Monday, 30 September 2013

రాహుల్‌దే ఆ పాపం - MODI

రాహుల్‌దే ఆ పాపం

September 30, 2013


న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: "ప్రస్తుత యూపీఏ సర్కారు గాంధీని ఆరాధిస్తుంది. అంటే  గాంధీ బొమ్మ ఉన్న వెయ్యి రూపాయల నోట్లను పూజిస్తుందన్నమాట! కాంగ్రెస్ పార్టీ అవినీతిపై యుద్ధం చేయడానికి బదులు అవినీతికి పాల్పడటానికి అలవాటు పడింది  ప్రభుత్వాలంటే ఎక్కడైనా ప్రజల బలం. కానీ, ఢిల్లీ మాత్రం ప్రభుత్వాల భారం మోస్తోంది. ఇక్కడ బహుళ ప్రభుత్వాలున్నాయి. ఒకటి.. తల్లి ప్రభుత్వం, మరొకటి కొడుకు ప్రభుత్వం, ఇంకొకటి అల్లుడి ప్రభుత్వం.

ఇవన్నీ కాకుండా.. సంకీర్ణ ప్రభుత్వం కూడా ఉంది.. ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ పేదరికాన్ని మార్కెట్ చేసుకుంటూ అమెరికా అధ్యక్షుడు ఒబామా ముందు మోకరిల్లుతున్నారు'' ..బీజేపీ ప్రధాని అభ్యర్థి హోదాలో దేశరాజధానిలో ఆదివారం నిర్వహించిన తొలి భారీ ఎన్నికల సభలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన తీరు ఇది! 'ఎర్రకోట'పై నుంచి ప్రసంగించేందుకు తహతహలాడుతున్న మోదీ ఢిల్లీలో ఈ సభతో తన సత్తా చాటారు. స్థానిక జపనీస్ పార్క్‌లో జరిగిన ఈ సభకు లక్ష మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. "2014లో భారతదేశానికి కావాల్సింది కలల బృందం (డ్రీమ్ టీమ్).. చెత్త బృందం (డర్టీ టీమ్) కాదు'' అని ఉద్ఘాటించారు.

మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాల నుంచి సామాన్యుడిని కుదేలు చేస్తున్న ధరా భారం, అవినీతి దాకా అన్ని అంశాలనూ ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ను, యూపీఏ సర్కారును, మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్న ఢిల్లీ ప్రభుత్వాన్ని, ప్రధానిని, పేరు ప్రస్తావించకుండా రాహుల్‌గాంధీ వైఖరిని చీల్చిచెండాడారు. కామన్‌వెల్త్ క్రీడల కుంభకోణంతో భారతదేశం తన విశ్వసనీయతను.. అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటే అవకాశాన్ని, 'బ్రాండ్ ఇండియా' ఘనతను సాధించే అవకాశాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశం ఇప్పుడు ప్రజాస్వామ్యానికి.. వంశ రాజకీయాలకూ నడుమ జరుగుతున్న యుద్ధానికి ప్రత్యక్షసాక్షిగా ఉందని వ్యాఖ్యానించారు. "ప్రభుత్వానికెప్పుడూ ఒక్కటే మతం ఉంటుంది...అది 'దేశమే ముందు' అనే మతం. ఒక్కటే పవిత్ర గ్రంథం ఉంటుంది.. అదే రాజ్యాంగం'' అన్నారు. బీజేపీని విశ్వసించాల్సిందిగా ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. అయితే, ఈ ర్యాలీకి బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే ఆడ్వాణీ, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ రాకపోవడం గమనార్హం. ఇంకా ఈ సభలో పలు అంశాలపై నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...
మనదేశంలో అత్యంత సంతోషంగా ఉన్న ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే..ఢిల్లీ చీఫ్ మినిస్టరేనని నా ఉద్దేశం.

పొద్దుణ్నుంచీ సాయంత్రం దాకా.. రిబ్బన్లు కట్ (ప్రారంభోత్సవాలు) చేయడం తప్ప ఆమెకు వేరే పనేమీ లేదు. శాంతి భద్రతల సమస్య ఉంటే.. ఢిల్లీలో పోలీసు విభాగం కేంద్రం ఆధ్వర్యంలో ఉందంటూ తప్పును ఆమె కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టేస్తారు. ఢిల్లీ రోడ్లపై గుంతలుంటే ఆ తప్పును మున్సిపల్ కార్పొరేషన్ పైకి నెట్టేస్తారు. ఇలా ఆమె నెపాన్ని పైవారి మీదికో..కిందివారి మీదికో నెట్టేస్తారు. మహిళలను రక్షించాల్సిన బాధ్యత ఢిల్లీ ముఖ్యమంత్రికి ఉంది. కానీ..ఆవిడేమో అత్యాచారాల నుంచి తప్పించుకునేందుకు ఆడపిల్లలందరూ త్వరగా ఇంటికి చేరాలని సలహా ఇస్తున్నారు.


ఆయన (ప్రధాని మన్మోహన్) పాకిస్థాన్ ప్రధానిని ఆత్మవిశ్వాసంతో కలుసుకోగలరా? ఘోరాతిఘోరంగా హత్యకు గురైన భారతీయ సైనికుల గురించి ప్రశ్నించగలరా అని సందేహంగా ఉంది. నవాజ్ షరీఫ్ మన ప్రధాని మన్మోహన్‌ను గ్రామీణ మహిళగా అభివర్ణించారు. మన్మోహన్ నవాజ్ షరీఫ్‌తో ఏం చెబుతారోనని దేశం భయపడుతోంది. 'మీరు నవాజ్ షరీఫ్‌తో ధైర్యంగా మాట్లాడగలరా లేరా' అని దేశం చూడాలనుకుంటోంది. ఎందుకంటే.. మీరు చాలా ఏళ్ల క్రితమే మాట్లాడ్డం మానేశారు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! మన సైనికుల తలలు తెగనరకడంపై మీరు పాకిస్థాన్ పీఎంను నిలదీసి అడగాల్సిందే.

ప్రధాని గౌరవాన్ని ఆయన సొంతపార్టీనే దిగజార్చింది. ఈ పాపాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడే మూటగట్టుకున్నారు. ప్రధానిని కాంగ్రెస్ పార్టీయే గౌరవించకపోతే.. వేరెవరైనా ఎలా గౌరవిస్తారు?
ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడవాలా లేక యువరాజు ఇష్టాల ప్రకారం నడవాలా అనేది ప్రజలే తేలుస్తారు. యువరాజు ఆధ్వర్యంలో పనిచేయాలని ఉందని ప్రధాని ప్రకటించారు. నేను యూపీయేలోని సీనియర్లని ఒక ప్రశ్న అడుగుతున్నా..మీరు రాజ్యాంగం ప్రకారం పనిచేస్తారా లేక యువరాజు ఇష్టాలతోనా?

No comments:

Post a Comment