Sunday, 8 September 2013

తుది నిర్ణయం ప్రజలదే - Ashok Babu

తుది నిర్ణయం ప్రజలదే

September 08, 2013



హైదరాబాద్, సెప్టెంబర్ 7: "ఇది ఆరంభం మాత్రమే. సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమం మరింత తీవ్రమవుతుంది. 23 జిల్లాల్లో సభలు నిర్వహిస్తాం. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మిలియన్ మార్చ్‌కూ సిద్ధం'' అని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు ఉద్ఘాటించారు. శనివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలో అశోక్‌బాబు అధ్యక్షోపన్యాసం చేశారు. సమైక్య శంఖారావం పూరించారు. 'రాష్ట్రం ఎందుకు సమైక్యంగా ఉండాలి? విడిపోతే నష్టమేమిటి?' అనే ప్రశ్నలకు సవివరమైన సమాధానాలు ఇచ్చారు. "రాష్ట్ర విభజనతో నీరు, విద్యుత్తు... వంటి 30 రకాల సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. వాటి బదులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే ఉత్తమం'' అని తెలిపారు. "ఇది రాజకీయ ప్రేరేపిత ఉద్యమం కాదు. మా వెనుక ఏ రాజకీయ నాయకుడూ లేడు.

మాది ప్రజాకాంక్ష మేరకు సాగుతున్న ప్రజా ఉద్యమం. ఇది ప్రారంభం మాత్రమే. రాష్ట్రం విడిపోవాలా, కలిసే ఉండాలా అనే తుది నిర్ణయం ప్రజలదే'' అని ప్రకటించారు. హైదరాబాద్‌లోని 90 లక్షల జనాభాలో మూడు ప్రాంతాలకు చెందిన 50 లక్షల మందికి తీరని అన్యాయం జరుగుతుంది. ఉద్యోగుల సీనియారిటీ, పదోన్నతులకు ఇబ్బంది తలెత్తుతుంది. ఆరు లక్షల మంది పెన్షనర్ల పరిస్థితి గందరగోళంగా మారుతుంది. విభజనతో ప్రధానంగా విద్యార్థులు, ఉద్యోగులు, ఆర్టీసీకి సమస్యలు తలెత్తుతాయని అశోక్‌బాబు చెప్పారు. "మీరూ రాజధానిని కట్టుకోవచ్చు కదా అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు పోగొట్టుకోవడమెందుకు... అప్పుడు కట్టుకోవడమెందుకు?'' అని ప్రశ్నించారు. ఉద్యోగులు పదేళ్లపాటు ఇక్కడే ఉండవచ్చంటున్నప్పటికీ... ఆచరణలో అనేక సమస్యలు తలెత్తుతాయని అశోక్‌బాబు తెలిపారు. "2014లో ఈ రాష్ట్రానికి కొత్త సీఎం ఎన్నికవుతారు. అప్పుడు ఉమ్మడి రాజధానిలో డీజీపీ తెలంగాణ రాష్ట్ర నియంత్రణలో ఉంటారు.

అంటే 30-40 వేల మంది ఉద్యోగులకు ఇబ్బందులు ఉండవా? ఆంధ్రప్రదేశ్‌లో ఆరు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. రాష్ట్రం విడిపోతే వీరి సమస్యను ఎలా పరిష్కరిస్తారో స్పష్టత లేదు. ఉద్యోగుల పదోన్నతులు, సీనియారిటీ వంటి సమస్యలున్నాయి. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని పదోన్నతులు, సీనియారిటీ నిర్ణయించాల్సి వస్తుంది. దీంతో ఉద్యోగులను ఏ మూరుమూల ప్రాంతానికో పంపిస్తారు. నీళ్లు, కరెంటు సమస్యలు వస్తాయి. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విడదీస్తామంటే ఒప్పుకోం. మీరు టోపీ పెడతామంటే పెట్టించుకునే అమాయకులం కాదు'' అని ఉద్ఘాటించారు. స్వీపర్ నుంచి అడిషనల్ డైరెక్టర్ వరకు 7 లక్షల ఉద్యోగులు సమ్మెకు దిగాలని నిర్ణయించి ముందుకు వెళ్లామన్నారు. "తెలంగాణ కోసం ఆ ప్రాంత ఎంపీలందరూ పార్లమెంటులో గందరగోళం సృష్టించారు. మీరెందుకు రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకోవడం లేదని సీమాంధ్రలో ఎంపీలను నిలదీశాం. రాజీనామాలు చేసినా, చేయకపోయినా... ప్రజల బాధలకు సమాధానాలు చెప్పిన తర్వాతే నియోజకవర్గాలకు వెళ్లాలి'' అని అశోక్‌బాబు స్పష్టం చేశారు. ప్రజలను కాదనే పార్టీలకు మనుగడ ఉండదన్నారు. తమ సమ్మె ఎన్నాళ్లుంటుందో కూడా చెప్పలేమన్నారు. "జై ఆంధ్ర ఉద్యమం 109 రోజులపాటు సాగిందని పెద్దలు చెప్పారు. మా సమ్మె కూడా ఎన్నాళ్లు సాగుతుందో చెప్పలేం.

