Sunday, 22 September 2013

చిక్కుముడి విప్పేందుకు ఎవరో రావాలి!

చిక్కుముడి విప్పేందుకు ఎవరో రావాలి! (కొత్త పలుకు!)- ఆర్కే

September 22, 2013





ఇది కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు, సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపీల మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న సంభాషణ! "మీరు ఫర్వాలేదంటేనే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు వెనక్కు వెళ్లే పరిస్థితి లేదు. సమస్య పరిష్కారానికి హైదరాబాద్ వంటి అంశాలపై సూచనలు చేయండి. అంగీకరిస్తాం'' అని అధిష్ఠానం పెద్దలు చెబుతుండగా, "రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మాత్రమే మేం ఇప్పుడు కోరగలిగేది. ఇందుకు విరుద్ధమైన ప్రతిపాదనలు చేస్తే సీమాంధ్ర ప్రజలు మమ్మల్ని వదిలిపెట్టరు'' అని ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకులు బదులిస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే సీమాంధ్ర ప్రజలను ఎలా సంతృప్తిపరచాలో ఎవరికీ తెలియని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. ప్రజాహితంకాంక్షించి రాజీ మార్గాలను సూచించడానికి ఎవరైనా సాహసిస్తే వారిపై విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యలు ఉంటున్నాయి. అటు అధిష్ఠానం పెద్దలను ఒప్పించలేక, ఇటు సమైక్య రాష్ట్రంకోసం ఉద్యమిస్తున్న ప్రజలను సంతృప్తిపరచలేక సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు నలిగిపోతున్నారు. ఈ పరిస్థితులలో పరిష్కారం ఏమిటి? ఎవరికీ తెలియడం లేదు.

తెలిసినా చెప్పడానికి సాహసించలేకపోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ప్రకటన చేస్తూ మరింత అయోమయం సృష్టిస్తున్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చేవరకు క్యాబినెట్ నోట్ ముందుకు వెళ్లదని కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ అంటుండగా, విభజన విషయంలో తొందరపడ్డామని అహ్మద్‌పటేల్ అభిప్రాయపడుతున్నారు. క్యాబినెట్ నోట్ సిద్ధమైందని ఆ మరుసటి రోజే కేంద్ర హోంమంత్రి షిండే ప్రకటిస్తున్నారు. ప్రజా ఉద్యమంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న తమ పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులను సంతృప్తిపర్చడానికి మొయిలీ, అహ్మద్‌పటేల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ నాయకులకు ఆగ్రహం తెప్పించడంతో వారిని సంతృప్తిపరచడానికి క్యాబినెట్ నోట్ సిద్ధమైందని షిండే ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు ఒక కంటితో తెలంగాణవాదులను, మరో కంటితో సమైక్యవాదులను గీటుతూ ఉభయ పక్షాలను ఆశల పల్లకీలో విహరింపచేయడం బాధ్యతారాహిత్యం కాదా! కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఈ ఆటలో తెలుగుజాతి బలిపశువుగా మారుతోంది.

రాష్ట్ర విభజన విషయంలో మరో మాటకు తావులేదని చెబుతున్న కాంగ్రెస్ పెద్దలు సీమాంధ్ర ప్రజలను గాలికి వదిలేస్తారా? ప్రజాస్వామ్య వ్యవస్థలో చేయవలసిన పనేనా? సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న వారిని శాంతింపచేయడానికి, వారికి సాంత్వన చేకూర్చే చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై లేదా? "మేం తీసుకోవలసిన నిర్ణయం తీసుకున్నాం. మీ చావు మీరు చావండి'' అని అనడం తేలికేగానీ, తదనంతర పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం సమర్థనీయమా? కాదా? అన్నది ముఖ్యం కాదు. విభజన నిర్ణయం తీసుకునేవరకు మౌనంగా ఉండి ఇప్పుడు ఈ గోల ఏమిటి? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. అయితే ఇలాంటి ప్రశ్నలు, సందేహాలకు ఇది సమయం కాదు. 50 రోజులకు పైగా ఉద్యమిస్తున్న సీమాంధ్ర ప్రజలు ఇప్పట్లో శాంతించేలా లేరు. సమైక్య ఉద్యమం వల్ల ఆ ప్రాంతంలో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పాలనా వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది. రాజకీయ వ్యవస్థ అచేతనంగా మారింది. మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులంటే చులకనభావం ఏర్పడింది. ప్రస్తుత సంక్షోభం నుంచి తెలుగుజాతిని రక్షించేమార్గాలే లేవా? మనసుంటే మార్గం ఉంటుంది.




ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా, రాష్ట్ర ప్రజలు ఇప్పుడు రెండుగా విడిపోయారు. తెలంగాణ ప్రజలు - సీమాంధ్ర ప్రజలు కలివిడిగా ఉండలేకపోతున్నారు. ఈ పరిస్థితికి రాజకీయ నాయకులే కారణం కావచ్చుగానీ, ఇప్పుడు పరిస్థితి రాజకీయ పార్టీల అదుపులో కూడా లేదు. ఉద్యోగ సంఘాలే రాజకీయాలను శాసిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రారంభమైన ఈ ఒరవడి ఇప్పుడు సీమాంధ్రకు పాకింది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు తెలంగాణ ఉద్యోగులు ఏమేమి చేశారో సీమాంధ్ర ఉద్యోగులు కూడా అదే చేస్తున్నారు. జనం కూడా ఉద్యోగుల మాటే వింటున్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు అవాంఛనీయ ధోరణులను ప్రోత్సహిస్తే దీర్ఘకాలంలో అవి ఎంత చేటుచేస్తాయో ఇప్పుడు అనుభవంలో తెలిసివస్తున్నది. గతంలో, 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం, తర్వాత 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమం రాజకీయ నాయకత్వంలో నడిచాయి.

ఇప్పటి తెలంగాణ ఉద్యమం రాజకీయ నాయకత్వంలోనే ప్రారంభమైనా, చివరకు ఉద్యోగ సంఘాలదే కీలకపాత్రగా మారింది. ప్రస్తుతం నడుస్తున్న సమైక్య ఉద్యమాన్ని మొత్తంగా ఉద్యోగులే నడుపుతున్నారు. సర్వీసు డిమాండ్ల కోసం ఉద్యమించవలసిన ఉద్యోగులను రాజకీయపరమైన అంశాలపై పోరాడేలా అలవాటుచేసింది రాజకీయ నేతలే! ఇందుకు వారు ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా మూల్యం చెల్లించుకుంటారు. ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకత్వం బలహీనపడటం వల్ల ఇతర శక్తులు తెరమీదకు వస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని గతంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగసంఘాల నాయకులు డిమాండ్ చేయగా, ఇప్పుడు సీమాంధ్ర ఉద్యోగులు అదే డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారంనాడు విజయవాడలో నిర్వహించిన సభ సందర్భంగా మాట్లాడిన వారు సీమాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని డిమాండ్ చేశారు.

ఇలాంటి డిమాండ్లు ఆవేశంతో కూడుకున్నవేగానీ, ఆలోచనతో చేసేవి కావు. ఎందుకంటే మరో ఆరేడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు రాజీనామాలు చేస్తే ఏర్పడే సంక్షోభం ఏమిటో ఆ డిమాండ్లు చేస్తున్నవారే చెప్పాలి. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రాష్ట్రప్రభుత్వం పడిపోవచ్చు. ఇప్పుడు మాత్రం ఉందన్న భరోసా ఎవరిలో ఉంది కనుక! ప్రభుత్వం పడిపోతే రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తిచేస్తారు. అప్పుడు కనీసం ప్రశ్నించడానికి కూడా ఎవరూ ఉండరు. గుంపుస్వామ్యం ప్రబలినప్పుడు వివేకానికి చోటుఉండదు. హితవు చెప్పేవారిని శత్రువుగా చూస్తారు. రాజకీయ వ్యవస్థను అనుసరించవలసిన ఉద్యోగులు రాజకీయ వ్యవస్థనే శాసించాలని చూస్తున్నారు. ప్రస్తుత వాతావరణంలో ఇది చూడటానికి బాగానే కనిపించవచ్చు. భవిష్యత్తులో దీని దుష్పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.

