Friday, 20 September 2013

సీమాంద్ర ఉద్యోగులు పర్మినెంట్ టూరిస్టులు!

పర్మినెంట్ టూరిస్టులు!

September 20, 2013


హైదరాబాద్, సెప్టెంబర్ 19 : "ఇలాంటి సమయంలో కండ బలంతో కాకుండా బుద్ధి బలంతో వ్యవహరించాలి. దాడులకు పాల్పడకుండా సీమాం«ద్ర ఉద్యోగులను భయపెట్టే ప్రయత్నం చేయాలి. అయినా, 20 వేల మంది సీమాంద్ర ఉద్యోగులు ఇక్కడ ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. తెలంగాణకు 20 వేల మంది పర్మినెంట్ టూరిస్టులు ఉన్నట్లువుతుంది. తద్వారా రాష్ట్రానికే లాభం'' అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాం«ద్ర ఉద్యోగులను పది రోజులు కూడా ఇక్కడ ఉంచరాదన్న తెలంగాణవాదుల డిమాండ్‌కు ఆయన ఈవిధంగా స్పందించారు. గృహకల్పలోని తెలంగాణ గెజిటెడ్ అధికారుల 'గెజిటెడ్ భవన్'ను గురువారం కేసీఆర్ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు.

"భూమి మీద వెయ్యేళ్లు బతకడానికి రాలేదు. మీరు చేసే ఉద్యమంలో నీతి లేదు. రాష్ట్రం విడిపోతే వచ్చే ఎలాంటి సమస్యకైనా సమాధానం చెప్పేందుకు మేం సిద్ధం. ఇప్పుడు మీరు చిమ్ముతున్న విషం భవిష్యత్తులో దేనికి దారితీస్తుంది? హైదరాబాద్‌కి మీరు ఏం తీసుకొచ్చారని ఇప్పుడు అడుగుతున్నారు?'' అని సీమాం«ద్రులను ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఉద్యమం విజయాన్ని ముద్దాడటం ఖాయమన్నారు. రాష్ట్ర విభజనపై ప్రకటన వచ్చినప్పటి నుంచి ఏ ఒక్కరూ మంచిగా స్పందించలేదన్నారు. ఇంతవరకూ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమూ రాష్ట్ర విభజనను అడ్డుకోలేదని, ఇది కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ కా సవాల్‌గా మారిందని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం ఒకసారి కాదు.. రెండుసార్లు అధికారికంగా ప్రకటించిందని, ఇంత దూరం వచ్చిన తర్వాత తెలంగాణను అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని చెప్పారు.

ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, కేంద్ర ప్రభుత్వం కాదంటూ కొందరు మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు. "ప్రభుత్వ ప్రతినిధిగా ప్రకటిస్తున్నానని రాజ్యసభలో ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు. ఆంధ్రోళ్లు వెళ్లి అడుక్కున్నప్పుడు స్వయంగా ప్రధాని చెప్పారు'' అని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ను కొనసాగించడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. అసలు ఆంధ్రా ప్రాంతంలో మేధావులు ఉన్నారా? అనే సందేహాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్రం నుంచి ప్రకటన వచ్చిన వెంటనే చంద్రబాబు, షర్మిల రంగులు మార్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోతే ఆంధ్రా ప్రాంతానికి నాలుగైదు లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని చంద్రబాబు అంటున్నారని, ఇంత కాలం నష్టపోయింది తెలంగాణ ప్రాంతమేనని, ప్యాకేజీ కూడా తమకే ఇవ్వాలని స్పష్టం చేశారు.

కేంద్రం ఇస్తే ఆంధ్రా ప్రాంతం వాళ్లు ప్యాకేజీ తీసుకోవచ్చన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఆశీస్సులు అవసరమని, ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రజలు అనవసర రభసను పక్కనబెట్టి విజ్ఞతతో వ్యవహరించాలని హితవు పలికారు. విషయాన్ని పక్కదారి పట్టించేందుకే సీమాంధ్రులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, రెచ్చగొట్టేందుకే 'సమైక్యాంధ్ర సభ' నిర్వహించారని ధ్వజమెత్తారు. సీమాం«ద్రులు వేల సంఖ్యలో వచ్చి తెలంగాణ ప్రాంతంపై దాడి చేయడమేకాకుండా హెచ్చరికలు చేయడం ఏమిటని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు తలచుకుంటే హైదరాబాద్ పొలిమేరల్లో కూడా అడుగు పెట్టే వారు కాదని హెచ్చరించారు.

ఈనెల 29న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న 'సకల జనుల భేరి'కి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాజకీయ ప్రక్రియ వల్లే తెలంగాణపై స్పష్టత వచ్చిందని, అందులో కేసీఆర్ కృషి అభినందనీయమని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉండే సీమాం«ద్రులకు సౌకర్యాలు కల్పిస్తాం కానీ అధికారం, భూములు అంటే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం శిలా శాసనం అంటూనే దానిపై శిల్పాలు చెక్కేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత విద్యాసాగర్‌రావు విమర్శించారు.

కాంగ్రెస్ నేతలు గట్టిగా మాట్లాడకపోవడం వల్లే రాష్ట్ర ఏర్పాటులో ఆలస్యం జరుగుతోందని, ఆలస్యం వల్లే కుట్రలు జరుగుతున్నాయని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం చెప్పారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న జగ్గారెడ్డి అసలు మనిషే కాదని, అతను బానిస అని వ్యాఖ్యానించారు. అవసరమైతే పెన్నులు పక్కన బెట్టి మరోసారి ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సమైక్య సమ్మెను ప్రభుత్వమే నడిపిస్తోందని, హైదరాబాద్‌లో ఏమైనా చేయగలమనే ధీమాతో ఉన్నారని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. రెచ్చగొడితే తడాఖా చూపిస్తామన్నారు.


'గెజిటెడ్ భవన్' ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథుల్లో ఒకరిగా హాజరైన టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్ రావు దూరంగా ఉన్నారు. పెద్దలంతా వేదికపై ఉండగా.. ఆయన మాత్రం దూరంగా వెళ్లిపోయారు. కార్యక్రమం ముగిసిన తర్వాత చేరుకున్న హరీశ్.. మీడియా మిత్రులను కేసీఆర్ ప్రసంగాన్ని అడిగి తెలుసుకున్నారు.

తప్పుదారి పట్టించేందుకే లీకులు: తెలంగాణ ప్రజల్లో గందరగోళం సృష్టించి తప్పుదారి పట్టించేందుకే సీమాంధ్ర నేతలు ఢిల్లీ నుంచి లీకులు ఇస్తున్నారని టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటును ఇంకా నాన్చినా.. సాగదీసినా ప్రజలు కాంగ్రెస్ భరతం పడతారని హెచ్చరించారు.

No comments:

Post a Comment