జీతాలు కూడా రావని అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు రూ.1000 ఖర్చు పెట్టుకుని ఈ సభకు వచ్చారు. అంటే వారిలో సమైక్య రాష్ట్ర ఆకాంక్ష ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు'' అని తెలిపారు. తమ ఉద్యమంలో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి నష్టం కలిగించలేదన్నారు. ప్రజలే ఉద్యమాన్ని నడిపిస్తున్నారని తెలిపారు. "రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు, మునిసిపల్, సెక్రటేరియేట్ ఉద్యోగులు, టీచర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. విద్యుత్తు ఉద్యోగులు కూడా సమ్మెకు దిగనున్నారు. ఈసారి వర్షాలు బాగా కురవడంతో రైతులు ఉద్యమంలో పాల్గొనలేకపోయారు. లేకపోతే ఉద్యమం 500 కిలోమీటర్ల వేగంతో ఉండేది'' అని వ్యాఖ్యానించారు. "కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్‌లో కలిసి ఉండాలని అనుకుంటున్నారు. ఇక్కడి ఉద్యోగులకు నైతిక బలం ఇవ్వడానికే హైదరాబాద్‌లో సభను నిర్వహిస్తున్నాం.

రాజకీయ నేతలు, కేంద్రంపై ఒత్తిడి పెంచడానికే సభ పెట్టాం. ఇది ప్రారంభ సభ మాత్రమే'' అని అశోక్‌బాబు తెలిపారు. "సాధారణంగా ప్రభుత్వాల నిర్ణయాలపై రెఫరెండం పెడుతుంటారు. ఈ దేశంలో రెఫరెండానికి అవకాశం లేదు. బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థులను తిరస్కరించే (రైట్ టు రిజెక్షన్) సదుపాయం లేదు. ప్రజల ఆకాంక్షలను తెలియజేయడానికి సభల నిర్వహణ ఒక్కటే మార్గం. అందుకే హైదరాబాద్‌లో ఈ సభను పెట్టాం. ఇది ప్రపంచంలో చరిత్రగా నిలిచిపోతుంది. ఈ సభకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది'' అని అశోక్‌బాబు తెలిపారు. 15 వేల మందితో సభ పెట్టాలనుకున్నామని... అయితే, ఇంత పెద్దసంఖ్యలో జనం వస్తారని ఊహించలేదని చెప్పారు. 'సభ పెట్టుకోవద్దు, సభను జరగనివ్వం, దాడులు చేస్తాం, సభకు వచ్చేవారిని తంతాం అని అన్నారు. అలాంటి వ్యాఖ్యలవల్లే ఈ సభ ఇంతగా విజయవంతమైంది. ఒకరి వాదనలను ఒకరు గౌరవించుకోవాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో సభను నిర్వహించుకుంటామని చెప్పాం.

అందుకే వాళ్లలో (తెలంగాణవాదుల్లో) మార్పు వచ్చిందేమో! అందుకే సభ సజావుగా సాగింది'' అని అశోక్‌బాబు పేర్కొన్నారు. అసలు పోలీసులు లేకుండానే సభను నిర్వహించాలనుకున్నామన్నా రు. "పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు చెప్పింది. చట్టాన్ని గౌరవించాలి కాబట్టే... పోలీసుల సహకారంతో సభను నిర్వహిస్తున్నాం'' అని తెలిపారు. "మేము ముందుంటాం. మీరు మా వెనుక ఉండాలని ఇతర సంఘాలను కోరాం. నాకు రాజకీయాలపై మోజు లేదు. రాజకీయాల్లోకి పోను. కానీ రాజకీయాల్లోని లోటుపాట్లను సరిచేయాల్సిన బాధ్యత మా సంఘంపై ఉందని భావించాం. అందుకే రోడ్లపైకి వచ్చాం. మాకు ఉద్యోగాలు ఎంత గొప్పో... రాజకీయ నాయకులకు రాజకీయాలు అంతే గొప్ప. వారిని మేము రాజకీయాలను వదిలేయాలని చెప్పడం లేదు. నీతి నియమాలు పాటించాలని కోరుతున్నాం'' అని అన్నారు. "610 జీవో ప్రకారం 5, 6 జోన్‌లలో సీమాంధ్ర ఉద్యోగులను వెనక్కి పొమ్మంటే వెళ్లిపోయారు. 14 ఎఫ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తే... ప్రభుత్వం దానినీ తొలగించింది. ఇన్ని జరిగినా... మళ్లీ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టారు. ఉద్యమం ఎందుకని ప్రశ్నిస్తే... అది తమ ఆత్మగౌరవ పోరాటమని చెప్పారు. రాష్ట్రం విడిపోతే... కడుపులో, గుండెలో పెట్టుకుని చూసుకుంటామన్నారు. ఇవాళ సభకు బస్‌లో వస్తే... తెలంగాణ విద్యార్థి జేఏసీ నేతలు తంతాం అని అన్నారు.

