Friday, 2 August 2013

ప్రత్యేక అస్తిత్వమే సీమకు రక్ష -అరుణ్

ప్రత్యేక అస్తిత్వమే సీమకు రక్ష -అరుణ్

August 03, 2013
ఆంధ్రరాష్ట్రమేర్పడిన నాటి ( 1953) నుంచి సీమ వాసులు భిన్న యజమానులకు ఊడిగం చేస్తున్న బానిసలుగా బతుకున్నారనడం, బాధాకరమైన ఒక చేదు నిజం. కోస్తాంధ్ర నాయకుల కుయుక్తులు, ఆధిపత్యధోరణుల పట్ల 1930లలోనే అనుమానాలు వ్యక్తంచేసిన సీమ రాజకీయ నాయకులు,అంబారాలపై ఊరేగింపుకు, పుచ్చు వాగ్దానాలకు ,తెలుగుజాతి సెంటిమెంట్‌కు సీమ ప్రజలనూ బలిపెట్టారనడం కొంత మందికి కఠిన మనిపించవచ్చు కానీ అదొక చారిత్రక సత్యం.

శ్రీబాగ్ ఒడంబడిక పురిటి దశలోనే మోసాలకు గురై,కృష్ణనీరు కళె ్ళదుట కింది ప్రాంతానికి పారుతుంటేనోరువిప్పలేని బానిసమనస్తత్త్వం సీమ రాజకీయ ప్రతినిధులది. దోపిడీకి, ఆధిపత్యానికి ప్రాంతీయ భేదాలు వుండవని నాటి సీమ నాయకులు మరిచారనుకుందామా అంటే అదేంలేదు తమకు దక్షిణాది వారి (తమిళులు) ఆధిపత్యం కన్న ఉత్తరాది వారి (కోస్తాంధ్ర) ఆధిపత్యం ఎక్కువగా సహించలేనిదని స్పష్టం చేసారు. అలాంటప్పుడు. శ్రీబాగ్ ఒడంబడికలోని హక్కులను ఎలానమ్మారో కృష్ణమ్మను కోస్తాంధ్ర ప్రజానీకానికి ఎందుకు తాకట్టు పెట్టారో అర్ధంకాని విషయం. అప్పటికే ఆంధ్ర విశ్వవిద్యాలయం అనంతపూర్‌లో స్థాపించే ప్రతిపాదనను ,కోస్తాంధ్ర రాజకీయ నాయకులు నిర్లక్ష్యం చేసిన విషయం చరిత్ర చెబుతూనేవుంది.కర్నూల్ జిల్లాలోని సిద్ధేశ్వరం వద్ద నిర్మించాలన్న కృష్ణానదిపై ప్రాజెక్టును, దిగువన శ్రీశైలం దగ్గర నిర్మించి దాన్ని నాగార్జున సాగర్‌కు రిజర్వాయర్‌గా ఇచ్చిన ఉదంతమూ వుంది.

సరే, గతం గతః అనుకున్నా,ఆంధ్రరాష్ట్రం, ఆంధ్రప్రదేశ్‌గా మారినప్పుడన్నా నీటివాటా విషయమై యేమైనా హామీ పొందారా? సీమ పాంత్ర రాజకీయ నాయకుల్ని ఎవ్వరూ అడగలేదు. రాష్ట్ర రాజధాని పోయింది, కనీసం హైకోర్టు నైనా సీమ ప్రాంతంలో స్ధాపించాలని కోరారా అంటే అదీలేదు. తమ స్వీయ రాజకీయప్రయెజనాల కోసం,తమ ప్రాంత ప్రజల ప్రయెజనాలు తాకట్టుపెట్టిన సాంప్రదాయం 1950ల నుంచి నేటి వరకు సీమ ప్రాంత రాజకీయనాయకుల విషయంలో కొనసాగుతూనేవుంది. దీన్ని ప్రశ్నించే చైతన్యం తరతరాలుగా పాళెగాళ్ళ పాలనలో నలిగిన సామాన్యునికి లేకపోయినా, కనీసం ఈ ప్రాంతపు మేధావులకుకూడా లేక పోవడం, సీమ దౌర్భాగ్యం.

తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నప్పుడు ు రోగి 'సంధి' ప్రేలాపనలాగా 1988లో రాయలసీమ హక్కులకోసం ఉద్యమం జరిగింది. తెలుగు గంగ కాలవల వెంట వున్న భూగర్భజాలాలనూ దిగమ్రింగుతు నెల్లూరుకు, తనకు పేరు ప్రతిష్ఠలు తెచ్చి సంపన్నుని చేసిన మద్రాస్‌కు నీరందించాడే తప్ప అన్న రామన్న తనకై రక్తమొలికిన రాయలసీమకు చేసిందేమీ లేదు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారమే, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటినుంచి రాయలసీమపై ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత? కేవలం 4 శాతం జనాభా ప్రాతిపదికన కనీసం 12 శాతంకు తక్కువగాఉంది అని 1988లో తెలంగాణ నుంచి ఆ వివరాలను ప్రాంతాల వారిగా బయటపెట్టకుండా, కోస్తాప్రాంతంలో రాయలసీమను కలిపారు. దీంతో, నేడు సీమ ప్రజలు తమ ప్రాంతంనుంచి ప్రభుత్వానికి పోతున్న ఆదాయం,తమ ప్రాతం పై ప్రభుత్వం వెచ్చిస్తున్న ఖర్చుల వివరాలు అడిగే ఆస్కారం లేకుండా చేశారు ఏమైనా హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సీమ ప్రాంత ఉద్యోగుల సంఖ్య, సీమ జనాభా నిష్పత్తిలో లేదనేది నిర్వివాదాంశం.

