Friday, 20 September 2013

ఒక హైదరాబాద్.. మూడు ముచ్చట్లు

కేబినెట్ ముసాయిదా నోట్ రెడీ

September 20, 2013



న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 : రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ ముందుకు రావాల్సిన ముసాయిదా నోట్ సిద్ధమైంది. ఈ విషయం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే స్వయంగా చెప్పారు. "ముసాయిదా నోట్ నా ముందుకు వచ్చింది. కానీ, దానిని పరిశీలించేందుకు సమయం చిక్కలేదు. శుక్రవారం దానిని పరిశీలిస్తాను'' అని షిండే గురువారం పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. షిండే దీనిని పరిశీలించిన తర్వాత... 'రాజకీయ ఆమోదం' కోసం ముసాయిదాను ప్రధాని మన్మోహన్, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముందుంచే అవకాశముంది. వారు కూడా ఓకే చెప్పాక... న్యాయమంత్రిత్వ శాఖ పరిశీలనకు వెళుతుంది.

అయితే... ఆంటోనీ కమిటీ సిఫారసులను కూడా కేబినెట్ పరిగణనలోకి తీసుకునే అవకాశముందని, ఈ కమిటీ తన సంప్రదింపులను ఇంకా పూర్తి చేయలేదని పీటీఐ పేర్కొంది. "ఈ కసరత్తు పూర్తయ్యేందుకు సమయం పడుతుంది. శుక్రవారం జరిగే కేబినెట్ భేటీ ముందుకు నోట్ రాదు'' అని హోంశాఖ వర్గాలు తెలిపాయి. అయితే... శుక్రవారమే జరగనున్న కోర్ కమిటీ భేటీలో తెలంగాణపై కీలక చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, హైదరాబాద్ ప్రతిపత్తిపై కొన్ని ప్రతిపాదనల గురించి షిండే కోర్ కమిటీ సభ్యులకు వివరిస్తారని తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ఏ విధంగా చక్కదిద్దాలి? హైదరాబాద్ ప్రతిపత్తిపై ఏ నిర్ణయం తీసుకోవాలి? అనే విషయంపై కోర్ కమిటీ మంతనాలు జరుపనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

హైదరాబాద్‌కు సంబంధించి మూడు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
హైదరాబాద్‌ను చండీగఢ్ తరహా యూటీగా ప్రకటించి, రెండు రాష్ట్రాలకు రాజధానిగా చేయడం.
.హైదరాబాద్‌కు ఢిల్లీ తరహా రాష్ట్ర ప్రతిపత్తి కల్పించి, రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉంచడం.
హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ప్రకటించి, ఆర్టికల్ 258ఏ కింద హైదరాబాద్‌లో శాంతి భద్రతల వంటి కొన్ని అధికారాలను కేంద్రం తన చేతిలో ఉంచుకుని, సీమాంధ్ర రాజధానిని కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం.

హైదరాబాద్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు రాష్ట్రాలకు పంచడం. ఈ మూడు ప్రతిపాదనలకు కూడా వర్కింగ్ కమిటీ పేర్కొన్న పదేళ్లనే కాలపరిమితిగా సూచించే అవకాశం ఉందని తెలిసింది. అయితే, రెండో ప్రతిపాదన అమలు సాధ్యాసాధ్యాలపై కాంగ్రెస్ పెద్దల్లోనే భిన్నాభిప్రాయాలు, సందేహాలున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు సాధారణ మెజారిటీ సరిపోతుంది. కానీ, రాష్ట్ర హోదాతో కూడిన యూటీ చేయాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం.

ఈ మెజారిటీ లోక్‌సభలో సాధించవచ్చుకానీ, రాజ్యసభలో సాధించడం కష్టమవుతుంది. అందువల్ల, రెండో ప్రతిపాదనపై కాంగ్రెస్ పెద్దలు ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. మొత్తానికి, ఈ మూడు ప్రతిపాదనల గురించి కోర్ కమిటీకి షిండే వివరించే అవకాశాలున్నాయి. ఆంటోనీ కమిటీ ఇప్పటిదాకా జరిపిన చర్చలను కూడా కోర్ కమిటీ సమీక్షిస్తుందని తెలిసింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆంటోనీ, చిదంబరం, షిండే, అహ్మద్ పటేల్‌తోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ కూడా హాజరు కావచ్చని తెలిసింది.



హైదరాబాద్ ప్రతిపత్తిపై స్పష్టత రానందునే కేబినెట్ నోట్ కొలిక్కి రావడంలేదని హోంశాఖ వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రి అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చాక... అక్టోబర్‌లోనే ఈ అంశంపై కేంద్ర కేబినెట్ దృష్టిసారించవచ్చునని భావిస్తున్నారు. ఈలోపు రాష్ట్రంలో పరిస్థితి చక్కదిద్దడం, హైదరాబాద్‌పై ఫార్ములాను రూపొందించడంపై హోంశాఖ కసరత్తు చేస్తుందని తెలుస్తోంది. కోర్ కమిటీలో జరిగిన చర్చల ఆధారంగా ఒకటి రెండువారాల్లో హోంశాఖ ఈ నోట్‌కు తుదిరూపం ఇస్తుందని, ఆ తర్వాత న్యాయమంత్రిత్వ శాఖకు, ప్రధానమంత్రి కార్యాలయానికి పంపుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కేబినెట్ ఆమోదం తర్వాత మంత్రుల బృందం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పరిశీలనకు పంపడం వంటి పరిణామాలు జరుగుతాయి.



అసెంబ్లీ తీర్మానం లేకుండా తెలంగాణపై ముందడుగు వేయడం మంచిది కాదని, గతంలో ఇతర రాష్ట్రాల విషయంలో అవలంబించిన విధానాలనే తెలంగాణపై అవలంబించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్రానికి స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనితో నేరుగా బిల్లును పార్లమెంటుకు పంపించాలని భావించిన కేంద్రం వెనుకడుగు వేసిందని, అసెంబ్లీ తీర్మానాన్నే తొలుత కోరాలని నిర్ణయించిందని తెలిసింది. తనను కలిసిన కొందరు సీమాంధ్ర నేతలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పలు దృష్టాంతాలు, రాజ్యాంగ నిబంధనల గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే.



"భారత రాజ్యాంగంలోని ఇతరత్రా అంశాలతో సంబంధం లేకుండా... భారత ప్రభుత్వ ఆమోదం మేరకు, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఏ అంశంపై ఉన్న కార్యనిర్వాహక అధికారాలనైనా ఒక రాష్ట్ర గవర్నర్‌కు షరతులతోగానీ, బేషరతుగా కానీ అప్పగించవచ్చు.''

No comments:

Post a Comment