ఉద్యోగులు మాత్రమే రాష్ట్రాన్ని విడగొట్టలేరు. సమైక్యంగా ఉంచలేరు. రాజకీయ ప్రయోజనం లేనిదే ఏ పార్టీ కూడా ఏ నిర్ణయం కూడా తీసుకోదు. రాజకీయంగా తెలంగాణలో లాభపడతామన్న నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణలో లాభపడి, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డితో డీల్ కుదుర్చుకోవడం ద్వారా సీమాంధ్రలో కూడా ప్రయోజనం పొందాలన్నది కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహం. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోయినా ఫర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలిస్తే తాము గెలిచినట్టేనని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ లెక్కలన్నీ వేసుకునే విభజనకు సిద్ధమైంది. ఈ పరిస్థితులలో ఉద్యోగులు ఆవేశాన్ని తగ్గించుకుని ఆలోచనలతో అడుగులు ముందుకు వేయాలి. ప్రస్తుత ఉద్యమం వల్ల విభజన ప్రక్రియ కొంత మందగించిన విషయం వాస్తవం.

ఈ పరిస్థితిని సానుకూలంగా మలచుకుని తమ సందేహాలను వ్యక్తంచేసి వాటి పరిష్కారానికి కేంద్రం నుంచి హామీపొందడం వాంఛనీయం. 2014 ఎన్నికల వరకు విభజన ప్రక్రియ ముందుకుసాగదని అటు ఉద్యోగ నాయకులు, ఇటు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ముఖ్యులు కూడా చెబుతున్నారు. అది నిజం కూడా కావచ్చు. ఆ తర్వాత మాత్రం సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? తెలుగుజాతిని ఈ రాచపుండు ఎంతకాలం బాధించాలి? విభజన ప్రక్రియలో జాప్యం జరిగే కొద్దీ తెలంగాణలో కూడా ఉద్యమాలు మొదలవుతాయి. అటూ, ఇటూ ఉద్యమాలు రగులుతున్న సమయంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలి. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు ఈ విభజన, సమైక్య ఉద్యమాల వల్ల అవాంఛనీయ శక్తులు రాజకీయ ప్రయోజనం పొందితే జరిగే ఆ నష్టం మరింత దారుణంగా ఉంటుంది.



రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత సంక్లిష్టంగా ఉన్న విషయం వాస్తవం. హేతుబద్ధంగా మాట్లాడే లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణకు కర్నూలు, అనంతపురం జిల్లాలలో జరిగిన పరాభవం తర్వాత సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో మధ్యవర్తులే లేకుండాపోయారు. ప్రజల్లో భావోద్వేగాలు పెచ్చరిల్లడం వల్ల మధ్యవర్తిత్వం వహించాలని మనస్సులో ఎవరికైనా ఉన్నా బయటపడలేకపోతున్నారు. ఇలా ఎంతకాలం? రాష్ట్ర విభజన అంశం రాజకీయ కారణాలతోనే తెరపైకి వచ్చింది. వెనుకబాటుతనంతో మొదలై ఇప్పుడు ఆత్మగౌరవ నినాదం, స్వయంపాలన ముందుకొచ్చాయి. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆయా నాయకులు చేసిన, చేస్తున్న ప్రకటనలు సీమాంధ్ర ప్రజలను గాయపర్చడం వల్ల ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉద్యమం జోరందుకుంది.

నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం వల్ల పరిస్థితి విషమించింది. వాస్తవానికి తెలంగాణలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మగౌరవం లేకుండాచేసింది తెలంగాణకు చెందిన భూస్వాములు, పెత్తందారులేకానీ సీమాంధ్ర ప్రజలు కాదు. దొరల కామవాంఛలకు తెలంగాణ ఆడపడచులు ఎందరో బలయ్యారు! భర్తలను వెళ్లగొట్టి వారి భార్యలతో కామవాంఛలు తీర్చుకున్న ఉదంతాలు తెలంగాణలో అడుగడుగునా జరిగాయి. అంటరానితనం కూడా సీమాంధ్రతో పోలిస్తే తెలంగాణలో అధికంగా ఉండేది. పేదలను మనుషులుగా గుర్తించడానికి కూడా తెలంగాణ దొరలు, పెత్తందారులు ఒకప్పుడు ఇష్టపడేవారు కాదు. దొరలు తనను ఒరేయ్ అనకుండా పేరు పెట్టి పిలిస్తే తనపై దొరకు కోపం వచ్చిందని బడుగులు భయపడిపోయేవారు. ఈ పరిస్థితికి సీమాంధ్రులు బాధ్యులు కాదే! వెనుకబాటు ఉన్నచోటే అణచివేత ఉంటుంది.

