Saturday, 21 September 2013

చిచ్చు ఆర్పండి - Chandrababu

చిచ్చు ఆర్పండి

September 22, 2013

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21 : రాష్ట్రంలో పరిస్థితి దిగజారుతోందని, తక్షణం జోక్యం చేసుకుని చిచ్చు చల్లార్చాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోరారు. ఇరుప్రాంతాలకు చెందిన నేతలతో శనివారం ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిశారు. కేంద్రం వైఖరి వల్ల ప్రజల్లో రాజకీయ వ్యవస్థపైనే విశ్వాసం సన్నగిల్లుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చంద్రబాబు చెప్పారు. వివిధ జేఏసీలు, పౌర సమాజ సంస్థలు, సమస్యతో ముడిపడి ఉన్న ఇతర వర్గాలతో వెంటనే చర్చలు జరపాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు.

"రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఆగస్టు 9, 29 తేదీల్లో లేఖలు రాశాను. ఉద్యమిస్తున్న వర్గాల మధ్య సయోధ్య ఏర్పర్చాల్సిన అవసరాన్ని గుర్తు చేశాను. ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఒక రాజనీతిజ్ఞుడిగా క్రియాశీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రధానమంత్రి.... 'ఆంటోనీ కమిటీకి చెప్పుకోండి' అని ఎన్జీవో నేతలకు సూచించడం అభ్యంతరకరమన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీని ఇతరులెలా కలుస్తారని ఆయన ప్రశ్నంచారు. అంటే విభజన వ్యవహారం కాంగ్రెస్ తన అంతర్గత సమస్యగా భావిస్తోందని అన్నారు.


"అభివృద్ది పథంలో ముందంజ వేస్తూ, శాంతియుత వాతావరణానికి పేరెన్నికగన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రం అనుసరిస్తున్న వైఖరి వల్ల కనీవినీ ఎరగని రీతిలో నష్టపోయింది. గత నాలుగుదేళ్లుగా అభివృద్ధి ఆగిపోయింది. ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం పడింది. టీఆర్ఎస్‌ను విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ రాజకీయ కుతంతాలు పన్నింది. వైసీపీ, కాంగ్రెస్ కూడా కుమ్మక్కయినట్లు ఆ పార్టీల వైఖరిని బట్టి తెలుస్తోంది'' అని చంద్రబాబు రాష్ట్రపతికి తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు మందగించిందని తెలిపారు. ఈ కుమ్మక్కు వల్ల జగన్‌కు త్వరలో బెయిల్ కూడా వ స్తుందని అంటున్నారని చంద్రబాబు వివరించారు.

విభజన సమస్యను కాంగ్రెస్ తన సొంత రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగించుకుంటోందని రాజ్యసభలో అన్ని రాజకీయ పార్టీలు విమర్శించినప్పుడు చిదంబరం నిర్లక్ష్యంగా, తప్పించుకునే ధోరణిలో సమాధానం ఇచ్చారని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. షిండే, ఇతర కాంగ్రెస్ నేతలు పొంతనలేని ప్రకటనలు చేస్తూ మరింత అయోమయం సృష్టిస్తున్నారని రాష్ట్రపతికి తెలిపారు. అప్పట్లో సకల జనుల సమ్మె, ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యోగుల సమ్మె గురించి వివరించారు. అన్నిరకాల ప్రజా సేవలకు పూర్తిగా విఘాతం కలుగుతోందన్నారు.

"ప్రజలు తమంతట తాము తీవ్ర ఆందోళనకు దిగారు. ఆశ్చర్యకరంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున వీధుల్లోకి వస్తున్నారు. చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. సీమాంధ్రలో కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీ ఆందోళనలు చేస్తున్నారు. దీని వల్ల ఉద్యోగుల మధ్య అశాంతి ఏర్పడి, సంబంధాలు దెబ్బతినే ప్రమాదముంది. ఇది వాంఛనీయం కాదు'' అని రాష్ట్రపతికి తెలిపారు.


రాష్ట్రపతిని, బీజేపీ, సీపీఎం నేతలను కలిసిన తర్వాత అక్కడికక్కడే చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. "రాష్ట్రంలో ముఖ్యమంత్రి పనిచేయడంలేదు. మంత్రులూ పని చేయడంలేదు. కాంగ్రెస్ తన స్వార్థ రాజకీయాలకోసం ప్రజలతో క్రూరపరిహాసం ఆడింది'' అని తెలిపారు. తాను రాజకీయాలు మాట్లాడడానికి, పొత్తుల గురించి చర్చించడానికి ఢిల్లీ రాలేదని, రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన పరిస్థితిని జాతీయ స్థాయి నేతలకు వివరించేందుకే వచ్చానని తెలిపారు. జాతీయ స్థాయిలో తమ సంబంధాలను ఉపయోగించి రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దాలని బీజేపీ, ఇతర పార్టీల నేతలను కోరానన్నారు. జేఏసీల నేతలు, సమస్యతో సంబంధం ఉన్న ఇతర వర్గాలతో చర్చించడం ద్వారానే ఒక పరిష్కార మార్గం కుదురుతుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో కాంగ్రెస్ తుఫాను సృష్టించిందని ఆయన అన్నారు. తెలంగాణలో రెండు సంవత్సరాలు ఉద్యమం జరిగి వందలాది మంది ఆత్మహత్యలకు పాల్పడితే... అదే పరిస్థితి సీమాంధ్రలో పునరావృతం అవుతోందని ఆయన చెప్పారు. రాజకీయ పార్టీల పట్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోయేలా చేసిన పాపం కాంగ్రెస్‌కు దక్కుతుందన్నారు.


సీమాంధ్రలో ప్రజల ఆందోళన గురించి చంద్రబాబు తమకు వివరించారని రాజ్‌నాథ్ మీడియాతో అన్నారు. తెలంగాణకు సంబంధించి బీజేపీ వైఖరి మారదని... అదే సమయంలో సీమాంధ్రను పట్టించుకుని తీరాల్సిందేనని స్పష్టం చేశారు. చంద్రబాబు ద్వారా రాష్ట్రంలోని పరిస్థితులపై విస్తృత సమాచారం అందిందని చెప్పారు. ఈ విషయం మినహా... పొత్తులు, ఇతర రాజకీయ అంశాలు తమ మధ్య చర్చకు రాలేదన్నారు.


రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని, ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని సీపీఎం నేత ప్రకాశ్ కరత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభన గురించి, సీమాంధ్రలో ఆందోళన గురించి చంద్రబాబు వివరించారన్నారు. చంద్రబాబుతోపాటు ఢిల్లీకి వచ్చిన నేతల్లో నామా నాగేశ్వరరావు, కొనకళ్ల నారాయణ, సీఎం రమేశ్, సుజనా చౌదరి, నిమ్మల కిష్టప్ప, గుండు సుధారాణి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కోడెల శివప్రసాద్ రావు, దయాకర్ రావు, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పయ్యావుల కేశవ్, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment