానదిలో కలుపుతారు. ఈ ప్రాజెక్టులో వరంగల్ వద్ద పర్వత మోపురాలను దాటడంలో నీటిని 480 అడుగుల ఎత్తువరకు పంపుచేసి నీటిని మళ్లించాలి. ఇందుకోసం దాదాపు 95 కిలోమీటర్లు మూడు చోట్ల సొరంగాలు నిర్మించాలి. అందులో రెండు సొరంగాలు గోదావరిని దాటేముందు నిర్మించాలి. మూడవ సొరంగం శ్రీశైలం జలాశయం వద్ద వస్తుంది.

వైనగంగ నుంచి శ్రీశైలం వరకు వచ్చే కాలువ పొడవు 650 కిలోమీటర్లు. గోదావరి నదిని దాటిన తరువాత దాదాపు 65 టీఎంసీల నీటిని వాడుతూ 8 లక్షల ఎకరాలను తెలంగాణలో సాగుచేయవచ్చు. మిగతా 500 టీఎంసీల నీటిని రాయలసీమ, కోస్తా జిల్లాలకు కొంతవరకు, తమిళనాడుకు ఇవ్వవచ్చు. తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న నీటిని ఈ ప్రాజెక్టు నుంచి కావాలనుకుంటే కృష్ణానది ద్వారా కోస్తాలోని డెల్టా భూములకు సరఫరా చేయవచ్చు. ఈ ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రంలోని తెలంగాణ, రాయలసీమ, కోస్తా జిల్లాల్లో లక్షలాది ఎకరాలను సేద్యం చేయడానికి మెండుగా అవకాశాలున్నాయి. గోదావరి నుంచి వచ్చే ఈ మిగులు నీటిని ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు వాటికి ఎత్తయిన పర్వత ప్రాంతాలలో సేద్యానికి అనుకూలమైన ప్రాంతాలు లేవు కాబట్టి వినియోగంచలేరు. అందువల్ల ఇది సుసాధ్యమయ్యే ప్రాజెక్టు.

No comments:

Post a Comment