ధన, మాన, ప్రాణాలకు కూడా హక్కులు లేకుండా జీవించిన తెలంగాణకు చెందిన బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఇప్పుడిప్పుడే ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. తెలంగాణవాదులు చేస్తున్న మరో ఆరోపణ ఏమిటంటే హైదరాబాద్‌లోని భూములను దోచుకున్నారని! ఈ భూదోపిడీకి పాల్పడిన వారిలో అన్ని వర్గాలవారూ, అన్ని ప్రాంతాలవారూ ఉన్నారు. అధికారం అండ ఉన్నవారంతా భూముల కబ్జాకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంతో అటుగానీ, ఇటుగానీ సామాన్య ప్రజలకు సంబంధం లేదు. హైదరాబాద్‌లో భూకబ్జాకు పాల్పడుతున్న వారిలో స్థానికులు లేరా? కబ్జాకు గురైన భూములన్నీ ప్రభుత్వానికి చెందినవే! ప్రయివేటు వ్యక్తుల భూములను ఎవరూ ఆక్రమించుకోలేదు. ఆ మాటకొస్తే తెలంగాణలో ఒకప్పుడు పేదలకు భూమి ఉండటానికి వీలు లేదని దొరలు, పెత్తందారులు భావించేవారు.

పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు అయిన తర్వాత తెలంగాణలో భూములపై పేదప్రజలు హక్కులు పొందగలుగుతున్నారు. వాస్తవాలు ఎలా ఉన్నా తెలంగాణ ప్రజలు ఇప్పుడు తమకు సొంత రాష్ట్రం కావాలనుకుంటున్నారు. వారి ఆకాంక్షను తీర్చడంతోపాటు రాజకీయంగా లాభపడవచ్చునని కాంగ్రెస్ పార్టీ అందుకు అంగీకరించింది. ఈ పరిస్థితులలో హుందాగా వ్యవహరించవలసిన తెలంగాణ ఉద్యమ నాయకులు, ముఖ్యంగా కె.చంద్రశేఖర్‌రావు వంటి వారు అగ్నికి ఆజ్యం పోసే విధంగా ప్రకటనలు చేయడం ఎంతవరకు సమంజసం? విభజన జరిగిన తర్వాత హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు వెళ్లిపోవలసిందేనంటూ ఆయన చేసిన ప్రకటనతో సీమాంధ్రలో ఉద్యమం రాజుకుంది. అది ఎక్కడ చల్లారుతుందోనన్న ఉద్దేశంతో కొన్నాళ్ల తర్వాత "విభజన జరిగినా ముఖ్యమంత్రి ఇక్కడే ఉండి కర్రీపాయింట్ పెట్టుకోవచ్చు'' అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌లో ఉండాలనుకుంటున్న సీమాంధ్రులకు పర్మనెంట్ టూరిస్టుల స్టేటస్ ఉంటుందని కొంటె వ్యాఖ్యలు చేశారు.

సామరస్య పూర్వకంగా విడిపోదామని భావించేవాళ్లు చేయవలసిన వ్యాఖ్యలేనా ఇవి? ఇలాంటి వ్యాఖ్యలను నిలువరించవలసిన తెలంగాణ మేధావులు కూడా ఆ వ్యాఖ్యలను చప్పట్లతో స్వాగతించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు తాత్కాలికంగా సంతోషాన్ని తెచ్చిపెట్టవచ్చుగానీ దీర్ఘకాలంలో నష్టంచేస్తాయి. సీమాంధ్రులు హైదరాబాద్‌లో టూరిస్టులుగా ఉండవచ్చునని చెబుతున్నారు. సరే! రేపు హైదరాబాద్‌లోని స్థానికులు హైదరాబాద్ సిర్ఫ్ హమారా! తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన వాళ్లు కూడా టూరిస్టులే అని అనరని గ్యారంటీ ఏమిటి? వెయ్యేళ్లు జీవించడానికి మనం ఈ భూమి మీదకు రాలేదని కేసీఆర్ చేసిన వ్యాఖ్య అక్షర సత్యం. ఎంతకాలం జీవించి ఉన్నామన్నది కాదు- ఏమి చేశామన్నదీ, ఎవరినీ నొప్పించకుండా ఎలా జీవించామన్నది ముఖ్యం. కేసీఆర్ విషయమే తీసుకుందాం. తెలంగాణపై ఆయన ఆధిపత్యం శాశ్వతంగా ఉండదు. రాష్ట్రం విడిపోతే అయిదు సంవత్సరాల పాటు ఆయన పెత్తనం ఉండవచ్చు.

ఆ తర్వాత ఆయన మాటకు ఏమి విలువ ఉంటుంది? అయితే, ఉద్యమవేడిలో చప్పట్లు కొట్టించుకోవడానికి ఇప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం భవిష్యత్తులో దుష్పరిమాణాలకు దారితీస్తాయి. 1969లో తెలంగాణ ప్రాంతంలో చెన్నారెడ్డి తిరుగులేని నాయకుడు. ఆ తర్వాత రెండు పర్యాయాలు ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన వారసుల పరిస్థితి ఏమిటి? తెలంగాణను ఏలిన నిజాం వారసుల పరిస్థితి ఏమిటి? చరిత్రను విస్మరించడం అవివేకమవుతుంది. కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే తెలంగాణ ఏర్పడటం ఆయనకే ఇష్టంలేనట్టు కనిపిస్తున్నది. విభజన ప్రక్రియ సాఫీగా జరిగిపోవాలన్న అభిప్రాయం ఉన్నవాడైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరు. సీమాంధ్రులను మెప్పించి ఒప్పించడానికి తెలంగాణవాదులు ప్రయత్నిస్తే సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని రెచ్చిపోతే అవే పరిస్థితులు తిరగబడతాయని కేసీఆర్ వంటి వాళ్లు తెలుసుకోవాలి.




రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్రలో ఉద్యమిస్తున్నప్పటికీ, వారి మనసంతా హైదరాబాద్‌పైనే ఉంది. హైదరాబాద్‌పై హక్కులు లేకుండా పోతున్నాయన్నదే వారి బాధ, ఆవేదన. పులి మీద పుట్రలా హైదరాబాద్‌లో రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ మండలిగా అభివృద్ధి చేసి పదిహేను లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 55 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాలని కేంద్రప్రభుత్వం ఇప్పుడే నిర్ణయించింది. దీంతో హైదరాబాద్‌ను వదులుకోవడానికి సీమాంధ్రులు అంగీకరించలేని పరిస్థితిని కల్పిస్తున్నారు. హైదరాబాద్ స్టేటస్ నిర్ణయించనంత కాలం సమస్య పరిష్కారం కాదు. హైదరాబాద్ విషయంలో మెలిక పెడితే సహించబోమని తెలంగాణవాదులు ఇప్పటికే ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరే బదులు హైదరాబాద్ విషయంలో ఏమిచేయాలో చెప్పండి అని తమను కలుస్తున్న సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపీలను కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు అడుగుతున్నారు.

సమైక్యం అనకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తే ప్రజల్లో పరాభవం ఎదురవుతుందన్న భయంతో సీమాంధ్ర నాయకులు జంకుతున్నారు. అందరి మనసులోనూ హైదరాబాదే ఉంది. అయితే, పిల్లి మెడలో గంటకట్టేది ఎవరు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగానో, మరో విధంగానో చేసినా సమస్య పరిష్కారం అవుతుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే విభజన నిర్ణయంపై మండిపడుతున్న సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికలలో చిత్తుగా ఓడించడానికి సిద్ధపడుతున్నారు. దీంతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం సీమాంధ్రకు చెందిన కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు రెండు మూడు రోజుల్లో రాజీనామాలు చేయబోతున్నారు. అదే జరిగితే దాని ప్రభావం కేంద్రమంత్రులు, ఇతర ఎంపీలపై కూడా పడుతుంది. ఫలితంగా సీమాంధ్రలో ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది.

ఈ పరిస్థితులలో ఏమిచేయాలో కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలకు కూడా పాలుపోవడం లేదు. ఇటీవలే వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అక్కడి వైద్యులతో తన మనసులోని మాట బయటపెట్టారని తెలిసింది. "విభజన చేసినా సీమాంధ్రలో పెద్దగా వ్యతిరేకత రాదని మా పార్టీకి చెందిన సీమాంధ్ర ముఖ్యులే చెప్పడంతో నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ ఉద్యమం తీవ్రంగా ఉంది. వారిని సంతృప్తిపరచడానికి హైదరాబాద్‌కు ఏదో ఒక రూపంలో ప్రత్యేక హోదా కల్పిస్తాం. ఇందుకు తెలంగాణవాదులు అంగీకరించకపోతే చేసేది ఏమీలేదు. ఇప్పుడున్న పరిస్థితి కొనసాగుతుంది'' అని సోనియాగాంధీ అన్నారని చెబుతున్నారు. పార్టీ అధిష్ఠానం పెద్దలు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని ఆంతరంగిక సంభాషణలో వ్యక్తంచేస్తున్నారు.

