Saturday, 28 September 2013

చించి పారేయండి! Rahul Gandhi

చించి పారేయండి! :

Published at: 28-09-2013 05:17 AM

 New  0  0 

 



ఆ నాన్సెన్స్ ఆర్టినెన్స్.. మా పార్టీ తప్పు చేసింది
నేరచరితులకు రక్షణపై రాహుల్ ఆగ్రహం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: యువరాజు రాహుల్ గాంధీకి చాలా కోపం వచ్చింది. తమ పార్టీ నేతృత్వంలో నడుస్తున్న యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను 'చించి అవతల పడేయాలి' అనేంత కోపం వచ్చింది. 'మా ప్రభుత్వం చేస్తున్నది తప్పు' అని వేలెత్తి చూపేంత కోపం వచ్చింది. శుక్రవారం ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ పాల్గొంటున్న 'మీట్ ది ప్రెస్'కు రాహుల్ అనుకోని అతిథిలావచ్చి, అనూహ్యమైన వ్యాఖ్యలు చేసి.. మెరుపులా మెరిసి వెళ్లిపోయారు. శిక్షలు పడిన ప్రజా ప్రతినిధులు పదవుల్లో కొనసాగేందుకు అనర్హులని, జైలులో ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేయడం కుదరదని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. దీంతో... పార్టీలు బెంబేలెత్తిపోయాయి. సుప్రీంతీర్పును తుంగలో తొక్కుతూ... నేర నేతలకు అభయమిచ్చేలా, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తూ యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. దీనిపై రాహుల్ తీవ్రంగా స్పందించారు. "ఈ ఆర్డినెన్స్ ఓ నాన్సెన్స్. మా ప్రభుత్వం తప్పు చేసింది. ఆర్డినెన్స్‌ను చించి అవతలపడేయాలి'' అని తెలిపారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని కూడా చెప్పారు.
ఈ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ సమర్థించుకోవడానికి చేసిన వాదననూ తప్పుపట్టారు. 'పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఇలాగే చేస్తారు. బీజేపీ అయినా, సమాజ్‌వాది అయినా, జనతాదళ్ (యూ)అయినా ఇదే చేస్తాయి. మనమూ చేశాం' అని తమ పార్టీ వాదిస్తోందన్నారు. "ఈ నాన్సెన్స్‌కు తెరదించాల్సిన సమయం వచ్చేసింది. మా పార్టీతో సహా అన్ని పార్టీలకు చెబుతున్నా! అవినీతిపై మనం పోరాడాల్సిందే. అయితే, ఇలాంటి అంశాలపై రాజీపడుతూ సాగలేం. అయినా... ఇలాంటి చిన్న చిన్న అంశాలపైనే రాజీ పడితే... ప్రతిచోటా రాజీ పడుతూనే ఉంటాం'' అని తెలిపారు. చెప్పాల్సింది చెప్పిన రాహుల్... వెంటనే కుర్చీలోంచి లేచి బయటికి బయలుదేరారు. 'కూర్చోండి... ప్లీజ్...' అని విలేకరులు ఒత్తిడితో కూడిన విన్నపాలు చేయడంతో రాహుల్ తిరిగి కూర్చున్నారు. "మా పార్టీ ఏం చేస్తోంది, మా ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది నేను గమనిస్తుంటాను. అందుకే... నేరచరితులపై సుప్రీం ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ జారీ చేయడం తప్పని చెబుతున్నాను'' అని చెప్పేసి బయటికి వెళ్లిపోయారు. 'ఏంటి సార్... మీ ప్రభుత్వమేమో ఆర్డినెన్స్ జారీ చేసింది. రాహుల్ మాత్రం అది తప్పంటున్నారు. ఇంతకీ మీ వైఖరి ఏమిటి?' అని విలేకరులు ప్రశ్నించగా... 'రాహుల్ వైఖరే మా వైఖరి' అని మాకెన్ ముద్దుముద్దుగా చెప్పారు.
అసలేం జరిగింది?
యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసినప్పటికీ... దానిపై రాష్ట్రపతి సంతకం పెట్టలేదు. గురువారం ఆయన కేంద్ర హోంమంత్రి, న్యాయశాఖ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిని పిలిపించుకుని మాట్లాడారు. "ఈ అంశంపై రాజకీయ ఏకాభిప్రాయంలేదు. అలాంటప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయడమేమిటి? అయినా... ఆ అంశంపై ఇప్పటికే బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉందికదా! ఆర్డినెన్స్‌కు అంత తొందరెందుకు?'' అని ప్రణబ్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఇది జరిగిన మరుసటిరోజే... రాహుల్ అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చి, ఆర్డినెన్స్‌ను చించిపారేయాలంటూ ఆగ్రహించడం గమనార్హం. అయితే, ఆర్డినెన్స్‌పై ఏకాభిప్రాయం ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధులు చెబుతున్నారు. బిల్లుపై గతనెల 13న అఖిలపక్ష సమావేశం నిర్వహించామని, సుప్రీం తీర్పును పక్కనపెట్టేలా చట్టం తెచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ కూడా అంగీకరించిందని తెలిపారు. పార్లమెంటులో బిల్లు పెట్టినప్పటికీ.. దానిపై ఆమోద ముద్రపడలేదు. అంతలోనే... ఈనెల 23న కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్ జారీకి అంగీకరించింది. దీనిని ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపింది. ఇలా ఆర్డినెన్స్ జారీ చేయడం అనైతికం, రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ, వామపక్షాలు మండిపడ్డాయి. ప్రజాసంఘాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. గురువారం బీజేపీ అగ్రనేత ఆడ్వాణీ నేతృత్వంలో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసి, ఆర్డినెన్స్‌ను తిప్పిపంపాలని కోరారు. ఇంత తతంగం జరిగిన తర్వాత, ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదించే అవకాశంలేదని స్పష్టమయ్యాకే రాహుల్ తెరమీదికి వచ్చి ఆర్డినెన్స్‌ను తప్పుపట్టడం విశేషం
- See more at: http://www.andhrajyothy.com/node/4269#sthash.x3CbcECT.dpuf

No comments:

Post a Comment