Friday, 20 September 2013

భాగ్యనగరికి గులాంనబీ మూడు ముళ్లు

హైదరా'జాదూ'
భాగ్యనగరికి గులాంనబీ మూడు ముళ్లు
ఏదిఏమైనా కేంద్రపాలిత ప్రాంతమే!

ఆంధ్రప్రదేశ్ సమస్యకు విభజనే పరిష్కారం
అణచివేతతో తాత్కాలిక ప్రశాంతతే
రాజధానితో సీమాంద్రుల బంధాన్ని తెలంచలేం!
నివేదికలో కీలకాంశాలు
సత్వర నిర్ణయాలకు సోనియా ఆదేశం
మినీ కోర్ కమిటీ భేటీ
దసరా తర్వాత అఖిల పక్షం
న్యూఢిల్లీ, అక్టోబర్ 1, 2011 : తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానంలో మథనం కొనసాగుతోంది. వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం కనుగొనాలనే యోచనతో ముందుకు కదులుతోంది. తెలంగాణ సమస్యపై అంతిమ నిర్ణయం తీసుకునేముందు... జాతీయ, ప్రాంతీయ స్థాయి పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విజయ దశమి తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని 'మినీ కోర్ కమిటీ' తీర్మానించింది.

శుక్రవారం కోర్ కమిటీ భేటీలో జరిగిన చర్చల ఆధారంగా, నిర్దిష్టంగా నిర్ణయాలు తీసుకునే బాధ్యతను సోనియా గాంధీ సీనియర్ నేత ప్రణబ్‌కు అప్పగించారు. సమస్య ప్రాధాన్యం దృష్ట్యా నిర్దిష్ట నిర్ణయాలను తీసుకుని సత్వరం తనకు నివేదించాలంటూ సోనియా ఆదేశించారు. దీంతో... నవరాత్రి పూజల కోసం పశ్చిమ బెంగాల్ వెళ్లాలనుకున్న ప్రణబ్ తన పర్యటన వాయిదా వేసుకున్నారు. ఆజాద్ కూడా తన హైదరాబాద్ పర్యటనను ఆదివారానికి మార్చుకున్నారు. ప్రణబ్ అధ్యక్షతన ఆంటోనీ, ఆజాద్, సోనియా సలహాదారు అహ్మద్ పటేల్ చర్చలు జరిపారు.

ఆ తర్వాత ప్రణబ్ తాము తీసుకున్న నిర్ణయాలను ఒక నోట్ ద్వారా సోనియాకు నివేదించినట్లు తెలిసింది. కాంగ్రెస్ తన నిర్ణయాలను ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. అఖిలపక్ష సమావేశంతోపాటు కేంద్ర ప్రతినిధులను హైదరాబాద్‌కు పంపి రాజధానికి సంబంధించిన అంశాల గురించి అధ్యయనం చేయించాలని కూడా కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. ఏదిఏమైనా దసరా తర్వాత తెలంగాణపై ఢిల్లీ స్థాయిలో కేంద్రంలో కదలికలు ఊపందుకుంటాయని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

హైదరాబాద్ చుట్టూ ఆజాద్...
రాష్ట్రానికి చెందిన మూడు పార్టీల నేతలతో చర్చించి అధిష్ఠానానికి సమర్పించిన నివేదికలో గులాంనబీ ఆజాద్ మూడు పరిష్కార మార్గాలు సూచించినట్లు తెలిసింది. ఈ మూడు హైదరాబాద్ కేంద్రంగానే తిరగడం ఒక విశేషమైతే... హైదరాబాద్‌ను పూర్తిగా తెలంగాణలో అంతర్భాగంగా పేర్కొనకపోవడం మరో విశేషం. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల ప్రజలు కలిసి మెలిసి ఉండడం సాధ్యపడదని, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే రాష్ట్ర విభజన తప్పదని ఆజాద్ తన నివేదికలో స్పష్టం చేశారు.

ఇరు ప్రాంతాల వారికి తమ తమ ప్రాంతాల్లో పరిపాలనకు సంబంధించిన నిర్ణయాధికారాలు అప్పజెబితే వారు విడిపోయినా కలిసి ఉంటారని, రెండు రాష్ట్రాలుగా ఉన్నా ప్రజా జీవనం గతంలోలాగే ప్రశాంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. "తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజాందోళనలను అణిచివేయడం ద్వారా పరిష్కరించవచ్చనే అభిప్రాయం సరికాదు. తాత్కాలికంగా ప్రశాంతత ఏర్పడినా, సమస్య మళ్లీ రగులుతుంది. విభజన తర్వాత సీమాంధ్ర ప్రత్యేకంగా ఒక బలమైన, సుసంపన్నమైన రాష్ట్రంగా అభివృద్ది చెందగలదు.

