Monday, 30 September 2013

కమలంలో కల్లోలం!

కమలంలో కల్లోలం!

Published at: 01-10-2013 07:46 AM
 New  0  0 
 
 

సీమాంధ్ర, తెలంగాణ నేతల మధ్య విభజన
కేసీఆర్‌తో వేదిక పంచుకోవడంపై సీమాంధ్ర నేతల ఆగ్రహం
సీమాంధ్రలో దాడులను పట్టించుకోరా? అని నిలదీత
కిషన్‌రెడ్డి మనస్తాపం, రాజీనామాకు సంసిద్ధత!
పార్టీని మీరే నడుపుకోండంటూ ఆగ్రహం
రాజ్‌నాథ్‌తో టీ-నేతల భేటీ వాయిదా
నేడు ఢిల్లీకి సీమాంధ్ర నేతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 30 : రాష్ట్ర విభజన వ్యవహారం బీజేపీలోనూ విభజనకు కారణమైంది! క్రమశిక్షణకు మారు పేరని చెప్పుకొనే కమలం పార్టీలోనూ చిచ్చు పెట్టింది! టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడిని కలిసే విషయమూ ఇరు ప్రాంతాల నేతల మధ్య విభేదాలకు కారణమైంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ రామారావు, శేషగిరిరావు, ఇంద్రసేనారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు నాగం జనార్దన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సకల జన భేరిలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరిగింది. 'ఆంధ్రోళ్లంతా తెలంగాణ ద్రోహులే' అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సీమాంధ్ర నేతలు మండిపడ్డారు. "తెలంగాణకు అనుకూలంగా బీజేపీ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. సీమాంధ్రలో పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నా, పార్టీ సమావేశాలను అడ్డుకుంటున్నా.. భౌతిక దాడులకు పాల్పడుతున్నా.. పార్టీ నిర్ణయాన్ని ఎదిరించలేదు. ఆడ్వాణీ, రాజ్‌నాథ్ సింగ్, మోదీ తెలంగాణలోనే పర్యటించినా.. సర్దుకుపోయాం. కానీ, కేసీఆర్ వ్యాఖ్యలతో మా ప్రాంతంలో మరిన్ని అలజడులు రేగుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే కాకినాడ తదితర చోట్ల బీజేపీ కార్యాలయాలపై సమైక్యవాదులు దాడులు చేశారు.
సీమాం«ద్రులను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్‌తో పార్టీ నేతలు వేదికను ఎలా పంచుకుంటారు!?'' అని నిలదీశారు. ఆంధ్రోళ్లంతా ద్రోహులే అని విమర్శిస్తుంటే పార్టీ నేతలు ఎందుకు ఖండించలేదని నిలదీశారు. అలాంటి నేతతో భవిష్యత్తులో వేదికను పంచుకోవద్దని కరాఖండిగా తేల్చి చెప్పారు. సీమాంధ్రలో పార్టీ కార్యాలయాలపై జరుగుతోన్న దాడులను ఎందుకు పట్టించుకోవడం లేదని పార్టీ అధ్యక్షుడిని నిలదీశారు. దీంతో, బీజేపీ ఇప్పటికే తెలంగాణ జేఏసీలో భాగస్వామ్య పార్టీ అని, అలాంటప్పుడు జేఏసీ ఆహ్వానిస్తే వెళ్లకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. తెలంగాణ సాకారమవుతున్న వేళ ప్రతి వేదికపైనా పార్టీ వాణిని వినిపించాల్సిన అవసరం ఉందని, అప్పుడే పార్టీకి తెలంగాణలో ఆదరణ పెరుగుతుందని వాదించారు. కేసీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేస్తారని తాము ఊహించలేదు కదా అని అన్నారు. భవిష్యత్తులో ఆయనతో వేదికను పంచుకోవద్దంటే జేఏసీ నుంచి వైదొలగాల్సి వస్తుందని చెప్పారు. అలాంటి పరిస్థితే వస్తే.. ఇప్పటిదాకా జేఏసీతో కలిసి పోరాడి తెలంగాణను తెచ్చుకుంటున్న దశలో పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీసుకున్నవాళ్లమవుతామని చెప్పారు.
జాతీయ నేతలతో భేటీపై..