కోస్తాంధ్ర రాజకీయ నాయకత్త్వం కుట్రలకు కుహకాలకు తెలంగాణ ఎంత బలయిందో ,అంతకన్న ఎక్కువగా రాయలసీమ బలయిందని సీమలో ఏ ప్రాంతాన్ని పరిశీలించినా విశదమవుతంది. నాటి సంజీవరెడ్డి నుంచి నేటి కిరణ్‌కుమార్ రెడ్డిదాకా సీమవాసులే అత్యంత ఎక్కువ కాలం మఖ్యమంత్రులుగా ఉన్నా సీమకు ఒరిగిందేమిలేదు. రాజాశేఖరరెడ్డి తన బంధుమిత్ర గణాల బ్యాంక్ బ్యాలెన్సులు పెంచేందుకు, వరద నీటిపై ఆధారపడే ఎత్తిపోతల ప్రాజెక్టులు చేపట్టారు. వీటికి నీరు గ్యారంటీ లేదు,ఇక విద్యుత్తు విషయం చెప్పాల్సిన అవసరంలేదు. సీమ ప్రజల కళ్ళ ముందు త్రవ్విన కాలువల్లో వర్షాకాలంలో కొన్ని నీళ్ళు ఉండవచ్చు. వాటిని నమ్ముకొని సాగుచేస్తే మిగిలేది కన్నీళ్ళే సుమా! ఇక తమకు మంత్రి పదవి వచ్చేంత వ రకు రాయలసీమ హక్కుల గురించి మాట్లాడిన టిజి గాని, ఏరాసుగాని పదవులు రాగానే సమైక్యతా వాదం ఎత్తుకున్నారు.ఒకవేళ రాజీనామాలు చేసినా,ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. ప్రజల సానుభూతితో తిరిగి ఎన్నికవచ్చునని వారి ధీమా. సీమేకాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ తన స్వంత జాగీరుగా, వారసత్త్వపు ఆస్తిగా భావిస్తున్న జగన్ సీమ హక్కుల గురించి ఎన్నడూ మాట్లాడలేదు కదా.ఆయన తల్లి, చెల్లెలు కూడా జగన్ సింహసనంపై వుండక, జైళ్లో ఉన్నందుకు వగస్తున్నారు తప్ప సీమ ప్రజలగురించి ఒక్కమాట మాట్లాడలేదు. బహుశా ఇప్పుడు అందరికి సీమ ప్రజలు గుర్తుకు రావచ్చు.

విభజన సమయంలో కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రాంతంలో లక్షలాది గిరిజనులను నిరాశ్రయం చేస్తూ వేలాది ఎకరాలను ముంచుతూ కోస్తాంధ్ర సంపన్న రైతాంగపు డిమాండ్లు గుర్తుకు వచ్చాయి గానీ రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుక బాటుతనం గుర్తుకురాలేదు. 'పోలవరం' నిర్మించి కృష్ణ ,గోదావరి డెల్టా రైతులకు మూడవ పంటకు నీరు స్థిరీకరిస్తామని హామీ ఇచ్చారుగానీ, కనీసం ఒక పంటకు నీరు పొందే అవకాశం కూడా లేని సీమ రైతాంగాన్ని ముఖ్యంగా అనంతపురం జిల్లాను పట్టించుకున్న వారెవ్వరూ లేరు. ఈ ప్రాంతపు ప్రభుత్వ ప్రతినిధులు 'సమైక్యాంధ్ర 'గీతం ఎత్తుకున్నారు తప్ప, 'సీమ' విషయం కచ్చితంగా మాట్లాడకపోవడం గమనార్హం.