ఇలా బెదిరిస్తే బెదరం. పైగా... సమస్య మరింత జటిలం అవుతుంది. కేంద్రం తన నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లదు. అలాగని ముందుకూ వెళ్లలేదు. భారత్‌లో ఇలాంటి సంక్లిష్ట పరిస్థితి ఎప్పుడూ లేదు'' అని అశోక్‌బాబు తెలిపారు. ప్రజల అంగీకారం లేకుండా విభజన జరగదని తాము కలిసినప్పుడు బీజేపీ, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీ(యూ), సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఏఐఏడీఎంకే నేతలంతా చెప్పారన్నారు. " ప్రభుత్వం పునరాలోచించాలి. మిలియన్ మార్చ్‌ను నిర్వహిస్తాం. ఇది బెదిరింపు కాదు. 16న కోర్టు తీర్పు వెలువడనుంది. దాని తర్వాత ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తాం.'' అని అశోక్‌బాబు పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన సమస్యను అశోక్‌బాబు ఒక కుటుంబంతో పోల్చుతూ వివరించారు. "తెలంగాణ అనే అమాయక అమ్మాయికి, ఆంధ్ర అనే గడసరి అబ్బాయితో పెళ్లి చేశాం. వారిద్దరూ అన్యోన్యంగా కలిసి కాపురం చేయాలి అని నెహ్రూ అన్నారు. విభేదాలు వస్తే ఎప్పుడైనా విడిపోవచ్చు అని చెప్పారు. కానీ, పెళ్లి చేసుకున్నాక... ఏ జంటైనా విడిపోదు. కలిసి కాపురం చేయాలనే కోరుకుంటారు. వారికి హైదరాబాద్ అనే కొడుకు పుట్టాడు. పెరిగి పెద్దవాడై సాఫ్ట్‌వేర్ ఇంజనీరయ్యాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. 1969లో ముల్కీ నిబంధనల అమలు కోసం తెలంగాణ ఉద్యమం వచ్చింది. 1972లో జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. అత్తగారిలాంటి ఇందిరాగాంధీ ఇరువురినీ పిలిచి.. హైదరాబాద్‌లాంటి కొడుకు ఉన్నాడంటూ... చక్కగా కలిసి ఉండండి అని చెప్పారు. కానీ కొంత మంది... కాపురం చేయవద్దు, నీ కుమారుడు హైదరాబాద్‌ను తీసుకుని నువ్వు వేరు వెళ్లిపో అని భార్యకు చెప్పారు. 60 ఏళ్ల పాటు కాపురం చేశాక... తన భార్య కొడుకుతో సహా వెళ్లిపోతే ముసలి భర్త పరిస్థితి ఏం కావాలి?'' అని అశోక్‌బాబు ప్రశ్నించారు.

"సీమాంధ్ర ఉద్యమాన్ని చేపట్టాక... రోజూ కేవలం 3 గంటలు మాత్రమే నిద్ర పోతున్నా. ఇటీవల నాకు తిరుపతి వెంకన్న కలలో కనిపించాడు. 50-60 ఏళ్ల నుంచి నిద్ర కరువైందని చెప్పాడు. మన సమ్మె పుణ్యమా అని కొండపైకి ఆర్టీసీ బస్సులు రా కపోవడం, భక్తుల జాడ లేకపోవడంతో 8 గంటల పాటు నిద్ర పో తున్నానని అన్నాడు. అందుకే మిమ్మల్ని కోరుతున్నదొక్కటే. దేవుడైనా కనీసం నిద్రపోయేలా మనం సమ్మెను కొనసాగిస్తూనే ఉందాం!''

"తెలంగాణావాదులు సీమాంధ్రలో సభ పెట్టుకుంటామంటే మేం సహకరిస్తాం. ఎవరు ఎక్కడైనా తమ వాదనలను వినిపించుకోవచ్చు. మా సదస్సు ఎవరికీ వ్యతిరేకం కాదు. అందువల్ల మా సభను ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు''.

"సభ విజయవంతమవుతుందనే నమ్మకం ముందు నుంచీ ఉంది. కానీ... అంచనాకు మించి విజయవంతం కావడం ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. సమైక్యవాదం ఎంత బలంగా ఉందో దీని ద్వారా రుజువైంది. ఇక ఎన్నో రకాల అడ్డంకులు, అవాంతరాలు ఎదురైనప్పటికీ ఈ స్థాయిలో ఉద్యోగులు వచ్చారు. ఎలాంటి అడ్డంకులు లేకుంటే... చరిత్ర సృష్టించేది.''

No comments:

Post a Comment