పార్టీ జాతీయ నేతలను కలిసి సమస్యలు వినిపించే విషయంపైనా ఇరు ప్రాంతాల నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇరు ప్రాంతాల నేతలకు రాజ్‌నాథ్‌సింగ్ బుధవారం అపాయింట్‌మెంట్ ఇచ్చారు. కోర్ కమిటీ భేటీలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. సీమాంధ్ర సమస్యలను పరిష్కరించిన తర్వాతే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే పార్టీ మద్దతు ఇవ్వాలని ఆ ప్రాంత నేతలు జాతీయ నాయకులను కోరాలని అనుకున్నారు. కానీ, పార్లమెంటులో బిల్లుకు బేషరతుగా మద్దతు ఇస్తామని రాష్ట్ర, జాతీయ నేతల పలుమార్లు ప్రకటించారని, ఇప్పుడు కండీషన్లు పెడితే ఎలా అని తెలంగాణ నేతలు ప్రశ్నించారు. ఇరు ప్రాంతాల నేతలు ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉండడంతో.. కిషన్‌రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. "అటు సీమాం«ద్ర నేతలు నన్నే తప్పు పడుతున్నారు. ఇటు తెలంగాణ నేతలు పట్టు విడవడం లేదు. ఒకే పార్టీలో రెండు అభిప్రాయాలుంటే ఎలా!? జాతీయ నేతలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇన్ని జంఝాటాల మధ్య అధ్యక్షుడిగా కొనసాగలేను. పార్టీని మీరే నడుపుకోండి'' అంటూ కాస్త తీవ్రంగానే స్పందించినట్లు తెలిసింది. ఒక దశలో రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు సమాచారం. కానీ, ఇరు ప్రాంతాల నేతలు శాంతించడంతో ఆయన వెనక్కి తగ్గారని తెలిసింది.
తెలంగాణ నేతల ఢిల్లీ టూర్ వాయిదా
ఢిల్లీలో జాతీయ నేతలను బుధవారం కలిసి తెలంగాణ బిల్లును త్వరలో పెట్టించాలంటూ కోరాలనుకున్న తెలంగాణ నేతల టూర్ వాయిదా పడింది. సీమాంధ్ర, తెలంగాణ నేతలకు 2నే రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్‌మెంట్ ఇచ్చిన నేపథ్యంలో, ఇరు ప్రాంతాల నేతలు ఒకేసారి వెళితే విభేదాలు ఢిల్లీదాకా వెళతాయన్న కారణంతో తెలంగాణ నేతలను ఇతర నేతలు సముదాయించినట్లు సమాచారం. దీంతో, వారు 2న కాకుండా ఆ తర్వాత వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, సీమాంధ్ర నేతలు మాత్రం అక్టోబరు ఒకటో తేదీ (మంగళవారం) ఉదయమే బయలుదేరి ఢిల్లీ వెళుతున్నారు. 2న జాతీయ నేతలను కలుస్తారు. సీమాంధ్ర ఉద్యమ కమిటీ చైర్మన్ యడ్లపాటి రఘునాథ్‌బాబు ఆధ్వర్యంలో సీమాంధ్రలోని రాష్ట్ర పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జిలు కలిసి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. రాజ్‌నాథ్‌సింగ్, ఆడ్వాణీలను కలవాలని, వీలైతే సుష్మా స్వరాజ్‌ను కూడా కలవాలని నిర్ణయించారు.
విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి పలువురు సీమాంధ్ర నేతలు ఢిల్లీ బయలుదేరారు. సుష్మా స్వరాజ్ తెలంగాణకు పూర్తి అనుకూలంగా ఉన్నందున ఆమెపై ఒకింత గుర్రుగా ఉన్న సీమాంధ్ర నేతలు.. కలవాలా వద్దా అన్న మీమాంసలో ఉన్నట్లు ఆ ప్రాంత నేత ఒకరు చెప్పారు. జాతీయ నేతలను కలిసి సీమాంధ్ర ప్రయోజనాలు, సమస్యలు పరిష్కరించాకే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేలా చూడాలని వారు కోరనున్నారు. కాగా, పాలమూరులో సుష్మా స్వరాజ్ ఏకపక్షంగా మాట్లాడి సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య నాయకులు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా వెంకట సత్యనారాయణ సోమవారం భీమవరంలో విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ నిర్ణయం ప్రకారమే సుష్మ మాట్లాడినా.. విభజనతో సీమాంధ్రులకు అన్యాయం జరుగుతుందని కూడా చెప్పకుండా ఏకపక్షంగా హైదరబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం తీవ్ర ఆవేదన కలిగించిందని శ్రీనివాసవర్మ చెప్పారు.
 
- See more at: http://www.andhrajyothy.com/node/5752#sthash.SHJbsqcH.dpuf

No comments:

Post a Comment