అయితే... హైదరాబాద్‌పై అక్కడి ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాల్సి ఉంది'' అని తెలిపారు. "హైదరాబాద్ గత 50 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగుతోంది. ఈ నగరంతో సీమాంధ్రులు తమ బంధాన్ని తెంచుకోవడం అంత సులభం కాదు. అందువల్ల, హైదరాబాద్‌పై ఇరుప్రాంతాలకు సంతృప్తికరమైన ఒక ఫార్ములాను రూపొందించాల్సిన అవసరం ఉంది'' అని ఆజాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు సిఫారసులు చేస్తూ, వాటి పరిణామాలను కూడా విశ్లేషించారు. అవేమిటంటే...

1) తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు హైదరాబాద్‌ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలి. పాలనా సౌలభ్యం దృష్ట్యా హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి. కానీ...హైదరాబాద్‌ను 'ఉమ్మడి రాజధాని'గా తాత్కాలికంగా మాత్రమే అనుమతిస్తామని తెలంగాణ వాదులు అంటున్నారు. కాలక్రమంలో తమకు సొంత రాజధాని కావాలనే డిమాండ్ సీమాం«ద్రుల నుంచే వస్తుంది. అందువల్ల, సీమాంధ్ర వేరే రాజధాని ఏర్పాటు చేసుకునేందుకు నిధులు కేటాయించాల్సి ఉంటుంది.

2) రాష్ట్రాన్ని విభజించి... ఇరు రాష్ట్రాలకు వేర్వేరు ప్రత్యేక రాజధానులు ఏర్పాటు చేయాలి. అప్పటిదాకా తాత్కాలికంగా హైదరాబాద్‌ను రాజధానిగా ఉపయోగించుకునేందుకు రెండింటికీ అవకాశమివ్వాలి. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించినట్లు భవిష్యత్తులో అవసరమైతే హైదరాబాద్‌కు కూడా ఆ హోదా ఇవ్వొచ్చు.

3) తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ను రాజధానిగా ప్రకటించాలి. సీమాంధ్రకు ప్రత్యేక రాజధానితో రాష్ట్రం ఇచ్చేయాలి. అదే సమయంలో... హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించాలి.

రాష్ట్రంలో తెలంగాణకంటే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయని... కానీ, అక్కడ తెలంగాణలో నెలకొన్న భావోద్వేగ పరిస్థితులు లేవని ఆజాద్ పేర్కొన్నట్లు తెలిసింది. తెలంగాణపై ఒక ఫార్ములా అనుసరించేటప్పుడు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కూడా సూచించారు. ఆజాద్ చేసిన ప్రతిపాదనల్లో దేనిలోనూ హైదరాబాద్ తెలంగాణకు పూర్తిగా సొంతం కాకపోవడం గమనార్హం! తల తెగినప్పటికీ హైదరాబాద్‌ను వదులుకోం అంటున్న తెలంగాణ నేతలు ఇందుకు అంగీకరిస్తారా?

ఆజాద్ మూడు ముచ్చట్లు
1) తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు హైదరాబాద్‌ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలి. పాలనా సౌలభ్యం దృష్ట్యా హైదరాబాద్‌ను యూటీ చేయాలి. 2) రాష్ట్రాన్ని విభజించాలి. ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా ప్రత్యేక రాజధానులను ఏర్పాటు చేయాలి. అప్పటిదాకా తాత్కాలికంగా హైదరాబాద్‌ను రాజధానిగా ఉపయోగించుకునేందుకు రెండింటికీ అవకాశమివ్వాలి. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించినట్లు భవిష్యత్తులో అవసరమైతే హైదరాబాద్‌కు కూడా ఆ హోదా ఇవ్వొచ్చు. 3) వేరే రాజధానితో సీమాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలి. హైదరాబాద్‌ను పరిపాలనా కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి. అదే సమయంలో... హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించాలి.

విరమించండి ప్లీజ్!
సకల సమ్మెపై నేడు(ఆదివారం) ఆజాద్ అభ్యర్థన? 


ఆదివారం రాష్ట్రానికి వస్తున్న ఆజాద్ సమ్మె విరమణ దిశగా కేంద్రం తరఫున ఒక విన్నపం చేసే అవకాశం ఉంది. "సంప్రదింపులు చివరి అంకంలో ఉన్నాయి. మరికొంత సమయం మాత్రమే పడుతుంది. కేంద్రం సరైన నిర్ణయమే తీసుకుంటుంది. సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి అర్థం చేసుకుని సమ్మె వివరించండి'' అని ఆజాద్ కేంద్రం తరఫున అభ్యర్థించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మన్మోహన్ కూడా ఇదే తరహా అభ్యర్థన చేయవచ్చని కూడా చెబుతున్నారు.

No comments:

Post a Comment