ఇక విద్యార్ధి, ఉద్యోగ సంఘాలుగానీ లాయర్లు ఇతర మేధావులు గానీ 'సీమ' విషయం పట్టించుకున్నారా అంటే అదీ లేదు. అదేదో సమైక్యాంధ్రలో రాయలసీమకు ఏమో ఒరిగినట్టు హైదరాబాద్ లేకపోతే ఇప్పుడు సర్వం కోల్పోయినట్టుగా వాపోతున్నారు. సమైక్యాంధ్రలో రాయలసీమకు ఒరిగేందేమిటో, ఒక్కసారి చరిత్రను మనం చెప్పుకుంటే అర్థమవుతుంది హైదరాబాద్ విషయం చూస్తే అది రాజధానిగా వున్నంత కాలం ఇతర ప్రాంతాలలోని పట్టణాలు అభివృద్ధి కావు. అంతేగాక, హైదరాబాద్ విడిపోయినంత మాత్రాన అక్కడ ఇతర ప్రాంతాల వాళ్ళు 'విద్య' నభ్యసించకూడదని, ఉద్యోగాలు చేయకూడదని నియమ నిబంధనలే మీ లేవు ఇక ప్రభుత్వ ఉగ్యోగుల విషయం వస్తే వారి సర్విసునుబట్టి వారు అక్కడ కొనసాగాలి, లేక స్వరాష్ట్రానికి వెళ్ళాలి అనే నిర్ణయం జరుగుతుంది.రైతాంగాన్ని 'సమైక్యాంధ్ర' వైపు మార్చడానికి, రాజకీయనాయకుల నదీ జలాల సమస్య గురించి చెబుతున్నారు ఇప్పటి సమైక్యాంధ్రలో రాయలసీమకు ఇవ్వాల్సిన నీటి వాటా అందడంలేదు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కృష్ణ జలాలను ప్రాధాన్యంగా సీమ నాలుగు జిల్లాలకే వినియోగించాలి. ఆ ఒప్పందాన్ని ఎప్పుడో తుంగలో తొక్కారు. ఇప్పుడు 'సీమాంధ్ర' పేరుతో కోస్తాంధ్ర సంపన్న రైతాంగం తమ మూడు పంటలకు తగినంత నీరందేలా కృష్ణ, గోదావరి డెల్టాల నీటి సదుపాయాన్ని స్థిరీకరించేందుకే పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ స్ధాయిని పెంచినప్పుడు దానికి వ్యతిరేకంగా గొంతు విప్పి అరిచింది కోస్తాంధ్ర నాయకులే. ఆ తర్వాత నెల్లూరు, తర్వాతనే తెలంగాణ రాజకీయ నాయకులు. మొదటినుంచి తాము అనుభవిస్తున్న సాగునీటి సదుపాయాన్ని తమకు పొందే హక్కువుందని వాదించే కోస్తాంధ్ర నాయకులు, రాయలసీమ వాసులు తాగునీటికై కనీసం ఒక పంటకైనా కృష్ణ నీటిని త్యాగం చేస్తారా? చేయరని చరిత్ర చెబుతున్న సత్యం.

మనకంటూ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు మాత్రమే, ఒక రాష్ట్రంగా నదీజలాల్లో మన వాటాను హక్కుగా పొందవచ్చు అంటూ సమైక్యాంధ్రలోగాని, ఇటు సీమంధ్రలోగాని అది సాధ్యం కాదు. కారణం సీమ రాజకీయ నాయకుల ప్రజల్ని మోసంచేసే 'ఆషాఢ భూతులు' కావడమే. దానికితోడు మెజారిటి శాసన సభ్యులు కోస్తాంధ్ర వారు కావడం. వారి అంగబలం, అర్థబలం ముందు, సీమప్రాంత రాజకీయ నాయకులవి 'హనుమంతుని ముందు కుప్పిగంతులలాంటివే'. రాజధాని సీమ ప్రాంతానికి వుండదు. 'సీమాంధ్ర' గతంలో 'ఆంధ్రప్రదేశ్ లాగానే వ్యవహరిస్తుంది. సీమ వాసులు రెంటికి చెడిన రేవళ్ళవుతారు.
ఏతావాతా తేలేదేమిటంటే రాయలసీమ ప్రతేక రాష్ట్రంగా అవతరించడం సీమ ప్రజల ప్రయోజనాలను కాపాడుతుంది అప్పుడు ఈ ప్రాంతంలో రాజధాని,హైకోర్టు, ఇతర కేంద్ర రాష్ట్ర కార్యాలయాలు సంస్థలు, సీమవాసుల హక్కుగా వస్తాయి. కొన్ని లక్షల మందికి ఉపాధి కోసమే ఉద్యోగాలు లభ్యమవుతాయి. సీమజిల్లాల్లోని ఖనిజ సంపదలో అనేక కర్మాగారాలను నెలకొల్పుకోని సీమను సంపన్నవంతంగా చేయవచ్చు రాజధాని ఏర్పడటంతో ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయి. ఆ రంగంలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. సీమ రాజకీయనాయకులకు ప్రజల సంక్షేమం ఎన్నికల సమయంలోనే జ్ఞాపకం వస్తుంది.కానీ చైతన్యవంతులైన వ్యక్తులుగా విద్యార్థులు ఉద్యోగులు,లాయర్లు, ఇతర మేధావి వర్గం 'సమైక్యాంధ్ర' ఒరవడిలో కొట్టుకుపోకుండా రాయలసీమ ప్రజల ప్రయోజనాలకై ప్రత్యేక రాయలసీమ 'రాష్ట్రం'కై పోరాడకపోతే భవిష్యత్తు మనల్ని క్షమించదు.

No comments:

Post a Comment