హైదరాబాద్‌ను ఏమి చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదని కేంద్ర హోం మంత్రి షిండే చెబుతున్నారంటే ఏదో చేయాలన్న ఆలోచన ఉన్నట్టే కదా! ఈ పరిస్థితులలో ఇటు తెలంగాణవాదులు, అటు సమైక్యవాదుల ముందున్న కర్తవ్యం ఏమిటి? ఉభయ ప్రాంతాలకు చెందిన నాయకులు ఆవేశాలను తగ్గించుకుని చర్చలకు ఉపక్రమిస్తే సమస్యకు ఎక్కడో ఒకచోట పరిష్కారం లభిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది చొరవ తీసుకుని తమ పార్టీకి చెందిన ఉభయ ప్రాంతాలకు చెందిన నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారుగానీ, మధ్యవర్తులు లేకుండా జరిగే ఇటువంటి సమావేశాల వల్ల ప్రయోజనం ఉండదు. కాంగ్రెస్ అధిష్ఠానమే ఉభయ ప్రాంతాలకు చెందినవారిని ఒకచోట కూర్చోబెట్టలేకపోతున్నది.

అంటే ఇప్పుడు మనకు మధ్యవర్తులు కావాలి. తెలుగుజాతి క్షేమాన్ని కాంక్షించి మధ్యవర్తిత్వం నెరపడానికి ఎవరైనా ముందుకు రావాలంటే ఉభయ ప్రాంతాలకు చెందినవారు పట్టువిడుపులు ప్రదర్శిస్తామన్న సంకేతాలు ఇవ్వాలి. అలాకాకుండా ఎవరికివారు మంకుపట్టు పడితే అందరం నష్టపోతాం. విడిపోవాలనుకుంటున్నా, కలిసి ఉండాలనుకుంటున్నా మెరుగైన జీవితాల కోసమే కదా! పంతాలకు పోయి ఉన్న జీవితాలనే నాశనం చేసుకోవడం ఔచిత్యం అనిపించుకోదు. హైదరాబాద్‌కు ఉన్న ప్రత్యేకతల వల్ల భవిష్యత్తులో ఇది అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతుంది. అలా అభివృద్ధి చెందాలన్నా, దాని వల్ల కలిగే ఫలితాలను అందరూ అనుభవించాలన్నా ఉభయ ప్రాంతాల వారు సామరస్యంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం ఒక్కటే సమస్యకు పరిష్కారం. ఉద్యమాల వల్ల రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పటికే క్షీణించాయి.

వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. పెట్టుబడులు రావడం లేదు. భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదు- వచ్చే ఎన్నికలలో నాలుగు సీట్లు గెల్చుకోవడమే మాకు ముఖ్యం అని రాజకీయ పార్టీలు భీష్మించుకుని కూర్చుంటే ఎవరు మాత్రం చేయగలిగింది ఏమి ఉంది? ఒకరినొకరు దూషించుకుంటూ పోవడం వల్ల ఇప్పటికే పెచ్చరిల్లిన వైషమ్యాలు ఘర్షణలకు దారితీయవచ్చు. ఉభయ ప్రాంతాలలో రాజకీయవ్యవస్థ పతనం అయితే అరాచకం ప్రబలుతుంది. ఎన్నికలకు ఇంకా ఎంతో వ్యవధి లేనందున వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి ప్రయత్నించవలసిన బాధ్యత అందరిపైనా ఉంది. ప్రస్తుతం ఉద్యమిస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు కూడా వాస్తవిక దృక్పథం అలవర్చుకోవాలి.

కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పడానికి బాగానే ఉంటుందికానీ, ఒక ప్రాంతంవారు కలిసి ఉండం మొర్రో అని అంటున్నప్పుడు బలవంతంగా ఎంతకాలం కలిసిఉంటారు? హైదరాబాద్‌తో సహా వివిధ అంశాలపై ఉభయప్రాంతాలకు చెందిన నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వివిధ ప్రత్యామ్నాయాలతో ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవతీసుకుని ఉభయ పక్షాలతో సంప్రదింపులకు శ్రీకారం చుట్టాలి. ఈ విషయంలో కేంద్రం కూడా మంకుపట్టుకు పోతే కాంగ్రెస్ పార్టీని తెలుగుజాతి ఎప్పటికీ క్షమించదు!

No comments:

Post a Comment